New Muslims APP

అసలు బాధ ఏది?

అసలు బాధ ఏది?   మన మాటల్ని చేతల్ని వట్టి బూటకం అని కొట్టి పారేసినప్పుడు బాధ. మన హక్కుని మనకు దక్కకుండా చేసినప్పుడు బాధ. మనం కూడబెట్టిందంతా ఒక్కసారిగా కుప్ప కూలినప్పుడు బాధ. వయసు పైబడినా కన్న కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయినప్పుడు బాధ. మనవారు, మనలో సగం అనుకున్నవారే ద్రోహం చేసినప్పుడు బాధ. ఆప్తులు అసువులు బాసినప్పుడు బాధ. వెన్నుపోటు పొడిచింది వెన్నుదన్నుగా నిలవాల్సినవారే అని తెలిసినప్పుడు బాధ. మనం ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నవారు మన మనో భావాలతో ఆడుకుంటున్నారని తెలిసినప్పుడు బాధ. ఆశలు చిగురించక ముందే ఆశాభంగం కలిగినప్పుడు బాధ. సదుద్దేశ్యంతో సేవ చేయాలనుకున్నప్పుడు నిందలు పడాల్సి వస్తే బాధ. మనం గౌరవించే వ్యక్తి దగ్గర మనకు మర్యాద దక్కనప్పుడు బాధ. కటుంబ గౌరవం బజారు పాలైనప్పుడు బాధ. చేయని నేరాని కి శిక్ష అనుభవించినప్పుడు బాధ. కష్ట కాలంలో ఆప్తులు కూడా ఆదుకోనప్పుడు బాధ.

ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నవారు మన మనో భావాలతో ఆడుకుంటున్నారని తెలిసినప్పుడు బాధ. ఆశలు చిగురించక ముందే ఆశాభంగం కలిగినప్పుడు బాధ. సదుద్దేశ్యంతో సేవ చేయాలనుకున్నప్పుడు నిందలు పడాల్సి వస్తే బాధ. మనం గౌరవించే వ్యక్తి దగ్గర మనకు మర్యాద దక్కనప్పుడు బాధ.

ఇవి, ఇలాంటి అనేక బాధల్ని మనిషి తన రోజువారి జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాడు. ‘అనుభవిస్తేనేగానీ ఆ బాధ ఏమిటో తెలియదు’ అన్న మాట మనం తరచూ వింటుంటాము. అనుభవిస్తాము గనక అది బాధగా తోస్తుంది. ఐహిక పరమైన ఈ బాధలన్నీ పరీక్ష నిమిత్తం మాత్రమేనని ఆపద్బాంధవుడు అయిన అల్లాహ్ సెలవిస్తున్నాడు: “యావత్తు విశ్వ సార్వ భౌమత్వం కలిగి ఉన్న దేవుడు ఎంతో శుభదాయకుడు. ఆయన ప్రతి వస్తువుపై, ప్రతి విషయంపై సర్వాధికారం కలిగి ఉన్నాడు. మీలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షిండానికి ఆయన జీవన్మరణాలు సృష్టించాడు. ఆయన మహా శక్తిమంతుడు. గొప్ప క్షమాశీలి”.(అల్ ముల్క్: 1,2)

“భయం, ఆకలి, ధనప్రాణ, పంట నష్టాలు కలిగించి మిమ్మల్ని మేము తప్పనిసరిగా పరీక్షిస్తాము”. (బఖర: 155)

దైవ ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: “అల్లాహ్ కొందరిని ఇచ్చి పరీక్షిస్తాడు. మరికొందరిని కష్టాలకు గురి చేసి పరీక్షిస్తాడు”. ఈ బాధలు, కష్టాలన్నీ తాత్కాలిక తటాకమైన ఐహిక జీవితానికి సంబంధించినవే. కాని మన అనుభవంలోకి రాని బాధలు, సిసలైన పీడనలు ముందున్నాయి. అవి, మనిషి మరణానంతరం మొదలవుతాయి. అవేమంటారా?

