సంబర ఘడియల సందేశం

eid-fitr-aadeshalu-5-638

సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతి సుహృద్భావాల మేలు కలయికే పండుగ. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తాయి. ‘ పండుగ ‘ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే….. దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ‘ పండుగ ‘ మానావాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే ‘ రంజాన్ ‘ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది.

అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ లా ఇలాహ ఇల్లల్లాహ్‌, అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ వ లిల్లాహిల్‌ హమ్ద్‌.

ఘనాఘన సుందరుడు అల్లాహ్‌. ఘనాఘన ఉపాధి ప్రదాత అల్లాహ్‌. ఘనాఘన సృజనశీలుడు అల్లాహ్‌. ఘనాఘన న్యాయ శీలుడు అల్లాహ్‌. ఆయన తప్ప మరో నిజ ఆరా ధ్యుడు లేడు. సకల సుకీర్తనలు ఆయనకే చెల్లు. అల్లాహ్‌యే ఘనాఘనుడు, అల్లాహ్‌యే మహా బలుడు. అండ పిండబ్రహ్మాండాల్లో ఏ ఒక్కటీ లేనప్పటి నుండి ఆయన ఘనాఘనుడే. సృష్టి, సృష్టిలోని చరా చరాలు ఉనికిలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఘనా ఘనుడే. విశ్వం, విశ్వంలోని సమస్తం చరమాంకానికి చేరుకున్న తర్వాత కూడా ఆయన ఘనాఘనుడే. ఆది నుండి నేటి వరకు, నేటి నుండి ప్రళయం వరకూ వచ్చిన, ఉన్న, రాబోవు ప్రాణులన్నీ కలిసి ఆయన్ను కీర్తించినా ఆయన ఘనాఘనుడే. అవి తమ కీర్తనల్ని మానుకున్నా ఆయన ఘనాఘనుడే. అందుకే నేడు మన ఈ పండుగ నాడు ప్రతి ఒక్కరి నోట నానుతోంది ఓ కీర్తన –  అదో విప్లవం, అదో ప్రభంజనం. అదే –

అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ లా ఇలాహ ఇల్లల్లాహ్‌, అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ వ లిల్లాహిల్‌ హమ్ద్‌.

పండుగంటే సంతోషం, సంతోషం అంటేనే పండుగ. సౌభాగ్య జీవితాల్లో మరిన్ని భాగ్య పుష్పాలను పూయించేది పండుగ. వేరయిన వారిని వారధిలా కలిపేది పండుగ. ప్రేమాభిమానాల ఘడియ పండుగ. మన్నింపు, మృదుత్వాల వేళ పండుగ.

ఇదిలా ఉంటె,  విశ్వాసుల్లో అవధుల్లేని ఆనందాన్ని, మేను పులకించే తన్మయాన్ని, తాదాత్మ్యాన్ని నింపే మహోత్సవ దినం ఏదో తెలుసా? అదే అల్లాహ్‌ మనందరి పట్ల ప్రసన్నుడయి మనల్ని నరకాగ్ని నుండి కాపాడి స్వర్గ వనాలలో విహరింపజేసే రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు అల్లాహ్‌ దివ్య దర్శనంతో మనందరి జన్మ ధన్యమయ్యే రోజు. అల్లాహ్‌ ఆ భాగ్యాన్ని మనందరికి అనుగ్రహించుగాక!

అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ లా ఇలాహ ఇల్లల్లాహ్‌, అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ వ లిల్లాహిల్‌ హమ్ద్‌.

ఇతర పండుగల మధ్య ఇస్లామీయ పండుగ ప్రత్యేకత ఏమిటంటే, అది రెండు విధేయతల నడుమ వస్తుంది. ఈదుల్‌ ఫిత్ర్‌ ”అయ్యామమ్‌ మాదూదాత్‌ – గణించదగిన దినాల” తర్వాత వస్తే, ఖుర్బానీ పండుగ  ”అయ్మామ్‌ మాలూమాత్‌ – నిర్థారిత దినాల” తర్వాత వస్తుంది. అంటే రమజాను పండుగ ముందు నెల సాంతం ఉపవాసాలు, తరావీహ్‌ జాగారాలు,లెలతుల్‌ ఖద్ర్‌ అన్వేషణలు, ఖుర్‌ఆన్‌ పారాయణాలు, దాన ధర్మాలు అయితే, రమజాను తర్వాత ‘ఆరు రొజుల’ షవ్వాల్‌ ఉప వాసాలు. దశ రాత్రుల ప్రార్థనలు.

అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ లా ఇలాహ ఇల్లల్లాహ్‌, అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ వ లిల్లాహిల్‌ హమ్ద్‌.

ఖుర్బానీ పండుగ ముందు ‘లయాలిన్‌ అష్ర్‌’ ప్రపంచ దినాల్లోనే మహోన్నతమయిన దశ  రాత్రుల ప్రాశస్త్యాలు, ఉపవాసాలు, ధాన ధర్మాలు, మినా మైదానంలో విడది, అరఫాలో బస అయితే, పండుగ తర్వాత ఖుర్బానీ, హాజీల ప్రార్థనలు, జమరాత్‌లపై రాళ్ళు రువ్వడాలు, మినాలో రాత్రి గడపడాలు, తవాఫ్‌ ఇఫాజాలు, హజ్జ్‌ సయీలు, తల నీలాల సమర్పణలు. అంతలోనే మళ్ళీ ముహర్రమ్‌ పది రోజుల ఉపవాసాల మహిమలు.

అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా, అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ వ లిల్లాహిల్‌ హమ్ద్‌.

ఈనాడు మనం శ్వాస పీల్చుకుంటున్న ఈ శుభ ఘడియల్ని యౌముల్‌ ఈద్‌-పండుగ దినం అంటారు. ప్రపంచం దినాల్లో మహి తాత్మ దినం ‘యౌమున్నహ్ర్‌-ఖుర్బానీ దినం’. ‘కాబట్టి నువ్వు అల్లాహ్‌ కోసమే నమాజు చెయ్యి, ఖుర్బానీ ఇవ్వు’ (అల్‌ కౌసర్‌:3) అన్న అల్ల్లాహ్‌ ఆదేశాన్ని అనుసరిస్తూ విశ్వంలో విశ్వాసులందరూ ప్రార్థనలు చేస్తారు, స్థోమత గలవారు ఖుర్బానీ ఇస్తారు. ఈ పది రోజుల తర్వాత వచ్చే దినాలు తష్రీక్‌ దినాలు. ఆహార పానీయాలు ఆరగిస్తూనే ప్రతి నమాజు అనంతరం అల్లాహ్‌ా ఘనకీర్తిని ఎలుగెత్తి చాటే రోజులు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలందరూ ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకునే సంబర ఘడియలివి.

అయితే అసలు పండుగ ఎవరిది? ఈ సంతోష క్షణాలు ఎవరి సొంతం?  నమాజు, ఉపవాసం, హజ్జ్‌ వంటి విధులు తమ మీద ఫర్జ్‌ అని తెలి సినా తప్పించుకు తిరిగే వారిదా? అసత్యం, అధర్మం, అన్యాయం, మోసం, దగా, కుట్ర, కాపట్యం, అహం అనే నిష్ట దరిద్రాలతో జీవించే వారిదా? అధికార మత్తులో ఆమ్‌ ఆద్మీపై దౌర్జన్యానికి దిగే వారిదా? అనాథల ఆస్తులను స్వాహా చేసే వారిదా? కార్మికుల కృషిని, శ్రమను జలగల్లా పీల్చేవారిదా? ఆకాశ గ్రంథాల ఆదేశాలను అంగట్లోని అటుకుల్లా భావించే వారిదా? ‘స్వర్గం వారి ప్రసన్నతలోనే ఉంది’ అని చెప్ప బడిన అమ్మానాన్నల పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ, అల్లాహ్‌ బల పర్చండి అని ఆదేశించిన బంధుత్వ సంబంధాను త్రెంచేందుకు బరి తెగించిన వారిదా? వీరూ ఈనాడు పండుగ జరుపుకుంటున్నారు. కానీ వారి గురించి అల్లాహ్‌ ఏమంటున్నాడో చూడండి! ”మీరు భూమ్మీద అన్యాయంగా అదిరి పడుతూ, అనుచిత రీతిలో మిడిసి పడినందుకు జరిగిన శాస్తి ఇది”. (మోమిన్‌: 75)

