New Muslims APP

దానవుణ్ణి జయించిన మానవుడు

అబ్బా! దారుణ ధ్వని. పాల కడలిలో హాలహలం అలజడి. భరించలేకున్నాను. కర్ణ పుటాలు వక్కలవుతున్నాయి. మనసులోని మధువు ఆవిరైపోతున్నది. హృదయ దీపం ఆరి పోతున్నది.

విశ్వం వెలుగునీడల కలయిక. పెనుగులాడుతుంటాడు మనిషి ఇది తెలియక. అడుగు నేలపై ఆనని యౌవనం అడుసులోకి దిగబడుతుందని గహ్రించక పడతాడు తికమక. నిత్యం దీప్తమని అనుకున్న జీవితం లిప్తలో ఆరిపోతుందని ఎరుగక కకావికలుడవుతాడు మనిషి.

గాండ్రించే అరణ్యాలు, గీపెట్టే సముద్రాలు, తీండ్రించే జలపాతాలు, తిరగబడే ఝంఝా మారుతాలు, గట్లకు కాట్లు వేసే నదుల బుసబుసలు, గిరుల వేళ్ళను పెళ్ళగించే భూగర్భ రుసరుసలు – విస్మయం చెందాడు మనిషి. ఈ భువనాన అతనో అపరిచితుడు. చేదు చిలికే జీవితంలో స్వాదుతా నిలయాలుంటాయని గానీ, మధువులొలికే మాటబొమ్మల మాటు నాగపణమ్ములుంటాయనిగానీ అప్పటికి అతనికి తెలవదు. జీవితం – తృటిలో అది చేద బావి. తృటిలో అది ఎండమావి. క్షణం నిండి ఉంటుంది, క్షణం ఎండి ఉంటుంది. క్షణంలో అది పెను ఎడారి, కనులు తెరిచిన ఇనుప దారి. జీవితం – అందులో సుఖదుఃఖాలు సమపాళ్ళలో ఉంటాయి. ఈ జీవిత సత్యాన్ని గ్రహించటానికి మనిషికి చాలా సమయమే పట్టింది.

ఇది తెలిసిన మరుక్షణం –
గుహను గుడిసెగా మార్చుకున్నాడు. ఇటుకే కండగా, ఇనుమే అండగా చేసుకొని ఇల్లు కట్టుకున్నాడు. ఈటెల్లాంటి చేతులతో ఏటిని రెండుగా చీల్చాడు. పడవల అరి కాళ్ళతో కడలి అంచుపైన నడిచాడు. సూదిలో దారం లా చొరబడ్డాడు గిరుల గుండెల్లో. సెగ విసిరిన రాపిడిలో రాలే నిప్పును చిలికించాడు. బిగుసుకు పడి ఉన్న నేలను చిగుళ్ళ నోళ్ళతో పలికించాడు. అడవిలో పూసే అందాలను అంగణంలో నాటించాడు. కోరల మధ్య అదిరే జీవాలను ఊరి ఒడిలో పెంచుకున్నాడు.

ఉక్కును ఉప్పులా కరగబోసి, ఇనుమును జనుములా సాగదీసి, అహర్నిశలు పరిశ్ర మించి ప్రకృతిలోని చలనశీలానికి ప్రతీకగా, జగతిలో భ్రమణానికి ప్రతి రూపంగా ఎదిగాడు మనిషి. తన తనువులో ఉన్నది ఆ భువనమే. తన శ్వాసలో ఉన్నది ఆ పవనమే. తన రుధిరంలో ఉన్నది ఆ ప్రవాహమే. తన కళ్ళల్లో ఉన్నది ఆ ప్రసారమే. తన శిరసులో ఉన్నది ఆ చలనమే. ఈ పంచ భూతాల తళుకుతో, ఈ జ్ఞాంనేద్రియాల వెలుగుతో మింట (ఆకాశాన) మొలచిన మిసిమిని ఇంట నిలిపాడు దివ్వెలా. ఆ కాంతిని లోకానికందించాడు. నాకాన్ని నేల కు దించాడు. సముద్ర గర్భంలో చదరంగం ఆడాడు. ఆమెరికాలో కూర్చొని ఆంధ్ర ప్రదేశ్‌ లో కన్పించాడు. ఏమూలనో ‘హెలో’యని విశ్వం సాంతం విన్పించాడు.

