తౌహీద్‌ వ్యతిరేక పనులు

వారు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలని, ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలనీ, ఏకాగ్రచిత్తులయి – నమాజును నెలకొల్పాలనీ, జకాతు ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించ బడింది. ఇదే స్థిరమైన, సవ్యమయిన ధర్మం. (అల్‌ బయ్యినహ్‌: 5)

‘వారు కూడా మీరు విశ్వసించినట్టు విశ్వసిస్తే, వారు సన్మార్గం పొందిన వారవుతారు. ఒకవేళ వారు తిరిగి పోతే, విరోధం వహించిన వారవుతారు”. (అల్‌ బఖరహ్‌: 137)

తౌహీద్‌ పరిచయం:

ఖుర్‌ఆన్‌ ద్వారా శాస్త్ర బద్ధంగా, హథీసు ద్వారా ప్రామాణికంగా నిర్దేశించ బడిన ఆరాధనల్లో అల్లాహ్‌ను ఏకైక పూజ్యనీయునిగా, గుణ నామాల్లో అద్వితీయునిగా విశ్వసించడం.

అఖీదా పరిచయం:

ధర్మం దేని ఆధారంగానయితే దృఢంగా ఉంటుందో అలాంటి ధ్వజస్థంభాన్ని అఖీదా అంటారు. అఖీదా అన్నది అఖ్ద్‌ నుండి వచ్చి పదం. అర్థం ఒప్పందం, అగ్రిమెంట్ , ముడి, ఏదయినా వస్తువును బలంగా కట్టి ఉంచడం. ‘ఇఅతఖత్తు కజా’ అంటే నేను మనసా, వాఛా, కర్మణ త్రికరణ శుద్ధితో ఫలానా నమ్మకం కలిగి ఉన్నాను. అనగా ఏ విషయాల యెడల మనకు పూర్తి విశ్వాసం ఉంటుందో, మరే విషయాల యెడల మన మనసులో ఎలాంటి శంకకు, సందేహానికి తావు ఉండదో అలాంటి వాటిని అఖీదా అనంటారు. అది నిజమయినా, అబద్ధమయినా.

అఖిదాను షరీయత్‌ పరిభాషలో చెప్పాలంటే, అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని, మంచీ-చెడు విధిరాతలను విశ్వసించడం. వీటినే అర్కానుల్‌ ఈమాన్‌ – ఈమాన్‌ మూలాధారాలు అంటారు.
ఇస్లాం ధర్మంలో రెండు విషయాలు ప్రధానంగా ఉంటాయి. 1) అఖాయిద్‌ – విశ్వాసాలు. 2) ఆమాల్‌ – ఆచరణలు -షరీయా. అఖాయిద్‌ అనేవి నమ్మకానికి సంబంధించినవి. ఉదాహరణకు అల్లాహ్‌ ఉలూహియ్యత్‌, రూబూబియ్యత్‌, అస్మా వస్సిఫాత్‌. ఇవి ధర్మానికి విత్తు, ఏరు లాంటివి. ఆమాల్‌ – ఆచరణలు. ఇవి భంగిమకు సంబంధించినవి. ఉదాహరణకు – నమాజు, ఉపవాసం, జకాత్‌, హజ్జ్‌.

అఖిదా ప్రాధాన్యత:

”ఇక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చేయాలి. తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించ కూడదు”. (అల్‌ కహఫ్‌:110)
పై ఆయతులో అద్వితీయ దేవుడయిన అల్లాహ్‌ను కలుసుకోవాలని ఆరాట పడే వ్యక్తి షిర్క్‌కు దూరంగా ఉండాలి. అంతిమ దైవ ప్రవక్త (స) వారి సున్నత్‌ను అనుసరించి సత్కర్మలు చేయాలి అన్న రెండు షరతుల ప్రస్తావన ఉంది.

అఖీదయె తౌహీద్‌కు వ్యతిరేకమైన వియాలు:

స్వచ్ఛమైన తౌహీద్‌ బావనకు వ్యతిరేకమయిన వాటిని నవాఖిజె ఇస్లాం అనంటారు. అంటే ఇస్లాం నుండి బహిష్కరించే విషయాలు. అలాంటివి చాలా ఉన్నప్పటికీ పదిని మాత్రమే ఇక్కడ పొందు పరుస్తున్నాము.

