అంతిమ ఆదర్శం ప్రవక్త ముహమ్మద్ (స)

జీవితం ఓ పరీక్ష. విజయం సాధించాలంటే ఉత్తమ ఆశయం మీద గురి ఉండాలి, ఆ మహాశయ సాధన కోసం అవిరళ కృషి ఉండాలి. ఆ కృషికి తగ్గ సత్ప్రవర్తన, పరివర్తన ఉండాలి. ఆ పరివర్తనకు స్ఫూర్తిగా ఓ మహా ఆదర్శం ఉండాలి. ఆ మహా ఆదర్శమే విశ్వ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి సుచరితం. ఆయన స్థాపించిన వెళ్ళిన ఆదర్శాల వెలుగులో విశ్వ ప్రభువును కలుసుకునేంత వరకూ అంకిత భావంతో జీవన ప్రయాణం సాగించిన వారి పాదాక్రాంతం అవుతుంది ఇహపరాల విజయం. విశ్వ ప్రభువు ఇలా అంటున్నాడు: ”నిశ్చయంగా అల్లాహ్‌ ప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది.”  (అహ్జాబ్‌: 21)

అస్పృశ్యతా జాడ్యమంటని సమస్పర్శి ఆయన (స). విచ్చుకునే పూల పెదవులనే కాదు, గుచ్చకునే ముళ్ల కంటి  మొనలను సయితం ప్రేమగా పలుకరించే మమత ఆయనది.

ప్రవక్తలందరికి అధినాయకులు మహనీయ ముహమ్మద్‌ (స). ఆయనకు మించిన సత్యవంతుడు, సచ్చీలుడు, సంపూర్ణుడు మరొకరు లేరు. ఇదే కితాబు ఇస్తున్నాడు విశ్వ ప్రభువు అల్లాహ్: ”ఇంకా నువ్వు శీల శిఖర అగ్ర భాగాన్ని అధిరోహించి ఉన్నావు”. (అల్‌ ఖలమ్‌: 4)
 అల్లాహ్‌ను ఎవరు ఎంతగా ప్రేమిస్తారో వారు ఆంతగానే ప్రవక్త (స) వారి యెడల అనురాగం, అనురక్తి, అనుబంధం, అభిమానం కలిగి ఉంటారు. అంతే గౌరవంతో ఆయన్ను ఆదరిస్తారు, అనుసరిస్తారు, అనుకరిస్తారు కూడా. ఆయన యెడల అనురాగం మరువడం అంటే అల్లాహ్‌ ప్రేమకు దూరమవ్వడమే. ఇది అభిమానంతో చెప్తున్న మాట కాదు, అక్షరాల విశ్వ భ్రువు అల్లాహ్‌ చెప్పిన   మాట: ”(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: ‘మీకు నిజంగానే అల్లాహ్‌ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ్‌ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు”. (ఆల్‌ ఇమ్రాన్‌: 31)
 విశ్వ జనావళికి విశ్వ ప్రభువు అల్లాహ్‌ చేసిన మహోపకారం మహనీయ ముహమ్మద్‌ (స). ”అల్లాహ్‌ విశ్వాసులకు చేసిన మహోపకారం – ఆయన వారిలో నుండి ఒక ప్రవక్తను ఎన్నుకుని వారి వద్దకు పంపాడు”. (ఆల్‌ ఇమ్రాన్‌: 164) ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే: ” మీకు కష్టం కలిగించే ప్రతిదీ ఆయనకు బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటాడు. విశ్వాసుల యెడల ఆయన వాత్సల్యం కలవాడు, దయామయుడు”. (అత్తౌబహ్‌: 128)
ఎవరు ఎక్కడ దారి తప్పినా సన్మార్గం మీదకు తేవాలన్న ఆత్రం ఆయన హిత  బోధనకు. ఎక్కడ ఏ హృదయంలో ఆవేదనా చితి రగిలినా ఆర్పేయాలన్న తపన ఆయన కన్నీటి  జల్లుకు.  రాళ్లు విసిరి శరీరం మొత్తం రక్తసిక్తం చేసినా, ‘ప్రభూ! వీరికి సన్నార్గం చూపు! నెనెవ్వరో గుర్తించ స్థితిలో ఉన్నారు పాపం!” అని వేడెకునే సమదార సానుభూతి ఆయనకు. సమస్త లోకాల పాలిట మూర్తీభవించిన కారుణ్యంగా ఆవిర్భవించిన ప్రవక్త కదా! ఆ క్షమా గుణం, ఆ దయా లక్షణం  ఎక్కడికి పోతాయి?
అస్పృశ్యతా జాడ్యమంటని సమస్పర్శి ఆయన (స). విచ్చుకునే పూల పెదవులనే కాదు, గుచ్చకునే ముళ్ల కంటి  మొనలను సయితం ప్రేమగా పలుకరించే మమత ఆయనది. బండ రాతి గుండెలు ఎదురయితే ఎలాగయినా ఆ గుండెల్లో దూరి కొడిగట్టిన ధర్మజ్యోతిని వెలిగించాలన్న శ్రేయోభిలాష ఆయనది (స). ఆదరణకు నోచుకోని అనాథల తల అమిత ఆప్యాయంగా నిమురుతూ ఉంటే, ఆ జాలి స్పర్శలో వాత్సల్యం వర్షించేది.
పుడమిపై పురుడు పోసుకున్న ప్రతి ప్రాణి ఆనిర్వచనీయ ఆయన (స) స్పర్శానుభూతినే కోరుకునేది. ఆ ఆత్మీయ  స్పర్శకు దూరమయినందుకే పసికందుని వలే ఎక్కి ఎక్కి ఏడ్చింది ఓ ఖర్జూరపు చెట్టు. ఆ అనురాగ స్పర్శ కోసమే ఉన్న చోటు నుండి కదలని వృక్షాలు రెండు నడిచి వచ్చాయి ఏకంగా. ఆ అద్భుత స్పర్శ తాకిడితోనే కలిమా చదివాయి కంకర్రాళ్లు, సుబ్హానల్లాహ్‌ అంటూ సత్య ఫ్రబువు కీర్తించాయి పర్వతాలు. జడ జగతినే ఆకట్టుకున్న ఆ స్పర్శ సమస్త మానవాళికి అడుగుజాడయ్యింది.
ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ పవిత్రమూర్తి ఆదర్శ స్పర్శలో, సాంగత్యంలోనే ఉంది సర్వాంగీణ వికాసం. దేహానికయినా, దేశానికయినా, అంతరిక్షానికయినా, అవనీతలానికయినా. ఆలోచనా ప్రవాహానికయినా, ఇహపరాల సాఫల్యానికయినా. ఇది అక్షరాల అంతిమ గ్రంథమయిన ఖుర్‌ఆన్‌ మాట: ”ఎవరయితే అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు విధేయత కనబరచాడో అతను గొప్ప విజయం సాధించాడు”. (అహ్జాబ్‌: 71)

Related Post