New Muslims APP

ఔదార్యాన్ని, త్యాగ నిరతిని నేర్పే శిక్షణా కాలం

ramadan_shahr_el_kheir_

ఆయిజ్ అబ్దుల్లాహ్ అల్ ఖర్నీ

ప రమ పభ్రువైన అల్లాహ్‌ ఈ విధంగా సెల విచ్చాడు: ”మీరు మీ కోసం ఏ మంచిని (పుణ్య కార్యాన్ని) ముందుగా పంపినా, దాన్ని అల్లాహ్‌ దగ్గర అత్యుత్తమ రూపంలో అత్యధికంగా పొందుతారు”  (ఖుర్‌ఆన్ 73:20)
  ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: ”అల్లాహ్‌ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసేవారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక విత్తనాన్ని నాటగా, అది మొలకెత్తి అందులో నుంచి ఏడు వెన్నులు పుట్టుకు వస్తాయి. ప్రతి వెన్నులోనూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్‌ా తాను కోరినవారికి సమృద్ధి వొసగుతాడు. అల్లాహ్‌ా పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతిదీ తెలిసినవాడు”. (ఖుర్‌ఆన్‌- 2: 261)
    ఒక ప్రామాణికమైన హదీసులో ఇబ్నె అబ్బాస్‌ (ర ) కథనం ప్రకారం దైవ ప్రవక్త (స ) సహజంగానే ప్రజలందరిలోకెల్లా ఎక్కువ దానశీలురు. అయితే రమజాన్‌ నెలలో జిబ్రయీల్‌ దూతను కలిసినప్పుడు ఆయన ఇంకా ఎక్కువ ఔదార్యం కనబర్చేవారు. నిజం చెప్పాలంటే ఆ సమయంలో ఆయన ఔదార్యం ప్రభంజనం కంటే వేగంగా ఉంటుంది. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టమని, అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోమని, నిరుపేదలకు చేయూతనివ్వమని ఉపవాసం ప్రోత్సహిస్తుంది. రమజాన్‌ మాసం దైవమార్గంలో ఖర్చు చెసే వారి కాలం. త్యాగం చేయాలని, పరులకు ఎంతోకొంత ఇవ్వాలని ఉవ్విళ్ళూరే సదాచార సంపన్నులకు రమజాన్‌ మాసం ఓ సువర్ణావకాశం. అల్ల్లాహ్‌ మీకేదైనా ప్రసాదించి ఉంటే అందులో కొద్దిగా నిరుపేదల కోసం త్యాగం చేయండి. ధనం నీరు లాంటిది. నీరు ప్రవహిస్తూ ఉంటే తియ్యగా, తాజాగా ఉంటుంది, దాని ప్రవాహాన్ని అడ్డుకున్నట్లయితే అది మురిగి, కలుషితమయి విషంగా మారిపోతుంది.
    త్యాగం ఎంత గొప్పది! దానం ఎంత మహోన్నతమైనది! ఔదార్యం ఎంత సుందరమైనది! ”ప్రతి రోజూ ఇద్దరు దైవ దూతలు దివి నుండి దిగి వస్తారు. వారిలో ఒక దూత, ‘అల్ల్లాహ్! ఖర్చు పెట్టేవాడికి ప్రతిఫలాన్ని ప్రసాదించు’ అని ప్రార్థిస్తే, రెండో దూత, ‘అల్ల్లాహ్‌ కూడబెట్టుకునే వాడి సంపదను నాశనం చెయ్యి’ అని ప్రార్థిస్తూ ఉంటాడ”ని దైవప్రవక్త (స ) ప్రబోధిం చారు.   ఆ విధంగా అల్లాహ్‌ దాసులు ఎవరైనా ఆయన మార్గంలో ఎంతో కొంత ధనం ఖర్చు చేసినప్పుడు దాని మూలంగా అల్లాహ్‌ా వారి భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక స్థితిగతుల్లో సౌలభ్యాన్ని సమకూరుస్తాడు. అతని జీవనావసరాలకు సరిపోయే వస్తువుల్లో వృద్ధిని ప్రసాదిస్తాడు. ”నీరు మంటను ఆర్పేసినట్లే, దానధర్మాలు రాబోయే ఆపదలను తప్పిస్తాయి” అని దైవప్రవక్త (స ) ప్రవచించి ఉన్నారు. చెడు పనులు మనసుల్లో మంటను రాజేస్తాయి. ఆత్మల్లో వేడిని రగిలిస్తాయి. జీవితాన్ని నిప్పుల కుంపటిగా మార్చేస్తాయి. ఒక్క దానధర్మాలు మాత్రమే ఆ అగ్ని జ్వాలల్ని చల్లార్చగలవు. దానం మనో వేడిని చల్లబరుస్తుంది. ఆత్మలో పరిమళాన్ని గుభాళింపజేస్తుంది. ప్రతి చెడు కార్యాన్ని పరిపూర్ణమైన రీతిలో తొలగిస్తుంది.
