New Muslims APP

ప్రశ్నోత్తరాలు నాల్గవ భాగం

ప్రశ్నోత్తరాలు నాల్గవ భాగం – అల్హందులిల్లాహ్ – సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్ కే. మేము ఆయన్ను ప్రశంసిస్తాము, ఆయన సహాయాన్ని కోరతాము, మనలోని ప్రతి చెడు మరియు దుష్ట పనుల నుండి ఆయన శరణు వేడుకుంటాము. అల్లాహ్ మార్గదర్శకత్వం చూపిన వారిని ఎవ్వరూ సన్మార్గం నుండి తప్పించలేరు మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదిలి వేసిన వారికి మరెవ్వరూ దారి చూపలేరు. నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్యుడు లేడని మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అనీ. తరుచుగా ముస్లిమేతరులు ఇస్లాం మరియు ముస్లింల గురించి అడిగే ప్రశ్నలు ఇక్కడ చర్చించబడినాయి.

దీనిని చదివే ప్రతి పాఠకుడు అల్లాహ్ తలిస్తే క్రింది అనేక విషయాలు మరియు అంశాల గురించి స్పష్టమైన మరియు సంతృప్తికరమైన అవగాహన పొందుతాడు.

ఇస్లాం అన్య మతాల అల్పసంఖ్యాకకుల హక్కులను గుర్తిస్తుంది మరియు ధృవీకరిస్తుంది. వారి మంచి కోసం, భద్రత కోసం మరియు క్షేమం కోసం, వారిపై జిజియా పన్ను విధించింది. అన్యమతాల దేవాలయాలను, చర్చీలను కూలగొట్టవద్దని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లామీయ సైన్యాన్ని ఆదేశించారు.

31- ఇస్లాం ధర్మం బహుభార్యాత్వాన్ని ప్రోత్సహిస్తుందా?

ఎంత మాత్రమూ కాదు. ఇస్లాం ధర్మం బహుభార్యాత్వానికి అనుమతినిచ్చిందే గానీ అది తప్పనిసరి అని ఆదేశించలేదు. చారిత్రకంగా, అసలు పెళ్ళి చేసుకోని ఒక్క జీసస్ అలైహిస్సలాం తప్ప, ప్రవక్తలందరూ ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉండేవారు. ఒకరి కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండే అనుమతి ఖుర్ఆన్ లో ఇవ్వబడింది. పురుషులకు ఇవ్వబడిన బహుభార్యాత్వం అనుమతి వారి కామవాంఛల్ని చల్లార్చుకోవడానికి కాదు. అది యుద్ధాలలో భర్తను కోల్పోయిన విధవరాళ్ళ మరియు అనాధ పిల్లల శ్రేయస్సు కోసం మాత్రమే. ఇస్లాం ధర్మానికి పూర్వం పురుషులు లెక్కలేనంత మంది భార్యలను కలిగి ఉండేవారు. ఇస్లాం ధర్మం మాత్రమే నలుగురి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండరాదనే నియమాన్ని ఆదేశించింది. ఉదాహరణకు, ఒక వ్యక్తి 11 మంది భార్యలను కలిగి ఉండేవాడు. ముస్లింగా మారిన తర్వాత, అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో, “నా అనేక మంది భార్యలను ఏమి చేయాలి?” అని ప్రశ్నించగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు, “నలుగురికి తప్ప మిగిలిన వారందరికీ విడాకులు ఇవ్వు.” ఖుర్ఆన్ ఇలా ప్రకటించింది, “నీవు ఇద్దరిని, లేక ముగ్గురిని లేక నలుగురిని పెళ్ళి చేసుకోవచ్చు, ఒకవేళ నీవు ప్రతి ఒక్కరి మధ్య సరిసమానంగా న్యాయం చేయగలిగితే” (4:3). భార్యలందరి మధ్య సరిసమానంగా న్యాయం చేయడం చాలా కష్టమైన పని కాబట్టి, అనేక మంది ముస్లింలు ఒక్క భార్యతోనే సరిపెట్టుకుంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన 24వ సంవత్సరం వయస్సు నుండి 50 ఏళ్ళ వయస్సు వరకు కేవలం ఖదీజా రదియల్లాహు అన్హా అనే పేరుగల ఒకే భార్యతో జీవించారు. పాశ్చాత్య సమాజాలలో, చట్టపరంగా ఒకే భార్యను కలిగి ఉన్నా, అనేక మంది స్త్రీలతో కొందరు పురుషులు వివాహేతర సంబంధాలు కలిగి ఉంటారు. “U.S.A. Today” (ఏప్రిల్ 4, 1988 సెక్షన్ D) లో ప్రచురించబడిన ఒక సర్వేలో ఎలాంటి స్థానం కోరుకుంటున్నారని 4,700 మంది ఉంపుడుగత్తెలను (సెక్స్ వర్కర్లను) వారు ప్రశ్నించగా, “తాము ‘వేరే స్త్రీ’గా జీవించే బదులు రెండో భార్యగా జీవించడాన్ని ఇష్టపడుతున్నామని, ఎందుకంటే వారికి ఎలాంటి చట్టపరమైన హక్కులు గానీ, చట్టబద్ధంగా పెళ్ళాడిన భార్యలకు లభించే ఆర్థికపరమైన సరిసమాన హక్కులు గానీ లేవని, పురుషులు కేవలం తమ కామవాంఛలు తీర్చుకోవడానికే తమను వాడుకుంటున్నారని భావిస్తున్నామని” వారు జవాబిచ్చారు.

