New Muslims APP

మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) గారి మరణం – 1

అంతిమ ప్రయాణ సూచనలు 

దైవసందేశ ప్రచార కార్యక్రమం పూర్తయి అరేబియా ద్వీప అధికార పగ్గాలు చేతికి వచ్చిన తరువాత మహాప్రవక్త (సల్లం) గారి భావాలు, ఆలోచనలు, వైఖరి, సంభాషణల ద్వారా ఇక ఆయన ఈ ప్రాపంచిక జీవితానికి స్వస్తి చెప్పబోతున్నారనే సూచనలు, గురుతులు కానరావడం ప్రారంభమయ్యాయి. ఉదాహరణకు:

దైవసాక్షిగా! నా తరువాత మీరు షిర్క్ చేస్తారనే భయం నాకు లేదుగాని, ప్రాపంచిక విషయాల్లో (భౌతిక విషయాల్లో) మనోవాంఛలకు లోనైపోతారనే భయం మాత్రం పీడిస్తోంది.

ఆయన (సల్లం) రమజాన్ నెల (హి.శ 10)లో ఇరవై రోజుల వరకు ఈతికాఫ్ చేశారు. ఇంతకు ముందు రమజాన్ నెలలో ఆయన పది రోజులే ఈతికాఫ్ పాటించేవారు. జిబ్రీల్ (అలైహి) ఈ సంవత్సరం రెండుమార్లు ఖుర్ఆన్ పారాయణాన్ని చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒకమారే దివ్య ఖుర్ఆన్ పారాయణం చేయించడం ఆనవాయితి. హజ్జతుల్ విదా సందర్భంగా ఆయన ఇలా చెప్పారు కూడా:

“బహుశా ఈ సంవత్సరం తరువాత మీ ఈ ప్రదేశంలో మీతో ఎప్పుడూ కలువలేనేమో.”

జమ్రయె అక్బా దగ్గర నిలబడి, “హజ్ నియమాలను నా నుండి తెలుసుకోండి, ఎందుకంటే, బహుశా దీని తరువాత నేను హజ్ చేయలేనేమో.”

అయ్యామె తష్రీక్ యొక్క నడిమి రోజున ‘నస్ర్ సూరా’ అవతరించింది. దీని ద్వారా ఆయన (సల్లం) తాము ఇక ఈ ప్రపంచం నుండి వెళ్ళే సమయం ఆసన్నమైందని గమనించారు. ఇదో మరణ ఘంటిక.

సఫర్ నెల ప్రారంభంలో (హి.శ. 11) ఆయన ఉహద్ కొండకు చేరుకున్నారు. అమరగతినొందిన సహాబా (రజి) కోసం, సజీవులు మరియు నిర్జీవులైన వారి నుండి సెలవు తీసుకున్నట్లుగా దుఆ చేశారు. తిరిగి వచ్చి మెంబరు పై కూర్చుని ఇలా సెలవిచ్చారు.

“నేను మీ బిడారానికి అమీర్ ను (అధ్యక్షుణ్ణి), మీ గురించి సాక్ష్యం పలికేవాణ్ణి. దైవసాక్షి! నేనిప్పుడు నా ‘హౌజ్’ను (హౌజె కౌసర్) చూస్తున్నాను. నాకు భూ ధనాగారాల తాళపు చెవులు ఒసగడం జరిగింది. దైవసాక్షిగా! నా తరువాత మీరు షిర్క్ చేస్తారనే భయం నాకు లేదుగాని, ప్రాపంచిక విషయాల్లో (భౌతిక విషయాల్లో) మనోవాంఛలకు లోనైపోతారనే భయం మాత్రం పీడిస్తోంది.”

ఓ రోజు అర్థరాత్రి లేచి ఆయన (సల్లం) ‘బకీ’ (బకీ ఖనన వాటిక)కు బయలుదేరి వెళ్ళారు. బకీలో ఖననం అయి ఉన్నవారిని మన్నించమని దైవాన్ని ప్రార్థించారు. ఈ సందర్భంలో ఆయన పలికిన పలుకులు ఇవి:

“ఓ సమాధి వాసులారా! మీపై సలాం (శాంతి). ప్రజల పరిస్థితి కంటే ఇప్పుడు మీరున్న పరిస్థితే శుభకరమైనది. మీకు శుభం కలుగుగాక. సంక్షోభాలు కాళరాత్రి తెరలుగా ఒకదాని తరువాత ఒకటి వచ్చి పైనబడుతున్నాయి. వెనుక వచ్చేవాడు ముందు వానికంటే చెడ్డవాడు” అంటూ ఆ ఖనన వాటికలో సమాధి అయినవారికి “మేము కూడా మిమ్మల్ని వచ్చి కలువబోతున్నాం” అనే శుభవార్తనిచ్చారు.

