New Muslims APP

ఎవరీ దైవ దూతలు

ఎవరీ దైవ దూతలు –  ఒక ముస్లిం మౌలిక విశ్వాసాల్లో మహోన్నతుడయిన అల్లాహ్‌ను విశ్వసించిన తర్వాత రెండవ విశ్వాస మౌలికాంశంగా దైవదూతల యెడల విశ్వాసం ఉంటుంది. దైవ దూతల గురించి తెలుసకోవడం, వారి ఉనికి మూలాలను గ్రహించడం వల్ల చాలా వరకూ సృష్టితాల గురించి మనుషులలో ఉన్న మూఢ నమ్మకాలను దూరం చేసుకోవచ్చు. మానవ చరిత్రలో ఏక దైవారాధన (తౌహీద్‌) ఎంత ప్రాచీనమయినదో, విగ్రహారాధన సయితం కొన్ని వేల సంవత్సరాల తేడాతో అంతే ప్రాచీనమయినది. మానవ చరిత్రలో విగ్రహారాధన జాతిగా ప్రపంచ వేదిక మీదకు వచ్చిన తొలి జాతి ప్రవక్త నూహ్‌ (అ) వారి జాతి. నాటి నుండి నేటి వరకూ నిజ ఆరాధ్యుడయిన అల్లాహ్‌ తిరుగు లేని నామ గుణాలలో, ఆరాధనలో రెండు రకాల సృష్టితాలను మానవుడు చేర్చుతూ వస్తున్నాడు. 1) భౌతిక రూపం కలిగి ఉండి కనిపించేవి. 2) రూపం ఉన్నా అందరికీ కన్పించనివి.

మొధటి కోవకు చెందిన మనుషులు, జంతువులు, సూర్య చంద్ర నక్షత్రాలు కంటికి కనిపిస్తాయి గనక వాటి దైవత్వాన్ని ఆధారాల ద్వారా ఖండించే వీలుంది. కాని రెండవ కోవకు చెందిన దైదూతలు, జిన్నులు అగోచరమైనవి, ఎంతో బల పరాక్రంతోపాటు ప్రభావ వంతమయినవి. ఇవే ప్రజల్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. వాటినే కొందరు దేవతలుగా, దైవ సంతానంగా భావించి వాటి ఊహా చిత్రాలను తయారు చేసి పూజించడం మనం చూస్తాము.

రూపం కలిగి ఉండి కనిపించేవి:

సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నదీనదాలు, పర్వతాలు, భూమి, ఆకాశం, నిప్పు, నీరు, గాలి, కొన్ని ప్రత్యేక జాతుల పశువులు, పక్షులు, చెట్లు, మహనీ యులయిన మానవులు, జాతి పెద్దలు మొదలయినవి. వీటిని గురించి ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది: ”రేయింబవళ్లూ, సూర్యచంద్రులు కూడా ఆయన (అల్లాహ్‌ శక్తి) సూచనలలోనివే. మీరు సూర్యునికి గానీ, చంద్రునికి గానీ సాష్టాంగ ప్రణామం (సజ్జా) చేయకండి. నిజంగా మీరు నిజ ఆరాధ్యుని దాస్యం చేసే వారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్‌ ముందు మాత్రమే సజ్జా చేయండి”. (హామీమ్‌ అస్సజ్దా: 37)

ప్రజలు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా ఉండేలా రాత్రిని చీకటిమయంగా చేసింది, ఉపాధి సముపార్జనలో ఇబ్బంది కలగకుండా ఉండానికి పగటిని ఉజ్వలంగా చేసింది అల్లాహ్‌యే. భూమిని పాన్పుగా చేసినవాడు దానిపై వాన కురిపించి జీవకోటి అవసరాలను తీర్చినవాడు, పంటల్ని, ఫల ధాన్యాలను ఉత్పత్తి చేసిన వాడు, ఆకాశాన్ని కప్పుగా నిర్మించిన వాడు, అందులో నక్షత్రాలను అలంకారప్రాయంగా పొదిగినవాడు, మేఘాలను ఒక చోటు నుండి మరో చోటుకి తోలుకెళ్లే ఏర్పాటు చేసినవాడు, ప్రతి ఒక్కటి దానికై నిర్థారించిన పని నిరాటంకంగా చేసుకునేలా తీర్చి దిద్దినవాడు, ఒక దాని తర్వాత మరొకటి వచ్చే రేయింబవళ్ళను కొంత కాలం రాత్రి పెద్దదిగా, కొంత కాలం పగలు పెద్దదిగా చేసినవాడు అల్లాహ్‌యే. ఆయన ఇదంతా సక్రమంగా, సజావుగా తన వ్యూహరచన ప్రకారం నడుపుతున్నాడు. ఆయన సాటి, సహవర్తులు లేని నిరపేక్షాపరుడయిన ఒకే ఒక్కడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఈ విశ్వ వ్యవస్థలో ఆయన అధికారమే తిరుగు లేనిది. ఆయన తాను తలచిన వారికి రాజ్యాధికారాన్ని ఇస్తాడు, తాను తలచిన వారి నుండి రాజ్యాధికారాన్ని లాకుంటాడు. తాను కోరిన వారికి కీర్తిప్రతిష్టల్ని ప్రసాదిస్తాడు, తాను కోరిని వారిని అపకీర్తి పాలు చేస్తాడు. సకల మేళ్లు ఆయన చేతిలోనే ఉన్నాయి. సమస్త వస్తువులపై అధికారం ఆయనకు మాత్రమే ఉంది.

