భక్తిభావ తరంగాలు

హాజీలు బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి అల్లాహుమ్మఫ్తహ్లీ అబ్వాబ రహ్మతిక్’ అంటూ మస్జిద్ హరామ్ లో ప్రవేశించారు. అలా ప్రవేశించిన వారు వింత, వినూత్న అనుభూతికి లోనయ్యారు. దేహ పరంగా వారు మౌనమూర్తులయి ఉన్నారుగానీ, వారి ఆత్మలు అనంతానంత ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. వారిలోని భక్తిభావాలు సాగర తరంగాల్లా ఉవ్వెత్తు ఎగిసి పడుతున్నాయి. ప్రభాత కాలం. భక్తి పారవశ్యాల సంరంభం. ఖుర్ఆన్ శ్రావ్య శ్రవణం, సుభక్తాగ్రేసరుల, సత్యప్రియుల, శాంతి కాముకుల కోలాహాలం!

అహో! పవిత్ర ప్రతిష్టాలయం కాబా గృహ ముగ్ధ మనోహర దృశ్యం, వినిర్మల ప్రాంగణం మస్జిద్ హరామ్. ఆ దివ్య ఆవరణంలో కాలు మోపగానే 1 లక్ష 24 వేల పగ్గాలతో లాగుతున్నట్లుంది. ‘ఫజ్ అల్ అఫ్యిదతం మినన్నాసి తహ్వీ ఇలైహిమ్’ అన్న ప్రవక్తల పితామహులు ఇబ్రాహీమ్ (అ) చేసిన ప్రార్థనా ఫలితంగా కనబడుతోంది. అల్లాహ్ అర్ష్కు నేరుగా భూమిలో ఉన్న పవిత్ర ప్రార్థనాలయం. అజాన్ పలుకులతో అనంత జనవాహినిని ఆహ్వానిస్తున్న మీనార్ శిఖరాగ్రాలు. నలువైపులా భక్తిపారవశ్యాలలో ఓలలాడుతున్న సుభక్త జనాలు, వారి గుండెల్లో సత్య సుగంధాలు, శాంతి సౌరభాలు వెదజల్లుతున్న మలయ పవనాలు. ఆత్మను వింతానుభూతికి, దివ్యత్వానికి లోను చేస్తున మృదు మధుర పవిత్ర ఖుర్ఆన్ పారాయణాలు. ఓహో. ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి. అవిగో అద్దాల వంటి పాలరాతి స్తంభాలు. వాటిలో ప్రతిబింబిస్తూ అగుపంచే తెల్లటి దుస్తులు ధరించిన హాజీల దేహాలు. ఆత్మసౌందర్యానికి ఆదర్శ రూపాలు.. ఏనాటిది ప్రతిష్ణాలయం?-ఈ పవిత్ర గృహం ముందు ఎన్ని వందల యుగాలు బృంద స్తోత్రం చేసినవో? ఈ కాబా లోపల ఎంతటి సుదీర్ఘ కాలం కొవ్వొత్తిలా కరిగిపోయినదో? నిన్నటిదా మరి మొన్నటిదా.. ఇది ఎన్ని యుగాల చరిత్ర. దైవ దూతలు తమ స్వహస్తాలతో కట్టిన భువన స్వర్గ భవనం అది కదా!

భక్తిభావ తరంగాలు

కస్తూరి, కర్పూరం, జివ్వాజి, పునుగు, శ్రీచందం, పన్నీరు ఒక్కటేమిటి లోకంలో ఉన్న సుగంధద్రవ్యాలన్నింటిలో ఏ ఒక్కటీ సరితూగదు స్వర్గ సురభీ ముందు. స్వయంగా ఆ పరమ పవిత్రుడైన అల్లాహ్ స్వహస్తాలతో అలంకరించిన ఆ స్వర్గధామం. ఆహా.. ఆ స్వర్గసీమకు పాత్రులం అవుదాం రండి!