వ్యాధి ప్రారంభ దశ

హిజ్రీ శక సంవత్సరం 11, సఫర్ మాసం 29వ తేదీ సోమవారం నాడు మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఓ జనాజా వెంట ‘బకీ’కి వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు దారిలోనే ఆయనకు తలనొప్పి ప్రారంభం అయింది. శరీర ఉష్ణోగ్రత, తలపై కట్టిన కట్టుపై నుండి బయటకు వచ్చేటంత తీవ్రమైపోయింది. ఇది ఆయన (సల్లం) మరణానికి ప్రారంభ సూచిక. ఆ పరిస్థితిలోనే ఆయన (సల్లం) పదకొండు రోజులు నమాజు చేయించారు. వ్యాధి కాలం మొత్తం 13 లేదా 14 రోజులు.

చివరి వారం

మహాప్రవక్త (సల్లం) గారి పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తూపోతోంది. ఈ లోపు ఆయన (సల్లం) సతీమణులతో, “నేను రేపు ఎక్కడుంటాను? రేపు నేను ఎక్కడ ఉంటాను?” అని అడగనారంభించారు. ఇలా ప్రశ్నించడంలో గల ఉద్దేశ్యం ఏదో ప్రవక్త (సల్లం) గారి సతీమణులు గ్రహించారు. కాబట్టి వారంతా కలసి, “తమరెక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండవచ్చు” అని సమాధానమిచ్చారు.

ఆ తరువాత ఆయన (సల్లం), హజ్రత్ ఆయిషా (రజి) గారి ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు హజ్రత్ ఫజ్ల్ బిన్ అబ్బాస్ (రజి) మరియు హజ్రత్ అలీ బిన్ అబీ తాలిబ్ (రజి)ల ఆధారంగా నడిచారు. తలపై కట్టు కట్టబడి ఉంది. కాళ్ళు నేలపై ఈడ్చుకుపోతున్నాయి. ఇదే పరిస్థితిలో ఆయన (సల్లం) హజ్రత్ ఆయిషా (రజి) గారి ఇంట్లోకి ప్రవేశించారు. ప్రవక్త (సల్లం) గారి జీవితపు చివరి వారం అక్కడనే గడిచింది.

హజ్రత్ ఆయిషా (రజి), ముఅవ్విజాత్ (అల్లాహ్ శరణు వేడే సూరాలు ముఖ్యంగా ఫలఖ్, నాస్ సూరాలు), మహాప్రవక్త (సల్లం) గారి నుండి నేర్చుకొని కంఠస్తం చేసిన దుఆలు పఠించి ఆయనపై ఊదేవారు, శుభం కలగాలనే తలంపుతో ప్రవక్త (సల్లం) గారి పవిత్ర హస్తాలనే ఆయన శరీరంపై నిమిరేవారు.

(దైవప్రవక్త – సల్లం) మరణానికి అయిదు రోజుల ముందు 

ప్రవక్త (సల్లం) గారి మరణానికి అయిదు రోజుల ముందు బుధవారం రోజున ఆయన (సల్లం) శరీర ఉష్ణోగ్రత మరింత పెరిగిపోయింది. ఆ కారణంగా ఆయన బాధ బాగా హెచ్చిపోయి అపస్మారక పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిలో ఆయన, “నా శరీరంపై వివిధ బావుల నుండి ఏడు ముష్కీజాల (తోలు సంచి) నీరు తెచ్చి పోయండి. నేను ప్రజల వద్దకు వెళ్ళి వసీయ్యత్ (మరణ శాసనం) చేస్తాను” అని కోరారు.

దాని కోసం ఆయన్ను ఓ వెడెల్పాటి పాత్రలో కూర్చోబెట్టి ఇక చాలు అన్నంత వరకు ఆయన (సల్లం)పై నీరు పోయడం జరిగింది. అప్పుడు గాని ఆయనకు కొంత ఊరట చేకూరలేదు.

మస్జిద్ లోనికి వెళ్ళారు – తలపై కట్టు అలానే ఉంది – మెంబరుపై కూర్చున్నారు. కూర్చునే ఖుత్బా ఇచ్చారు. ఆయన (సల్లం) చుట్టూ సహాబా (రజి) గుమిగూడి ఉన్నారు. ఆయన వారిని ఉద్దేశించి ఇలా అన్నారు:

“యూదులు, నసారాల (క్రైస్తవుల)పై అల్లాహ్ శాపం పడుగాక – వారు తమ ప్రవక్తల సమాధుల్ని మస్జిద్ లుగా (ఆరాధనాలయాలుగా) మార్చారు.” మరో ఉల్లేఖనంలో, “యూదులు మరియు నసారాలపై అల్లాహ్ దెబ్బ పడుగాక. వారు తమ ప్రవక్తల సమాధుల్ని మస్జిదులుగా చేసుకున్నారు.”