అవును, వారి పండుగ అధర్మమయినది, వారి ప్రార్థన అసత్యమయి నది, వారి ప్రవర్తన లోపభూయిష్టమయినది, వారి ప్రేమ కలుషితమయినది. వారు తిన్నది హరామ్‌, వారు తొడిగినది హరామ్‌, వారి దేహంలోని ప్రతి భాగం హరామ్‌తోనే పోషించబడినదే. మరలాంటప్పుడు అల్లాహ్‌ వారి ప్రార్థనను స్వీకరిస్తాడని, వారిని గొప్పగా సన్మానిస్తాడని ఎలా భావించగలం?

వాస్తవంగా వారి పండుగ ఖారూన్‌ పండుగ వంటిదే. పండగలయితే అతను చాలా దర్జాగానే చేసుకున్నాడు. ముందున్న మొసళ్ల పండుగను గమనించని కారణంగా పంగ నామాలు పెట్టుకు మరీ ఇంటితోసహా రాత్రికే రాత్రే భూస్థాపితం చేయబడ్డాడు.

వారి ముచ్చట అల్లాహ్‌ను విస్మరించిన వారి ముచ్చట లాంటిదే. ”తర్వాత వారికి బోధించబడిన విషయాలను వారు విస్మరించినప్పుడు మేము వారి కోసం అన్ని వస్తువుల ద్వారాలు తెరిచి వేశాము. తమకు ప్రాప్తించిన భోగభాగ్యాలపై వారు మిడిసి  పడుతుండగా  అకస్మాత్తుగా మేము వారిని పట్టుకున్నాము. అప్పుడు వారు పూర్తిగా నిరాశ  చెందారు. ఈ విధంగా దుర్మార్గాలకు పాల్పడిన వారి వేరు తెంప బడింది”. (అన్‌ఆమ్‌:44,45)

వారి ఈ సంబరాలు క్షణభంగురం, తాత్కాలికం. ఈ యదార్థాన్ని పండుగ రోజయినా వారు గ్రహించాలి. పశ్చాత్తాపం చెంది, మారు మనస్సు పొంది మాధవుని వైపునకు మరలాలి. వారినుద్దేశించిన  దయాసాగరుడయిన అల్లాహ్‌ పండగ ఆహ్వానం ఇది: ”తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్‌ా కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్‌ పాపాలన్నింటినీ క్షమి స్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరు ణించేవాడు”. (జుమర్‌: 53)

”తర్వాత ఎలాంటి సహాయం లభించని భయంకరమయిన విపత్తు  మీపై వచ్చి పడక ముందే మీరు మీ ప్రభువు వైపునకు మరలండి. ఆయనకే విధేయత చూపండి”. (54)

నేటికీ కొన్ని వేల సంవత్సరాల క్రితం మాట – ఒక వయో వృద్ధుడ యిన తండ్రి తన కొడుకుతో సంప్రదించిన వైనం బండరాయి గుండెన యినా కరిగించేస్తుంది. వెయ్యి సార్లు ఆలోచించి ఒక్క సారి అడిగిన ప్రశ్న అది! ‘బాబూ!’….

ఆ పిలుపులో ఎంత ఆప్యాయత, ఎంత వాత్స ల్యం, ఎంత ప్రేమ, ఎంత ఆర్ధ్రత, ఎంత అనురాగం, ఎంత మమకారం!