చిరకాలం మేధాసాగర మథనం చేసి మనిషి సాధించిన విషయాలు అగణ్యం. పాన్పులోంచి కదలకుండా ప్రపంచాన్ని చుట్టి వచ్చాడు. చేతికి తడి అంటకుండా చిత్రంగా భోంచ శాడు. కాలికి మన్నంట కుండా కాబా గృహం దర్శించాడు. వీటన్నింటికీ ప్రేరణగా నిలిచింది మెదడు+మనస్సు.అయితే ఇన్ని సాధింగలిగిన మనిషి తన ఆ చిట్ట్టి మనస్సును అదుపు చేయ లేకపోతున్నాడు. సమస్తాన్ని గెలిచి వచ్చిన ఈ మనిషి తన మనస్సులోని తమస్సును గెలవ లేకపోతున్నాడు. ఎంత విచారకరం! ఆ మనసుతో మనిషి సాగించిన సంబాషణే  ఇది –

మనిషి: మనసు నను లాలించే ఆత్మసఖి. మనసు నన్నూగించే అపర శిఖి. మనసే నా సారథి. మనసే నా వారిధి. మనసే నా వారధి.

మనసు: ఆ గొంతుక ఎవరిదీ? అటునున్నది ఎవరదీ? ఒహోహో మనిషి! దీపశిఖవు కాదు సుమా వొఠ్ఠి నుసి. నేను నీ వారిధినా? నేను నీకు వారధినా? రథసారథినా… సఖినా.. ..శిఖినా…ఔనొక మాదిరిగా సఖినే, శిఖినే, వారిధినే, వారధినే. రథసారథినే.
నాటి – ఆది కాలం నాటి మాట; నీ లోపల దైవ అవిధేయత మంచుగడ్డై పేరిన నాడు, నీలోని చైతన్యం జడీభవించిన నాడు, దైవ శిక్షకు నీవు నిలువునా కంపించి పోయిన నాడు, గుండె గుబులుతో నీ  దవడలు   వడ వడ వణికిన నాడు, జ్వలనధాతువునై నీలో పశ్చాత్తాపాగ్నిని రగిలించి వేడి కలిగించిన శిఖినే. గాడి తప్పిన నీ మేధను దారి మళ్ళించి దయాభిక్షకు అర్హుణ్ణి చేసిన ప్రియ సఖినే. ప్రభువు ప్రసన్నత మార్గాన నిన్ను నడిపించిన రథసారథినే. నిన్ను వీపుపై మోసిన సారిధినే. నీ ప్రగతికి పూబాటగా నిలిచిన వారధినే.

(అంతలో తమస్సు నడుస్తున్న చప్పుడు భయంకరంగా విన్పిస్తుంది).

మనషి: అబ్బా! దారుణ ధ్వని. పాల కడలిలో హాలహలం అలజడి. భరించలేకున్నాను. కర్ణ పుటాలు వక్కలవుతున్నాయి. మనసులోని మధువు ఆవిరైపోతున్నది. హృదయ దీపం ఆరి పోతున్నది. అయ్యో! కాటుక కొండ కదలినట్టు. కర్రి మబ్బులు క్రమ్మినట్టు. ఆ భయంకర రూపాన్ని చూడలేను. అమ్మయ్యో! ఆ ఉక్కు పాదాలు నాదిక్కే కదులుతున్నాయి. ఆ కబంద హస్తాలు నావైపే వస్తున్నాయి. ఇప్పుడేం చేయను!

తమస్సు: స్వర్గంలో హాయిగా విహరించే  నిన్ను దైవ అభిశాపానికి, కోపానికి గురి చేసిన మసిని నేనే. నేనంటే నీకెందుకంత భయం? అప్పుడే నా శక్తిని మరచిపోయావా?
మనిషీ! దోర్బలం ఉన్న దుర్బలుడవు నీవు. మట్టి సారంతో సృజంచబడిన సామాన్యుడవు నీవు. నీవా సృష్టి శ్రేష్ఠుడవు? నీకా నన్ను సాష్టాంగపడమని దైవం చెప్పినది?
మానవత్వ హరణం నాకెంతో ప్రియం. మాయలు, మోసాలు, మోహాలు నా రక్త సం బంధీకులు. నగ్నత్వం నా పురోగతికి నిలువు టద్దం. పాప సంస్కృతి నివృత్తి నా ప్రవృత్తి.