ఈ మస్జిద్ హరామ్ కోసం ఉపయోగించిన రాళ్లని రాళ్ళని ఎలా అనగలం? మట్టిని కరచుకొని మౌనంగా పడి ఉండే మొండి రాళెక్కడ? నిరతం వినిర్మల వాతావరణంలో పవిత్ర ఖుర్ఆన్ పారాయణాన్ని, ప్రార్థనా దృశ్యాం వినే, అనే భాగ్యం వీటికి మాత్రమే లభించింది. శిలలా అని కావు; భక్తిభావాలు ఉప్పొంగగా జలజలా పొంగిన అలలు. అలలా కానివి; అందంగా మలచి నిలబెట్టిన బంగారు కలలు. ఇన్ని అద్భుత దృశ్యాల్లో దేన్నని చూడాలి. ఒక్కొక్కటి ఒక జీవితానికి ప్రతీక, మాతృమూర్తి హజ్రత్ హారా (అ) గారి అపూర్వ విశ్వాసానికి నిలువుటద్దం సఫామర్వాల సయీ, సుభక్తురాలిని ఆ విశ్వకర్త ఎలా ఆదుకుంటాడనటానికి సజీవ సాక్ష్మం జంజం జల విధి. తండ్రి కొడుకుల నిరుపమాన త్యాగానికి, ఆదర్శ వాత్సల్యానికి ప్రతిరూపం కాబా కట్టడం. పుణ్య పుత్రుని అనితర సాధ్య విధేయతకు ప్రబల తార్కాణం ఖుర్బానీ మీనా ప్రాంతం, ధర్మమూ, త్యాగమూ, సౌందర్యమూ, భక్తిభావమూ పరస్పరం కలిసిపోయిన చోటిది. అవేశమూ, ఆలోచనా- ఒకే కౌగిటిలో ఒదిగిపోయిన స్థలం ఇది.

‘ఓహో ఏమి స్తోత్రాలు, భక్తిపరవశులైన విశ్వాసుల అధరాలు. ఎటు చూసినా అల్లాహ్ నామస్మరణలు.. సంస్మరణలు… ఇసిగార్లు.. తౌబాలు…. పశ్చాత్తాపాలు.. అశ్రువులు పొంగుతున్న నయనాలు. పాపభీతితో కంపించిపోతున్న హృదయ పొదరిళ్ళు. కన్నీటి ధారతో సస్యశామలం అవుతున్న మనోబిళ్ళు. (పారవశ్యంలో ఎంత అందంగా ఉంది ‘హజ్రె అస్వద్’. అది స్వర్గం నుండి తేబడిన అపురూప శిలము. దివ్యకాంతి కరళ్లు త్రొక్కినట్లు, ఏదో మహా సౌరభమే గుమ్మమై నిలిచినట్టు కాబా తలుపు, సందేహం లేదు. అటుగా కనబడుతున్నది ముఖామె ఇబ్రాహీమే’! ఈ రాయిపై నిలబడి ఆయన పవిత్ర ఆలయాన్ని నిర్మించినారు. సంశయానికి తావే లేదు. అదుగో…మీజాబె రహ్మత్ సరిగ్గా ‘హతీమ్’ లోపలి భాగంలోనే ఉంది. అక్కడ చేసే ప్రార్ధన సర్వ విధాల స్వీకృతం. సందేహానికి ఆస్కారమే లేదు. దూరాన కనబడుతున్నది ముమ్మాటికి రుక్నే యమావీయే. రుక్నే యమానికి మరియు హజ్రె అస్వద్కి మధ్య ‘రబ్బనా ఆతినా సిద్ధున్యా హసవహ్ నఫిల్ అఖిరతి హసవమ్ వభినా అజాబన్నార్’ చదవాలన్నది ప్రవక్త (స) వారి మాట.