అది- ‘దైవదూతలు వచ్చి, వారి ముఖాలపై పిరుదలపై కొడుతూ ‘ఇక దహనయాతన చవి చూడండి. ఇది మీరు చేజేతులా కొనితెచ్చుకున్న దాని పర్యవసానమే’. (అల్: 50) అని అన్నప్పుడు కలిగే బాధ. తను చలనం లేకుండా పడి ఉంటే – ఆప్తులు పెట్టే నాదాలు వింటూ కూడా కనీసం వారిని ఓదార్చలేని దుర్భర స్థితి ఏర్పడినప్పుడు కలిగే బాధ. సమాధిలో చల్లనైన ఎసీలకు, మెత్తనైన పరుపులకు, వెచ్చనైన హీటర్లకు, పసందైన పరిసరాలకి బదులు ఇరుకిరుకు స్థలంలో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉన్నప్పుడు, చేసుకున్న పాప పుణ్యాలు తప్ప మరే సామగ్రి లేనప్పుడు, అరచి నోరు బాదుకు న్నా వినే, పట్టించుకునే నాధుడే లేనప్పుడు కలిగే బాధ.
మున్కర్ నకీర్లు వచ్చి మన్ రబ్బుక? – నీ ఆరాధ్య దేవుడు ఎవడు?, మన్ నబియ్యుక? – నీ ప్రవక్త ఎవరు?, మా దీనుక? -నీధర్మం ఏది? అని నిలదీసినప్పుడు, భూమి అత్యంత విశాలంగా ఉండి కూడా అతి ఇరుకైన ప్రదేశంలో ఉండాల్సి వచ్చినప్పుడు, ధరిత్రి చేసే ఒత్తిడికి కుడి ప్రక్కటి ఎముకలు ఎడమ ప్రక్కటి ఎముకల్లో చొచ్చుకుపోయినప్పుడు, 70 గజాల లోతుకి పాతుకుపోయేలా చేసే కొరడా దెబ్బ పడినప్పుడు కలిగే విపరీతమైన బాధ.

“అలాంటి వారిని (దైవాన్ని మరచిన వారిని) మేము ప్రళయ దినాన బోర్ల పడేసి ఈడ్చుకొస్తాము. వారిని, అంధులుగా, బధిరులుగా, మూగలుగా చేసి వేస్తాము”. (బనీ ఇస్రాయీల్: 97) అని దేవుడు హెచ్చరించినప్పుడు కలుగుతుంది భరించరాని బాధ. కాకపోతే ఐహిక బాధలు పరీక్ష నిమిత్తం అయితే, మరణానంతరం బాధలు మనిషి చేసిన కర్మల ఫలం అయి ఉంటాయి. ఇది మరువ కూడదు. మరచి బ్రతకకూడదు. బ్రతికతే శిక్ష అనుభవించక తప్పదు.
“ఒక భయంకర దినాన తాము లేపి (దైవ సమక్షంలో) ప్రవేశించబడతామని వారికి తెలియదా? ఆ రోజు యావత్తు మానవులు విశ్వ ప్రభువు ముందు (తల వంచి) నిలబడతారు”.(దివ్య ఖుర్ఆన్ – 83; 4-6)
(వారు తమ దుష్కార్యాలకు జవాబు చెప్పుకోవాల్సిన పని లేదని భావిస్తున్నారా?) “ఎంత మాత్రం కాదు. దురాత్మల కర్మల వివరాలు కారాగారం (సిజ్జీన్) చిట్టాలో ఉంటాయి”. (ముతఫ్ఫిఫీన్: 7)

దీనికన్నా ఇంకా తీవ్రమైన బాధ మరొకటుంది. హషర్  మైదానంలో తలమీదికి సూర్యుడు తీసుకురాబడినప్పుడు, భూమి మరో భూమిగా మార్చివేయబడినప్పుడు, చేసుకు న్న వారికి చేసుకున్నంత అన్నట్టు – మోకాళ్ళ దాక కొందరు, నడుము దాక కొందరు, పూర్తిగా కొందరు చెమటలో మునిగి ఉన్నప్పుడు కలిగే బాధ.
నీడ ఎక్కడ కానరాని మాడ్చివేసే ఎండలో ఏ అండ మనకూ ఉండని తుది తీర్పు దినాన అల్లాహ్ అర్ష్  నీడకు సయితం నోచుకోని నికృష్ట స్థితి దాపురించినప్పుడు, హౌజె కౌసర్ (కౌసర్ సరోవరం) పై నుండి ధిక్కరించ బడినప్పుడు, మనం చేసిన పాపాలకు అల్లాహ్  ఆగ్రహించి “మీ కర్మలకు పర్యవసానం చవి చూసుకోండి” అన్నప్పుడు, “ఈ దినం రాకను మీరు బుద్ధి పూర్వ కంగానే విస్మరించారు. ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని విస్మరిస్తున్నాము” (జా:13) అని అన్నప్పుడు కలిగే బాధ మహా దారుణమైనది.

