అరుణోదయం అవుతేనేగాని… సూర్యోదయం అవదు

అరుణోదయం

భూమండలం నియంతల, నిరంకుశ వాదుల పాదాల కింద ఎంతగా నలిగి పోకూడదో అంతగానూ నలిగిపోయాక, మానవ జాతి ఎంతగా బానిస అయిపోరాదో అంతగానూ అయిపోయాక, బ్రతుకు ఎంతగా దుర్భరం అవకూడదో అంతగానూ అయిపోయాక, మానవ రక్తం ఎంతగా పారకూడదో అంత గానూ పారాక, భవిష్యత్తు ఎంతగా అంధకార బంధురం అవకూడదో అంతగానూ అయిపో యాక, స్వేచ్ఛా పూవజిజూ విప్పారింది ఓ పవిత్రాత్మ. పుడమిని పావనం గావించేందుకు సిద్ధమయింది ఓ మానవాత్మ. మనుజ జాతి మనుగడకు మెరుగులు దిద్దేందుకు సమాయత్త మయింది ఓ మహితాత్మ. దేశ దుస్థితిని సంస్కరించేందుకు, దళితుల దుర్గతిని సుగతిగా మార్చేందుకు దేహం దాల్చింది ఓ మహాత్మ. అచేతనావస్థలో కొట్టుమిట్టాడుతున్న కొడిగట్టిన దీపం వంటి సమాజంలో చేతనా దీపాలు వెలిగించేందుకు కంకణం కట్టింది ఓ ప్రవక్తాత్మ. ఆ మహిమాన్వి తాత్మయే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స). భావికి బాట వేసిన ముహమ్మద్‌ (స) వారథి గతానికి, వర్తమానానికి, భావితారలకు వెలుగుబాటయింది. మానవ జాతి సంస్కరణకూ, ఆదర్శ సమాజ ఆవిష్కరణకూ, లోకోద్ధరణకూ, సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రప్రథమమైనది, పునాది వంటిది దైవభీతి – తౌహీద్‌ అన్నారు ఆ ప్రవక్త (స). మనిషి ఇహ పర సాఫల్యానికీ, ముక్తికీ – మోక్షానికీ, స్వర్గానికీ – తౌహీద్‌కీ (దేవుని ఏకత్వానికీ) మధ్య గల అవినాభావ సంబంధం ఎన్నటికీ చెరిగిపోనిది. దేశ ప్రజల, పరి పాలకుల, పుణ్యాత్ముల పట్ల అభిమానం పెంచు కోవటం తప్పు కాదు. కానీ దైవాన్నీ, దైవాను గ్రహాలనూ మరచి, షిర్క్‌కు పాల్పడి, తౌహీద్‌ను విడనాడితే ఆ జాతి గతి సుగతి కాదు, దుర్గతే అన్నారు ఆ మహా మనీషి.

పిల్లలకు బాల్య థ నుండే తౌహీద్‌ విశిష్ఠతను బోధిస్తూ ఉంటే వచ్చే ఫలితాలు బహుళం. దైవభీతి ద్వారా జాతి ఆచరణ సక్రమంగా ఉంటుంది. నీతి సంపద వృద్ధి చెందుతుంది. మాటలో, బాటలో సారూప్యత ఏర్పడుతుంది. దేశ పౌరుల్లోని ప్రజ్ఞాపాటవాలు ప్రగతి పథాన వెచ్చించ బడతాయి. స్వచ్ఛమయిన సహజ భావాల పురోభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. భావ దారిద్య్రం నుండి బయటపడి, భావ దాస్యపు సంకెళ్ళను త్రెంచే ధైర్య సాహసాలు అబ్బుతాయి. వర్గ, వర్ణ, జాతి, కుల, భాష, ప్రాంత విభేదాలు తగ్గి విశాల దృక్పథం అలవడుతుంది. దైవ దాసులు అందరూ సమానులు అన్న భావన పరిఢవిల్లుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఏకముఖంగా అందించగల ఏకేశ్వరోపాసన-తౌహీద్‌-ను విస్మరించడం క్షంతవ్యంకాని అలసత్వమే కాదు, క్షమించ రాని పాపం కూడా. ’70 తల్లులకన్నా అధిక ప్రేమ గలవాడు అల్లాహ్‌ా. మరి అట్టి కరుణా మయుణ్ణి విస్మరించడం అంటే ఎంతటి ఘోరపాపమో ఆలోచించండి’ అని జాతిని జాగృత పర్చారు జగత్ప్రవక్త ముహమ్మద్‌ (స).

