ఆత్మ పరిశీలనకు అమల సాధనాలు

మనిషి జయాపజయాల్లో అతని పక్కలో ఉండే మనసు పోషించే పాత్ర అత్యంత కీలకమయినది. అది గనక గాడిలో పడితే యావత్‌ జీవితం గాడిలో పడినట్లే. అది గనక గాడి తప్పితే యావత్‌ జీవితం గాడి తప్పినట్లే, గతి మారినట్లే, చితి పేరినట్లే. ఇదే విషయాన్ని ఎరుక పరూస్తూ దైవప్రవక్త (స) ఇలా అన్నారు: ”సావధానంగా వినండి! మానవ దేహంలో ఒక ముద్ద ఉంది. అది గనక బాగుంటే మొత్తం శరీరం బాగుంటుంది. అది గనక పాడయితే మొత్తం శరీరం పాడవు తుంది. బాగా గుర్తుంచుకోండి! అదే మానవ హృదయం”. (ముత్తఫఖున్‌ అలైహి)

దేహ వైద్యం కన్నా ఆత్మ వైద్యం బహు కష్టమయినది. మరెవరయితే ప్రవక్తల పవిత్ర మార్గాన్ని వీడి ఆత్మ ప్రక్షాళన కోసం పాటు పడతారో వారు వైద్యం తెలియని రోగానికి వైద్యుని సలహా తీసకోకుండా స్వీయ వైద్యం చేసుకున్నట్లే. ఇక వారి వైద్యం వికటస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మనిషి జీవితంలో మనసు పాత్ర ఎంత కీలకం అంటే, ఖుర్‌ఆన్‌లో సూర్యుడు, చంద్రుడు, పగలు, రాత్రి, అకాశం మరియు భూమి వంటి మహా గొప్ప సృష్టితాల ప్రస్తావన తర్వాత అల్లాహ్‌ మనసును ప్రస్తావించాడు. ఇలా అన్నాడు: ”ఆత్మ మరియు దానిని తీర్చిదిద్దిన వాని సాక్షిగా! పిదప ఆయనే దానికి దుష్టతను, మరియు దైవభీతిని (చెడు నుండి తప్పించుకునే ప్రేరణను) ఎరుక పర్చాడు. దానిని (అంతరాత్మను) పరిశుద్ధపరచుకున్నవాడు ఖచ్చితంగా సఫలుడ వుతాడు. మరియు దానిని అణగద్రొక్కినవాడు నిశ్చయంగా విఫలుడవుతాడు”. (అష్షమ్స్‌: 7-10) మనందరికి ఆత్మ పరిశీలకు పనికొచ్చే పది మౌలిక సూత్రాలను తెలుసుకుందాం!

మొదటి సూత్రం: ఆత్మ ప్రక్షాళనకు అసలు బీజం తౌహీద్‌.

మానవ జీవితపు తొలి మరియు తుది లక్ష్యం తౌహీద్‌. తన నిజకర్త, విశ్వ సృష్టికర్త అయిన అల్లాహ్‌ను మనిషి ముందు గుర్తించాలి. ఆయన్ను మాత్రమే ఆరాధించాలి. సకల ఉపాసనారీతులను ఆయనకు మాత్రమే అంకితం చేయాలి. ఇదే యదార్థాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా తెలియ జేస్తుంది: ”నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నా ఆరాధన కోసం మాత్రమే ప్టుించాను”. (జారియాత్: 56)
ఒక లక్ష 24 వేల మంది ప్రవక్తల్ని ప్రభవింపజేసి ఆయన వారి ద్వారా తన దాసులకు ఇచ్చిన సందేశం – ”మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. ”వారు కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలని, తాగూత్‌ను విడనాడాల”ని ఆదేశించాము. (అన్నహ్ల్: 36 )

