New Muslims APP

ప్రశ్నోత్తరాలు రెండవ భాగం

ప్రశ్నోత్తరాలు రెండవ భాగం – అల్హందులిల్లాహ్ – సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్ కే. మేము ఆయన్ను ప్రశంసిస్తాము, ఆయన సహాయాన్ని కోరతాము, మనలోని ప్రతి చెడు మరియు దుష్ట పనుల నుండి ఆయన శరణు వేడుకుంటాము. అల్లాహ్ మార్గదర్శకత్వం చూపిన వారిని ఎవ్వరూ సన్మార్గం నుండి తప్పించలేరు మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదిలి వేసిన వారికి మరెవ్వరూ దారి చూపలేరు. నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్యుడు లేడని మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అనీ. తరుచుగా ముస్లిమేతరులు ఇస్లాం మరియు ముస్లింల గురించి అడిగే ప్రశ్నలు ఇక్కడ చర్చించబడినాయి.

స్పెయిన్ దేశాన్ని పరిపాలించిన ముస్లింల కాలం ఇస్లామీయ పరమత సహనానికి మరో మంచి ఉదాహరణ. ఆనాటి స్పెయిన్ లోని ఇస్లామీయ పరిపాలనలో యూదులు స్వర్ణయుగ వైభవాలను అనుభవించారు.

దీనిని చదివే ప్రతి పాఠకుడు అల్లాహ్ తలిస్తే క్రింది అనేక విషయాలు మరియు అంశాల గురించి స్పష్టమైన మరియు సంతృప్తికరమైన అవగాహన పొందుతాడు:

11- మరేమైనా దివ్య మూలాధారాలు ఉన్నాయా ?

అవును, ఉన్నాయి. అవి సున్నతులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణలు మరియు ఉపమానాలు ముస్లింల కొరకు రెండో ప్రధాన ప్రామాణిక మూలాధారం. హదీథు అంటే ప్రామాణికంగా నమోదు చేయబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పలుకులు, ఆచరణలు మరియు సహచరులకు ఇచ్చిన అనుమతులు. సున్నతులను విశ్వసించడమనేది ఇస్లామీయ విశ్వాసంలోని రెండో ప్రధాన భాగం.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాల కొన్ని ఉపమానాలు :

1_’ఇతరులపై దయచూపని వారిపై అల్లాహ్ కూడా దయ చూపడు.’

2_’స్వయంగా తనకోసం ఏదైనా కోరుకుంటాడో, దానినే ఇతరుల కోసం కూడా కోరుకోనంత వరకు మీలో ఎవ్వడూ నిజమైన విశ్వాసి కాజాలడు.’

3_’ప్రత్యర్థిని పడగొట్టినవాడు బలవంతుడు కాడు, కానీ తారస్థాయికి చేరుకున్న కోపంలో తనను తాను నిగ్రహించుకో గలిగినవాడే బలవంతుడు.’ (బుఖారీ, ముస్లిం, తిర్మిథీ మరియు బైహఖీ హదీథు గ్రంథాల నుండి)

12- కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే ఋజుమార్గమని ఎవరికైనా ఎలా తెలుస్తుంది?