  ”మనిషి ప్రాపంచిక జీవితంలో చేసి వెళ్లిన దానధర్మాలు పరలోకంలో అతనికి నీడ కల్పిస్తాయి. ఆ రోజు మానవులకు సంబంధించిన పరస్పర సమస్యలన్నీ తెమలేదాక అతను ఆ నీడ పట్టునే ఉంటాడు” అని ప్రవక్త (స ) ప్రబోధించారు. దాన ధర్మాలు విశాలమైన నీడను కలిగి ఉండటం, ఆ నీడలో మనుషులు ప్రతిఫల దినాన సేద తీరటం, ఆ నీడ ఇహలోకంలో ఆచరించిన దానధర్మాలకు తగ్గట్టు అద్భుతంగా ఉండటం, వింటుంటేనే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ?!
  రుజువర్తనులైన మన మూడవ ఖలీఫా ఉస్మాన్‌ బిన్‌ అఫ్ఫాన్‌ (ర ) గొప్ప ధనవంతులు. ఆ  కాలంలో   ముస్లింలు  ‘తబూక్‌’
అనే ప్రాంతంలో ఓ మహా సంగ్రామం చేయవలసి వచ్చింది. ఆ సమయంలో ముస్లింలకు యుద్ధ సామగ్రి, ఇతర ఆయుధ పరికరాలు అవసరమయ్యాయి. కేవలం అల్లాహ్‌ా ప్రసన్నత కోసం తన సంపదను, ఆస్తులన్నింటినీ ఖర్చుపెట్టి ముస్లిం సేవకులకు కావలసిన యుద్ధ సరంజామా అంతా ఆయన సమకూర్చారు. ప్రత్యేకంగా ముస్లింల కోసం ఆ కాలంలో మొత్తం ఒక బావినే కొనేశారాయన. అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ ఔఫ్‌ మరో గొప్ప ధనవంతులైన సహాబీ (దైవ ప్రవక్త సహచరులు). అల్ల్లాహ్‌ ప్రసన్నత కోసం ఆయన ఒకసారి, 700 ఒంటెలపై మోపబడి ఉన్న తన వ్యాపార సామగ్రి మొత్తం మదీనా నగరంలోని పేద ప్రజలకు పంచి పెట్టారు.  ఒక చిన్న రొట్టె ముక్కకూ, చుక్క పాలకూ, పట్టెడన్నానికీ నోచుకోకుండా పస్తులు గడుపుతూ ఉపవాసాలు పాటిస్తున్న అభాగ్య జీవులెందరో మన సమాజంలో బతుకు బండి లాగుతున్నారు.
 తల దాచుకోవటానికి ఇల్లులేక, ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్ళటానికి కనీస వాహన వసతుల్లేక, కష్ట కాలంలో తమను ఆదుకునే స్నేహితులూ లేక సతమతమవుతున్న ఎంతో మంది దీనులూ మన చుట్ట్టు ప్రక్కల్లో ఉపవాసం పాటిస్తున్నారు.
 తినేందుకు ఏమీ లేక పస్తులతోనే ఉపవాసం ప్రారంభించి, తిరిగి ఉపవాస విరమణ (ఇఫ్తార్‌) సమయంలోనూ గుక్కెడు మంచి నీళ్ళతో సరిపెట్టుకుని పస్తుల్ని కొనసాగించే కష్టజీవులకూ మన సమాజంలో కొదువ లేదు.
బహుశా ఇలాంటివారిని దృష్టిలో పెట్టుకుని దైవప్రవక్త (స ), ”ఎవరయినా ఒక ఉపవాసి ఉపవాసాన్ని విరమింపజేస్తే (అంటే ఇఫ్తార్‌ చేయిస్తే) ఆ ఉపవాసికి లభించినంత పుణ్యం అతనికీ లభిస్తుంది. అలా అని ఆ ఉపవాసి పుణ్యంలోనూ ఎలాంటి కోతా విధించబడదు” అని వక్కాణించారు.  ఈ కారణంగానే సదాచార సంపన్నుల ఔదార్యం శుభప్రదమైన రమజాన్‌ మాసంలో అనూహ్యంగా పెరిగిపోతుంది. ఈ మాసంలో వారు దైవ మార్గంలో అమితంగా ధనం ఖర్చు పెడతారు. ఎముక లేని చేత్తో దానధర్మాలు చేస్తారు. అసాధారణ త్యాగ భావాన్ని కనబరుస్తారు. వారిలో చాలా మంది నిరుపేదలకు అన్నదానం చేస్తారు. రమజాన్‌ నెలలో ప్రతి రోజూ ఉపవాసకులకు ”ఇఫ్తార్‌” (ఉపవాస విరమణ) చేయిస్తారు, అలా చేసి వారు విశ్వ ప్రభువైన అల్లాహ్‌ా నుంచి గొప్ప పుణ్యాన్ని, మహోన్నతమైన ప్రతిఫలాన్ని అందుకుంటారు.