ప్రవక్త (స) హజ్రత్‌ ముఆజ్‌ బిన్‌ జబల్‌ (ర) గారిని యమన్‌ దేశం వైపునకు గవర్నర్‌గా చేసి పంపుతూ చేసిన హితవు: ”(ఓ మఆజ్‌!) నువ్వు వెళుతున్నది గ్రంథప్రజల వద్దకు. కాబట్టి వారికి ముందు వారు అల్లాహ్‌ను మాత్రమే ఏకైక ఆరాధ్య దైవంగా (తౌహీద్‌ను) నమ్మమని పిలుపు ఇవ్వు..” (ముత్తఫఖున్‌ అలైహి)
ఇమామ్‌ ఇబ్ను తైమియా (రహ్మ) ఇలా అన్నారు: ”హృదయ ప్రక్షాళనకు తొలి సూత్రం తౌహీద్‌. దాని ద్వారానే ఏ హృదయమయినా పవిత్రం కాగలదు”. (మజ్‌మూవుల్‌ ఫతావా)

తౌహీద్‌ భావన వల్ల మనస్సు నిమ్మలమయితే, షిర్క్‌ – బహు దైవారాధన, నాస్తిక భావన ద్వారా మనస్సు కలుషితమవుతుంది. అంటే, తౌహీద్‌ రహిత ఏ ఆత్మ పరిశీలన, ప్రక్షాలనా మార్గమయినా మనిషి నట్టేటా ముంచుతుంది, ఒడ్డుకు చేర్చదు. ఆ రకంగా ఆత్మ పరిశీలకు తౌహీద్‌ తొలి సాధనం అయితే, ఆత్మ అస్వస్థతకు ప్రధమ కారణం షిర్క్‌. మరి ఎవరయితే షిర్క్‌ మహమ్మారిని వదలకుండా సత్కర్మలు చేస్తారో వారి ఆ కర్మలు ఎంత ఘనాపాటివయినా అల్లాహ్‌ సమక్షంలో అవి గడ్డి పోచకు కూడా సమానం కాజాలవు, బూడిదలో పోసిన పన్నీరే. ఇదే హెచ్చరిక కుర్‌ఆన్‌ చేస్తోంది: ”ఒకవేళ నువ్వే గనక షిర్క్‌ చేసినట్లతే నీ కర్మలన్నీ వృధా అవుతాయి. మరియు నువ్వు నష్ట పోయినవారి జాబితాలో చేరతావు జాగ్రత్త!”. (అజ్జుమర్ : 65)
ఈ నష్టం కేవలం ప్రాపంచిక నష్టం మాత్రమే కాదు. పరలోకంలో సయితం ఈ దరిద్రం అతన్ని వదలదు. ”ఎవరయితే అల్లాహ్‌తోపాటు అన్యులను సాటి సహవర్తులుగా చేసి కొలుస్తాడో (షిర్క్‌ చేస్తాడో) అలాంటి వ్యక్తిపై అల్లాహ్‌ స్వర్గాన్ని నిషేధించాడు. మరియు నిశ్చయగా అతని నివాసం నరకమే”. (అల్ మాయిదహ్: 72)

రెండవ సూత్రం: ఆత్మ ప్రక్షాళనకు తాళం చెవి ప్రార్థన – దుఆ.

దైవప్రవక్త (స) ఇలా అన్నారు: ”అల్లాహ్‌కు దుఆ కన్నా మిక్కిలి ఇష్టమయిన వస్తువు మరేదీ లేదు”. (తిర్మిజీ)
ఎందుకు దుఆకు మాత్రమే అగ్ర తాంబూలం అంటే, దుఆలో కృతజ్ఞత ఉంటుంది. దుఆలో ఉపకార భావం ఉంటుంది. దుఆలో వినయం ఉంటుంది, దుఆలో విధేయత ఉంటుంది. దుఆలో ఆర్థ్రత ఉంటుంది. దుఆలో అశక్తత ఉంటుంది. దుఆలో ఆశ ఉంటుంది. దుఆలో అంగీకారం ఉంటుంది. దుఆలో భయం ఉంటుంది. దుఆలో భక్తి ఉంటుంది. ప్రార్థన అంటేనే, దాస్య భావన పరాకాష్ట. అది దుఆలో పుష్కలంగా ఉంటుంది. అందుకే ”దుఆ పార్థనా సారాంశం” అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ )
”మేళ్ళన్నింటికీ తాళం చెవి దుఆ” అన్నారు ఇమామ్‌ ఇబ్ను తైమియా (రహ్మ).
హజ్రత్‌ ఉమర్‌ (ర) ఇలా అంటుండేవారు: ”దుఆ స్వీకరించ బడుతుందా? లేదా? అన్న చింత నాకు లేదు. దుఆ చెయ్యాలన్న ఆలోచన మాత్రమే నాది. నాకు దుఆ చేసే సత్బుద్ధి కలిగిందంటే స్వీకరించబడుతుందన్న సంకేతం దానితోపాటే ఉంటుందన్నది నా బలమయిన నమ్మకం”. (తిర్మిజీ)

