పంచ ప్రతిష్టల పవిత్ర మాసం రమజాన్‌

పంచ ప్రతిష్టల పవిత్ర మాసం రమజాన్‌ – రమజాను మాసం కారుణ్య మేఘమయిన మనపై వాలింది. మహిమాన్విత ఋతువు. వరాల వసంతం. గౌరవ ప్రదమయిన నెల. అల్లాహ్ ఈ పవిత్ర మాసాన్ని తనివితీరా ఆస్వాదించేలా, సత్య ధర్మాన్ని సంఫూర్ణం గా అమలు పర్చేలా, సత్కార్యాలకు శ్రీకారం చుట్టేలా, సత్యోపదేశానికి సన్నద్ధులయ్యేలా, సత్య మార్గం మీద సహన స్థయిర్యాలు కలిగి జీవించేలా దీవించాలని మనః పూర్వకంగా కోరుకుంటున్నాము.

సత్యాన్ని సంపూర్ణంగా స్వీకరించి సత్కర్మలకు శ్రీకారం చుట్టి స్వర్గాన్ని సొంతం చేెసుకునేందుకు సువర్ణ సమయం రమజాన్‌

మొది ప్రతిష్ట:
”రమజాను మాసం ప్రారంభమవగానే స్వర్గపు ద్వారాలు తెరచి వేయ బడతాయి”. (బుఖారీ, ముస్లిం)
హజ్రత్‌ అబూ హురైరహ్‌ (ర) గారి కథనం ప్రకారం – ”స్వర్గ తలుపులు తెరవ బడతాయి.ఏ ఒక్క తలుపును మూయడం జరగదు”. (సహీహ్‌ ఇబ్ను ఖుజైమహ్‌)

రమజాను మాసం ఎంతి పుణ్య కాలం అంటే, స్వయంగా అల్లాహ్‌ ఉపవాస దీక్షకుల కోసం స్వర్గాన్ని అలంకరిస్తాడు. ప్రార్థనలు చేసి, దానధర్మాలు చేసి, ఉపవాసాలు ఉండి, హజ్జ్‌ చేసి, జిహాద్‌-నిరంత పరిశ్రమతో ధర్మోన్నతి కోసం పాటు పడి ఏ కష్టనష్టాలనయితే దాసుడు భరించాడో వాటన్నింని మరచి పోయి హాయిగా స్వర్గంలో సకల భోగభాగ్యాలను అనుభవించేందుకు సిద్ధ పర్చడం జరుగుతుంది. అంటే స్వయం స్వర్గమే ఉపవాస దీక్షకుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంత అదృష్టం! మరెంత సౌభాగ్యం!!
ప్రవక్త (స) అన్నారు: ”స్వర్గానికి ఎనిమిది తలుపులుాంయి. అందులో ఒక తలుపు పేరు ‘రయ్యాన్‌ తలుపు’. దాని గుండా కేవలం ఉపవాస దీక్షకులు మాత్రమే ప్రవేశిస్తారు” (బుఖారీ)
సత్యాన్ని సంపూర్ణంగా స్వీకరించి సత్కర్మలకు శ్రీకారం చుట్టి స్వర్గాన్ని సొంతం చేెసుకునేందుకు సువర్ణ సమయం రమజాన్‌ ”మేలును కోరుకునేవాడా! త్వర పడు” అని ఒక దైవదూత రమాజను మాసం సాంతం పిలుపునిస్తూనే ఉంటాడు.
ప్రవక్త (స) రమాజను మాసంలో జిబ్రీల్‌ (అ) ఖుర్‌ఆన్‌ పారాయణం కోసం ఆయన వద్దకు వచ్చినప్పుడు ప్రభంజనం కన్నా వేగంగా దాన ధర్మాలు చేెసేవారు. దైవ దూత జిబ్రీల్‌ (అ) ఖుర్‌ఆన్‌ పారాయణ నిమిత్తం ప్రతి రాత్రి ఆయన వద్దకు వచ్చేవారు. అంటే దాన ధర్మాల విశిష్ఠతతోపాటు, ఖుర్‌ఆన్‌ పారాయణ ఔన్నత్యం బోద పడుతున్నది.