లోకోద్ధరణకు, శాంతికి పాటు పడాల్సిన బుద్ధి జీవులే బానిసత్వాన్ని ఇష్టపడి స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని నిర్లక్ష్యం చేశారు. ‘బానిసత్వాన్ని ప్రేమించేవారు, చిల్లర దేవుళ్లను, రాళ్ళను, రప్పలను, అన్య ప్రతిమలను ఆరాధించటం నిత్యం కానవచ్చే దృశ్యం. ‘మనకు మాత్రం తౌహీదే ప్రాణం’ అని చాటడమే కాక, ప్రజల్లో స్ఫూర్తిని నింపి, చైతన్యాన్ని రగిలించి సత్య సమర యోధులుగా వారిని తీర్చిదిద్దారు.’ మనిషి నిద్రావస్థ నుండి మేల్కోవాలి. అసత్యాన్ని ఎదిరించాలి. బూజు పట్టిన వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. తమస్సుకి వ్యతిరేకంగా తిరగబడాలి’ అని ప్రేరేపించారు. ఈ తర్ఫీదు ఎందుకో తెలుసా? అసత్యాధిక్యతా ప్రవృత్తి అతి చెడ్డది. అది గనక జూలు విదిల్చిందంటే దానికిక యుక్తాయుక్తాల విచక్షణ ఉండదు. ఒకనాటి 70 వేల పసికందుల్ని ఇట్టే అవలీలగా హతమార్చెేంతటి దుష్టతరమైనది. అందుకే సత్యాన్వేషి, సత్య ప్రియుడు తనను తాను రక్షించుకోక తప్పదు అని కర్తవ్యబోధ చేసి, విజయ ఢంకా మ్రోగించారు ప్రవక్త ముహమ్మద్‌ (స).

ఆయన చేపట్టిన ఉద్యమంలో నీగ్రో బానిసయిన బిలాల్‌ ఉన్నాడు. పారశీక దేశస్థుడైన సల్మాన్‌ ఫార్సీ ఉన్నాడు. రోము దేశస్థుడైన సుహైబ్‌ రూమీ ఉన్నాడు. అరబ్బు ధీరోదాత్తుడైన అలీ ఉన్నాడు. వీర జవాను అయిన ఉమరూ ఉన్నాడు. మొక్కవోని ముసఅబూ ఉన్నాడు. ఓపికలో అందెవేసిన అబూ బకరూ ఉన్నాడు. ఉక్కు వనిత సుమయ్యా ఉంది. ఆదర్శ మహిళ అస్మా ఉంది. అరుణకాంత ఆయిషా ఉంది. పేదల పెన్నిధి జైనబ్‌ కూడా ఉంది. స్వర్గ స్త్రీల నాయకురాలు ఫాతిమా ఉంది- వీరి గురించి ఖుర్‌ఆన్‌ ఇచ్చిన సాక్ష్యం ఒకటి చాలు. అది మానవ జాతి మర్యాదకు మచ్చుతునక. స్త్రీ జాతి కీర్తికి కలికితురాయి.

అయితే అభూత కల్పనలను దైవ గ్రంథాలలో జొప్పించి, వాటి మాతృకలను మటుమాయం చేసి, వాటి అర్థాలను. తాత్పర్యాలను వక్రీ కరించి, వాటినే వ్యాపింపజేస్తూ సంఘానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి తీరని అపచారం చేయడం అన్నది ఆనాడే కాదు, ఈనాడు కూడా జరుగుతోంది.
చరిత్రను శాస్త్రాన్నే కాదు, ఏకంగా తౌహీదునే తగులబెట్టడానికి ‘ఉజైర్‌, యేసు’ చాటున గ్రంథవహుల్లోని కొందరు ఛాందసులు వేసుకున్న పథకం దైవ గ్రంథాలన్నింటిలోనూ సమానమైన తౌహీద్‌ భావనను మట్టు పెట్టి, సకల విశిష్ఠతలు, సమస్త విశేషాలు ఒక్క షిర్క్‌కే కట్టబెట్టి, ధర్మాన్ని, నీతి శాస్త్రాన్ని వంచకులకు ముట్టజెప్పడానికి సాగించిన మంతనాల బండారమంతా ఈ ‘మోజునే’ నిరూపిస్తున్నది. ‘ఉజైర్‌, యేసు’ అలాంటి ఇతరులు – దేవుళ్ళు, దైవాంశ సంభూతులు, దేవుని కుమారులు అనడానికి ఎలాంటి చారిత్రక, గ్రంథ పరమైన ఆధారాలు లేనప్పటికీ. ‘త్రినిటి’ అన్న పదమే సువార్తల్లో ఎంత దేవులాడినా దొరకనప్పటికీ. ‘ఆయన వాక్యమై ఉండెను, వాక్యం దేవుని వద్దనుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను’ అని కుట్రలు, కురాహకాలు పన్నేందుకు సైతం బరి తెగించారు. పైగా మేధకందని, పామరులకే కాదు, పండితులకు సయితం అంతుబట్టని, అర్థమవని ఆ సిద్ధాంతాల పంచన, ఆ విశ్వాసాల పట్టున అహంకారంతో, తలబిరుసుతనంతో ప్రవర్తిస్తున్నారు, తద్వారానే లోకశాంతి సాధ్యం అని బల్ల గుద్ది మరీ వాదిస్తున్నారు.

