New Muslims APP

నిండు చందురుడు నిరతం నీ మోమై నిలిచె!

”కమసలిల్‌ హిమారి యహ్మిలు అస్ఫారా- ఆచరణా శూన్యమైన చదువులు వల్లె వేెసే వాడు పుస్తకాలను మోసే గాడిదకు సైదోడు” అని చెప్పిన విజ్ఞాన ఖని ప్రవక్త శిఖామణి (స). ‘లిమ తఖూలూన మాలా తఫ్‌అలూన్‌” – చెప్పే నీతులు పాటించకపోవడం అన్నది దైవానికి కోపం తెప్పించే ప్రక్రియ అని హెచ్చరిస్తూనే, ధనాన్ని తృణీకరించమని ధర్మశాసనాలు వల్లించే ధన స్వాములున్నారు జాగ్రత్త! అని జగతిని జాగరూక పరచిన సత్యోపదేశ స్థితప్రజ్ఞులు ఆయన (స).

”మాపై నిండు చందురుడు ఉదయించాడు
‘వదా’ పర్వత శిఖరాల మధ్య నుండి
అభినందనాలు, దైవానికి ధన్యవాదాలు మాపై తప్పనిసరి
ప్రార్థించేవారు అల్లాహ్‌ను ప్రార్థించగా
మాలో ప్రభవించిన ఓ పూర్ణ చంద్రమా! పురుషోత్తమా!
నీ అమృత ప్రవచనాలే మాకు వీనుల విందు!!”

”అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మిన్‌ ఇల్మిల్‌ లా యన్‌ఫవు”- దూరంగా ఉంచు ప్రభూ! నిష్ప్రయోజన విద్య నుంచి, కరుణ లేని విజ్ఞానం నుంచి. ‘వ మిన్‌ ఖల్బిల్‌ లా యఖ్‌షవు’ – దూరంగా ఉంచూ ప్రభూ! భక్తీప్రపత్తులు కరువైన హృదయం నుంచి, మానవత్వం మరణించిన మనస్సు నుంచి, చిరునవ్వెరగని నైరాశ్యం నుంచి, పిల్లల్ని ప్రేమించని అహం నుంచి, పెద్దల్ని గౌరవించని అవిధేయత నుంచి అన్న ప్రార్థనా పలుకులతో నైతిక విలువల్ని నూరిపోసిన నవయుగ వైతాళికులు ప్రవక్త (స).

‘పైపై పశ్చాత్తాపంతో, ఉత్తుత్తి కన్నీళ్ళతో పాపాలు పోవు. పవిత్ర హృదయంతో, నిర్మల మనస్సుతో ప్రభువును వేడుకునే క్షమాబిక్ష వల్లనే పాప ప్రక్షాళనం జరుగుతుంది’ అన్నది ఆయన చెప్పిన మాటే. ‘తాత్కాలికంగా తళుక్కుమని తర్వాత జడీభవించే అమిత కార్యాచరణ కన్నా – నిరంతరం నిత్య చైతన్యరూపంలో అలరారే, గలగల పారే భక్తి ప్రవాహమే మిన్న’ అన్న మాట ఆయన నోట జాలువారినదే. ‘దైవ కీర్తన చేయనివాళ్ళు జీవచ్ఛవాలు, దైవ సంకీర్తనం ఆలాపించేవాళ్ళు నిత్య చైతన్యవ్రతులు’ అన్న ఉపమానం ఆయన ఇచ్చినదే. ‘మీరు ధర్మాత్ములుగా రూపొంది ప్రజల పట్ల నిరపేక్షతో ఉంటే, అందరి హృదయ బంధువులవు తారు. మీరు కరుణాత్ములుగా మసలితే దైవ కాక్షానికి పాత్రులవుతారు’ అని మహితోక్తిని చెప్పిన మహా ప్రవక్త ముహమ్మద్‌ (స).

మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిది మధుర ధ్వని. అగ్రజుల వారిది సువ్యక్త సముదాత్త రసావేశ సత్య స్వర ధుని. సంఘ సంస్కరణ పండితాగ్రేస ప్రవక్తలందరి నాయకమన్యులు ముహమ్మద్‌ (స. ఆయన అమృత పలుకుల్లో దివ్యావిష్కృతి సాక్షాత్కరించింది. సత్య సంధత సంపెంగలు, దయార్ధ్రత దానిమ్మ మొగ్గలు, మమతల మొగలి పూరేకులు, వాత్సల్య వేప పూలు, సాత్వికత సన్నజాజులు, ప్రేమ పారిజాతాలు, అనురాగ అడవి మల్లెలు, సుగుణాల గులాబీలు, గుల్‌ మొహర్లు విలక్షణ రేఖల్లో, రూపాల్లో ఆయనలో ఘనీభవించాయి. ఆయనలో ప్రకృతి సౌందర్య సుకుమార సుమ దర్శనమూ ఉంది. పరలోక పరిచింతన పరిమళమూ ఉంది. ఆయన మాటలు అక్షరాలా పోతపోసుకున్న దివ్యావిష్కృతి మూటలు, సత్య ధర్మ సురుచిర మందహాసాలు. సత్య గ్రంథ సుందర సూక్తుల సుమనోహర చంద్రహాసాలు. అవి ముత్యాలు పొదిగిన హారం వలె రసరమ్యంగా, అందంగా, అతి సౌమ్యంగా జాలువారు తుంటాయి. సత్యవాక్కుల సెలయేిటి నీటి వలె గలగలా పారుతూ ఉంటాయి – సత్య శోధక నరోత్తముల వైపు, సత్య పిపాస కమనీయ కరుణ ధ్యేయ హృదయాల వైపు.

దివ్య గ్రంథాల సారాంశ మకరందాన్ని రసీకరించుకున్న రసూల్‌గా, మానవాత్మ ధాత్రిని షిర్క్‌ నుండి విముక్తం చేెసి, తౌహీద్‌ తన్మయ తరంగాలలో ఓలలాడించిన మానవ మహోపకారిగా, తన పసిడి పలుకే మేలుకొల్పుగా మనుజ జాతిని నడిపించిన వక్తృత్వమూర్తిగా, వారధిగా, రథసారధిగా ముహమ్మద్‌ (స) వారి వ్యక్తిత్వం మానవాళికే మచ్చుతునక, మానవత్వానికే తలమానికం. అందుకెే ఆ సుగుణాగ్రజుణ్ణి జీవితపు అన్ని రంగాల్లోనూ ఆదర్శంగా పేర్కొన్నాడు అల్లాహ్‌: ”నీవు నిస్సందే హంగా మహోన్నతమైన శీల శిఖరాధిరోహుడవు -మహాగ్ర సౌశీల్యవంతుడవు”. (ఖలమ్‌: 4) ”నిశ్చయంగా దైవ ప్రవక్తలో మీ కొరకు ఉత్తమ ఆదర్శం ఉంది”. (అహ్జాబ్‌: 21)

ఆయన (స) ప్రజల కోసం పుట్టి, ప్రజల కోసం పెరిగి, విశ్వ శాంతి కోసం పాటుపడుతూ జీవించారు. అది చూసి అల్లాహ్‌ ఇలా అన్నాడు: ”(ఓ ముహమ్మద్‌!) ఒకవేళ జనులు ఈ మాటను విశ్వసించకపోతే నువ్వు వారి వెనుక దుఃఖంతో కుమిలిపోతూ నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా ఏమీ?” (కహఫ్‌: 6)
తలపై మిలమిలలాడే పచ్చని తలపాగ. తళతళ మెరిసే కుండల పాశము. చెక్కిళ్ళపై జీరాడే నీలాల ముంగురులు. అందమైన అంగ సౌష్టవం, సుందర దేహంతో మదీనాలో ప్రవేశిస్తుండగా ఆ పుర ప్రజలు పరుగులిడిరి అభిమానం ముసురుకోగా!
అది మదీనా చరిత్రలోనే కనీ వినీ ఎరుగని మహోజ్వలమైన రోజు. నగర వాడవాడల్లో, వీధుల్లో దైవ సంకీర్తనలు మిన్ను ముడుతున్నాయి. అన్సార్‌ బాలికలు సంతోషాతిరేకంతో గేయా లాపనలు చేెస్తున్నారు….

”మాపై నిండు చందురుడు ఉదయించాడు
‘వదా’ పర్వత శిఖరాల మధ్య నుండి
అభినందనాలు, దైవానికి ధన్యవాదాలు మాపై తప్పనిసరి
ప్రార్థించేవారు అల్లాహ్‌ను ప్రార్థించగా
మాలో ప్రభవించిన ఓ పూర్ణ చంద్రమా! పురుషోత్తమా!
నీ అమృత ప్రవచనాలే మాకు వీనుల విందు!!”

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.