రెండవ ప్రతిష్ట:

”నరక ద్వారాలు మూసి వేయ బడతాయి”. (బుఖారి, ముస్లిం)
”రమాజను తొలి రాత్రి అవ్వగానే.. నరక తలుపులు మూసి వేయ బడ తాయి. ఏ ఒక్క తలుపును తెరవడం జరగదు”. (సహీహ్‌ ఇబ్ను ఖుజైమహ్‌)
రమజాను మాసం గౌరవార్థం నరక ద్వారాలను మూసి వేయడం జరుగుతుంది. రమజాను మాసంలో అల్లాహ్‌ అనేకానేక మందిని నర కాగ్ని నుండి ముక్తిని కలిగిస్తాడు. ఇలా రమజాను ప్రతి రాత్రి జరుగు తుంది. విశ్వాసి దుష్కర్మలకు, దుష్ప్రేరణలకు దూరంగా మలసుకునే ఏర్పాటు నిమిత్తం అల్లాహ్‌ షైతానులను బంధిస్తాడు. అన్య మాసాల్లో వారు అల్లాహ్‌ దాసుల్ని తమ వసీకరణల ద్వారా వక్ర మార్గానికి గురి చేసినట్లు రమజాను మాసంలో చెయ్య లేరు. ఈ కారణంగానే విశ్వ వ్యాప్తంగా ఉన్న విశ్వాసులందరూ ఎంతో చురుకుగా రమజాను మాసం లో ఇబ్బడి ముబ్బడిగా పుణ్య కార్యాల్లో పాల్గొనడం మనం చూస్తాము. ”చెడును కోరుకునే వాడా! ఆగిపో” అని ఒక దైవ దూత ఈ మాసంలో పిలుపునిస్తూనే ఉంటాడు,

మూడవ ప్రతిష్ట:
”ఎవరయితే విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతో రమ జాను ఉపవాసాలు పాటిస్తారో వారి గత పాపాలన్నీ మన్నించ బడ తాయి”. (బుఖారీ, ముస్లిం)
ఇతర అనేక ఆరాధనల మధ్య ఉపవాసానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రవక్త (స), అల్లాహ్‌ మాటను ఇలా తెలియజేశారు: ”ఆదమ్‌ పుత్రుని ప్రతి సత్కర్మకు బదులు పది నుండి ఏడొందల వరకు పుణ్యం పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఒక్క ఉపవాసం తప్ప. ఉపవాసం నాది, నేనే దానికి ప్రతిఫలాన్ని ఇస్తాను. అతను కేవలం నా కోసం తన కోరికను, ఆహార పానీయాలను త్యజించాడు”. (బుఖారీ)
ప్రవక్త (స) వారు ఓ సందర్భంగా చెప్పిన మాట: ”నువ్వు ఎక్కువ ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించు. నిశ్చయంగా దానికి సరి తూగ గలిగేదేదీ లేదు”. (సహీహ్‌ నసాయీ)
వేరొక ఉల్లేఖనంలో – ”అల్లాహ్‌ మార్గంలో ఒక్క రోజు ఉపవాసం ఉంటే అల్లాహ్‌ అతని ముఖాన్ని నరకాగ్ని నుండి 70 సంవత్సరాలంతి దూరం చేసేస్తాడు” అన్నారు ప్రవక్త (స). (ముత్తఫఖున్‌ అలైహి)

ఉపవాసికి రెందు సంతోష ఘడియలు: ”ఒకటి ఉపవాస విరమణ సమయంలో లభించే సంతోషం. ఒకటి రేపు అల్లాహ్‌తో కలుసుకున్నప్పుడు కలిగే సంతోషం. నిశ్చయంగా ఉపవాసి నోటి దుర్వాసన అల్లాహ్‌ దగ్గర కస్తూరీ సువాసనకన్నా ఘనాపాటిది”. (బుఖారీ)
సుఫ్యాన్‌ బిన్‌ ఉయైనహ్‌ ఇలా సెలవిచ్చారు: ”రేపు ప్రయ దినాన ఉపవాసి వల్ల జరిగిన తప్పిదాలకు గాను అతని సత్కర్మలను పంచేయడం జరుగుతుంది. అన్నీ సత్కర్మలు అయి పోతాయి. ఒక్క ఉపవాసం మిగిలుంటుంది. అప్పుడు అల్లాహ్‌ అతనిపై గల సకల విషయాల బాధ్యతను తాను స్వీకరించి ఒక్క ఉపవాస కారణంగా అతన్ని స్వర్గంలో ప్రవేశింప జేస్తాడు”.
ఉపవాసి ఉపవాసం విరమించేంత వరకూ అతని కోసం దైవ దూతలు ఇస్తిగ్ఫార్‌ – పాప పన్నింపుకై ప్రార్థన చేస్తూ ఉంటారు. రెప్ప పాటు కోసం కూడా అల్లాహ్‌ అవిధేయతకు పాల్పడని పునీత జీవులయిన దైవ దూతలు మన కోసం ప్రార్థించడం! ఆహా! ఎంత అదృష్టం!!

