హజరె అస్వద్

ఇబ్న్ అబ్బాస్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కాబాకు ఆనుకొని ఇలా అన్నారు: “హజరె అస్వద్ మరియు మఖాం (ఇబ్రాహీం) స్వర్గపు రత్నాలలో రెండు రత్నాలు.” (తిర్మిజి)

ఇబ్న్ అబ్బాస్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కాబాకు ఆనుకొని ఇలా అన్నారు: “హజరె అస్వద్ మరియు మఖాం (ఇబ్రాహీం) స్వర్గపు రత్నాలలో రెండు రత్నాలు.” (తిర్మిజి)

మక్కాలోని కాబాలో ఉన్న నల్ల రాయిని అరబీ భాషలో అల్ హజర్ అల్ అస్వద్ అంటారు. అనేక భూగోళ శాస్త్రజ్ఞులు మరియు చరిత్రకారులు దీన్ని ఉల్క అంటారు. కాబాలో ఇది తూర్పు దిశ మూలలో ఉంది. ఇది నల్లగా ఉంది.

చరిత్ర

ఇబ్రాహీం అలైహిస్సలాం కాబా నిర్మాణం పూర్తి చేశాక, ఒక రాయి తక్కువపడితే, ఇస్మాయిల్ అలైహిస్సలాం ను వెతకమన్నారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం చాలా వెతికారు, కాని దొరకక పోవడంతో తిరిగి వచ్చి చూస్తే, తన తండ్రి ఒక రాయిని పెట్టేశారు. అప్పుడు ఆయన తన తండ్రిని ఇలా అడిగారు: “ఓ తండ్రి! ఈ రాయి ఎక్కడ దొరికింది?” దానికి ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా జవాబిచ్చారు: “జిబ్రయీల్ అలైహిస్సలాం స్వర్గం నుంచి తెచ్చారు.”

ఈ విధంగా కాబా నిర్మాణం పూర్తి అయ్యింది. ఈ రాయి స్వర్గం నుంచి తెచ్చినప్పుడు పాల కన్నా తెల్లగా ఉండింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నల్ల రాయి స్వర్గం నుంచి పంపబడినప్పుడు పాల కంటే తెల్లగా ఉండేది. ప్రజల పాపాల వల్ల అది నల్లగా మారిపోయింది.” (తిర్మిజి 2577)

కాబాను పునర్నిర్మించడానికి ఖురైషులు దాన్ని పడగొట్టినప్పుడు, నల్ల రాయి వరకు నిర్మాణం పూర్తిచేశాక, ఒక వివాదం తలెత్తింది. నల్ల రాయిని దాని స్థలంలో ఎవరు ఉంచాలి అనే దానిపై తర్జన భర్జన జరగసాగింది. ఆ వివాదం యుద్ధానికి దారి తీసేలా కనిపించసాగింది. బనూ అబ్దుద్ దార్ ఒక పాత్రనిండా రక్తం తీసుకు వచ్చాడు. అన్ని తెగలకు చెందిన వారు అందులో చేతులు ముంచారు. ఇక అందరూ యుద్దానికి సిద్ధమయ్యారు. వారిలో ఒక పెద్దాయన అబూ ఉమయ్యా ఇబ్న్ అల్ ముఘీరా ఒక ప్రస్తావన ఉంచాడు. అదేమిటంటే, బనీ షైబా ద్వారం గుండా ఎవరైతే మొదట వస్తారో, వారి తీర్పు స్వీకరిద్దాము. దీనికి అందరూ ఒప్పుకున్నారు. ఆ ద్వారం గుండా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మొట్ట మొదట వచ్చారు. ఈ సంఘటన దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రవక్తగా నియమించబడటానికి ఐదు సంవత్సరాల ముందు జరిగింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నల్ల రాయిని ఒక దుప్పట్లో ఉంచి, దాని కొసలను ప్రతి జాతికి చెందిన ఒక మనిషిని పట్టుకోమన్నారు. ఇలా పట్టుకుని దాన్ని దాని స్థలానికి దగ్గరగా తెచ్చారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన స్వంత హస్తాలతో దాన్ని దాని అసలు స్థానంలో ఉంచారు. ఈ విధంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన వివేకం ద్వారా ఒక పెద్ద యుద్ధాన్ని నివారించారు.
ఇస్మాయిలి షియా తెగకు చెందిన ఖర్మాతియన్ యోధులు 930 CE లో హజరె అస్వద్ ను దొంగిలించారు. వారు మక్కా వాసులను చంపి, వారి శవాలను జంజం బావిలో పడేశారు. హజరె అస్వద్ (నల్ల రాయిని) ను తమతో పాటు ప్రాచీన బహరైన్ లోని తమ స్థావరం అయిన ఇహ్సాకు తీసుకెళ్ళారు. అల్ జువైని అనే చరిత్రకారుని ప్రకారం నల్ల రాయి తిరిగి తన స్థానంలో 952 CE లో చేర్చబడింది.