దైవ ప్రవక్త (స) సదా ఈ దుఆ చేస్తూ ఉండేవారు: ”అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తఖ్వాహా వ జక్కిహా అంత ఖైరు మన్‌ జక్కాహా” – ఓ అల్లాహ్‌! నా మనసుకి దానికి తఖ్వాను అనుగ్రహించు. దానిని పవిత్రం గావించు. ఆత్మకు పవిత్రను ప్రసాదించడం కేవలం నీ వల్ల మాత్రమే అవుతుంది. నీవే దాని రక్షకుడవు మరియు యజమానివి”. (ముస్లిం)

మూడవ సూత్రం: ఆత్మ ప్రక్షాళనకు జీవ జలం ఖుర్‌ఆన్‌.

”ఓ ప్రజలారా! నిశ్చయంగా మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి హితోపదేశం వచ్చేసింది. అది మనో రుగమ్మతలకు ఔషధి. మరియు విశ్వాసుల కోసం మార్గదర్శకత్వం, కారుణ్యం”. (యూనుస్: 57)
”నీటి తాకిడి వల్ల ఇనుము ఎలా తుప్పు పడుతుందో, ఈ (మానవ) హృదయాలు కూడా తుప్పు పడతాయి” అన్నారు ప్రవక్త (స). దానికి నివారణోపాయం ఏమిటి? అని సహాబా అడగ్గా – ”మరణ స్మరణ మరియు ఖురాన్ పారాయణం” అని బదులిచ్చారు ప్రవక్త (స). (బైహాఖీ – ఈ హదీసు బలహీనమైనది)
ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (రహ్మ) ఇలా అన్నారు: ”శారీరక, ఆత్మ పరమయిన సకల రుగ్మతలకు సంపూర్ణం ఔషధి ఖుర్‌ఆన్‌. ఇహ పరాల సకల రోగాలకు చక్కటి సంజీవని ఖుర్‌ఆన్‌”. (జాదుల్‌ మఆద్‌)
మరి అనునిత్యం ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తున్నా మన హృదయాలు ఎందుకు పవిత్రం కావడం లేదు? ఎందుకు మన సమస్యలు తీరడం లేదు? అంటే హజ్రత్‌ ఫజల్ బిన్‌ అబ్బాస్‌ (ర) ఇలా సెలవిచ్చారు: ”అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని అమలు పర్చడానికి, ఆచరించడానికి అవతరింపజేశాడు. కానీ ప్రజలు దాని పారాయణాన్ని ఆచరణగా చేసుకున్నారు”. (ఆజుర్రీ)

కాబట్టి మనం కేవలం పారాయణం వరకే పరిమితం కాకూడదు. ఖుర్‌ఆన్‌ గ్రంథానికనుగుణంగా జీవించాలి. జీవించేలా దీవించమని ప్రార్థించాలి. దైవ ప్రవక్త (స) సదా ఈ దుఆ చేస్తూ ఉండే వారు: ”అల్లాహుమ్మజ్‌అలిల్‌ ఖుర్‌ఆన రబీఅ ఖల్బీ, వ నూర సద్రీ, వ జిహాబ హమ్మీ వ గమ్మీ” – ఓ అల్లాహ్‌! ఖుర్‌ఆన్‌ను మా మనో వసంతంగా మార్చేయి. మా ఆత్మ జ్యోతిగా మలిచేయి. మా సకల చింతల, సమస్త బాధల నివారిణిగా చేసేయి”. (ముస్నద్ అహ్మద్)

నాల్గవ సూత్రం: ఆత్మ ప్రక్షాళనకు అవసరం ఉత్తమ ఆదర్శం.