నాల్గవ ప్రతిష్ట:

”విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతో ఎవరయితే రమ జాను ఖియామ్‌ (తరావీహ్‌ నమాజు) చేస్తారో వారి గత పాపాలన్ని మన్నించ బడతాయి”. (బుఖారీ, ముస్లిం)
రోజుకి అయిదు పూటల నమాజు విధి అంటే, మూడు నమాజులు రాత్రిలోనే ఉన్నాయి. రాత్రి ప్రార్థన విశిష్థతను తెలియజేస్తూ వ్రవక్త (స) ఇలా ఉపదేశించాడు: ”ఫర్జ్‌ నమాజు అనంతరం శ్రేష్ఠ స్థాయి నమాజు రాత్రి నమాజు (తహజ్జుద్‌)”. (ముస్లిం)
వేరోక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”ఓ ప్రజలారా! సలాంను సర్వ సాధా రణం చేసుకోండి. అన్నదానాలు చేపట్టండి. బంధుత్వ సంబంధాలను బల పర్చండి. ప్రజలు నిద్రిస్తుండగా రాత్రి పూట నమాజు చేయండి. స్వర్గంలో ప్రశాంతంగా ప్రవేశించండి”. (తిర్మిజీ)

”రాత్రి నమాజు రెండేసి రకాతులు” అని సెలవ్చిన ప్రవక్త (స) వారు చెప్పిన మరో అద్భుత విషయం – ”ఇమామ్‌తోపాటు ఖియామ్‌ చేసి ఇమామ్‌ నమాజు నుండి వెనుదిరిగేంత వరకూ ఆయనతోనే ఉంటే అలాంటి వ్యక్తి ఆ రాత్రి సాంతం ఖియామ్‌ చేసిన ఫుణ్యం వ్రాయ బడుతుంది” అన్నారు. (అహ్లుస్సునన్‌)
కాబట్టి ప్రవక్త (స) వారు ఆనవాయితీగా చేసినా 11 రకాతుల నమాజు ను సున్నత్‌గా భావించి, అంతటితోనే ఆగి పోకుండా ఇంకా ఎక్కువగా నఫిల్‌ ప్రార్థనలు చేసే ప్రయత్నం చేయాలి. ముస్లిం సమాజంలో ఉన్న పాక్షికాలను ప్రస్తావించుకుంటూ, విభేదాలు సృష్టిస్తూ రమజాను పుణ్య కాలాన్ని హననం చేయడం ఎంత మాత్రం హర్షనీయం కాదు.
తరావీహ్‌ నమాజును ఒక పవిత్ర ప్రార్థనగా చెయ్యాలి. ఏదో బరువు దిందుకున్నట్లు తొందర తొందరగా చెయ్యడం సమంజసం కాదు. ఖుర్‌ఆన్‌ పారాయణంలో తర్‌తీల్‌ ఉంటేనే ఖుర్‌ఆన్‌కు ఇవ్వాల్సిన గౌరవం మనం ఇచ్చినట్లు. తర్‌తీల్‌ అంటే ప్రతి అక్షరాన్ని దాని స్థానం నుండి స్పష్టంగా పలకడం. సరయిన అక్షర ఉచ్చారణ, వాక్య ఉచ్చారణ లేని పారాయణం నిషిద్దం అని తెలుసుకోవాలి. కొందరు ఒక్క చిన్న ఆయతు చదివి రుకూ చేసేస్తూ ఉంటారు. ఇది గర్హించదగిన విషయం. తరావీహ్‌ అసలు ఉద్దేశ్యం ఖుర్‌ఆన్‌ను ఎక్కువగా పారాయణం చెయ్య డం అని గ్రహించాలి.
షరీఅతు పరమయిన ఎలాంటి ప్రమాదం లేకపోతే స్త్రీలను సయితం తరావీహ్‌ నమాజులో పాల్గొనే అనుమతి ఇవ్వాలి. అలాగే తరావీహ్‌ నమాజు రమాజను మాసంతో ముడి పడి ఉన్న నమాజు గనక నఫిల్‌ నమాజే కదా అన్న నిర్లక్ష్యం తగదు. ఈ నమాజు ద్వారా అల్లాహ్‌ మన గత పాపాలను ప్రక్షాళించుకునే సువర్ణవకాశాన్ని రమజాను మనకు కల్పిస్తుంది.