32- ఇస్లాం ధర్మం ముస్లిం మహిళలను అణిచి పెడుతున్నదా?

అస్సలు కాదు. వాస్తవం ఏమిటంటే మీడియాలో కొందరు వ్యాపింపజేస్తున్న తప్పుడు ప్రచారాలకు విరుద్ధంగా, ఇస్లాం ధర్మం 1,400 సంవత్సరాలకు పూర్వమే విడాకులు పొందే హక్కు, ఆర్ధిక స్వాతంత్ర్య హక్కు, హిజాబ్ ధరించడం ద్వారా శీలవతిగా గౌరవింపబడే మరియు గుర్తింపబడే హక్కులు ఇచ్చి స్త్రీల స్థాయిని ఉన్నత పరిచింది. ఆ కాలంలో యూరోపుతో సహా ఇతర ప్రాంతాలలో మహిళలకు ఎలాంటి హక్కులూ ఉండేవి కావు. “అన్నిరకాల ఆరాధనలలో, దైవభక్తిలో మహిళలు పురుషులతో సరిసమానంగా ఉన్నారు” (ఖుర్ఆన్ 33:32). ఇస్లాం ధర్మం పెళ్ళి తర్వాత కూడా మహిళలకు తమ ఇంటిపేరును అలాగే కొనసాగించే అనుమతినిచ్చింది, తమ సంపాదనను తమ వద్ద ఉంచుకునే మరియు తమ ఇష్టానుసారం ఖర్చు పెట్టుకునే అనుమతినిచ్చింది, ఇంటి నుండి బయటకి వెళ్ళవలసి వచ్చినప్పుడు వారి మానమర్యాదలు కాపాడాలని పురుషులను ఆదేశించింది. ఎందుకంటే వీధులలో పోకిరీ వెధవలు వారి వెంటపడే అవకాశం ఉన్నది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింతో ఇలా పలికారు, “తన కుటుంబంతో ఉత్తమంగా ప్రవర్తించే వ్యక్తే మీలో ఉత్తముడు.” ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా కొందరు ముస్లిం పురుషులు తమ మహిళలను అణచి వేస్తున్నారు. అది వారి వారి ఆచారం, సంప్రదాయం లేదా ధర్మం గురించి తెలియని వారి అజ్ఞానం మాత్రమే.

33- ఇస్లాం ధర్మం అన్యమతాల అల్పసంఖ్యాకులను ద్వేషిస్తుందా ?