హితం కోరేదే మతమై ఉండాలి. మతం అన్నది ఇహంలో, పరంలో, సర్వత్రా మనిషి మోక్షానికి పూబాట వేసేదిగా ఉండాలని, పేదల బ్రతుకుల్ని బాగుచేసేదిగా, పీడిత ప్రజల సాధక బాధకాల్ని పట్టించుకునేదిగా, వారి జీవితాలను ప్రగత పథాన నడిపించేదిగా ఉండాలని ఆయన (స) చెప్పిన మాటలు నాటికీ, నేటికీ, ఏనాటికీ సప్త సముద్రాల ఆవలి గట్టు వరకఎ అనుసరించదగ్గవే.

దైవగ్రంథాలన్నింటినీ కాచివడబోసి, వాటిలోని సారాన్ని, సత్యాన్ని సంపూర్ణాకారంలో లోకానికి అందజేసిన అపురూప గ్రంథం, అంతిమ దైవ బహుమానం ఖుర్‌ఆన్‌. అది నిజాల్ని నిగ్గు తేల్చి మరి ఉన్నవి ఉన్నట్లుగా ఎలాంటి జంకూగొంకూ లేకుండా ప్రకటించింది. వర్ణం, వంశం, అందం, భాష, ప్రాంతం, జాతి, వర్గం వల్ల గొప్పతనం రానేరాదనీ, గుణయోగ్యత, దైవభీతి వల్లనే గొప్పదనం వస్తుందని ఘంటాపథంగా చెప్పింది.

ఇదే సందేశాన్ని, జీవన సత్యాన్ని ప్రజలకు తెలియపర్చేందుకు వచ్చిన యావన్మంది ప్రవక్తలు ‘జనం తమ మూల ధనం’ అని భావించారు. నాతికి వలువ, నీతికి విలువ ముఖ్యమని చాటిన వీరు ‘మనీ’కి విలువ ఇవ్వలేదని చెప్పటానికి వారి ఆదర్శ జీవితాలే సాక్షి! వారు ఎంత సేపటికీ ప్రజల యోగ క్షేమాల్ని, ముక్తి మోక్షాల్ని ఆశించారేగానీ, తాము వెనుకేసు కున్నదేమీ లేదు. ‘ప్రవక్తలు దేన్నీ వారసత్వ సొత్తుగా వదలి వెళ్ళరు – ఒక ధర్మ విద్యను తప్ప’ అన్నది వారన్న మాటే. ఈ కారణంగానే దైవం పట్ల భయం భక్తి, ప్రజల పట్ల అనురక్తి వారందరిలోనూ ఒకే స్థాయిలో దర్శన మిస్తుంది.
అయితే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారికి గల ప్రత్యేకత ఏమిటంటే- దైవ ప్రవక్తలందరి జీవితాల్లో గల విశేష దృక్కోణాలన్నీ ఆయనలో మూర్తీభవించి అందంగా, అతి మనోహరంగా ప్రతిబింబిస్తూ కన్పిస్తాయి. ఆయన కేవలం ఒక ప్రవక్త మాత్రమే కాదు – నీతిమంతుడైన ఒక వ్యాపారి, నిజాయితీపరుడైన ఒక ఉద్యోగి, దయా హృది గల ఒక యజమాని, అవిరళం శ్రమించే ఒక కార్మికుడు, శత్రువులకు సైతం న్యాయం చేసే ఒక న్యాయాధిపతి. ధర్మ సంస్థాపనార్థం ధన, మాన, ప్రాణాలొడ్డి పోరాడే ఒక సైనికుడు, ఆయన రాజ్యాలను జయించటానికి వచ్చిన రాజు కాదు, హృదయాలను జయించడానికి అరుదెంచిన అరుణోదయ కిరణం! దైవ ప్రవక్త!! అంతిమ దైవ ప్రవక్త!!! మనిషిని మానవునిగా మలచగ వచ్చిన మానవ మహోపకారి!!!!