మనందరి దైవమైన అల్లాహ్ ఏకైకుడు, అద్వితీయుడు, అపూర్వుడు, పరిపూర్ణుడు, సర్వలోకాల ప్రభువు మరియు సృష్టికర్త అని బోధిస్తున్న ఏకైక ధర్మం ఇస్లాం ధర్మం మాత్రమే.
కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి గానీ జీసస్ ను లేదా విగ్రహాలను లేదా దైవదూతలను ఆరాధించకూడదని పూర్తిగా విశ్వసిస్తున్న ధర్మం కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే.
1400 సంవత్సరాలకు పూర్వం అవతరించిన ఖుర్ఆన్ గ్రంథంలో ఎలాంటి వైరుధ్యాలు, వ్యత్యాసాలు లేవు. దానిలో అనేక వైజ్ఞానిక వాస్తవాలు ప్రస్తావించబడినాయి. కేవలం ఈ మధ్య మాత్రమే వాటిలో కొన్నింటిని శాస్త్రజ్ఞులు ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో కని పెట్టారు, మరికొన్నింటిని కనిపెట్టే పరికరాలను తయారు చేసే స్థాయికి ఇంకా వారు చేరుకోలేదు. కాబట్టి, ఖుర్ఆన్ గ్రంథం ఎన్నడూ సైన్సుకు విరుద్ధంగా లేదు.
ఖుర్ఆన్ లోని ఒక్క అధ్యాయం వంటి అధ్యాయాన్నైనా తయారు చేయమని అల్లాహ్ సవాలు చేసినాడు. అంతేగాక, ఎవ్వరూ ఎన్నడూ ఆయన సవాలును ఎదుర్కోలేరని కూడా స్పష్టంగా తెలిపినాడు. గత 14 శతాబ్దాల నుండి ఈనాటి వరకు అది తిరుగులేని సవాలుగా అలాగే నిలిచి ఉన్నది.
నిశ్చయంగా మొత్తం చరిత్రలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తి. ఒక ముస్లిమేతరుడు రచించిన “The 100 most influential men in History” (అంటే చరిత్రలోని అత్యంత ప్రభావశీలురైన 100 మంది పురుషులు) అనే పుస్తకంలో ఆయన మొట్టమొదటి స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మరియు ప్రవక్త జీసస్ అలైహిస్సలాంకు 3వ స్థానం ఇచ్చినాడు. ప్రవక్త జీసస్ అలైహిస్సలాం కూడా అల్లాహ్ పంపిన ప్రవక్తయే అనే విషయాన్ని మనం ఇక్కడ తప్పకుండా గుర్తుంచుకోవాలి.

13- ఇతర మతాలను ఇస్లాం ధర్మం సహిస్తుందా అంటే ఇస్లాంలో పరమత సహనం ఉన్నదా?

నిస్సందేహంగా సహిస్తుంది. ఇస్లాంలో పరమత సహనం ఉన్నది. ఖురఆన్ లోని అల్లాహ్ ఆదేశం:
ధర్మంలో ఎలాంటి బలవంతం లేదు. (2:214)

ధర్మం విషయంలో మీపై కాలు దువ్వకుండా మిమ్ముల్ని మీ ఇల్లూ వాకిలి నుండి వెళ్ళగొట్టకుండా ఉన్న వారితో మీరు సద్ వ్యవహారం చేయడాన్ని, వారికి న్యాయం చేయడాన్ని అల్లాహ్ ఎంత మాత్రం నిరోధించడు. పై అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు. (ఖుర్ఆన్, 60:8)

ఇస్లామీయ రాజ్యంలోని అల్పసంఖ్యాకుల సంరక్షణ ఇస్లామీయ చట్టం యొక్క బాధ్యతలలోని ఒక ముఖ్య బాధ్యత. అందువలననే ఇస్లామీయ దేశాలన్నింటిలోనూ ముస్లిమేతరుల దేవాలయాలు, ఆరాధనాలయాలు వర్ధిల్లాయి. చరిత్రలో ఇస్లామీయ పరమత సహనాన్ని చూపే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు,

634వ సంవత్సరంలో, ఖలీఫా ఉమర్ రదియల్లాహు అన్హు జెరుసలేం పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు, అక్కడి ప్రజలందరికీ ఆయన శరణు ప్రసాదించారు మరియు ఇస్లాం ధర్మాన్ని అనుసరించకుండా, తమ తమ ధర్మాల ప్రకారమే స్వేచ్ఛగా జీవించే అనుమతినిచ్చారు.
స్పెయిన్ దేశాన్ని పరిపాలించిన ముస్లింల కాలం ఇస్లామీయ పరమత సహనానికి మరో మంచి ఉదాహరణ. ఆనాటి స్పెయిన్ లోని ఇస్లామీయ పరిపాలనలో యూదులు స్వర్ణయుగ వైభవాలను అనుభవించారు.
అంతేకాదు, ఇస్లాం ధర్మం ముస్లిమేతర అల్పసంఖ్యాకులకు తమ స్వంత కోర్టులను పెట్టుకునే అనుమతినిచ్చి, వారికి తగిన అటానమీ (autonomy) ప్రసాదించింది.

14- ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మాలు – రెండింటి మూలస్థానాలు ఒక్కటేనా లేక వేర్వేరా ?

యూదమతంతో పాటు, వాటి మూలాలు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు పోయి కలుస్తాయి. ఈ మూడు ధర్మాల ప్రవక్తలు తిన్నగా ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇద్దరు కుమారుల సంతతి నుండే ఎంచుకోబడినారు.

ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం యొక్క పెద్దకుమారుడైన ప్రవక్త ఇస్మాయీల్ అలైహిస్సలాం సంతతి నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంచుకోబడినారు.
ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం యొక్క రెండవ కుమారుడైన ప్రవక్త ఇస్హా అలైహిస్సలాం సంతతి నుండి ప్రవక్త మూసా అలైహిస్సలాం, ప్రవక్త జీసస్ అలైహిస్సలాం మొదలైనవారు ఎంచుకోబడినారు. ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఒక పట్టణాన్ని స్థాపించారు. ఈనాడు అది మక్కా పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇంకా అక్కడ కాబాగృహాన్ని నిర్మించారు. ఈనాడు ప్రతిరోజూ ఐదు పూటలా నమాజు చేసేటప్పుడు ముస్లింలు కాబాగృహం దిక్కు వైపుకే తిరిగి నిలబడతారు.

15- ప్రవక్త జీసస్ అలైహిస్సలాం గురించి ముస్లింల అభిప్రాయం ఏమిటి?

ప్రవక్త జీసస్ అలైహిస్సలాంను మరియు ఆయన తల్లి కన్య మేరీలను ముస్లింలు ఎంతో గౌరవిస్తారు. తండ్రి లేకుండా పుట్టిన ప్రవక్త జీసస్ అలైహిస్సలాం యొక్క పుట్టుక ఒక మహిమ అని ఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తున్నది.

“అల్లాహ్ దృష్టిలో ఈసా ఉపమానం ఆదం ఉపమానాన్ని పోలినదే. అతన్ని మట్టితో చేసి: అయిపో అని ఆజ్ఞాపించగా అతను (మనిషిగా) అయిపోయాడు” (ఖుర్ఆన్ 3.59).

“ఒక ప్రవక్తగా అల్లాహ్ అనుజ్ఞతో ఆయన తన తల్లి శీలాన్ని ధృవీకరిస్తూ, పుట్టిన వెంటనే ఆయన ప్రజలకు జవాబివ్వడం, అంధులకు దృష్టి ప్రసాదించడం, కుష్టు రోగులను నయం చేయడం, మృతులను తిరిగి సజీవులుగా చేయడం, మట్టి నుండి పక్షిని తయారు చేయడం వంటి అనేక మహిమలు ప్రదర్శించారు. అన్నింటి కంటే ముఖ్యంగా అల్లాహ్ యొక్క సందేశాన్ని అందజేయడం. ఖుర్ఆన్ ప్రకారం, ఆయన అస్సలు శిలువ వేయబడలేదు, స్వర్గంలోనికి ఎత్తుకోబడినారు”. (ఖుర్ఆన్, మర్యమ్ అధ్యాయం)

16- “మీరు చూడలేని, వినలేని, స్పర్శించలేని, వాసన చూడలేని, రుచి చూడలేని, ఎలా ఉంటాడో కనీసం ఊహించను కూడా ఊహించలేని దేవుడిని మీరు ఎలా విశ్వసిస్తారు?”

వాస్తవానికి ఈ ప్రాపంచిక జీవితంలో ఎవ్వరూ అల్లాహ్ ను చూడలేదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనల ద్వారా మనం తెలుసుకున్నాము. ఏ విధంగానైనా ఆయన దరి చేరేలా మన పంచేద్రియాలను ఉపయోగించే శక్తిసామర్ధ్యాలు మనకు లేవు. ఏదేమైనా, ఈ విశ్వం మొత్తం తనకు తానుగా ఉనికిలోనికి వచ్చే అవకాశం లేదనే అసలు సత్యాన్ని గుర్తించేందుకు మన పంచేంద్రియాలను ఉపయోగించమని ఇస్లాం ధర్మం ప్రోత్సహిస్తున్నది. ఈ మహాద్భుత విశ్వాన్ని ఖచ్ఛితంగా డిజైన్ చేసి, ఉనికిలోనికి తెచ్చిన ఒక సర్వశక్తిమంతుడైన సృష్టికర్త తప్పకుండా ఉన్నాడు. ఇది మన శక్తిసామర్ధ్యాలకు అందని విషయం. అయినా, దీనిని మనం గ్రహించగలం, దీని అనుభూతి పొందగలం మరియు చూడగలం.