ఎన్నడూ కాదు, ఇస్లాం అన్య మతాల అల్పసంఖ్యాకకుల హక్కులను గుర్తిస్తుంది మరియు ధృవీకరిస్తుంది. వారి మంచి కోసం, భద్రత కోసం మరియు క్షేమం కోసం, వారిపై జిజియా పన్ను విధించింది. అన్యమతాల దేవాలయాలను, చర్చీలను కూలగొట్టవద్దని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లామీయ సైన్యాన్ని ఆదేశించారు. ఖలీఫా ఉమర్ అయితే ముస్లింలకు చర్చీలలో నమాజు చేసుకునే అనుమతిని కూడా ఇవ్వలేదు. స్పెయిన్ లో యూదులను స్వాగతించారు మరియు వారు వర్ధిల్లేలా ముస్లింలు సహాయపడినారు. అయితే ఆ కాలంలో యూరోపులోని మిగిలిన ప్రాంతాలలో యూదులు ఊచకోతకు గురవుతూ ఉండగా, స్పెయిన్ లోని ముస్లిం పరిపాలకుల కాలాన్ని యూదులు తమ స్వర్ణయుగంగా పేర్కొనేవారు. ఇస్లామీయ దేశాలలో క్రైస్తవులు సుఖశాంతులతో జీవించారు, ప్రభుత్వాలలో ఉన్నత పదవులు పొందారు, చర్చీల ప్రార్థనలలో స్వేచ్ఛగా పాల్గొన్నారు. అయితే, ముస్లిమేతర రాజ్యాలలో అల్పసంఖ్యలో ఉన్న ముస్లింలకు అలాంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించలేదు. ఉదాహరణకు, పూర్వం స్పెయిన్ ను ఆక్రమించిన క్రూసేడుల కాలం మరియు ఈనాడు బోస్నియా, ఇస్రాయీల్, ఇండియాలలో ముస్లింలపై జరుగుతున్న మారణహోమం మరియు అణచివేతలు. ఒక్కోసారి, కొందరు నాయకుల చర్యలు అతని ధర్మబోధనలను సూచించవనే విషయం ముస్లింలకు కూడా తెలుసు.

34- క్రింది అంశాలపై ఇస్లామీయ దృక్పథం ఏమిటి?

a. డేటింగ్ ల పేరుతో స్త్రీపురుషులు విచ్చలవిడిగా కలుసుకోవడం మరియు పెళ్ళికాకుండానే సంభోగించడం:

ఇస్లాంలో ఎన్నడూ స్త్రీపురుషుల అనైతిక సన్నిహిత సంబంధాలకు అనుమతి లేదు. అంతేగాక పెళ్ళికి ముందు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం మరియు వివాహేతర సంబంధాలు కలిగి ఉండటం మొదలైన వాటిని ఇస్లాం ధర్మం పూర్తిగా నిషేధించింది. దురాకర్షణలు, చెడు ప్రేరణల నుండి కాపాడే ఒక రక్షణ కవచంగా మరియు పరస్పర ప్రేమాభిమానాలు మరియు శాంతిసుఖాలు వర్ధిల్లే మాధ్యమంగా వివాహబంధాన్ని ఇస్లాం ప్రోత్సహిస్తుంది.

b. భ్రూణహత్యలు:

గర్భవిచ్ఛిత్తి లేదా భ్రూణహత్యలను ఇస్లాం ధర్మం నిజమైన హత్యలుగా పరిగణిస్తుంది. తల్లి ప్రాణం కాపాడే స్థితిలో తప్ప, అలాంటి వాటిని ఎన్నడూ అనుమతించదు (ఖుర్ఆన్ 17:23-31, 6:15 1).

c. స్వలింగ సంపర్కం మరియు ఎయిడ్స్:

స్వలింగ సంపర్కాన్ని ఇస్లాం ధర్మం స్పష్టంగా వ్యతిరేకిస్తున్నది మరియు నిషేధిస్తున్నది. దానిని ఒక పాపంగా పరిగణిస్తున్నది. అయితే జాలితో, కనికరంతో ఇతర రోగులకు చికిత్స చేసినట్లుగానే ఎయిడ్స్ రోగులకు కూడా చికిత్స చేయాలని ముస్లిం డాక్టర్లకు సలహా ఇస్తున్నది.