మనం ఎంచుకున్న లక్ష్యం మాత్రమే గొప్పదయి ఉంటే సరిపోదు, ఆ లక్ష్య సాధన కోసం మనం ఎంచుకునే మార్గం సయితం ఉత్తమం అయి ఉండాలి. ఈ విషయంలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి మార్గానికి మించిన ఉత్తమోత్తమ మార్గం మరేది లేదు. ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటుంది: ”నిశ్చయంగా మీ కోసం అల్లాహ్‌ ప్రవక్తలో అత్యుత్తమ ఆదర్శం ఉంది”…..(ఆహ్జాబ్: 21)
నేడు ఆత్మ ప్రక్షాళన కోసం సత్య ప్రవక్త (స) చూపిన బాటను వదలి అసత్యవాదులు ఉపదేశించే మార్గాలలో తెలిసో తెలియకో చాలా మంది పయనిస్తున్నారు. అపమార్గానికి అధినాయకులుగా చెలామణి అయ్యే వర్గాలు ముస్లిం జీవితాల్ని నవ్వుల పాలు చేస్తూ కనబడుతోంది. ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (రహ్మ) ఇలా అన్నారు: ”దేహ వైద్యం కన్నా ఆత్మ వైద్యం బహు కష్టమయినది. మరెవరయితే ప్రవక్తల పవిత్ర మార్గాన్ని వీడి ఆత్మ ప్రక్షాళన కోసం పాటు పడతారో వారు వైద్యం తెలియని రోగానికి వైద్యుని సలహా తీసకోకుండా స్వీయ వైద్యం చేసుకున్నట్లే. ఇక వారి వైద్యం వికటస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దైవ ప్రవక్తలు వారే అందరికి ఆత్మ గురువులు, వైద్యులు. వారికి బేషరతుగా లొంగిపోవడం వినా ఆత్మ ప్రక్షాళనకు మార్గాంతరం లేదు. (మదారిజుస్లాలికీన్‌)

అయిదవ సూత్రం: ముందు శుద్ధి తర్వాత వృధ్ధి.

‘(ఓ ప్రవక్తా!) ”నువ్వు వారి సంపదల నుండి జకాతును తీసుకో. తద్వారా నువ్వు వారిని ప్రక్షాళిస్తావు మరియు వారిని తీర్చిదిద్తుతావు”. (తౌబహ్: 103)
పై ఆయతులో ‘తుతహ్హిరుహుమ్‌’ అంటే వారిలోని సకల మానసిక, శారీరక రుగ్మతలు, బలహీనతలను దూరం చేయడం. ‘తుజక్కీహిమ్‌ బిహా’ వారిని మానసికంగానూ, శారీరకంగాను సలక్షణాలు, సత్కర్మలతో బల పర్చడం. అంటే ఒక రైతులా చెడును తొలగించి మంచిని నింపడం అన్న మాట. ఎందుకంటే మనసు ఎప్పుడూ ఒకే రీతిన ఉండదు. ప్రవక్త (స) ఇలా అన్నారు: ”మనిషి వల్ల ఒక పాపం జరిగినప్పుడు మనసులో ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది. తౌబా చేసుకుంటే అది వైదొలుగుతుంది. తప్పుల తడికెగా మనిషి తన మనసును చేసుకుంటే ఆప్పుడది మాడి మసయి పోతుంది. అదే ఖుర్‌ఆన్‌లో అల్లహ్‌ పేర్కొన్న హృదయ తుప్పు” అని చెప్పి ఈ ఆయతు చదివారు: ”అసలు విషయం ఏమిటంటే, వారి దురాగతాల మూలంగా వారి హృదయాలకు తుప్పుపట్టింది”. (ఖుర్‌ఆన్‌ -83; 14) (తిర్మిజీ)

ఆరవ సూత్రం: చెడు తలపుల్ని, తలుపుల్ని మూసి వేయడం.