అయిదవ ప్రతిష్ట:

”విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతో ఎవరయితే లైలతుల్‌ ఖద్ర్‌ ఖియామ్‌ చేస్తారో వారి గత పాపాలు మన్నించ బడ తాయి”. (బుఖారీ, ముస్లిం)
లైలతుల్‌ ఖద్ర్‌ అంటే ఏమనుకుంటున్నారు? అది వెయ్య మాసాల కన్నా ఘనమైనది. స్వయంగా ప్రవక్త (స) ఈ రాత్రి అన్వేషణలో మొది దశకంలో ఏతికాప్‌ పాటించారు. అందులో లేదు అని తెలిసి, తర్వాతి దశకంలో ఏతికాప్‌ పాటించారు. అందులో కూడా లేదని తెలిసి చివరి దశకంలో ఏతికాప్‌ పాటించారు. చివరి థకం లో ఉందని తెలిసినప్పి నుండి తుది శ్వాస ఆగేంత వరకూ ఆయన ఏతికాఫ్‌ను వదల లేదు. హజ్రత్‌ అయిషా (ర.అ) ఇలా అన్నారు:

”చివరి దశకం ప్రారంభవగానే ప్రవక్త (రాత్రి ప్రార్థనకై) నడుం బిగించేవారు. (చివరి దశకం సాంతం రాత్రి పూట సయితం లైంగిక వాంఛకు దూరంగా ఉండేవారు). రాత్రంతా మేల్కొనేవారు. ఇంటిల్లిపాదిని మేల్కొలిపేవారు”. (బుఖారీ)
సజ్జనులయిన మన పూర్వీకులు మూడు పదులను గొప్పవిగా భావించేవారు. రమజాను చివరి థకం, జుల్‌హిజ్జహ్‌ తొలి థకం, ముహర్రమ్‌ మొధటి పది రోజులు. ఈ మూడు పదుల్లో రమజాను చివరి దశకానికి అగ్ర పీఠం కట్టబెట్టేవారు. కారణం ఈ పది రాత్రుల్లో లైలతుల్‌ ఖద్ర్‌ ఉండటమే. ఈ రాత్రి దైవ దూతల నాయకుడ యిన జిబ్రీల్‌ (అ) ఇతర దైవ దూతల తోడు దివి నుండి భువికి దిగి వచ్చి ఫజ్ర్‌ వేళ అయ్యేంత వరకూ ఉంటారు అంటుంది ఖుర్‌ఆన్‌. లైలతుల్‌ ఖద్ర్‌ చివరి దశకంలో బేసి సంఖ్య గల రాత్రుల్లో ఉంటుంది అని స్వయంగా ప్రవక్త (స) వారు తెలియజేశారు. ఇతరత్రా ఉల్లేఖనాల ద్వారా రమజాను 27వ తేదీ ఉండే అవకాశాలు ఎక్కువ గా ఉన్నా అన్య రాత్రులలో సయితం అన్వేషణ కొన సాగాలి. ఆ రాత్రికే పరిమితం అయి పోవడం సబబు కాదు. చివరి దశకంలోని ప్రతి రాత్రి-”అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్‌ తుహిబ్బుల్‌ అఫ్వ ఫఅఫు అన్నీ” అని దుఆ చేస్తూ ఉండాలి.
రమజాను చివరి రాత్రి అల్లాహ్‌ ముస్లిం సముదాయానికి క్షమాభిక్ష పెడతాడు. వారికి చెందాల్సిన వెతనాన్ని ఆ రాత్రినే పంచి పెడతాడు.
అల్లాహ్‌ మనందరి తప్పిదాలను మన్నించి, ఇహపరాల మనల్ని సఫలీకృతుల్ని చేయుగాక! ఆమీన్‌

Related Post