మనిషిని ‘మనీ+షి’కి బానిసగా మార్చిన దుశ్శక్తిని నేనే. నేను సైగ  చేస్తే లోకం లౌక్యం కోల్పోయి నన్నే అనుసరిస్తుంది. నేను మత్తు జల్లితే లోకులు చిత్తయిపోతారు. నన్నెదిరించే నరులను సున్నంలా చిదిమి వేస్తాను. నాకు ఎదురయ్యే మానవులను ఆకులా నలిపివేస్తాను. మానవత్వాన్ని మంట గలుపుతాను. దానవాత్వనికి ఆజ్యం పోస్తాను. వీర మానవుడు నా తాండవానికి రుగ్నాత్ముడు కావాలి. ప్రపంచం నా ఘట్టనకు శకలాలై పోవాలి. ఇదిగో కదిలాను నేను! ఇదిగో కదిసాను నేను!
(తమస్సు కదలిక భయంకర ధ్వని విన్పిస్తుంది. కమ్రంగా ఆ ధ్వని సన్నగిల్లి పోతుంది. ఇంపైన ఓ స్వరం వినిపిస్తుంది).

మనసు: మెరుపు ఉరిమితే ఉలిక్కిపడి అరిచే వాడవు. చంద్ర సూర్య గ్రహణాలను చూసి వాటిని పాము మింగేసిందని భయకంపితు డయ్యేవాడవు. నీవు పంచ భూతాలను దేవుళ్ళగా, దెయ్యాలుగా పూజించావు. చెట్టు, రాయి, రప్పలను మ్రొక్కావు. గత స్థితి నెమరు వేసుకో, కళ్ళ పొరలు తీసి వేసుకో. సమస్యల తో సతమతమవుతున్నప్పుడు నిన్ను మార్గ నిర్దేశం చేసింది నేనే. నిజ ఆరాధ్యుడు ఒక్కడేనని సృష్టి నిదర్శనానలను చూపించి చెప్పాను. ఒఠ్ఠి మనిషివైన నిన్ను మహా మనీషిగా మలిచాను.

మనషి: పంచ ప్రాణాలు అరచేతలో ఉన్నవి. కను మూసి తెరిచే లోపుగా ఉక్కు హస్తాల్లో నలిగిపోతున్నాను. నన్ను కాపాడే తోటమాలీ! నా శ్రేయం కోరే వనమాలీ! ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు!!

మనసు: భయపడకు సుమా, కలత చెందకు. నీ వెన్నంటి నేనుంటాను. తమస్సు వేస్తున్న వెర్రి వెషాల్ని సాంతం గమనిస్తున్నాను.

మనిషి: పాలు పోసి పెంచుకున్న పాపమై పోయిందే తమస్సు. నానాటికీ నా లోపల దానవత ముదురుతుంది. ప్రతి క్షణం నా లోపల పైశాచికం ప్రబలుతుంది.(అంతలో మళ్ళీ తమస్సు పానకంలో పుడకలా దూరుతుంది).

తమస్సు: భీకర డమరు ఘోషణ ముందు దొమ్మరి డోలు పోలిక ఉంది నీ సంభాషణ. నేను మాత్రం యథావిధిగా మోసగిస్తూనే ఉంటాను. కాకోలాన్ని కబళించి మనిషి కంటి మీద కునుకు లేకుండా చేస్తాను. విష ధారలను అతని జీవితంలో ప్రాకించి అతని హృదిని పాషాణంలా మార్చివేస్తాను. జలసిని జల పాతంలా దూకించి, జులుంతో జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసేస్తాను. మానవత్వ మందారాల పూదోటలో మారణాయుధాల ఫ్యాకర్టీలు తెరుస్తాను. నా ఉక్కు పాదాల క్రింద సమస్తాన్ని నశ్యంలా నలిపేస్తాను.
(తమస్సు వికృతంగా అరచి, భీకరంగా కేక పెట్టి వెళ్ళిపోతుంది).