హజరె అస్వద్ ముందు ఒకటిగా ఉండేది. కాని అనేక చారిత్రక సంఘటనల వల్ల అది ఇప్పుడు ఎనిమిది ముక్కలుగా చేయబడింది. ఈ ముక్కలు వివిధ సైజుల్లో ఉన్నాయి. ఈ ముక్కలన్నీ ఒక పెద్ద రాయికి అతికించి దాన్ని వెండి ఫ్రేములో పొదిగించారు. ఈ వెండి ఫ్రేమును మొదట అబ్దుల్లా బిన్ జుబైర్ (రజి) చేయించారు. ఆ తరువాత అవకాశాన్ని బట్టి ఖలీఫాలు దాన్ని మార్చారు.

ఆరు (అదనపు) ముక్కలు టర్కీలోని ఇస్తాంబుల్ లో ఉన్నాయని టర్కీయులు దావా చేస్తున్నారు. అవి నీల మస్జిద్ (బ్లూ మొస్క్)లో ఉన్నాయని వారు అంటారు. దీని ధృవీకరణ ప్రశ్నార్ధకం. తుర్కీయులు అనేక సంవత్సరాలు సౌదీ అరబియాపై పరిపాలన చేశారు. అనేక ఇస్లామీయ అవశేషాలను తమతో పాటు తీసుకెళ్ళారు. కాబట్టి దీని గురించి అల్లాహ్ కే తెలుసు.

హదీస్

అబూ తుఫైల్ ఇలా అన్నారని ఉల్లేఖించబడింది: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కాబా తవాఫ్ చేస్తూ, హజరె అస్వద్ (నల్ల రాయి) ను తనతో ఉన్న ఒక కర్రతో స్పర్శించారు. ఆ తరువాత ఆ కర్రను ముద్దుపెట్టుకున్నారు.” (సహీహ్ ముస్లిం 1275)

ఇబ్న్ అబ్బాస్ (రజి) ఉల్లేఖించారు: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన ఒంటెపై తవాఫ్ చేశారు. ప్రతి సారి నల్ల రాయి (హజరె అస్వద్) ఉన్న కొసకు రాగానే, దాని వైపు సైగ చేసి ‘అల్లాహు అక్బర్’ అనేవారు.” (సహీహ్ బుఖారీ 4987)

నల్ల రాయి ప్రాముఖ్యత

నల్ల రాయి గురించి అనేక హదీసులు ఉన్నాయి. వాటిని క్రింద పేర్కొనడం జరిగింది.
నల్ల రాయిని అల్లాహ్ స్వర్గం నుండి భూమిపై పంపించాడు. ఇబ్న్ అబ్బాస్ (రజి) ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నల్ల రాయి స్వర్గం నుండి వచ్చింది.” (తిర్మిజి 877, నసాయి 2935)

ఈ రాయి పాల కంటే తెల్లగా ఉండేది. కాని ఆదం సంతానం పాపాల మూలంగా ఇది నల్లగా మారింది. ఇబ్న్ అబ్బాస్ (రజి) ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నల్ల రాయి స్వర్గం నుండి వచ్చినప్పుడు పాల కంటే తెల్లగా ఉండేది. కాని, ఆదం సంతానం యొక్క పాపాల వల్ల అది నల్లదై పోయింది.” (తిర్మిజి 877; అహ్మద్ 2792, ఇబ్న్ ఖుజైమిన్ సహీహ్ అని ధృవీకరించారు 4/219)

(a) అల్ ముబారక్ పూరి (రహి) అల్ మర్ఖాలో ఇలా అన్నారు: ఆదం సంతానం పాపాల వల్ల, వారు తాకిన ఈ రాయి నల్లగా మారిపోయింది.