మహనీయ ముహమ్మద్ (స) అంతిమ దైవ ప్రవక్త. అంతేకాదు ప్రవక్తలందరి నాయకుడు. మానవత్వం మూర్తీభవించిన మహితాత్ముడు. సత్ప్రవర్తనతో మనసుల్ని ఏలిన హృదయాల విజేత. మట్టిని మాణికంగా తీర్చిదిద్ది, హరిణాన్ని (స్త్రీని) తరంగంగా కదను తొక్కించి, స్త్రీ స్వర్గానికి సోపానం అని ప్రకటించి, శప్తంగా, నిర్లిప్తంగా పడి ఉన్న బానిస జాతికి నల రూపంలో దావానల రూపంలో ప్రజ్వలింపజేసిన జాజ్వల్వ మూర్తి – మానవ మహోపకారి ముహమ్మద్ (స).

అరేబియా దేశంలోని మక్కా పట్టణంలో అబ్దుల్లాహ్ మరియు ఆమీనాలకు జన్మించి, అక్కడే ప్రవక్తగా ప్రభవించిన అగ్రజులు మహనీయ ముహమ్మద్ (న), విగ్రహ దాస్యం, మనిషి దాస్య భారంతో తలవంచుకుని పశువుకన్నా హీనంగా బ్రతుకుతున్న స్వజాతికి -మానవ జాతికి ఊతగా, నేతగా, భాగ్య విధాతగా అలరారి అంతిమ శ్వాస వరకు అవిరళంగా పరిశ్రమించి, జాతి మొత్తం స్వేచ్ఛ పొందగా, దాస్య శృంఖలాలు తెంచుకోగా, శాంతి తంత్రి నినదించగా పరవశించిపోతూ పరమపదించిన ప్రవక్తాగ్రేసర శిఖామణి ముహమ్మద్ (స). ఆ మహితాత్ముడు పుట్టిన నేలలో, ఆ మహాత్ముడు పీల్చిన గాలిలో కొన్ని క్షణాలైనా జీవించడం సమస్త మానవాళి సౌభాగ్యం.

ఇది హజ్ మహారాధన మహోత్సవం. గతంలో మానవ మనో దర్పణాలకంటుకున్న మషీరసాన్ని కడిగివేసే మంచి తరుణమిది. మనలో ఎవ్వరైనా కాలు జారి అధర్మ ఆడుసులోకి దిగజారి ఉంటే నేడే. ఈనాడే పశ్చాత్తాపం వెలిబుచ్చండి. ఆత్మ ప్రక్షాళనంకన్నా అమల సాధనం మరొకటి లేదు. పాప గోపనంకన్నా పరమ నీచం ఇంకొకటి లేదు. ఆందోళనతో, ఆవేదనతో అల్లాహ్ సాన్నిధ్యం పొందలేము. తప్పులు ఒప్పుకున్న నాడే హృదయం నిర్మలమవుతుంది. పునీత హృదయులే అల్లాహ్ ఆదరానికి అర్హులు. నేటితో మన చిత్తం చలించకూడదు. మనం మనో తుచ్చ కోరికల రాపిడితో జ్వలించకూడదు. మనలోని చాంచల్యం నేటితో నశించిపోవాలి. అప్పుడే మన మీద అల్లాహ్ కరుణామృతం కురుస్తుంది. మనకు మన్నింపు లభిస్తుంది. కళ్ళకు మిరిమిట్లు గొలిపే ఈ సృష్టి తేజస్తుకే మూలం అయిన అఖండ జ్యోతీశ్వరుడిని స్వర్గంలో దర్శించుకుని జన్మ ధన్యం చేసుకునే మహదావకాశం ప్రాప్తిస్తుంది.

కస్తూరి, కర్పూరం, జివ్వాజి, పునుగు, శ్రీచందం, పన్నీరు ఒక్కటేమిటి లోకంలో ఉన్న సుగంధద్రవ్యాలన్నింటిలో ఏ ఒక్కటీ సరితూగదు స్వర్గ సురభీ ముందు. స్వయంగా ఆ పరమ పవిత్రుడైన అల్లాహ్ స్వహస్తాలతో అలంకరించిన ఆ స్వర్గధామం. ఆహా.. ఆ స్వర్గసీమకు పాత్రులం అవుదాం రండి!

Related Post