దైవప్రవక్త (స) ఇలా అన్నారు: అల్లాహ్‌ రుజుమార్గాన్ని ఒక ఉపమానం ద్వారా విశధ పర్చాడు. సరళమైన మార్గం ఒకటి. దాని రెండు వైపులా ఎత్తయిన ప్రహారీ గోడలున్నాయి. ఆ గోడల్లో తెరవ బడిన తలుపులు అనేకం ఉన్నాయి. ఆ తలుపులపై అందమైన, మనసైన పరదాలు వ్రేలాడదీయబడి ఉన్నాయి. రుజుమార్గం ప్రవేశ తలుపు దగ్గర ఒక పిలుపునిచ్చేవాడు ఇలా పిలుపునిస్తుంటాడు: ‘ఓ ప్రజాలారా! మీరందరూ ఈ రుజుమార్గంలోనికి ప్రవేశించండి. వక్ర మార్గాలు పోకండి. రుజుమార్గం పై భాగాన మరొక పిలుపునిచ్చే వాడున్నాడు. ఎవరు ఆ ప్రక్క తలుపులు తెరవాలని తలచినా అతను ఇలా హెచ్చరిస్తాడు: ‘నీ పాడుగాను! ఈ తలుపుని తెరవకు. ఒకవేళ నువ్వు దాన్ని తెరిచావంటే ఖచ్చితంగా అందులో దూరతావు’ అని. (ఇందులో పేర్కొన బడిన) రుజుమార్గం – ఇస్లాం అయితే, ప్రక్క గోడలు అల్లాహ్‌ నిర్థారించిన సరిహద్దులయితే, ముఖ ద్వారం దగ్గర పిలుపునిచ్చినవాడు ఖుర్‌ఆన్‌ అయితే, పై నుండి హెచ్చరించేవాడు ప్రతి ముస్లిం హృదయంలో ఉండే అంరాత్మ సాక్షి”.
(ముస్నద్‌ అహ్మద్‌)

ఇస్లాం ధర్మం మీద నిలకడ కలిగి జీవించడం అల్లాహ్‌ అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. రుజుమార్గం – ఇస్లాం మీద మన పాటికి మనం ఎంతో సౌమ్యంగా, హుందాగా సాగిపోతున్నా చుట్టూప్రక్కల ఉన్న అనేక ఆకర్షణలు మనల్ని ఒక పట్టాన వదలి పెట్టవు. ఒక్కోసారి షిర్క్‌, కుఫ్ర్‌, బిద్‌అత్‌ మనల్ని ఆకర్షిస్తే, ఒక్కోసారి వ్యభిచారం, విచ్చల విడతనం, మితిమీరిన స్వేచ్ఛ మనల్ని ఆకర్షిస్తుంది. ఒక్కోసరి పదవి వ్యామోహం, కీర్తి కాంక్ష మనల్ని ఆకర్షిస్తే, ఒక్కోసారి హత్య, అత్యాచారం మనల్ని ఆకర్షించవచ్చు. ఒక్కోసారి ధన దాహం, వడ్డీ వ్యాపారం, లంచం మనల్ని ఆకర్షిస్తే, ఒక్కోసారి పరనింద, ఆత్మ స్తుతి మనల్ని ఆకర్షించవచ్చు. కాబట్టి మన చూపుల్ని మనం పర స్త్రీల మీద పడకుండా కాపాడుకోవడమే కాదు. ఇలాంటి అన్నీ అనర్థాలవైపు మనం అస్సలు చూడకూడదు. ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటుంది: (ఓ ప్రవక్తా!) ”విశ్వాసులు వారి చూపులను వారు వ్రాల్చి ఉంచాలని, వారి మర్మావయవాలను కాపాడుకోవాలని వారికి చెప్పు. అది వారి కోసం ఎంతో శ్రేయస్కరమయినది, పవిత్రమయినదీను”……(అన్నూర్: 30)
అబూ హయ్యాన్‌ ఉన్దులుసీ (రహ్మ) ఇలా అన్నారు: ”ఈ ఆయతులో అల్లాహ్‌ ముందు చూపును ప్రస్తావించి, తర్వాత మర్మావయవాలను ఎందుకు పేర్కొన్నాడంటే, ‘చూపే సకల చెడులకు, వ్యభిచారానికి మూల కేంద్రం’. (అల్‌ బహ్రుల్‌ ముహీత్‌)

ఏడవ సూత్రం: మరణ స్మరణ-అల్లాహ్‌తో కలవబోతున్నామన్న భావన.