(b) అల్ హాఫిజ్ ఇబ్న్ హజర్ (రహి) ఇలా అన్నారు: కొందరు ఈ హదీసును విమర్శిస్తూ ఇలా అన్నారు: బహుదైవారాధకుల పాపాలు దీన్ని నల్లగా మార్చినప్పుడు, ఏకదైవారాధన చేసే వారి ఆరాధనలు దీన్ని ఎందుకు తెల్లగా మార్చలేదు? ఇబ్న్ ఖుతైబా చెప్పినదాన్ని నేను జవాబుగా చెబుతున్నాను: అల్లాహ్ తలిస్తే, ఇలా జరిగేది. నల్ల రంగు ఇతర రంగులను మారుస్తుంది, కాని స్వంత రంగును మార్చుకోలేదు. తెల్ల రంగు ఇతర రంగులను మారుస్తుంది మరియు స్వంత రంగును కూడా మార్చుకుంటుంది. అల్లాహ్ ఇలా చేశాడు.

(c) అల్ ముహిబ్బ్ అల్ తబరీ ఇలా అన్నారు: అంతర్ద్రుష్టి గలవారికి ఇది నల్లగా ఉండడంలో ఒక పాఠo ఉంది. మానవుని పాపాలు ఒక ప్రాణం లేని రాయి మీద ఇంతగా ప్రభావం చూపించగలిగినప్పుడు, మానవుని హృదయంపై ఇంకెంత ప్రాభవం వేయగలవో ఊహించండి. (ఫత్ హుల్ బారి 3/463)

నల్ల రాయి తీర్పు దినాన వచ్చి, తనను తాకిన వారి పక్షంలో సాక్ష్యం ఇస్తుంది.

ఇబ్న్ అబ్బాస్ (రజి) ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నల్ల రాయి గురించి ఇలా అన్నారు: “అంతిమ దినాన అల్లాహ్ నల్ల రాయిని తీసుకు వస్తాడు. అప్పుడు దానికి రెండు కళ్ళు ఉంటాయి, దాంతో అది చూస్తుంది మరియు నాలుక ఉంటుంది, దానితో అది మాట్లాడుతుంది. దాన్ని మనస్ఫూర్తిగా తాకిన వారి గురించి అది సాక్ష్యం ఇస్తుంది.” (తిర్మిజి 961; ఇబ్న్ మాజా 2944)

హజ్ కోసమైనా, ఉమ్రా కోసమైనా లేదా నఫిల్ తవాఫ్ అయినా – నల్ల రాయిని తాకడం, చుంబించడం లేదా దాని వైపు సైగ చేయడం తవాఫ్ మొదలు పెట్టే ముందు చేయవలసిన పని.
జాబిర్ ఇబ్న్ అబ్దుల్లా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మక్కాకు వచ్చినప్పుడు, తవాఫ్ చేసే ముందు నల్ల రాయి కొసను ముద్దాడేవారు. ఆ తరువాత తవాఫ్ లోని ఏడు ప్రదక్షినల్లో, మొదటి మూడింటిలో రమల్ (వేగంగా నడవడం) చేసేవారు. (సహీహ్ బుఖారీ 2.673 & సహీహ్ ముస్లిం 1218)

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నల్ల రాయిని ముద్దాడారు. ఆయన సమాజం (ముస్లింలు) వారిని అనుసరించారు.
ఉమర్ (రజి) నల్ల రాయి వద్దకు వచ్చి, దాన్ని ముద్దాడారు. ఆ తరువాత ఇలా అన్నారు: “నీవు కేవలం ఒక రాయివి అని నాకు తెలుసు. నీవు నాకు లాభం గానీ, నష్టం గానీ కలిగించలేవు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నిన్ను ముద్దాడుతూ నేను చూసి ఉండక పోతే, నేను నిన్ను ముద్దాడే వాణ్ణి కాదు.” (సహీహ్ బుఖారీ 1520; సహీహ్ ముస్లిం 1720)

ఎవరైనా నల్ల రాయిని చుంబించలేకపోతే, అతను దాన్ని చేతితో తాకడానికి ప్రయత్నించాలి లేదా ఇతర దేనితోనైనా తాకి, దాన్ని చుంబించవచ్చు.
(a) అబూ తుఫైల్ ఇలా అన్నారని ఉల్లేఖించబడింది: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కాబా తవాఫ్ చేస్తూ, హజరె అస్వద్ (నల్ల రాయి) ఉన్న కొసను స్పర్శించారు. ఆ తరువాత తనతో ఉన్న సిబ్బందిని ముద్దుపెట్టుకున్నారు.” (సహీహ్ ముస్లిం 1275)