1) అల్లాహ్‌ విషయంలో షిర్క్‌ చెయ్యడం:

”తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించాన్ని (షిర్క్‌ను) అల్లాహ్‌ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి కోసం వారి పాపాపలను మన్నిస్తాడు”. (అన్నిసా: 48)
”ముమ్మాటికీ షిర్క్‌ చాలా పెద్ద దుర్మార్గం” అని ప్రవక్త (స) ఓ సంద ర్భంలో చెబితే, ‘ఘోర పాపాల్లోకెల్లా అత్యంత ఘోరమైన పాపం షిర్క్‌’ అని వేరొక సందర్భంలో సెలవియ్యడం జరిగింది.
అల్లాహ్‌ విషయంలో షిర్క్‌ చెయ్యడం అంటే, అల్లాహ్‌ రుబూబియ్యత్‌ – సార్వభౌమత్వంలోగానీ, అల్లాహ్‌ ఉలూహియ్యత్‌ – ఆరాధనలోగానీ, అల్లాహ్‌ అస్మా వస్సిఫాత్‌ – నామ గుణాల్లోగానీ వేరొకరిని సాటి సహవర్తులుగా, బాగస్వాములుగా చెయ్యడం. ముఖ్యంగా అల్లాహ్‌ నామ గుణాల విషయంలో కడు అప్రమత్తంగా ఉండాలి. ఆయన నామ గుణాలను యథావిధిగా విశ్వసించాలి. వాటిలో ఏ ఒక్క నామ గుణాన్ని నిరాకరించడంగానీ, పోలికలు కల్పించడం గానీ, వేరే అర్థాలు తొడిగించే ప్రయత్నం చెయ్యడంగానీ అస్సలు చెయ్య కూడదు. ఈ మూడు కారణాల వల్లనే ప్రపంచంలో నాస్తికత్వం, బహుదైవారాధన, విగ్రహారాధన చోటు చేసుకుంది.

పరిణామం ఏమిటి ?

”ఎవడు అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వాని కోసం అల్లాహ్‌ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని”. (అల్‌ మాయిదహ్‌; 72)

2) వసీలా – మధ్యవర్తిత్వాన్ని నమ్మడం:

ఒక వ్యక్తిని అల్లాహ్‌కు మరియు ప్రజలకు మధ్య దళారిగా నమ్మడం, అతని వల్లనే సకల సమస్యలు పరిష్కృతం అవుతాయి అనుకోవడం షిర్క్‌ అనబడుతుంది. ఇలా చేసిన వ్యక్తి పండితులందరి ఏకాభిప్రాయంతో ఇస్లాం నుండి వైదొలుగుతాడు. అయితే నేడు ముస్లిలయిన కొందరిలో కనిపించే వసీలా దాన్ని బిద్‌యీ వసీలా అంటారు. అది షిర్క్‌ మరియు కుఫ్ర్‌ స్థాయికి చెందినదయితే కాదు. కానీ ఇలాంటి భావాలకు, భావన కలిగిన వ్యక్తులకు దూరంగా మసలుకోవడంలోనే క్షేమం ఉంది.

3) అవిశ్వాసులు, నాస్తికులు కాఫిర్‌ అన్న విషయంలో సందిగ్ధానికి లోనవ్వడం.
4) ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి సంప్రదాయం కన్నా అన్యుల విధానాన్ని, సంప్రదాయాన్ని గొప్పగా భావించడం.
5) ప్రవక్త ముహమ్మద్‌ (స) తీసుకొచ్చి ఏ విషయాన్నయినా సరే అసహ్యించుకోవడం.
6) అల్లాహ్‌ వచనాలు, ప్రవక్త (స) వారి ప్రవచనాలతో పరిహాస మాడటం:

చాలా మంది ముస్లింలు ఖుర్‌ఆన్‌ మరియు హథీసులను హాస్య వస్తువులుగా చేసి చెబుతుంటారు. వారు అల్లాహ్‌కు భయ పడాలి. అల్లాహ్‌ ఈ హెచ్చరికను సదా గుర్తుంచుకోవాలి:
‘మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని నువ్వు వారిని అడి గితే, అబ్బే ఏమీ లేదు. ఏదో సరదాగా, నవ్వులాటకు ఇలా చెప్పుకుంటున్నాము అని వారంటారు. ”ఏమి, మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తలతో పరిహాసమాడుతున్నారా?” అని వారిని అడుగు. మీరిక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి ఒడి గట్టారు. ఒకవేళ మేము మీలోని కొందరిని మన్నిం చినా, మరికొందరిని వారి నేరాలకుగానూ కఠినంగా శిక్షిస్తాము అని ఓ ప్రవక్తా! వారికి చెప్పు”. (అత్తౌబహ్‌: 65,66)

7) చేతబడి చెయ్యడం.

8) సత్యం, ధర్మం, న్యాయ విషయంలో ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లిమేతరులకు సహాయ పడటం.
9) ప్రవక్త (స) వారు తీసుకొచ్చిన షరీయతు ఆదేశ పాలన నుండి కొందరికి మినహాయింపు ఉంది అని నమ్మడం.
10) అల్లాహ్‌ ధర్మం యెడల విముఖతను కనబర్చడం.

ఇలా ఎందుకు జరుగుతుంది?