ఈ విశ్వాంతరాళానికి ఆయన తప్ప మరొకడు దేవుడిగా లేడు. అతలానికి ఒకడు, వితలానికొకడు, సుతలానికొకడు, తలాతలాకొకడు అంటూ ఉండి ఉంటే ఈ విశ్వ వ్యవస్థ ఎప్పుడో ఛిన్నాభిన్నయి పోయి ఉండేది. మనం చూస్తున్న ఈ విశ్వ వ్యవస్థ ఇంత పకడ్బందీగా, సాఫీగా సాగుతుందంటే ఈ విశ్వం మొత్తానికి కర్త అనేవాడు ఒక్కడే, ఆయనే అల్లాహ్‌. అండంతో ఉనికిలోకి వచ్చినవిగానీ, పిండంతో ఉనికిలోని వచ్చినవిగానీ, మనిషికి ఛేదించ సాధ్యం కానివిగా గోచరించే భూమ్యాకాశాలు, పర్వత శ్రేణులు, సముద్రాలు, సూర్యచంద్ర నక్షత్రాలు-అన్నీ ఆయన సృష్టించినవే, ఆయనకు తల వంచినవే, ఆయన ఆదుపాజ్ఞలో అణగిమణిగి ఉండేవే. సూర్యున్ని దాటే శక్తి చంద్రునికిగానీ, చంద్రున్ని దాటే శక్తి సూర్యునికి గానీ, పగిని దాటే శక్తి రాత్రికి గానీ, రాత్రి దాటే శక్తి పగికి గానీ లేదు. సమద్రాన్ని ఇంత వరకే నువ్వు రావాలన్నాడు అంత వరకే అది పరిమితమయింది. గాలులు ఎంత మాత్రం అంటే అంత మాత్రమే వీస్తున్నాయి, వాన ఎంత శాతం ఎక్కడ కురవాలంటే అక్కడ కురుస్తున్నది. కాబట్టి క్రిందన్ను భూమి దైవం కాదు, పైనున్న ఆకాశం దైవం కాదు. ఉదయ అస్తమయాలు కలిగిన సూర్యుడు దైవం కాదు, అర సెకనులో మనకు చేరుతున్న వెన్నల కలిగిన చంద్రుడూ దైవం కాదు. వీచే గాలీ దైవం కాదు, కురిసే వాన దైవం కాదు, మండే నిప్పూ దైవం కాదు. వీటన్నింని సృష్టించిన, వీటి సృష్టి ప్రక్రియలో సాటి సహవర్తులు లేని అల్లాహ్‌ మాత్రమే మనందరి దేవుడు, నిజ ఆరాధ్యుడు. మనం ఆయన్ను మాత్రమే ఆరాధించాలి. మన సకల ఉపసనా రీతులు ఆయనకే సమర్పితం, మన జనన మరణాలు ఆయనకే అంకితం. ఇదే సర యిన ధర్మం.