”ఓ విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్‌కు భయ పడండి. ప్రతి ప్రాణి తాను రేపటి కోసం ఎలాంటి సరంజామాను సిద్ధం చేసి పెట్టుకున్నదో సమీక్షించుకోవాలి. మరియు అల్లాహ్‌కు బయ పడుతూ ఉండండి”.. (అల్ హషర్: 18)
”రుచుల్ని మైమరపించే మరణ స్మరణ అధికంగా చెయ్యండి” అన్నారు ప్రవక్త (స). (నసాయి)
సయీద్‌ బిన్‌ జుబైర్‌ (రహ్మ) ఇలా అన్నారు: ”ఒక్క క్షణం కోసం నా హృదయం మరణ స్మరణను మరచితే అది నన్ను పాడు చేస్తుంది” అన్న భయం నాకుంటుంది. (ముస్నద్‌ అహ్మద్‌)
సుఫ్యాన్‌ బిన్‌ ఉయైనహ్‌ (రహ్మ) ఇలా అన్నారు: మీరు మీ ఆత్మతో ఇలా ప్రశ్నించండి: ”నువ్వు మరణిస్తే నీకు బదులుగా నమాజు ఎవరు చదువుతారు? నీకు బదులుగా ఎవరు నీ ఉపవాసాలు ఉంటారు? నీకు మాత్రమే తెలిసిన నీ పాపాలు, నీ నిర్వాకాల నుండి ఎవరు తౌబా చేస్తారు. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. నువ్వు కర్మ స్థలిలోనే ఉన్నావు. సత్మర్మలు చేసుకొని పరలోక సరంజామాను తయారు చేసుకో”. (ముహాసబతున్నఫ్స్‌)

ఎనిమిదవ సూత్రం: మంచి స్నేహితుల్ని ఎంచుకోవాలి.

”తమ ప్రభువును ఉదయం సాయంత్రం వేడుకుంటూ, ఆయన ప్రసన్నతను వేడుకుంటూ, ఆయన ప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో ఉన్నవారి సహచర్యం పట్ల నీ మనసును సంతృప్త పరచుకో. జాగ్రత్త! ప్రాపంచిక జీవిత అందాలను కోరకుంటూ వారి నుంచి నీ దృష్టిని మరల్చుకోకు. చూడు! ఎవరి హృదయాన్ని మేము మా ధ్యానం పట్ల నిర్లక్యానికి లోను చేశామో, ఎవడయితే తన మనో వాంఛల వెనక పరుగు తీస్తున్నాడో, ఎవడి పనితీరయితే మితిమీరి పోయిందో అలాంటి వ్యక్తిని అనుసరించకు”. (కహఫ్‌: 28)
అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ (ర) ఇలా అన్నారు: ”ప్రజల్ని వారి స్నేహితుల్ని బట్టి అంచనా కట్టడం జరుగుతుంది. వ్యక్తి తనకు నచ్చిన వారితో మాత్రమే స్నేహం చేస్తాడు”. (ఇబ్ను బత్తా)

తొమ్మిదవ సూత్రం: ఆత్మ స్తుతికి దూరంగా ఉండాలి.