ఆయన (సల్లం) ఇలా కూడా సెలవిచ్చారు:”మీరు నా సమాధిని పూజల కోసం ఓ విగ్రహంగా మార్చకండి”

ఆ తరువాత మహాప్రవక్త (సల్లం) ఖిసాస్ కోసం సిద్ధపడుతూ, “నేను ఎవరి వీపుపై కొరడాతో కొడితే ఇదిగో నా ఈ వీపు, నన్ను కూడా కొరడాతో కొట్టి బదులు తీర్చుకోవచ్చు. ఎవరి మానమర్యాదలకు భంగం కలిగిస్తే ఆ వ్యక్తి కూడా బదులు తీర్చుకోవాలి” అని పలికారు.

ఆ తరువాత ఆయన మెంబరు నుండి క్రిందకి దిగి వచ్చి జొహ్ర్ నమాజు చేయించారు. ఆ తరువాత తిరిగి మెంబరుపైకి వెళ్ళి తన గురించి ఎవరికైనా పగ ఉంటే తీర్చుకొమ్మని ఇదివరకు అన్నట్లుగానే ఉన్నారు. ఒక వ్యక్తి లేచి, “దైవప్రవక్తా! మీరు నాకు మూడు దిర్హములు బాకీ ఉన్నారు” అని చెప్పాడు. మహాప్రవక్త (సల్లం), ఫజ్ల్ బిన్ అబ్బాస్ (రజి)తో, “ఆయనకు ఆ మూడు దిర్హములు చెల్లించండి” అని చెప్పి అన్సారులను గురించి ఇలా వసీయ్యత్ చేశారు.

“నేను మీకు అన్సారులను గురించి వసీయ్యత్ చేస్తున్నాను. ఎందుకంటే వారు నాకు గుండెలాంటివారు. వారు తమ బాధ్యతలను నెరవేర్చారు. కాని వారి హక్కులు మాత్రం మిగిలేపోయాయి. కాబట్టి వారి సత్పురుషుల నుండి గ్రహించండి. వారి దుష్టులను వదిలేయండి.” మరో ఉల్లేఖనంలో, “ప్రజలు పెరిగిపోతూనే ఉంటారు. అన్సారులు భోజనంలో ఉప్పులా తగ్గిపోతారు. కాబట్టి మీలో ఏ వ్యక్తి అయితే లాభనష్టాలను చేకూర్చే కార్యాలకు సమర్ధుడో, అతను వారి సత్పురుషుల నుండి గ్రహించాలి. వారి దుష్టులను వదిలివేయాలి.”

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) ఇలా సెలవిచ్చారు:”అల్లాహ్ ఓ దాసునికి, ప్రపంచ ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు ఒసగడానికి లేదా అల్లాహ్ వద్ద ఉన్నది పొందడానికి అధికారం ఇచ్చాడు. అయితే ఆ దాసుడు అల్లాహ్ వద్ద ఉన్నదాన్నే కోరుకున్నాడు.”

అబూ సయీద్ ఖుద్రీ (రజి) కథనం ప్రకారం, “ఇది విన్న హజ్రత్ అబూ బక్ర్ (రజి) రోదిస్తూ, “మేము మా తల్లిదండ్రులతో సహా ఆయన (సల్లం)కు అర్పించుకున్నాం” అనగా, వినేవారికి ఆశ్చర్యం వేసింది. వారు పరస్పరం, “చూడండి ఈ ముసలివాడు! అల్లాహ్ ఓ దాసునికి ప్రపంచ భోగభాగ్యాలు, ఐశ్వర్యాలు లేదా అల్లాహ్ దగ్గర ఉన్నదాన్ని పొందవచ్చనే అధికారం ఇస్తే ఈ వృద్ధుడేమో తన తల్లిదండ్రుల్ని దైవప్రవక్తకు అర్పితం అంటున్నాడేమిటి?” అని అనుకోసాగారు. (కాని కొన్ని రోజులు గడచిన తరువాత) ఏ దాసునికి అధికారం ఇవ్వబడిందో ఆయన స్వయంగా మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) గారే అనే విషయం తెలిసిపోయింది అందరికీ. హజ్రత్ అబూ బక్ర్ (రజి) మాలో అందరికంటే వివేకి.”

ఇంకా ఇలా సెలవిచ్చారాయన:”నాకు అత్యంత ఆప్తుడు అబూ బక్ర్ (రజి). ధనం విషయంలో నేను ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాను. ఒకవేళ, అల్లాహ్ కాకుండా మరెవరినైనా ‘ఖలీల్’గా (మిత్రునిగా) చేసుకోవలసివస్తే, అబూ బక్ర్ (రజి)నే ఖలీల్ గా చేసుకొని ఉండేవాణ్ణి. కాని (ఆయనతో నాకు) ఇస్లాం సోదరభావం మరియు ప్రేమ (సంబంధం) ఉంది. మస్జిద్ లో ఏ ద్వారాన్నీ మిగిల్చి తెరచి ఉంచవద్దు. కాగా దాన్ని తప్పక మూసివేయాలి. ఒక అబూ బక్ర్ (రజి) గారి ద్వారం తప్ప.”

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.