కలిమి + లేమి = జీవితం

కలిమి + లేమి = జీవితం

అద్ధం జీవితం. -అబద్దమాడకు
యుద్ధం జీవితం ఆధైర్యపడకు

ఒకేసారి ఒకే క్షణంలో – అటు అంతఃపురంలో
పుత్రోదయ పరమోత్సాహం – ఇటు పట్టణ చివర
మురికివాడలో పూరి గుడిసెలో ఏ దిక్కూ లేని
తల్లి చింకి బట్టల పొత్తిళ్ళలో – పసిబిడ్డ ఆక్రందనం.

అప్పుడే అదే క్షణం ఒక మేఘం చంద్రుణ్ణి కప్పివేసింది
తళుక్కున ఒక మెరుపు తీగ భూమిని తాకింది
గగన శిఖరం పైనుంచి ఒక గర్జన వినబడింది.
అది ఆదిమధ్యాంతరహితుడి ఓదార్పులా ఉంది

దిక్కుమాలిన ఆ తల్లి తన బిడ్డను చూసి
బాబూ! ఈ భూమంతా దుఃఖమయం. వేదన-హింస-బాధ
అక్రమం అన్యాయం-పగ-ద్వేషం – ప్రేమరాహిత్యం నాయనా!
నేను నీకు ఇచ్చేందుకు నాదగ్గర కన్నీళ్ళు తప్ప
మరేమి లేవు తండ్రీ! పాలుకు బదులు కన్నీళ్ళతో
కదుపు నింపుకొని జీవించగలవా బిడ్డా! చలికి వణికే నిన్ను
కప్పేందుకు నా వట్టి చేతులు తప్ప పట్టు బట్టలు లేవు
నా చేతులు నీకు వేడినిస్తాయా బాబూ!
నా ఒడి నీకు బడి కాగలదా నాన్నా!

ఒకేసారి ఒకే ఘడియలో అటు అట్లూరు మండలంలోని
ఆడకూతురు పుట్టినందుకు ఆనందోత్సవాలు-ఇటు
పల్లెటూరులో చెట్టు క్రింద పేద తల్లి పాకి బట్టల మధ్య
వెక్కిళ్ళతో ఎర్రబడ్డ పసికూన చెక్కిళ్ళు
పేదైన ఆ తల్లి తన కూతురుని చూసి

ప్రియాతి ప్రియమైన నా చిట్టి తల్లీ!
నీకు ఇచ్చేందుకు ఈ పేద తల్లి దగ్గర
ఒక్క ప్రేమతప్ప ఇంకేమీ లేదమ్మా!
స్త్రీగా నేను అనుభవిస్తున్న విషాద జీవితాన్ని
పంచుకోవడానికి ఆత్మలోకాన్ని వదలి ఈ లోకానికి
ఎందుకు వచ్చావు తల్లీ? దుర్భర దారిద్ర్యంలో జీవితం
గడిపే ఈ తల్లి కడుపున ఎందుకు పుట్టావమ్మా?!

స్త్రీ ఒక అబలని తలచి, అంగాంగ కొలతలు కొలిచి
అతివను అంగడి బొమ్మను చేసిన కుళ్ళు సమాజంలో
ఒంటరిగా నడవలేక, పశువుల్లో బ్రతకలేక
ఊరు వల్లకాడాయే – రక్షణే కరువాయే
మమతలకు తావే లేని మానవ సంబంధాల్లో
కట్నం, లంచం అర్హతలైన మృగ పెత్తనాలు నీలి నీడల్లో
మగ్గుతున్న మగువల మధ్య మరో స్త్రీగా ఎందుకు జన్మించావు తల్లీ!?