‘కాబట్టి మీ పారిశుధ్యాన్ని గురించి మీరు గొప్పలు చెప్పుకోకండి. దైవానికి భయపడే వాడెవడో ఆయనకు బాగా తెలుసు” (జుమర్: 32)
”ప్రాణులన్నింలోకెల్లా శ్రేష్టుడు, అధికుడు మనిషి”. ‘అధికుడు’ అన్న ఈ భావనలో నుంచి పుట్టిన మరో భావనే ‘నేను గొప్ప, నాకంతా తెలుసు’ అన్నది. దీన్నే మనం ఆత్మ స్తుతి, బీరాలు పోవడం< కోతలు కోయడం అంటాము. ఈ భావన మనిషిని అహంకారానికి గురి చేసి ఆత్మ విమర్శ, స్వీయ వికాశానికి దూరం చేస్తుంది. ఒక రకమైనటువంటి మైకానికి లోను చేసి మనిషిని అచేతనావస్థలో పడవేస్తుంది. ఫలితంగా క్రియాశూన్యత అతని కొంపను కొల్లేరు చేసిగాని వదలదు. కాబట్టి మనిషి ఏ స్థాయి వ్యక్తియినా సరే అతనిలో ఆత్మ విమర్శ ఉండాలే గాని ఆత్మ స్తుతి ఉండ కూడదు. స్వయంగా అంతిమ దైవ ప్రవక్త, ప్రవక్తందరికి నాయకుడు అయిన ముహమ్మద్‌ (స) అల్లాహ్‌తో చేసుకున్న వేడుకోలును గమనించండి! ”అల్లాహుమ్మ ఇన్నీ అబ్దుక, వబ్ను అబ్దిక, వబ్ను అమతిక….” ఓ అల్లాహ్‌ నేను నీ బానిసను. నీ బానిస కుమారడను, నీ బానిసరాలి పుత్రడను”. (ముస్నద్ అహ్మద్)
అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ ఇలా అన్నారు: ”వినాశనం రెండు విషయాల్లో ఉంది. 1) నిరాశ. 2) ఆత్మస్తుతి.
ఎందుకంటే, అదృష్టం, సౌభాగ్యం అనేది సాహసం, కష్టంతో మాత్రమే లభిస్తుంది. నిరాశపరుడు కష్ట పడడు, ప్రయత్నించడు కనుక అతని వినాశనం ఖాయం. ఆత్మస్తుతి అనే మత్తుకి లోనయిన వ్యక్తి తనను తాను అందరికన్నా ఎక్కువ అదృష్టవంతునిగా, సజ్జనునిగా ఊహించుకుంటాడు. తాను చేస్తున్నది కరెక్టే అనుకుాండు గనక ప్రయత్నించడు, కష్ట పడడు. ఫలితంగా వినాశకాలే విపరీత బుద్ధి అన్న మాట నిజమవుతుంది.

ముతర్రిఫ్‌ (రహ్మ) ఇలా అన్నారు: ”రాత్రంతా మేల్కొని ప్రార్థనలు చేస్తూ గడిపి తెల్లారేకల్లా ఆత్మస్తుతికి లోనవ్వడం కన్నా రాత్రంగా నిద్రపోయి ఉదయం నిద్ర లేచాక పశ్చాత్తాపం చెందడం మిన్న”.
”ఆత్మస్తుతి, ఆత్మ విమర్శకు పూర్తి విరుద్ధం. అనర్ధాలన్నింటికీ మూలం” అన్నారు హజ్రత్‌ అలీ (ర).
ఇబ్ను ఖుదామా (రహ్మ) ఇలా అన్నారు: ”ఆత్మస్తుతి అహంకారానికి దారి తీస్తుంది. అహంకారం అనేక అనర్థాలకు దారి తీస్తుంది”.
ఈ ఆత్మస్తుతి అన్న మహమ్మారే షైతాన్‌ కొంప ముంచింది. కాబట్టి మనం ఆత్మ విమర్శ చేసుకోవాలే గానీ, ఆత్మ స్తుతికి లోను కాకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే, గొప్పలు పోతే తిప్పలు తప్పవు.

పదవ సూత్రం: స్వీయ ఆత్మ అవగాహన.