రూపం ఉన్నా అందరికీ కన్పించనివి:

భౌతిక రూపం ఉన్నా అందరికీ కన్పించకుండా, దైవాజ్ఞ మేరకు సృష్టి నిర్వహణ కార్యాన్ని నిర్వర్తించే సృష్టితాలు. ఉదాహరణకు దైవ దూతలు. వరుణ దేవుడు, వాయువు దేవుడు అని కొందరు కొలిచేది వీరినే. మొధటి కోవకు చెందిన మనుషులు, జంతువులు, సూర్య చంద్ర నక్షత్రాలు కంటికి కనిపిస్తాయి గనక వాటి దైవత్వాన్ని ఆధారాల ద్వారా ఖండించే వీలుంది. కాని రెండవ కోవకు చెందిన దైదూతలు, జిన్నులు అగోచరమైనవి, ఎంతో బల పరాక్రంతోపాటు ప్రభావ వంతమయినవి. ఇవే ప్రజల్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. వాటినే కొందరు దేవతలుగా, దైవ సంతానంగా భావించి వాటి ఊహా చిత్రాలను తయారు చేసి పూజించడం మనం చూస్తాము. అంచేత ఈ రెండవ రకమయిన మూడ నమ్మకాల్ని అంతం చెయ్యడానికి సృష్టికర్త అయిన అల్లాహ్‌, ముస్లిం మౌలిక విశ్వాసాల్లో ‘దైవ దూతలపై విశ్వాసం’ అన్న ఓ శాశ్వత ప్రకరణ ప్రవేశ పెట్టడమే కాక, వాటిని గురించి గొప్ప చమాచారమే అంతిమ దైవ గ్రంథం ఖుర్‌ఆన్‌ మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారి ప్రవచనాల ద్వారా తెలియజేశాడు.

”కరుణామయుడయిన (అర్రహ్మాన్‌) దాసులైన దూతలను వీళ్ళు ఆడవారుగా ఖరారు చేశారు. ఏమిటి, వారి పుట్టుక సందర్భంగా వీళ్లుగాని అక్కడున్నారా? వీళ్ళ సాక్ష్యం వ్రాసుకోబడుతుంది. (దీని గురించి) వీళ్ళు తప్పకుండా నిలదీసి అడగ బడతారు”. (జుఖ్రుఫ్‌: 19)

”సర్వ స్తోత్రాలు (శూన్యంలో నుంచి) ఆకాశాలను, భూమిని సృష్టించిన అల్లాహ్‌కే శోభిస్తాయి. ఆయన రెండేసి, మూడేసి, నాలుగేసి రెక్కలు గల దూతలను తన సందేశ వాహకులుగా చేసుకుాండు. సృష్టిలో తాను కోరిన దాన్ని పెంచుతాడు. అల్లాహ్‌ అన్నింటిపై అధికారం కలవాడు”. (ఫాతిర్‌: 1)

అనుగ్రహ దాత, అవరోధ కర్త అయిన అల్లాహ్‌ మనిషిని మట్టితో, జిన్నాతులను నిప్పుతో, దూతలను వెలుగుతో పుట్టించాడు అని ఖుర్‌ఆన్‌ మరియు హథీసుల ద్వారా తెలుస్తుంది. దూతలు, జిన్నులు మనుషుల్లాగే దైవ దాసులే, అల్లాహ్‌ సృష్టితాలే. సృష్టి – స్థితి, లయకి సంబధించిన ఆయన ప్రణాళిక మహిమాన్విత యుక్తితో కూడినది, క్రమబద్ధమయినది అనడానికి దైవ దూతల ఉనికి, వారికి అప్పగించబడిన కార్య నిర్వహణా బాధ్యతలు ప్రబల నిదర్శనం. అంటే దీనర్థం – దైవదూతలు లేకుండా ఆల్లాహ్‌ ఈ సృష్టి క్రమాన్ని నడుప లేడు అని ఎంత మాత్రం కాదు. అల్లాహ్‌ తలచుకుంటే మేఘాలు లేకుండా వర్షం కురిపించ గలడు. నీటి చుక్క లేకుండా చెట్టును మొలకెత్తించ గలడు. జడమయిన బండరాయి నుండి 12 జలపాతాలను పుట్టించగలడు. ప్రవిహించే జల వాహినిని స్థంభింపజేయగలడు. నీటినే గోడగా చేసి సముద్రంలో 12 మార్గాలను చెయ్యగలడు. కొండ చీల్చి ఒంటెను రప్పించ గలడు. తల్లిదండ్రులు లేకుండా మనుషుల్నిపుట్టించ గలడు. అమ్మానాన్న లేకుండా ఆదమ్‌ (అ)ను. అమ్మ లేకుండా హవ్వా (అ)ని, తడ్రి లేకుండా ప్రవక్త ఈసా (ఆ)ను పుట్టించింది ఆయనే. సృష్టిలో మనకు కానవచ్చే ఏ వింత, విశేషమయినా అది ఆయన శక్తి సూచనకు నిదర్శనమే. ఒక్క మాటలో చెప్పాలంటే, ”ఆయన ఎప్పుడయినా, ఏదయినా వస్తువును చేయ సంకల్పించినప్పుడు ‘అయిపో’ అని ఆదేశించగానే అది అయి పోతుంది”. (యాసీన్‌: 82)