ఆలూబిడ్డలు, అన్నాదమ్ముళ్లు కూడా మా లెక్క పూర్తి కాలేదు సారీ అన్నప్పుడు, మన కర్మల చిట్టా ఎడమ చేతిలో ఇచ్చి – ‘ఇదిగో చదువుకో నీ కర్మల చిట్టా. ఈరోజు నీ కర్మల లెక్క చూడటానికి నీవే చాలు” (దివ్యఖుర్ఆన్-17:14) అని అన్నప్పుడు, విశ్వ కారుణ్యమూర్తి ముహమ్మద్ (స) వారి సిఫారసు కూడా మన విషయంలో స్వీకరించ బడనప్పుడు, 70 తల్లుల కన్నా అధిక ప్రేమ గల అల్లాహ్  కూడా మన వైపు కన్నెత్తి చూడనప్పుడు, మనతో ఒక్క మాటైనా ప్రేమతో మాట్లాడనప్పుడు కలిగే తీవ్రమైన బాధ వర్ణ నాతీతం.

మన నుదుటి మీద నరకవాసి అని వ్రాయబడినప్పుడు, అవిశ్వాసుల్ని గుంపులు గుంపులుగా నరకం వైపు తోలుకెళ్ళినప్పుడు, నరక ద్వారాలు తెరవబడినప్పుడు, ‘నరకంలో పోయి పడండి. ఇక మీరిక్కడే ఎల్లకాలం పడి ఉంటారు’. (జుమర్: 72) అని అన్నప్పుడు, అయ్యయ్యో! నా కర్మల పత్రం నాకసలు లభించకుండా, నా లెక్కేమిటో నాకు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది!! ఈ రోజు నా సిరి సంపదలు నాకేమాత్రం పనికి రాలేదే!? అయ్యో! నా అధికారం, అధిపత్యాలన్నీ మట్టిలో కలిసి పోయాయి” (హ్మాహ్: 26-29) అంటూ తీవ్ర పశ్చాత్తాపంతో నెత్తి నోరు బాదుకున్నప్పుడు, ‘పట్టుకోండి వాణ్ణి. వాడి మెడకు గుదిబండ కట్టి నరకంలో త్రోసేయండి. ఆ తర్వాత 70 మూరల గొలుసుతో వాడ్ని బిగించి కట్టండి…..చీము, నెత్తురు తప్ప వాడికి తినడానికి మరేమీ లభించదు’ (దివ్యఖుర్ఆన్-69: 30-38) అని ఆజ్ఞ జారి చేయబడినప్పుడు, ‘పట్టుకోండి వాడ్ని, బరబర ఈడుస్తూ తీసుకెళ్ళి నరకం మధ్యలో విసరి పడేయండి. సలసల కాగే నీటిని వాడి నెత్తి మీద కుమ్మరించండి…ఇక చూడు దీని రుచి, నువ్వు మహా గౌరవనీయుడవయిన పెద్ద మనిషివి కదూ….” (దుఖాన్: 48, 49) అని అవహేళనగా అన్నప్పుడు కలిగే పీడన. జఖూమ్ అనే చెట్టు తప్పకుండా తిన వలసి వచ్చినప్పుడు, చమురు తెట్టు లాంటి ఆ పదార్థం కడుపు లోకి పోయి మరగ కాచిన నీటిలా కుతకుత ఉడికిపోతున్నప్పుడు కలిగే బాధ మహా భయంకరమైనది.