మనసును అల్లాహ్‌ మూడు విధాలుగా విభజించాడు: 1) నఫ్స్‌ ముత్‌మయిన్నహ్‌ – నెమ్మదించిన, ప్రశాంత మనస్సు. 2) నఫ్స్‌ లవ్వామహ్‌ – విమర్శించే మనస్సు. 3) నఫ్స్‌ అమ్మారహ్‌ – చెడుకై పురిగొలిపే మనస్సు. ఇందులో సమస్యల్లా నఫ్స్‌ అమ్మారహ్‌తోనే. దాన్ని గనక గాడిలో పెట్టుకోగలిగితే ఇక మనం ఇహపరాల్ని జయించినట్లే. ఈ దుష్ట మనస్సు గురించి ఇమామ్‌ ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (రహ్మ) ఇలా అన్నారు.
”దుష్ట మనస్సు ఉపమానం – అల్లాహ్‌ వైపు సాగిపోయే ప్రతి వ్యక్తి దారిలో అడ్డు తగిలే ఓ మహా పర్వతం లాంటిది. దుష్ట మనసు అనే ఆ కఠోర కొండను దాటి వెళ్లడం వినా మార్గాంతరం లేదు. కొందరికి దానిని దాటడం చాలా కష్టమయితే, అల్లాహ్‌ సులభతరం చేసిన వారికి దాన్ని దాటడం ఎంతో సులువు కూడా. ఆ పర్వత శ్రేణిలో ఎన్నో ఏట వాలు లోయలున్నాయి. ఎన్నో ఇరుకయిన కనుమలున్నాయి. భయంకరమైన ఊబి ఉంది. ముళ్ళు, దట్టమయిన పరికి కంపలతో అది నిండి ఉంది. సదరంగా ఉన్న స్థలం మొత్తం జారుడు నేలగా ఉంది. పులులు, సింహాలు, కౄర మృగాలు, విష సర్పాలు, తేళ్ళున్నాయి. ఇవి సరిపోవన్నట్టు దొంగలు, దోపిడీ దారులు ఆ బాటన నడిచి వేళ్ళ వారిని నిలువు దోపిడి చెయ్యడానికి మాటు వేసుకొని కూర్చుని ఉన్నారు. ఒకవేళ మనిషి దగ్గర అల్లాహ్‌ యెడల విశ్వాసం (ఈమాన్‌) అనే వజ్రాయుధం, అల్లాహ్‌ యెడల నమ్మకం, పూర్తి భరోసా అనే కవచం, జీక్ర్‌, షుక్ర్‌, సబ్ర్‌ అనే సైన్యాలు గనక లేకపోతే అతను ఆ భీకర, కీకర అరణ్యానికి ఆహుతి అవ్వాల్సిందే. ఇవి సరిపోవన్నట్లు ఆ పర్వత శిఖర భాగాన షైతాన్‌ నిలబడి ఆ పర్వత శ్రేణిని అధిరోహించాలనుకునే వారిని ‘ఈ పర్వత దరిదాపులకు కూడా రాకండి, మీరు దీన్ని ఛేధించ లేరు’ అని గట్టిగా హెచ్చరిస్తూ ఉంటాడు”.

ఎన్ని ఉన్నా మనం మాత్రం అంతిమంగా అల్లాహ్‌తో వెళ్ళి కలవాల్సిందే. కాబట్టి వ్యప్రయాసలతో కూడి ఈ ప్రయాణానికి మనం సిద్ధం కాకపోతే మనకు బదులు ఇంకెవ్వరూ ముందుకు రారు. ‘ఎవరో వస్తారు, ఏదో చేస్తారు’ అన్న కాలయాపన మాని ‘ఎవరూ రారు, ఏమీ చెయ్యరు, ఏదయినా చెయ్యాలంటే మనమే చెయ్యాలి’ వాస్తవ దృక్పథంతో, వజ్ర సంకల్పంతో ముందడుగు వెయ్యాలి. మనం వేసే ఆ అడుగు మన ఘనకీర్తిని కాపాడే గొడుగు అవ్వాలేగానీ, మనల్ని ముంచే మడుగు, మన పరువు ప్రతిష్టను గాలి వాన చేసే నుడుగు కాకుండా చూసుకోవాలి. అవును మనిషిగా బతికి, మహా మనీషిగా మనం ఎదగాలంటే చాలా కష్ట పడాలి. లేకపోతే పశువుకన్నా అధమంగా బ్రతకాల్సి వస్తుంది. తస్మాత్‌ జాగ్రత్త! మన ఆత్మ కళ్లెం లేని బాగా యవ్వనం మీదుండే పొగరుబోతు గుర్రం వంటిది. మచ్చిక చేసుకొని మార్గం మీద తెచ్చుకున్నామా సరి. లేదంటే సరేసరి!

Related Post