దైవ దూతల పుట్టుక లక్షణాలు:

రెక్కలు: అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ (ర) గారి కథనం దైవప్రవక్త (స) హజ్రత్‌ జిబ్రీల్‌ (అ) వారిని ఆయన వాస్తవ రూపంలో చూశారు. ఆయనకు 6 వందల రెక్కలున్నాయి. ప్రతి రెక్క తూర్పు పడమరలను కప్పేసేంతటి విశాలమయినది గా ఉంది. ఆయన రెక్కల నుండి రంగు రంగుల ముత్యాలు-పగడాలు, మణి మాణిక్యాలు రాలుతున్నాయి”. (ముస్నద్‌ అహ్మద్‌)

శరీరాకృతి: జాబిర్‌ (ర) గారి కథనం – ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అల్లాహ్‌ దూతల్లోని అర్ష్‌ దూతల గురించి వివరించే అనుమతి నాకు లభించింది. ఒక దూత ఎలా ఉంటాడంటే అతని చెవి నుండి భుజం వరకు గల దూరం 7 వందల సంవత్సరాలు ప్రయాణం చేసేటంతటిది”. (అబూ దావూద్‌)
దేహ సౌందర్యం: ”అతను (జిబ్రీల్‌) గొప్ప శక్తి సంపన్నుడు, సౌందర్య శీలి”. (అన్నమ్మ్‌: 6)
స్థాయి భేధం: రిఫాఅహ్‌ బిన్‌ నాఫే కథనం- ‘దైవ దూత జీబ్రీల్‌ (అ) ప్రవక్త (స) సన్నిధికి వచ్చి మీ దృష్టిలో బద్ర్‌ సంగ్రామంలో పాల్గొన్న విశ్వాసులు ఎలాంటి వారు?’ అని ప్రశ్నించగా – ప్రవక్త (స) అన్నారు: ”వారు మాలోని ఉత్తములు”. అది విన్న జిబ్రీల్‌ ‘అవును, బద్ర్‌ సంగ్రామంలో పాల్గొన్న దూతలు మా వద్ద ఉత్తములు’ అని చెప్పారు. (బుఖారీ)
ఆకలి, దాహాలు వేయవు: ”దాన్ని వారి (దూతల) ముందు సమర్పించాడు. (అయ్యో!) మీరు తినరేమి?’ అని అన్నాడు”. (జారియాత్‌: 27)
అలసి పోరు: ”వారు రేయింబవళ్ళు ఆయన (అల్లాహ్‌) పవిత్రతను కొనియాడు తూ ఉంటారు. ఏ మాత్రం వారు అలసి పోవడంగానీ, (విసిగి పోవడంగానీ) బద్దకం చూపడం గానీ జరగదు”. (అన్బియా: 20)
నివాస స్థలం: ఆకాశం వారి నివాస స్థలం. ”ఆ రాత్రియందు దైవ దూతలు, ఆత్మ (జిబ్రీల్‌) తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల (నిర్వహణ) నిమిత్తం (దివి నుండి భువికి) దిగి వస్తారు”. (అల్‌ ఖద్ర్‌: 4)
లింగం భేదం: ఇతర సృష్టితాల్లా దైవదూతలకు లింగ భేదం లేదు.
వారి సంఖ్య: ఇస్రా మేరాజ్‌ సందర్భంగా బైతుల్‌ మామూర్‌లో ఒక సారి 70 వేల మంది దైవదూతలు ప్రవేశించారని, అలా ఒక్కసారి ప్రవేశించిన వారికి ప్రళయ దినం వరకూ మళ్ళి ప్రవేశించే అవకాశం రాదని” ప్రవక్త (స) వారు తెలియజేశారు. (బుఖారీ)
ప్రళయ దినాన నరకాన్ని లాక్కు రావడం జరుగుతుంది. దానికి 70 వేల జీనులుంటాయి, ప్రతి జీనుని 70 వేల మంది దైవ దూతలు పట్టుకుని లాగుతుంటారు” అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ)