అఖీదహ్‌, విశ్వాసం అనేది దైవ నిర్దేశితం. అల్లాహ్‌ వచనాలు మరియు ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి ప్రవచనాల వెలుగులో మాత్రమే మనం అఖీదాను గ్రహించాలి. ఇందులో జోక్యం చేసుకునే అనుమతి ఏ స్థాయి పండితునికయినా లేదు. ఎందుకంటే అల్లాహ్‌ గురించి ఆయన పంపిన షరీఅతు గురించి ఆయనకంటే ఎక్కువ తెలిసిన వారు ఎవ్వరూ లేరు. అల్లాహ్‌ తర్వాత ప్రవక్త ముహమ్మద్‌ (స) వారికన్నా ఎక్కువ తెలిసిన వారు మానవ లోకంలో ఎవరూ లేరు. కాబట్టి మనం స్వచ్ఛ మయిన తౌహీద్‌ అఖిదాకు ప్రాధాన్యతనిచ్చి, తర్వాత ఆ అఖీదా ఆధారంగా ఆచరణలు చేపట్టాలి. అఖిదా రహిత, అఖీదా లోపించి ఎలాంటి ఉత్తమ కార్యమయినా ఉత్తుత్తి కార్యంగా మిగిలి పోతుంది.

ఎప్పుడెప్పుడయితే ప్రజలు తమ అఖిదాను ఖుర్‌ఆన్‌ మరియు హదీసుల ఆధారంగా కాకుండా, తత్వ శాస్త్రం, తర్క శాస్త్రాలు అనుసరించి నిర్మించుకునేందుకు ప్రయత్నించారో అప్పుడప్పుడు వారు త్రోవ తప్పారు. వర్గాలు, తెగలుగా విడి పోయారు. వారి నిర్వాకాల కారణంగా ఇస్లాం ధర్మ సౌధ బాహ్య స్వరూపం దెబ్బ తిన్నది. ముస్లిం సముదాయం 73 వర్గాలుగా వేరయి పోతుంది అని చెప్పింది అఖీదా వియంలోనే తప్ప, ఆచరణల విషయంలో కాదు.

స్వచ్ఛమయిన అఖిదాను మనిషి ఎందుకు వదులుకుంటాడు?

1) అజ్ఞానం: మనిషి తన విశ్వాసాల – అఖీదా గురించి తెలిసుకోక పోవడం, ఎవరయినా చెప్పినా పట్టించుకోక పోవడం. హజ్రత్‌ ఉమర్‌ (ర) ఇలా అన్నారు: ”ఎప్పుడయితే ఇది అజ్ఞానం, ఇది మూర్ఖత్వం అని తెలియని ప్రజలు ఇస్లాంలో అధికమయి పోతారో అప్పుడు ఇస్లాం ముడులు ఒక్కోక్కటిగా విప్పుకుంటూ పోతాయి. ఫలితంగా దాని ధృఢత్వం సడలుతుంది” (అఖీదాలో అపనమ్మకాలు కూడా చేరతాయి).

2) మౌఢ్యం, వంశ దురభిమానం:

ఇది అసత్యం, అధర్మం, అన్యాయం అని స్పష్టంగా తెలుస్తున్నా దాన్నే అనుసరించే వారు సమాజంలో మనకు చాలా మంది కన బడతారు. దానికి వారు చెప్పే సాకు – వంశ పరంపర, మరియు పెద్దల అనుసరణ. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”అల్లాహ్‌ అవతరింప జేసిన గ్రంథాన్ని అనుసరించండి” అని వారికి చెప్పినప్పుడల్లా, ‘మా తాత తండ్రులు అవలంబిస్తూ ఉండగా చూచిన పద్ధతినే మేము పాటిస్తాము’ అని వారు సమర్థించుకుంటాకుాంరు. ఏమిటి, వారి పూర్వీకులు ఒట్టి అవివేకులు, మార్గ విహీనులైనప్పటికీ (వీళ్ళు వారినే అనుసరిస్తారన్న మాట!). (అల్‌ బఖరహ్‌: 170)
3) అంధానుసరణ: ”నా సముదాయం 73 వర్గాలుగా విడి పోతుంది. ఒక్క వర్గం తప్ప మిగతా వర్గాలన్నీ నరకానికి పోతాయి” అని ప్రవక్త (స) హెచ్చరించి వెళ్ళారు గనక మనం మన అఖీదా, విశ్వాసాల విషయంలో కడు అప్రమత్తంగా ఉండాలి. మనం దేన్నీ గుడ్డిగా, మిడి మిడి జ్ఞానంతో అనుసరించ కూడదు. ప్రామాణికమయిన వాటిని మాత్రమే తీసుకోవాలి.