ఆ తల్లి తన కొడుకును గుండెలకు గట్టిగా హత్తుకుంది.
ఈ తల్లి తన కూతురిని బాహువుల్లో బిగబెట్టుకుంది.
ఇద్దరు తల్లులది ఒకే ఆలోచన, ఒకే నిర్ణయం
మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదు
ఇద్దరూ పసికూనల చుట్టూ చేతులు వేశారు;
గతంలో మాదిరిగా తాము మళ్ళీ ఒకటి కావాలని……

ఆ ఇద్దరు తల్లులు కళ్ళు పైకెత్తి దైవాన్ని వేడుకున్నారు
దురదృష్టవంతులైన ఈ ప్రాంత ప్రజల మీద
మానవత్యం మరచిన ఈ మానవాళి మీద
దయ చూపు ప్రభూ! అని

అప్పుడే అదే క్షణం ఒక మేఘం చంద్రుణ్ణి కప్పివేసింది
తళుక్కున ఒక మెరుపు తీగ భూమిని తాకింది
గగన శిఖరం పైనుంచి ఒక గర్జన వినబడింది.
అది ఆదిమధ్యాంతరహితుడి ఓదార్పులా ఉంది

“కలత చెందకండి….కంగారు పడకండి.. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు’ దారిద్య్రం భయంతో మీ సంతానాన్ని (గొంతు నులిమి హతమార్చకండి. వారు భువన తారలు వారికి ఉపాధినిచ్చే బాధ్యత మాది. మీకు ఆహారమిచ్చే బాధ్యత కూడా మాదే, ప్రతి జీవి ఉపాధి మా చేతిలోనే ఉంది. వారు రేపటి ఆశాదీపాలు- వారిని ఆర్పివేయకండి. వారు మీ పాలిట దివ్య వరాలు. వారిని గుండెలకు హత్తుకోండి. గుర్తుంచుకోండి! అజ్ఞానం, అధైర్యం, మూర్ఖత్వంతో తమ సంతానాన్ని బలిగొనేవారు వారే ఘోరంగా నష్టపోతారు”. (దివ్య ఖురాన్ / బనీ ఇస్రాయీల్: 31)

ఒకేసారి – ఒకే నిమిషం అటు మరికివాడలో
ఇటు పల్లెటూరులో ఇద్దరు తల్లులూ ఈ శబ్దాన్ని
విన్నారు. నిజాన్ని గ్రహించారు. ఊరట చెందారు.
లెంపలేసుకున్నారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు. తమ
చంటి పిల్లలిద్దర్ని చచ్చినా చంపుకోబోమన్నారు.
దైవానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
తమ పిల్లలు తమకు దక్కినందుకు ఆనందభరితులయ్యారు.
అమాంతంగా సజ్జాలో పడిపోయారు…. సుల్తానల్లాహ్ అంటూ…..

జోరుగాలి వీస్తోంది ఆ గాలి నుంచి ఓ రాగం వినబడుతోంది….

అద్దం జీవితం విసిరిపారేయకు
యుద్ధం జీవితం విసుగు చెందకు

అంతలో చంద్రుడి పైనుండి మబ్బు తొలిగింది. చంద్ర కిరణాలు పూరి గుడిశెలపైన – అందున్న రెండు తల్లుల ప్రార్థనాస్థలాలపైన పడ్డాయి మీ తౌబాకు మేమే సాక్ష్యం అంటూ అల్విదా అంటూ …..శుభవార్తను విన్పించి మరీ వెళ్లాయి!

ఎవరు తమ ప్రభువు అల్లాహ్ యేనని పలికి, ఆమాట మీదనే స్థిరంగా ఉంటారో వారి (సహాయం) కోసం దైవదూతలు తప్పకుండా అవతరిస్తారు. అప్పుడు వారికి ఇలా ధైర్యం చెబుతారు: “భయపడకండి. విచారపడకండి. స్వర్గప్రవేశం గురించి మీకు చేసిన వాగ్దానం గుర్తు చేసుకొని ఆనందించండి. మేము ఇహలోకంలోనూ మీకు తోడుగా ఉన్నాం, ఇప్పుడు పరలోకంలోనూ మీకు తోడుగా ఉంటాం. ఇక్కడ మీరు కోరుకున్న వస్తువు లభిస్తుంది. మీరు కోరిందల్లా మీదే అవుతుంది. గొప్ప క్షమాశీలి, అమిత దయా మయుడయిన ప్రభువు వైపున లభించనున్న ఆతిథ్యమిది.” ((దివ్య ఖురాన్/ 41: 30-32)

Related Post