d. బాధానివారణ కోసం చంపడం (మెర్సీ కిల్లింగ్) మరియు ఆత్మహత్య చేసుకోవడం (సూసైడ్) :

బాధానివారణ కోసం చంపడం మరియు ఆత్యహత్యలు రెండింటినీ ఇస్లాం ధర్మం వ్యతిరేకిస్తున్నది. అంతిమ దశలో ఉన్న రోగల దుఃఖాన్ని మరింత ఎక్కువ చేసే అలాంటి అనవసరమైన ఘనకార్యాలను ముస్లింలు నమ్మరు.

e. శరీర అవయవాల మార్పిడి :

ఒకరి ప్రాణాలు కాపాడాలని ఇస్లాం ధర్మం నొక్కి చెబుతున్నది (ఖుర్ఆన్ 5:32); కాబట్టి, సామాన్యంగా మానవ శరీర అవయవాల మార్పిడిని ఇస్లాం ధర్మం అనుమతిస్తున్నది. అయితే తమ ఇష్టానుసారం మాత్రమే దాతలు తమ అవయవాలను అవసరమైన వారికి దానం చేయాలి. అయితే, అమ్మకం లేదా వేరే లాభం కోసం అనుమతించబడలేదు.

35- యూదులు మరియు క్రైస్తవులతో ముస్లింలు ఎలా వ్యవహరిస్తారు ?

దివ్యఖుర్ఆన్ వారిని “గ్రంథ ప్రజలు” అని సంబోధిస్తున్నది, అంటే వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు దివ్యసందేశాన్ని అందుకున్నారు. వారిని గౌరవించాలని, న్యాయంగా వ్యవహరించాలని మరియు వారు స్వయంగా ఇస్లాంకు వ్యతిరేకంగా విరోధం చూపడం లేదా ఇస్లాంను ఎగతాళి చేయడం వంటివి చేయనంత వరకు వారితో పోరాడకూడదని ముస్లింలకు ఆదేశించబడింది. ఏదో ఒకనాడు వారు కూడా అల్లాహ్ ను ఆరాధించడంలో తమతో పాటు కలిసి ముందడుగు వేస్తారేమో మరియు అల్లాహ్ కు సమర్పించుకుంటారేమోనని చివరికి ముస్లింలు వారిపై ఆశ పడుతున్నారు.

“(ఓ ముహమ్మద్) వారికి చెప్పు: ఓ గ్రంథ ప్రజలారా! మాలోనూ, మీలోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే మనం అల్లాహ్ ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు. ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాహ్ ను వదిలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు. ఈ ప్రతిపాదన పట్ల గనుక వారు విముఖత చూపితే, “మేము మాత్రం ముస్లింలము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి” అని వారికి చెప్పేయండి.” (ఖుర్ఆన్ 3:64)

మరి హిందువులు, బహాయి, బౌద్ధులు మరియు ఇతర ధర్మాలను అనుసరించే ప్రజలతో ఎలా వ్యవహరించాలి? వారితో కూడా కనికరం, దయ, గౌరవమర్యాదలతో వ్యవహరించాలి మరియు ఇస్లాం ధర్మం వైపు పిలుస్తున్న తమ ఆహ్వానం వారికి అర్థం అయ్యేలా మంచిగా ప్రవర్తించాలి.

36- మానవ హక్కుల గురించి ఇస్లాం ధర్మం ఏ విధంగా గ్యారంటీ ఇస్తున్నది ?

ఖుర్ఆన్ లో ఏ ధర్మాన్నైనా అనుసరించే స్వేచ్ఛాస్వాతంత్ర్యాల గురించి స్పష్టమైన ప్రకటన ఉన్నది : ‘ధర్మంలో ఎలాంటి బలవంతం లేదు’. (2:256)

ముస్లిం లేదా ముస్లిమేతరుడు అనే భేదభావం లేకుండా ప్రజలందరి ప్రాణాలు మరియు సంపదలను ఇస్లాం ధర్మం చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తున్నది.