చచ్చిపోదామన్నా చావు రానప్పుడు, చావుకే చావు ఇవ్వబడిన ప్పుడు, చర్మాలు కాలిపోతే మళ్ళి మళ్ళి కొత్త చర్మాల్ని సృజించ బడినప్పుడు, నరకంలో గల చివరి విశ్వాసి కూడా స్వర్గానికి చేరుకున్నప్పుడు, మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండండి అని అల్లాహ్  తీర్పు ఇచ్చేసినప్పుడి కలిగే పరమ పీడన వర్ణనాతీతం.

పై పేర్కొన్న ఈ బాధలు నేడు మన అనుభవంలో లేనివి, రానివి. అయితే హెచ్చరిస్తున్నది ఎవరో కాదు; తన దాసుల
శ్రేయం కోరే కరుణ సాగరుడైన అల్లాహ్. ఆయన తెలియ పరచిన వాస్తవాలు నిజాలుగా మన ముందు ప్రత్యక్షమవ్వక ముందే ‘పారా హుషార్’ అంటున్నాడు. “మానవులారా! మీ ప్రభువు ఆగ్రహం నుండి తప్పించుకోండి. (మీ ప్రభువుకు భయపడండి.) తండ్రి తన కొడుకుకు, కొడుకు తన తండ్రికి ఎలాంటి సహాయం చేయలేని దినం గురించి భయపడండి. అల్లాహ్  వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. కనుక ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసగించ కూడదు సుమా!”. (లుఖ్మాన్: 33)

ఇక ఐహిక సంపద, సుఖసౌఖ్యాలంటారా-,
“మానవులంతా ఒకే ఒరవడిలో కొట్టుకుపోతారన్న భయమే గనక లేకపోతే మేము కరుణామయుడైన అల్లాహ్ను  తిరస్కరించే వారి ఇండ్ల కప్పులను, వారు మేడపైకి ఎక్కే మెట్లను, వారి తలుపులను, వారు దిండ్లకానుకొని కూర్చునే పీఠాలను, అన్నింటినీ వెండి బంగారాలతో చేసి వేసే వారము. అయినా అది (మూన్నా ళ్ళ ముచ్చటైన) ప్రాపంచిక జీవిత సంపద మాత్రమే. (పరలోక సంపద ఇంతకంటే ఎంతో శ్రేష్ఠమైనది. శాశ్వతమైనది). నీ ప్రభువు దగ్గర భయభక్తులు కలవారికే పరలోక సంపద ప్రాప్త మవుతుంది”. (జుఖుఫ్: 35) –
కనుక విశ్వసించిన ప్రజలారా! మీరు మిమ్మల్ని, మీ భార్యా పిల్లల్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి. ఆ నరకాగ్నికి మాన వులు, రాళ్ళు సమిధలవుతారు”. (తహ్రీమ్: 6)

రేపటి భయంకర పీడనలు, పరాభవం నుంచి మనల్ని, మన వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: “ప్రతీ ప్రాణి మృత్యు రుచి చూడ వలసిందే. ప్రళయ దినాన మీరందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్ని నుండి కాపాడ బడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడతాడో అతడు నిశ్చయంగా సఫలీకృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయా వస్తువు తప్ప మరేమీ కాదు”. (అలి ఇమ్రాన్: 185)
ప్రాపంచిక బాధలు, కష్టాలు, నష్టాలు – ఒక్క మరణంతో అంతమైపోతాయి. కానీ, పరలోక బాధలు మరణానంతరం మొదలవుతాయి. కాబట్టి మంకు ప్రాప్తమైన ప్రాపంచిక జీవితాన్ని పరలోకపు పంట పొలంగా భావించి మేలిమి  విత్తనాల్ని నాటుకుంటే మంచిది. అలా కాకుండా నాసి రకపు  విత్తనాల్ని, ముళ్ల  విత్తనాల్ని జల్లుకుంటే తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల  ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ఆరోజు సంతానం, సిరిసంపదలు ఏమాత్రం ఉపయోగపడవు. నిష్కల్మషమైన హృదయంతో అల్లాహ్  సన్నిధికి వచ్చినవారికే ఆరోజు ప్రయోజనం ఉంటుంది.” దైవభీతి పరులకు స్వర్గం అతిచేరువగా తీసుకురాబడుతుంది. (ఆరోజు) దారితప్పినవారి ముందు నరకం ఉంచబడుతుంది. (అష్-షుఅరా: 88-91)

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.