మహా సిగ్గరులు: హజ్రత్‌ ఉస్మాన్‌ (ర) గారి గురించి ప్రవక్త (స) ఇలా అన్నారు: ”దైవదూతలు సయితం సిగ్గు పడే వ్యక్తి విషయంలో నేను సిగ్గు పడకుండా ఎలా ఉంటాను”. (ముస్లిం)
రూపం మారడం: ”అప్పుడు మేము ఆమె వద్దకు మా ఆత్మ (జిబ్రీల్‌)ను పంపాము. అతను ఆమె ఎదుట సంపూర్ణ మానవాకారంలో వచ్చాడు”. (మర్యమ్‌: 17)

వేగం: కాంతి సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగం కలిగి ఉంటుంది. మనిషి కనుక్కొన్న వాటిలో అత్యంత వేగవంతమయినది వెలుగే. అయితే కాంతి రూపులయిన దైవదూతలు వెలుగకన్నా వేగవంతులు అన్న యదార్థం ప్రవక్త (స) వారి జీవితంలో చోటు చేసుకున్న పలు సంఘటనల ద్వారా రూఢీ అవుతున్నది.

వారి ప్రతి విషయం వ్యవస్థీకృతమయి ఉంటుంది: ”దైవ దూతలు (నమాజులో) ముందు మొధటి పంక్తిని పూర్తి చేస్తారు, ఆ తర్వాత రెండవది. వారు పంక్తుల్లో బాగా అతుక్కుని నిలబడతారు” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)

మనిషితో దూతల అనుబంధం: (మొధటి మనిషి మరియు ప్రవక్త) ”ఆదమ్‌ (అ) మరణించినప్పుడు దైవ దూతలు ఆయన్ను బేసి సంఖ్యలో నీటితో స్నానం చేయిపించారు. ఆయన కోసం లహద్‌ సమాధిని త్రవ్వారు. తర్వాత ఇలా అన్నారు: ”ఇది ఆదమ్‌ (అ) సున్నత్‌-సంప్రదాయం ఆయన సంతానంలో కొనసాగుతుంది”. (సహీహుల్‌ జామె)
మాతృ గర్భంలో దూతలు: మూడు నలభయిలు దాటిన తర్వాత అల్లాహ్‌ ఆజ్ఞతో మాతృ గర్భంలో ఒక దూత వచ్చి నాలుగు విషయాలను నిర్థారించి వెళతాడు. 1) అతని ఉపాధి. 2) అతని మరణం. 3) అతని కర్మ. 4) అతను అదృష్టవంతుడా, దురదృష్టవంతుడా అన్న ఖర్మ”. (బుకారీ, ముస్లిం)

ఇతర కర్మలు:

కాపలా కాయడం, దైవవాణి తీసుకు రావడం, ఇమామత్‌ చేయిపించడం, మంచి చెయ్యమని ప్రోత్సహించడం, చెడు చెయ్యవద్దని వారించడం, మంచి వారిని దీవించడం, చెడ్డ వ్యక్తుల్ని శపించడం, కర్మలు లిఖించడం, విశ్వాసుల్ని ప్రేమించడం, విశ్వాసుల కోసం ఇస్తిగ్ఫార్‌ చేయడం, విశ్వాసుల పై దీవెనలు కురిపించడం, విశ్వాసులకు సాక్షులుగా, మిత్రులుగా ఉండటం, ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిపై ప్రపంచ వ్యాప్తంగా పంపే దరూద్‌ను ఆయన (స) వరకు చేరవేయడం, శుభవార్తను అందజేయడం, ఆపదలో ఉన్న వారిని అల్లాహ్‌ అజ్ఞతో సహాయం చెయ్యడం, ప్రాణం పోయడం, ప్రాణం తీయడం మొదలయిన బాధ్యతలు వారికి అప్పగించ బడి ఉం టాయి. ”అల్లాహ్‌ వారిని ఆదేశించిన వాటిలో దేనికి వారు విముఖత చూపరు. పైగా జారీ చెయ్యబడిన ఆజ్ఞలను ఖచ్చితంగా పాలిస్తారు”. (అత్‌ తహ్రీమ్‌; 6)

వారి పేర్లు: జిబ్రీల్‌ (అ): దైవదూతల నాయకుడు, వహీని తీసుకొచ్చే దూత
మీకాయీల్‌: వాన మరియు సకల వృక్ష సంపద బాధ్యత ఆయనది.
మాలిక్‌: నరక దూతలకు పెద్ద. ఇలా కొన్ని పేర్లున్నాయి.

దైవదూతల మరణం:

”మరి శంఖం ఊద బడగానే ఆకాశాలలో, భూమిలో ఉన్న వారంతా స్పృహ తప్పి పడిపోతారు (మరణిస్తారు)”. (జుమర్‌: 68)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.