ఉదాహరణకు, అతని లేక ఆమె పెయింటింగ్ ను గుర్తించేందుకు దానిని తయారు చేస్తున్నప్పుడు మనం ఆ ఆర్టిస్టును చూడవలసిన అవసరం లేదు. కాబట్టి, పెయింటింగ్ చేసిన ఆ కళాకారుడిని ఒకవేళ మనం చూడలేక పోయినా, ఆ పెయింటింగును ఎవరో ఒక కళాకారుడే తయారు చేసి ఉంటాడని గుర్తిస్తాము. అంతేగానీ తనకు తానుగా ఆ పెయింటింగ్ ఉనికిలోనికి వచ్చిందని భావించము. అలాగే, అల్లాహ్ ను చూడవలసిన అవసరమేమీ లేకుండానే, ప్రతిదీ ఆయనే సృష్టించాడని మనం విశ్వసించవచ్చు.

17- ఇస్లామీయ ధర్మం యొక్క మూలస్థంభాలు (మూలసిద్ధాంతాలు) ఏవి ?

ఇస్లామీయ ధర్మం యొక్క మూలస్థంభాలు ఐదు. అవి:

షహాదహ్ అంటే సాక్ష్యప్రకటన: ఒక్క అల్లాహ్ తప్ప, ఆరాధింపబడే అర్హత గల వారెవ్వరూ లేరని మరియు ముహమ్మద్, అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యమివ్వడం.
సలాహ్ – నమాజు: ప్రతిరోజూ ఐదు సార్లు నమాజు చేయడం.
సౌమ్ – ఉపవాసం : రమదాన్ నెల మొత్తం విధిగా ఉపవాసం పాటించడం.
జకాతు – విధిదానం : ధనవంతుల సంపదలోని పేదప్రజల హక్కు.
హజ్ యాత్ర : శారీరకంగా మరియు ఆర్ధికంగా తగిన స్తోమత గలవారు జీవితంలో కనీసం ఒక్కసారి మక్కా వెళ్ళి, హజ్ యాత్రలో పాల్గొనడం.
ఉదాహరణకు – ఒకవేళ మన వద్ద ఒక బిల్డింగు ప్లాను ఉందని అనుకుందాము. దానికి ఒక మంచి ఆకారాన్నిస్తూ నిర్మించాలంటే, దాని మూలస్థంభాలన్నీ ఎత్తులో మరియు దృఢత్వంలో సమానంగా ఉండాలి.

ఇస్లాం ధర్మం విషయంలో కూడా అంతే. ఒక ముస్లింగా తప్పక ఇస్లామీయ మూలస్థంభాలన్నింటినీ సరిసమానంగా ఆచరించ వలసి ఉన్నది.

ఉదాహరణకు, రమదాన్ నెల ఉపవాసాలు పాటించకుండా లేక ప్రతిరోజూ ఐదు పూటలా నమాజులు చేయకుండా హజ్ యాత్ర చేస్తే చాలని భావించడం సరికాదు.

ఒక బిల్డింగులో కేవలం పిల్లర్స్ అంటే మూలస్థంభాలు మాత్రమే ఉన్నాయని భావించుదాం. అలాంటి స్థితిలో అదొక బిల్డింగ్ యే అనబడదు. దానిపై కప్పు ఉండాలి. దానికి గోడలు, తలుపులు మరియు కిటికీలు మొదలైనవి ఉండాలి. అప్పుడే అది ఒక బిల్డింగు అని పిలబడుతుంది.