ఒక్కసారిగా ఇన్ని లక్షణాలు మూర్తీభవించిన ప్రవక్తోత్తములు ఈ జగాన ఒక్క ముహమ్మద్‌ (స) వారే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బహుముఖ శేముషి ఆయనకెలా ప్రాప్తమయింది? దివ్యావిష్కృతామృత జీవ జలంనుంచి, పరమోన్నత ప్రభువైన అల్ల్లాహ్‌ జ్ఞాన శక్తి నుంచి. ‘అన సయ్యిదు ఉలిది ఆదమ్‌, వలా ఫఖర్‌’ (నేను ఆదం సంతతి మొత్తానికి నాయకుణ్ణి, ఇది గర్వాతిశయంతో చెప్పే మాట కాదు) అన్న పలుకు ఆయన నోట జాలు వారినదే. ‘నేను ఇబ్రాహీమ్‌ (స) ప్రార్థనా ఫలాన్ని, ఈసా (అ) సువార్త రూపాన్న’ని కూడా ఆయన అనేక సార్లు చెప్పారు.

అయితే – బుద్ధి తికమక పడిన వారు ఈ ప్రవచనాలకు పెడర్థాలు తీసి నేటి ఆధునికంలో ఆ మహా మహుని గురించి చేసే దుష్ప్రచారం జోరుగానే సాగుతున్నది. ‘మనిషి తనకు తెలియని దానికి శత్రువ’న్నట్టు ఆ మహితాత్ముని జీవితం, ఆదర్శమెరుగని ప్రపంచం ఆయన్ను శత్రువుగానే చిత్రీకరిస్తున్నది. దాన్నే నిజం అని నమ్మబలుకుతున్నది. ఇట్టి దయనీయ స్థితిలో సైతం దైవాదేశాలకు, దైవ ప్రవక్తల ప్రవచనాలకు విలువిచ్చేవాళ్ళు, వాటి వేగాన్ని, లాభాన్ని కొలిచేవాళ్ళు, వాటిలో దాగివున్న ముత్యాలను, పగడాలను వెలికి తీసి లోకానికి అంద జేసేవాళ్ళు లేకపోలేదు. వారు ఎక్కువ సంఖ్యలో కాకపోయినా, తక్కువ సంఖ్యలో ఉన్నారన్నది అసత్యవాదుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించే సత్యం. ‘కడుపు నిండిన వారి స్థితి వేరు, కడుపు పండిన వారి స్థితి వేరు, కడుపు మండిన వారి దుస్థితి చాలా వేరు’ అన్నట్టు, సత్యం తెలిసిన వారి గతి వేరు, సత్యం పాటించేవారి స్థితి వేరు, సత్యాన్ని తృణీకరించిన వారి దుర్గతి చాలా వేరు. నేడీ ఆధునిక యుగంలో సైతం లోకం కాంతికి కళ్ళు తెవాలంటే…సత్సమాజ సంస్థాపన జరగాలంటే …ప్రవక్త (స) వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, లోతుగా పరిశీలన జరిపి, ఆయన ప్రవచనాలను బాగా జీర్ణం చేసుకుని కార్చారణకు ఉపక్రమించటం తప్ప మార్గాంతరం లేదు. ఇదే నేడు విశ్వ జనులందరి పాలిట తరుణోపాయం. వేయి సూర్యులు ఉదయించు గాక, వేయి చంద్రులు ఉదయించుగాక, మహా ప్రవక్త (స) వారి మహితోక్తుల కాంతి ద్వారా తప్ప మనో చీకట్లు, మనుషుల మధ్య దూరాలు తొలగవు. సత్యశోధన అనే ఈ అరుణోదయం అవనిదే ‘లోక శాంతి’ అనే సూర్యోదయం అవదు. మరి జనులు ఇరుకు బుద్ధులు పెంచుకుని ఇరకాటంలోనే కొట్టుమిట్టాడుతారో, సార్వజనీన భావాన్ని వృద్ధి పరచుకుని లోక శాంతినే సాధించుకుంటారో వారే నిర్ణయించుకోవాలి.

Related Post