ప్రవక్త (స) వారి పవిత్ర ప్రవచనాలు

”ఒక వ్యక్తి నడిచి వెళుతూ దారిన పడి ఉన్న ముళ్ళ కంపను తీసి పక్కన పడేశాడు. అతని ఆ కర్మను అల్లాహ్‌ గుర్తించి అతని పాపాలను మన్నించాడు”.

1) హజ్రత్‌ జాబిర్‌ (ర) గారి కథనం – ఓ వ్యక్తి దైవ ప్రవక్త (స) వారి సన్నిధికి వచ్చి ఇలా అడిగాడు: ‘ఒక వేళ నేను అయిదు పూటల ఫర్జ్‌ నమాజు ఆచరించి, రమజాను ఉపవాసాలు పాటించి, హలాల్‌ను హలాల్‌గా ఎంచి, హరామ్‌ను హరామ్‌గా భావించి, అదనంగా మరే విషయాన్ని చేర్చకుండా జీవిస్తే స్వర్గంలో ప్రవేశిస్తానా?’ అని. అది విన్న ప్రవక్త (స) – ”అవును” అని సమాధానం ఇచ్చారు. (ముస్లిం)

2) హజ్రత్‌ అబూ హురైరా (ర) గారి కథనం – దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”ఒక వ్యక్తి నడిచి వెళుతూ దారిన పడి ఉన్న ముళ్ళ కంపను తీసి పక్కన పడేశాడు. అతని ఆ కర్మను అల్లాహ్‌ గుర్తించి అతని పాపాలను మన్నించాడు”. (ముత్తఫఖున్‌ అలైహి) 


3) హజ్రత్‌ అబూ హురైరా (ర) గారి కథనం – దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”ప్రత్యర్థిని మట్టి కరిపించిన వాడు కాదు అసలు ధీరుడు. కోపం వచ్చినప్పుడు మనో నిగ్రహాన్ని కనబర్చినవాడు సిసలయిన ధీరుడు”. (బుఖారీ, ముస్లిం) 


4) హజ్రత్‌ ఆయిషా (ర.అ) గారి కథనం – దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”మా ధర్మంలో లేని ఓ విషయాన్ని ఎవరయినా ప్రవేశ పెడితే అది రద్దు చేయ బడుతుంది”. (బుఖారీ, ముస్లిం) 


5) హజ్రత్‌ అబూ హురైరా (ర) గారి కథనం – దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”నిశ్చయంగా అల్లాహ్‌ పరిశుద్ధుడు, పరిశుద్ధమయిన వాటినే స్వీకరిస్తాడు. ఆయన తన ప్రవక్తలకు ఇచ్చిన ఆదేశాన్నే విశ్వాసులకు సయితం ఇచ్చాడు. ఇలా అన్నాడు: ”ఓ ప్రజలారా! పరిశుద్ధమయిన వాటిలో నుంచి తినండి, సత్కర్మలు చేయండి”. (బుఖారీ, ముస్లిం) 


6) హజ్రత్‌ అబూ హురైరా (ర) గారి కథనం – దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”మీరు విశ్వాసి కానంత వరకూ స్వర్గంలో ప్రవేశించ లేరు. మీరు పరస్పరం ప్రేమాభిమానాలు కలిగి ఉండనంత వరకూ విశ్వాసి కాలేరు. నేనో విషయాన్ని మీకు తెలుపనా? అది గనక మీరు చేస్తే పరస్పరం ప్రేమించుకుంటారు. మీ మధ్యన సలామ్‌ను సర్వ సామాన్యం చేసుకోండి”. (ముస్లిం) 


7) హజ్రత్‌ అనస్‌ (ర) గారి కథనం – దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు:”నిశ్చయంగా – అల్హమ్దు లిల్లాహ్‌, సుబ్హానల్లాహ, లా ఇలాహ ఇల్లలాహ్‌, అల్లాహు అక్బర్‌ చెప్పడం వల్ల చెట్టు నుండి ఆకులు రాలినట్లు దాసుని పాపాలు రాలి పోతాయి”. (అల్బానీ (రహ్మ) ఈ హదీసుని సహీహ్‌గా ధృవీకరించారు) 


8) హజ్రత్‌ అబూ హురైరా (ర) గారి కథనం – దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”ఖుర్‌ఆన్‌ చదవండి, నిశ్చయంగా ఖుర్‌ఆన్‌ తనను చదివే వారి పక్షం వహిస్తూ ప్రళయ దినాన సిఫారసు చేస్తుంది”. (ముస్లిం) 


9) హజ్రత్‌ అబూ హురైరా (ర) గారి కథనం – దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”అనవసరమయిన విషయాలను వదిలి వెయ్యడం వ్యక్తి ధర్మ ఉన్నతికి తార్కాణం”. (తిర్మిజీ) 


10) హజ్రత్‌ అబూ జర్‌ (ర) గారి కథనం – దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ఓ అబా జర్‌! నువ్వు కూర వండినప్పుడు నీళ్ళు కాస్త ఎక్కువ వేసుకో, నీ పొరుగువానికి అది చేరేలా చూడు”. (ముస్లిం)

Related Post