ప్రేమామృతం జాలువారుతున్న ఆ ధ్వని నూనూగు మీసాల ఆ కుర్రాడిని ఇట్టే ఆకర్షించింది. ప్రేమ, బాధ, ఆవేదన, అనురాగం కలగలసిన ఆ పిలుపు వినడం అదే అతనికి తొలిసారి!! ఇంతటి సంది గ్దానికి తన తండ్రిని ఏ విషయం గురి చేసినట్లు?

అంతలో మాట పూర్తి చేశారు ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ) – బుజ్జీ! నాకొచ్చిన కల ఏదో సాధారణ మయిన కల కాదురా! ప్రతి తండ్రి తన పిల్ల కోసం కనే కల అసలే కాదురా!..మాటలు తడబడుతున్నాయి…అధరాలు అదురుతున్నాయి… పంటి క్రింద బాధను బిగబెట్టి మరీ మాట పూర్తి చేశారు.

ఒరేయి చంటీ! నేను నిన్ను నా స్వహస్తాలతో జిబహ్‌ చేస్తూ చూశానురా. దీనికి నెవ్వేమంటావో చెప్పు!…………………… శ్మశాన నిశబ్దం!! భూమ్యాకా శాలు తండ్రి వేసిన ప్రశ్నకు నివ్వెరబోయి చూస్తున్నాయి. కొడుకు ఇవ్వ బోయే సమా ధానం ఏమయి ఉంటుంది? అన్న ఉత్కంఠ వాటిలో నెలకొని ఉంది…!!!

కుమారుడు ఆలోచిస్తున్నాడు. వంద వసంతాలు జీవించాల్సిన తన జీవితాన్నే తన తండ్రి కోరుకుంటున్నారని అతని బాగా తెలుసు. అయితే త్యాగానికే తలమానికం అయిన తన తండ్రి కోసం తను ఆ మాత్రం చేయలేడా? తను చేస్తున్నది త్యాగం కాదు. ప్రవక్త అయిన తన తండ్రి ప్రతి మాట తనకు పరమావధి అయినప్పుడు, ఆయన తనకు అల్లాహ్‌ తర్వాత అందరికన్నా అధికంగా ప్రియమయినప్పుడు, ఆయన కోరిక తీర్చడం తనకిష్టమయినప్పుడు, ఇష్టమయిన పని చేయడం త్యాగం  ఎలా అవుతుంది? అది స్వచ్చమయిన ప్రేమకు అక్షర రూపం కాదా! తక్షణమే ఎటువంటి తటపటాయింపు లేకుండా అన్నాడు: ”నాన్న గారూ! మీకు ఆజ్ఞాపించబడిన దానిని (నిశ్సంకోచంగా) నెరవేర్చండి. అల్లాహ్‌ చిత్తమయితే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు” (అస్సాప్ఫాత్‌: 102) ఈ మాట నాటి నుండి నేటి వరకు విశ్వవ్యాప్తంగా ఖుర్బానీ పండుగ రూపంలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ లా ఇలాహ ఇల్లల్లాహ్‌, అల్లాహయ అక్బర్‌ అల్లాహు అక్బర్‌ వ లిల్లాహిల్‌ హమ్ద్‌.

 

పశ్చాత్తాపంతో ప్రభువు వైపు మరలే వారిదే పండగ. దివారాత్రులు ఆయన్ను స్మరించే వారిదే పండుగ. ఏకాంతంలో సయితం ఆయనకు భయ పడేవారిదే పండుగ. వైర భావంతో వేరయిన ఇద్దరు సోదరుల మధ్య సంధి కుదర్చడానికి ప్రయత్నించిన వారిదే పండుగ. అనాథలకు ఆశ్రయం కల్పించిన వారిదే పండుగ. అభాగ్యుల్ని అక్కున చేర్చుకున్నవారిదే పండుగ. అగత్యపరుల్ని అనుఁగు సంతానంగా ఎంచిన వారిదే పండుగ. వితంతువుల్ని, వికలాంగుల్ని చేరదీసి చేతనయిన సహాయం చేసిన వారిదే పండుగ. బాధాతప్త హృదయుల్ని ఓదార్చిన వారిదే పండుగ. ఆప్తుల ఎడబాటును భరించలేక కన్నీరుమున్నీరయ్యే వారి కన్నీళ్ళు తుడిచిన వారిదే పండుగ.