‘ఓ మానవులారా! మేము మిమ్ముల్ని ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్ముల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యథార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడూ, అప్రమత్తుడూను. (ఖుర్ఆన్ 49:13)

37- ముస్లిం కొరకు కుటుంబ వ్యవస్థ ఎందుకు అంతగా ముఖ్యమైనది ?

కుటుంబమనేది ఇస్లామీయ సమాజం యొక్క పునాది వంటిది. ఒక నిలకడైన కుటుంబ యూనిట్ సమాజానికి అందించే శాంతిభద్రతలు చాలా విలువైనవి. ఆ కుటుంబ సభ్యుల అధ్యాత్మిక అభివృద్ది కోసం అవి ఎంతో అవసరమైనవి. విస్తృత కుటుంబాల ఉనికి వలన సామరస్యపూర్వకమైన సామాజిక క్రమం సృష్టించబడుతుంది; పిల్లలు సరైన పెంపకం లభించడం వలన మంచిగా పరిపక్వం చెందుతారు, పెళ్ళయ్యే వరకు ఇంటిపట్టానే ఉంటారు. పెళ్ళికి ముందు చాలా అరుదుగా ఇంటిని వదిలి పెడతారు.

38- వయసు మళ్ళిన పెద్దలతో ముస్లింలు ఎలా వ్యవహరిస్తారు?

ఇస్లామీయ సమాజంలో, వృద్ధాశ్రమాలే లేవు. వయసు మళ్ళిన తల్లిదండ్రులకు జాగ్రత్తగా ప్రేమతో సేవలందించడంలో శ్రమించడమనేది ఒక గౌరవమైన మరియు ఆశీర్వాదాలతో, దీవెనలతో నిండిన ఉత్తమ పనిగా, అధ్యాత్మికంగా ఉత్తమ స్థానానికి చేరుకునే అవకాశంగా ఇస్లాం ధర్మం పరిగణిస్తున్నది. మన తల్లిదండ్రుల కోసం ప్రార్థించడమే కాకుండా నిస్సహాయులైన పసిబిడ్డలుగా ఉన్నప్పుడు వారు తమ అవసరాల కంటే ఎక్కువగా మనకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని మరీ వారికి అపరిమితమైన కనికరం, దయ, ప్రేమాభిమానాలతో సేవలు చేయాలని అల్లాహ్ ఆదేశిస్తున్నాడు.

తల్లి స్థానం తండ్రి స్థానం కంటే ఒకంత ఉన్నతమైంది. అందువలన వారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రేమించాలి మరియు గౌరవించాలి. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, ‘తల్లి పాదాల చెంత స్వర్గం ఉన్నది’.

ఇస్లాం ధర్మంలో, తల్లిదండ్రులకు సేవలు చేయడమనేది నమాజుల తర్వాత స్థానంలో ఉన్న గొప్ప బాధ్యత. అంతేగాని, అది వారికి చేస్తున్న ఉపకారం ఎంత మాత్రమూ కాదు, అది మనపై వారికి ఉన్న తిరుగులేని హక్కు.
ఖుర్ఆన్ లోని ప్రకటన ఇలా ఉన్నది: ‘నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు: మీరు ఆయనను తప్ప మరొకరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్యవహరించాలి. నీ సమక్షంలో వారిలో ఒకరు గాని, ఇద్దరు గానీ వృద్ధాప్యానికి చేరుకుని ఉంటే, వారి ముందు (విసుగ్గా) “ఊహ్” అని కూడా అనకు. వారిని కసురుకుంటూ మాట్లాడకు. పైగా వారితో మర్యాదగా మాట్లాడు. అణుకువ, దయాభావం ఉట్టిపడే విధంగా నీ భుజాలను వారి ముందు అణచి పెట్టు. “ఓ ప్రభూ! బాల్యంలో వీరు నన్ను (ప్రేమానురాగాలతో) పోషించినట్లుగానే నీవు వీరిపై దయజూపు” అని వారికోసం ప్రార్థిస్తూ ఉండు. (ఖుర్ఆన్ 17:23-24)

39- ఆహారపదార్థాల గురించి ఏమిటి?