ఒకవేళ ఎవరైనా పై దానిని చేయలేని పక్షంలో, అతను తన చేతితో సైగ చేస్తూ “అల్లాహు అక్బర్” అనాలి. ఇబ్న్ అబ్బాస్ (రజి) ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన ఒంటెపై తవాఫ్ చేశారు. నల్ల రాయి ఉన్న కొసకు వచ్చిన ప్రతి సారి దాని వైపు సైగ చేసి “అల్లాహు అక్బర్” అనేవారు. (సహీహ్ బుఖారీ 4987)

నల్ల రాయిని తాకడం వల్ల అల్లాహ్ మనిషి పాపాలను మన్నిస్తాడు. ఇబ్న్ ఉమర్ (రజి) ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఆ రెండిటినీ (నల్ల రాయి మరియు రుక్నె యమాని)ని తాకిన వారి పాపాలు మన్నించబడుతాయి.” (తిర్మిజి 959) [3]

అపోహ : రాయి దైవం కాగలదా?

తవాఫ్ లో నల్ల రాయిని అంతగా చుంబించిననూ, ముట్టుకున్ననూ ముస్లింలు దీన్ని పూజించరు. ఒక్క అల్లాహ్ ను ఆరాధించే వారు ఎవరూ ఇలా ఆలోచించరు. ఇది వారికి ఒక రాయి మాత్రమే. ఇది ఎవరికీ ఎలాంటి మేలు లేదా చెడు కలిగించజాలదు. మేలు లేదా చెడు కలిగించే అధికారం కేవలం ఒక్కడైన అల్లాహ్ కు మాత్రమే ఉంది. ఒక్క అల్లాహ్ ను ఆరాధించే వారెవరూ ఇలా చేయరు. కేవలం బహుదైవారాధకులు మాత్రమే ఇలా చేస్తారు. ఇలాంటి వారికి నల్ల రాయి ఓ రహస్యంగా మారిపోయింది. అజ్ఞానం కారణంగా వీరు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కాబాలోని విగ్రహాలన్నిటిని విరగ్గొట్టి కేవలం కాబాను లేదా నల్ల రాయిని విడిచిపెట్టారు అని అంటారు. అంతెందుకు కొందరు ముస్లింలు కూడా సందేహానికి లోనవుతారు. అందుకే రెండో ఖలీఫా ఉమర్ (రజి) ప్రజల్లోని ఈ సందేహాన్ని చెరపడానికే, దాన్ని (నల్ల రాయిని) చుంబించడానికి వచ్చినప్పుడు అందరు వినేలా బిగ్గరగా ఇలా అన్నారు: అబిస్ బిన్ రబియా ఉల్లేఖించారు: ఉమర్ (రజి) నల్ల రాయి వద్దకు వచ్చి, దాన్ని చుంబించి ఇలా అన్నారు: “నిస్సందేహంగా నీవు ఒక రాయివి మాత్రమే. నీవు ఎవరికీ ఎలాంటి మంచి లేదా చెడు కలిగించలేవు. నేను గనక దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నిన్ను చుంబిస్తూ చూడకపోతే, నిన్ను ఎన్నటికీ చుంబించే వాడిని కాను.” (సహీహ్ బుఖారీ 808)

రాయిని చుంబించడం, దాన్ని ఆరాధించినట్లు కాదు. నల్ల రాయిని చుంబించడం విగ్రహారాధన చేసినట్లు అవదు. ఎందుకంటే, రాయి ఒక రూపం కాదు. కొందరు, ముస్లింలు విగ్రహారాధన చేస్తారు అని అంటారు. కాని, వాస్తవం ఏమిటంటే ముస్లింలు ఒక్కడైన అల్లాహ్ తప్ప ఎవరినీ ఆరాధించరు.
అల్లాహ్‌! తన అను మతితో, మిమ్మల్ని స్వర్గం వైపునకు మరియు క్షమాభిక్షపొందటానికి పిలుస్తున్నాడు.మరియు ఈ విధంగా ఆయన తన సూచనలను ప్రజలకు – బహుశా వారు గుణ పాఠం నేర్చుకుంటారని – స్పష్టంగా తెలుపు తున్నాడు.

Related Post