మనిషి: నా కరుణ కలువను నలిపేశాడు నిశాటుడు. నా అంతరాత్మ ఘోషను నులిపేశాడు కిరాతకుడు. నా దైవానికి నన్ను దూరం చేశాడు దుర్మార్గుడు. అయ్యో నా మతి మండ! అయ్యో తమస్వీ! పాలు పోసిన జాలి గుండెను హాలహలంతో నింపేస్తావా?!

మనసు: గడిచిపోయిన దానికై తపించెదవేల. ఎదనే కన్నీళ్ళ మడుగు చేసెదవేల. విలపించీ ఫలమ్మేమి మానవా! వెలుగు బాట ముందుంది కానవా!! తమస్సు ఒక మదపు టేనుగైతే నీవు మావటీడవు కావాలి. తమస్సు ఒక సుడిగుండం అయిపోతే నీవొక వారధియై నిలవాలి. పుణ్యఫలాలను పిండి అమృతం ఒలికించాలి. కరుణ రసాల్ని పండించి ప్రేమ పూలు పూయించాలి. ఖుర్‌ఆన్‌లోని ఆదేశాలు ఆలంబం కావాలి. అంతిమ ప్రవక్త (స) ఆదర్శం ప్రాణంకన్నా ప్రియమవ్వాలి.

మనిషీ! నువ్వు తమస్సును గెలిస్తే, కోరిలకు కళ్లెం వేస్తే అప్పుడు తమస్సు ఉండదు. నీ హృది ఉషస్సు కాంతులతో తేజోవంతం అవు తుంది. అవును; ఖుర్‌ఆన్‌ ఏమంటున్నదో శ్రద్ధగా విను!

”నిశ్చయంగా అల్లాహ్‌ భీతిపరులు (ముత్తఖీన్‌) తమకు ఎప్పడైనా షైతాన్‌ తరఫు నుంచి చెడు ఆలోచనలు తట్టినప్పుడు వారు అల్లాహ్‌ (యొక్క ఔన్నత్య) స్మరణలో నిమగ్నులైపోతారు. దాంతో వెంటనే వారికి కనువిప్పు కలుగుతుంది”. (ఆరాఫ్: 201)

చూడు అల్లాహ్‌ ఏమంటున్నాడో!
”నా దగ్గరకు చేరుకోవడానికి ఇదే రుజు మార్గం. (ఈ మార్గంలో నడిచే) నా (ప్రియ) దాసులపై నీ పెత్తనం చెల్లదు. నీ అధికారం నిన్ను అనుసరించే భ్రష్టుల మీదనే చెల్లుతుంది. వారందరకి నరకమే గతి. ఇది మా వాగ్దానం”. (హిజ్ర్: 41-43)

గమనించు షైతాన్‌ ఎంత నిస్సహాయుడో!
”నీ గౌరవ ప్రతిష్టల సాక్షి! నేను అందరిని దారి తప్పిస్తూ ఉంటాను. నీతిమంతులైన నీ దాసులపై నా పెత్తనం చెల్లదు”. (సాద్‌: 82, 83)

మనిషి: (ధైర్యం తెచ్చుకుని) అహో! క్షుద్ర శక్తీ! కాచుకో నా గమన ధాటి. మానవుడు మేల్కొన్నాడు. తిరగబడ్డాడు, గెలిచాడు. దానవుడు తోకముడిచి పారిపోయాడు. మానవత్వం ఇంట నిలిచింది. మింటనున్న మాధవుడు దీవించాడు. హృదయలోకంలో శాంతి, కాంతి, క్రాంతి వెల్లి విరిసింది. అదుగో! దూరాన దైవవాణి కమ్మని స్వరం విన్పిస్తున్నది:

”మా ప్రభువు అల్లాహ్‌ మాత్రమే అని పలికి, దానిపై స్థిరంగా ఉన్నవారి వద్దకు దైవ దూతలు దిగి వచ్చి ఇలా అంటూ ఉంటారు). ‘మీరు భయపడకండి, కలత చెందకండి. మీకు వాగ్దానం చేయబడిన స్వర్గలోకపు శుభవార్తను అందుకోండి”.  (హామీమ్‌ అస్సద్‌దా: 30)

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.