ఇస్లాం ధర్మం విషయం కూడా అంతే. ఇస్లాం ధర్మంలో కేవలం మూలస్థంభాలు మాత్రమే లేవు. దానిలో ఇస్లామీయ నైతికత అనబడే నిజాయితీ, సత్యత, దయాగుణం, దానధర్మాలు, ఇతరులను గౌరవించడం, ఇంకా ఇలాంటి అనేక ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి, ఒక ముస్లింగా జీవించాలంటే, కేవలం ఇస్లాం ధర్మం యొక్క మూలస్థంభాలను మాత్రమే ఆచరిస్తే సరిపోదు, వాటితో పాటు ఒక మంచి మానవుడి ఉత్తమ లక్షణాలు కలిగి ఉండేందుకు వీలయినంత ఎక్కువగా, శాయశక్తులా ప్రయత్నించాలి. అప్పుడే ఆ బిల్డింగు నిర్మాణం పూర్తయి, ఎంతో అందంగా కనబడుతుంది.

18- ఇస్లాం ధర్మంలో ఆరాధనల అసలు ఉద్దేశ్యం ఏమిటి?

ఆరాధనల అసలు ఉద్దేశ్యం అల్లాహ్ యొక్క భయభక్తులు అలవర్చుకోవడం. కాబట్టి, అది నమాజు అయినా, ఉపవాసం లేక దానధర్మాలైనా అవి మనలన్ని అల్లాహ్ కు దగ్గరగా తీసుకువెళతాయి. ఎప్పుడైతే ఒకరి ఆలోచనలలో మరియు ఆచరణలలో అల్లాహ్ యొక్క భయభక్తులు పాదుకొంటాయో, ఆ వ్యక్తి ఇహపరలోకాలలో అల్లాహ్ యొక్క అనుగ్రహాలు ఎక్కువగా ప్రసాదింపబడే ఉత్తమ స్థానం పైకి చేరుకుంటాడు.

19- ముస్లింలకు పరలోకంపై విశ్వాసం ఉందా?

అల్లాహ్ అత్యంత న్యాయవంతుడు మరియు తన న్యాయాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తాడు. మన పలుకులకు మరియు పనులకు మనమే బాధ్యత వహించే వ్యవస్థను ఆయన స్థాపించాడు. ఎవరైతే మంచి చేస్తారో, వారికి మంచి ప్రతిఫలం ప్రసాదించబడుతుంది. అలాగే ఎవరైతే చెడు చేస్తారో, వారు కఠినంగా శిక్షించబడతారు. కాబట్టి, దాని కోసం స్వర్గనరకాలను ఆయన సృష్టించాడు. రెండింటిలోనూ వేర్వేరు ప్రవేశ నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుత జీవితం తాత్కాలికమైన జీవితమని ముస్లింలు నమ్ముతారు. ఇదొక పరీక్ష. ఒకవేళ ఈ పరీక్షలో మనం పాసైతే, స్వర్గంలో మంచి వ్యక్తుల సహచర్యంలో శాశ్వతమైన సుఖసంతోషాల జీవితం మనకు ప్రసాదించబడుతుంది.

20- ముస్లిమేతరుల మంచిపనులు వ్యర్థమై పోతాయా?

లేదు. ఖుర్ఆన్ స్పష్టంగా చెబుతున్నది, “ఎవరైనా అణువంత మంచి చేసినా వారు దానిని చూస్తారు మరియు ఎవరైనా అణువంత చెడు చేసినా వారు కూడా దానిని చూస్తారు” (ఖుర్ఆన్ 99:7- 8).
దీని అర్థం ఏమిటంటే, మంచిపనులు చేసిన ముస్లిమేతరులకు ఈ ప్రపంచంలోనే వారి మంచి పనులకు తగిన ప్రతిఫలం ప్రసాదించబడుతుంది. అలాగే, మంచిపనులు చేసిన ముస్లింలకు ప్రతిఫలం ఈ ప్రపంచంలో ప్రసాదించబడటమే గాక, పరలోకంలో కూడా ప్రసాదించబడుతుంది. ఏదేమైనా అంతిమ తీర్పు స్వయంగా అల్లాహ్ పైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. (ఖుర్ఆన్ 2:62)

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.