యూదులు మరియు తొలితరం క్రైస్తవులు అనుసరించిన ఆహారపదార్థాలకు సంబంధించిన నియమనిబంధనల కంటే ఇస్లామీయ నిబంధనలు చాలా సులభమైనవే అయినా, పంది మాసం మరియు మత్తుపదార్థాల దరిదాపులకు కూడా పోకూడదని ముస్లింలు నిషేధిస్తున్నది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, ‘మీ శరీరానికి మీపై హక్కు ఉన్నది’, ఇస్లాం ధర్మంలో ఆరోగ్యవంతమైన ఆహారపానీయాలు సేవించడం మరియు ఆరోగ్యవంతమైన జీవన శైలిని అనుసరించడం మొదలైనవి ధార్మిక విధులుగా చూడబడుతున్నాయి. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: ‘తప్పకుండా మీరు (దైవవిశ్వాసంలో) నిలకడతనం, మంచిగా ఉండటం కోసం అల్లాహ్ ను వేడుకోండి; ఎందుకంటే (దైవవిశ్వాసంలో) నిలకడతనం తర్వాత, ఆరోగ్యం కంటే ఉత్తమమైన ఏ బహుమతీ ఎవ్వరికీ ఇవ్వబడలేదు!’

40- ఎవరైనా ముస్లింగా మారవచ్చా?

తప్పకుండా, ఎవరైనా ముస్లింగా మారవచ్చు. దీని కోసం రెండు ప్రకటనలు చేయవలసి ఉంటుంది. ఎవరైనా ఇస్లాంలో ప్రవేశించాలంటే ఇలా క్రింది సాక్ష్యప్రకటనలు చేయడం తప్పనిసరి:

నేను సాక్ష్యమిస్తున్నాను – అల్లాహ్ తప్ప ఆరాధింపబడే అర్హతలు గలవాడెవ్వడూ లేడు.
నేను సాక్ష్యమిస్తున్నాను – ముహమ్మద్, అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
కాబట్టి, ఎవరైతే ఎలాంటి బలవంతం లేకుండా, ఎలాంటి ప్రాపంచిక లాభాపేక్షా లేకుండా స్వచ్ఛందంగా, మనస్ఫూర్తిగా పై రెండు సాక్ష్యప్రకటనలు పలుకుతారో, వారు ముస్లింలు మారిపోతారు. అయితే ఈ రెండు సాక్ష్యప్రకటనలను అరబీ భాషలో ఇలా పలుక వలసి ఉన్నది – “అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్”. ఇలా సాక్ష్యప్రకటన పలకడానికి ముందు ఈ నవముస్లిం తలస్నానం చేయడం మంచిది.
తర్వాత ఏమి చేయాలి ?

ముస్లింగా మారిన తర్వాత, అతడు / ఆమె, ఒక ముస్లింగా ప్రతిరోజు ఐదుపూటలా చేయవలసిన నమాజులు, రమదాన్ నెల ఉపవాసాలు, జకాతు విధిదానం, హజ్ యాత్ర మొదలైన ఇస్లామీయ మూలస్థంభాల గురించి నేర్చుకోవాలి,

ఆ తర్వాత ఏమి చేయాలి ?

ముస్లింలు సోదరసోదరీమణులు. స్వయంగా తనకోసం దేనినైతే ఇష్టపడతాడో, ఒక ముస్లిం తన తోటి సోదరుడు / సోదరి కోసం కూడా దానినే ఇష్టపడాలి. అల్లాహ్ వద్ద నున్న సంపదలు కరిగిపోవు. ఆయన మనందరికీ ప్రసాదించ గలిగే సాటిలేని శక్తిసామర్ధ్యాలు కలిగి ఉన్నాడు. కాబట్టి, మనం పరస్పరం ఒకరి మంచి కొరకు మరొకరు ప్రార్థించుదాము, పరస్పరం ప్రేమించుదాము. మన కోసం దేనినైతే ఇష్టపడతామే, దానినే ఇతర సోదరసోదరీమణుల కోసం కూడా ఇష్టపడదాము.

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.