ఈ నేల మనది కాదు. ఈ నింగి మనది కాదు. ఈ నీరు మనది కాదు. ఈ నిప్పు మనది కాదు. ఈ సృష్టి చరాచరాల్లోని ఏది మనది కాదు. అన్నీ అల్లాహ్‌ ప్రసాదితాలే. అందరూ ఆయన దాసులే. మన ఒక్క ఆదరణకు, ఒక చిరునవ్వుకు, సహాయానికి, సానుభూతికి అందరూ సమాన అర్హులే అని శక్తి వంచన లేకుడా ప్రజల బాగు కోసం పాటు పడేవారిదే పండుగ.  అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ లా ఇలాహ ఇల్లల్లాహ్‌, అల్లాహయ అక్బర్‌ అల్లాహు అక్బర్‌ వ లిల్లాహిల్‌ హమ్ద్‌.

ఈ నాటి పండుగ సంబరాల్లో పడి, క్షణక్షణం గండంగా జీవిస్తున్న అనేక దేశాల్లోని, అనేకానేక అమాయక జనాల్ని మనం మరచి పోతే చరిత్ర మనల్ని క్షమించదు. నేడు వారు గుప్పెడు మెతుకుల కోసం ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారన్న యధార్థాన్ని విస్మరిఇస్తే మనకు పుట్టగతులుండవు. భయం నీలి నీడల్లో నలుగుతున్న సీరియా ప్రజలయితేనేమీ, షామ్‌ పౌరులైతేనేమీ, ఫాలస్తీనా జనాలైతేనేమీ – అందరినీ సమానంగా మన ప్రార్థనల్లో గుర్తు చేసుకోవాల్సి ఉంది. నేడు విశ్వ వ్యాప్తంగా అవిశ్వాస మూకలు ఆకలి శునకాల్లా ముస్లిం బ్రతుకుల్ని చింపిన విస్తరి చేయాలని చూస్తున్నారన్నది వాస్తవమే కావచ్చుగాక. అయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అసలు నిరాశ అన్న పదానికే ముస్లిం డిక్షనరీలో చోటు లేదు. ఆ విషయానికొస్తే పరీక్షా  ఘడియలు లేని ఘట్టం ఒక్కటి కూడా మనకు ముస్లిం చరిర్రతలో కనబడదు. ఇస్లాం ధర్మంలో, ముస్లిం సముదాయంలో ఉన్న ఏకైక వైచిత్రి గుణం  ఏమిటంటే, దాన్ని ఎంతగానయితే అణచడానికి ప్రయత్నం జరిగుతుందో అది రెట్టింపు వేగంతో ఉవ్వెత్తుకు లేచి, ఉన్నత శిఖరాలను తన సొంతం చేసుకుంటుంది. ఈ విషయంలో అల్లాహ్‌ వాగ్దానం మనకు చాలు. ఆయనకు మించిన గొప్ప కార్యసాధకుడు ఎవడూ లేడు. ఆయన ఇలా అంటున్నాడు: ”వారందరూ కలిసి అల్లాహ్‌ జ్యోతిని తమ నోళ్ళతో ఊది ఆర్పి వేయజూస్తున్నారు. అల్లాహ్‌ ఏమో తన జ్యోతిని పరిపూర్ణం చేయనిదే వదలడు అని వాగ్దానం చేసి ఉన్నాడు”. (తౌబా: 32) ”మరి అల్లాహ్‌ మాటకంటే సత్యబద్ధమయిన మాట ఎవరిది కాగలదు?”. (అన్నిసా: 122)

ప్రియ పాఠకులారా! పండుగ అందించిన స్ఫూర్తితో మన శేష జీవితాన్ని భాగ్య బాటన నడిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఎంతయినా ఉందని సవినయంగా మనవి చేసకుంటూ సహృదయ పూర్వకంగా అందరికీ ఫిత్ర్‌ పండుగ శుభాకాంక్షలు!

Related Post