  సదాచార సంపన్నులైన మన పూర్వీకుల కాలంలో మస్జిదులు ఎల్లప్పుడూ పేదల కొరకు సమకూర్చబడిన ఆహార  పదార్థాలతో  నిండుగా ఉండేవి. మస్జిదులలో భోజన సదుపాయాలు కలిగించి అన్నార్తులు, అవసరార్ధులు ఒక్కరు కూడా  లేకుండేటట్లు  లేకుండేటట్లు చేసేవారు మన పూర్వీకులు. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అల్లాహ్‌ దాసులు తమ తోటి నిరు పేదలకు అన్నపానీయాలతో సత్కరించినా, వస్త్రదానంతో గౌరవించినా అందులో తమకు అల్లాహ్‌ా ప్రసన్నతా ఉద్దేశం లేకపోతే దానివల్ల ఎలాంటి పుణ్యమూ రాదు. దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ా ఇలా అంటున్నాడు:
   ”మీరు గనక అల్లాహ్‌కు మంచి రుణం ఇస్తే (అంటే అల్లాహ్‌ మార్గంలో ఖర్చు పెడితే) దాన్ని ఆయన మీ కొరకు పెంచుతూ పోతాడు. మీ పాపాలను కూడా  క్షమిస్తాడు. అల్లాహ్‌ (తన దాసుల సేవలను) గుర్తించేవారు, సహనశీలుడు.” (ఖుర్‌ఆన్ 64:17)
ఓ ఉపవాసీ! ఈ రోజు నువ్వు చేసే త్యాగం, నువ్వు ఇచ్చే దానం రేపు నువ్వు పేదరికంలో, అవసరంలో ఉన్నప్పుడు నీకు పనికి రావటానికి నీ ప్రభువుకు ఇచ్చుకుంటున్న రుణమేనని గ్రహించు. ఆ రేపు మరేదో కాదు, ప్రతిఫల దినమే. మనిషి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండని రోజు. ఓ ఉపవాసీ! దప్పిక గొన్న వానికి ఈ రోజు నువ్వు త్రాపించే గుక్కెడు నీళ్లు, శ్రమ జీవి గుండె చల్లదనం కోసం నువ్వు పోసే కాసిన్ని పాలు ఆకలిగొన్న వానికి నువ్వు పెట్టే పట్టెడన్నం, అవసరంతో సతమతమవుతున్న మనిషికి నువ్వు చేసే కొద్దిపాటి ఆర్థిక సహాయం, బట్టలు లేని బీద ప్రజలకు నువ్విచ్చే వస్త్రదానం – ఇవన్నీ నీ స్వర్గారోహణకు సోపానాలని నువ్వు తెలుసుకోవాలి.
   ఓ ఉపవాసీ! అల్లాహ్‌ సాక్షిగా చెబుతున్నాను. దానం కన్నా ఎక్కువగా మరే వస్తువూ సంపదను పరిశుద్ధ పర్చదు. ఎంతో మంది ధనవంతులు అంతులేని తమ సిరిసంపదలను, నిధులు నిక్షేపాలను, ఎత్తయిన భవనాలను, మేడలను మిద్దెలను ఎలా సంపాదించారో అలాగే ఈ లోకంలో వదిలిపెట్టి చనిపోయారు. కాని తాము జీవించి ఉన్నప్పుడు వారు వాటిని అల్లాహ్‌ మార్గంలో ఉపయోగించకపోవటం మూలంగా వారి తదనంతరం కూడా ఆ సంపద వారి పాలిట దుఃఖానికి, సంతాపానికి కారణమయింది. రేపు ప్రళయ దినాన విజేతలెవరో, ఓటమి పాలయ్యేదెవరో నువ్వే చూస్తావు! సహాయం లభించేది మాత్రం అల్లాహ్‌ తరఫు నుంచే సుమా!
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.