4) పుణ్యాత్ముల విషయంలో అతిశయిల్లడం:

”ఇంకా వారిలా అన్నారు – ఎట్టి పరిస్థితిలోనూ మీ పూజ్య దైవాలను వదల కండి. వద్ద్‌ను గానీ,
సువాను గానీ, యగూస్‌ను గానీ, యవూఖ్‌ను గానీ వదలి పెట్టకండి”. (అన్నూహ్‌: 23)
ఇంతకీ పై ఆయతులో పేర్కొన బడిన ఈ అయిదుగురు ఎవరు? అంటే, వారు ప్రవక్త నూహ్‌ (అ) కాలానికి చెందిన పుణ్య పురుషులే. వారి మరణానంతరం షైతాన్‌ వారి అభిమానుల్లో దురాలోచనను నూరి పోసి వారిని మార్గం తప్పించాడు. క్రమేణా వారు నిజ దైవాన్ని వదలి వ్యక్తులయిన వారిని దైవాలుగా, దైవాంశ సంభూతులుగా భావించి కొలవనారంభించారు. అంటే, అభిమాన వ్యక్తుల, పుణ్యాత్ముల విషయం లో అతిశయిల్లడం అనేది చరిత్రలో ఎప్పుడు ఎక్కడ ఏ సమాజంలో జరిగినా అది వ్యక్తి పూజకు, విగ్రహారాధనకు దారి తీసింది అన్నది నిర్వివాదాంశం.

కుటుంబంలో శిక్షణ లేమి:

”పుట్టే ప్రతి శిశువు ఇస్లాం ధర్మం మీదనే పుడతాడు. అయితే, అతని తల్లిదండ్రులు అతన్ని యూదునిగానో, క్రైస్తవునిగానో, మజూసీ (అగ్గి పూజారీ)గానో మార్చి వేస్తారు” అన్నారు ప్రవక్త (స). (బుఖారీ)
అంటే సంతానం సక్రమంగా, అక్రమంగా ఉండటంలో తల్లిదండ్రుల పాత్ర తప్పక ఉంటుందన్న విషయాన్ని ప్రవక్త (స) వారి ఈ ప్రవచనం తెలియజేస్తుంది. కుటుంబ సభ్యుల్లో స్వచ్ఛమయిన తౌహీద్‌ భావన లేక పోతే ఖచ్చితంగా పిల్లలు సయితం పెడత్రోవ పడతారు. పాడయి పోతారు. తండ్రి పిల్లలకు చెప్పే విద్యాబోధలో అగ్ర భాగం తౌహీద్‌కు ఇవ్వాలి.

వ్యక్తి, వ్యవస్థ దురభిమానం:

”ఉజైర్‌ (అ) అల్లాహ్‌ కుమారుడు” అని యూదులు అన్నా, ”మసీహ్‌ (యేసు) అల్లాహ్‌ కుమారుడు” అని క్రైస్తవులు అన్నా కారణం – వారు స్వచ్ఛమైన ధర్మాన్ని వదలి పండితులను, పెద్దలను గుడ్డిగా అనుసరించడమే. అల్లాహ్‌ ఇలా అంటున్నాడు: ”వారు అల్లాహ్‌ను వదలి తమ పండితులను, సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు”. (తౌబహ్‌: 31)

మద్రసాలు అవసరమైన పాత్రను పోషించక పోవడం:

చాలా మద్రసాలలో నమాజు, వుజూ, గుసులు, జకాత్‌, హజ్జ్‌కు సంబంధించి చాలా వివరణాత్మక శిక్షణ ఉంటుంది కానీ, తౌహీద్‌ సంబంధిత విషయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. చాలా మంది మద్రసాల నుండి పట్టాభద్రులయి బయిటికి వస్తారు కానీ, అఖీదా గురించి పూర్తి అవగాహన ఉండదు. అఖీదాను పాడు చేసే విషయ పరిజ్ఞానం ఉండదు. సామాన్య జనం లాగే వారు కూడా పైన పేర్కొన బడిన తౌహీద్‌ వ్యతిరేక పనులు చేస్తూ కనిపిస్తారు. ఇస్లాం ధర్మానికి ఆత్మ తౌహీద్‌. అది లేని మతధర్మం ప్రాణం లేని దేహంతో సమానం.

ఈ విపత్తు నుండి ఎలా బయట పడాలి?

”ముస్లిం సమాజానికి చెందిన తొలి వారి సంస్కరణ దేని ఆధారంగా జరిగిందో, చివరి వారి సంస్కరణ కూడా దాని ఆధారంగానే జరగ గలదు” అన్నారు ఇమామ్‌ మాలిక్‌ (రహ్మ).
ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”వారు కూడా మీరు విశ్వసించినట్టు విశ్వసిస్తే, వారు సన్మార్గం పొందిన వారవుతారు. ఒకవేళ వారు తిరిగి పోతే, విరోధం వహించిన వారవుతారు”. (అల్‌ బఖరహ్‌: 137)

Related Post