ముహమ్మదుర్రసూలుల్లాః నిబంధనలు

ఇస్లాంలో ప్రవేశించడానికి “అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఏ విధమైన ఆరాధనకు అర్హులు కారు – మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త” అని నేను సాక్ష్యమిస్తున్నాను” అని “షహాదా” ను ప్రకటించ వలసి ఉంటుందని దాదాపుగా అందరికీ తెలుసు. కానీ “షహాదా” ను గురించి చర్చించ వలసి వచ్చినపుడు చాలా సందర్భాలలో “షహాదా” వాక్యంలోని మొదటి భాగాన్ని సవివరంగా, విస్తారంగా చర్చించడానికే ఎక్కువ భాగం ఎక్కువ సమయం కేటాయించబడతాయి. కానీ “షహాదా” యొక్క రెండవ భాగాన్ని అర్థం చేసుకోవడం, ఆ రెండవ భాగం సూచించే నిబంధనలను ఆకళింపు చేసుకోవడం, వాటిని పాటించడం, అమలుచేయడం కూడా “షహాదా” మొదటి భాగమంత ముఖ్యమని, అంతే ప్రాధాన్యంగల అంశమని గమనించాలి. నిజానికి “షహాదా” యొక్క ఈ రెండవ భాగాన్ని సరిగా ఆకళింపు చేసుకోని కారణంగా, యుక్తమైన విధంగా అమలు చేయని కారణంగా, కొన్నిసార్లు ముస్లిములు అల్లాహ్ యొక్క సూటియైన మార్గంనుంచి తప్పుకుని మార్గభ్రష్ఠులై తద్వారా ఇస్లాంనుండే వెలివేయబడే ప్రమాదం ఉంది అనేది వాస్తవం.

ఓ ఉమర్! ప్రవక్త మూసాయే ఇప్పుడుగానీ బ్రతికి ఉంటే, ఆయనకు కూడా నన్ను అనుసరించడం మినహా మరో మార్గం లేదు” అని.

1 – ఎన్నుకోబడిన ప్రవక్త

ఒక వ్యక్తి “ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త” అని సాక్ష్యమిస్తున్నాడూ అంటే, “ముహమ్మద్ , అల్లాహ్ చేత ఆయన యొక్క ప్రవక్తగా, ఆయన యొక్క సందేశాలను, ఆదేశాలను ప్రజలకు తెలియజేయడానికి ఎంచుకోబడిన ప్రవక్త” అని తన విశ్వాసాన్ని చాటుతున్నాడూ అని అర్థం. ఖుర్’ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:
وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ …………..القصص: 68

“వ రబ్బుక యఖ్ లుఖు మా యషాఉ వ యఖ్ తార్”
“నీ ప్రభువు తలుచుకున్న దానిని సృజిస్తాడు, తాను కోరిన వ్యక్తని (ప్రవక్తగా) ఎంచుకుంటాడు” అల్ ఖశశ్ – 68

అల్లాహ్ సృష్ఠికర్త, తాను ఏమి చేయాలన్నా చేయగల శక్తి కేవలం ఆయనకు మాత్రమే ఉంది. ఆయన ప్రత్యేకించి చాల నిర్దిష్టంగా ముహమ్మద్ ను తన ప్రవక్తగా ఎంచుకున్నాడు. ఖుర్’ఆన్ లో మరో వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా ప్రకటిస్తున్నాడుః

[……اللهُ أَعْلَمُ حَيْثُ يَجْعَلُ رِسَالَتَهُ ……..] الأنعام:124

“అల్లాహు అ’లము హైసు యజ్అలు రిసాలతహు”
“ప్రవక్త పదవి ఎవరికి అప్పగించాలో అల్లాహ్ కు బాగా తెలుసు” (అల్ అన్ఆమ్ 124)

ఈ రెండు వాక్యాలు ప్రవక్త ముహమ్మద్ యొక్క గుణగణాలను చెప్పకనే చెబుతున్నాయి. అల్లాహ్ మహోన్నత న్యాయనిర్ణేత, అనంతకరుణా, కృపాసాగరుడు, మహావివేచనాశీలి. ఆయన ఒక శీలరహితుడిని, మోస కారిని, అబధ్ధాలకోరును తన ప్రవక్తగా ఎప్పుడూ ఎంచుకోడు. అల్లాహ్ జ్ఞానం అనంతమైనది. తన ప్రవక్తగా నిర్వహించవలసిన ఒక అత్యంత ప్రముఖ కార్యరంగానికి-కర్తవ్యానికి; తన ఆదేశాలను, సందేశాలను ప్రజల వద్దకు తు.చ. తప్పకుండా పూర్తిగా, ఎటువంటి సంకరం చేయకుండా సక్రమంగా చేరవేయలేడు అని తెలిసిన ఒక వ్యక్తిని; మరియు “అల్లాహ్ యొక్క ప్రవక్త” అనే మహోన్నత స్థానాన్ని తన స్వప్రయోజనాలకు ఉపయోగిచుకునే వ్యక్తిని – తన అనంతమైన జ్ఞానానికి తెలిసి కూడా అల్లాహ్ ఎంచుకొనగలడని, నియమించ గలడని ఊహించగలమా? ప్రవక్త , అల్లాహ్ యొక్క ఆదేశాలను, సందేశాలను వాస్తవంలో తు.చ. తప్పకుండా ఆసాంతం, ఉన్నదున్నట్లుగా అందజేయలేదని, లేదా వాస్తవంలో వాటిని వక్రీకరించి అందజేశారని ఎవరైనా అంటున్నట్లైతే, వాస్తవానికి అతను ప్రవక్తగా ఎంపిక చేయడానికి ఎవరు ఉత్తమమైన వ్యక్తో, ఎవరు సరియైన వ్యక్తో అల్లాహ్ కు ఏమీ తెలియదని ఆరోపిస్తున్నాడని అర్థం. ఇది నిస్సందేహంగా స్పష్టమైన విశ్వాసరాహిత్యమే.

2 – సర్వకాల, సర్వావస్థ, సర్వజగత్తుకూ ఒకే ప్రవక్త

రెండవ విషయం – ఒకవ్యక్తి “షహాదా” ను ప్రకటిస్తున్నాడూ అంటే అతను “ముహమ్మద్ అల్లాహ్ చేత సర్వ మానవాళికీ తీర్పుదినం వరకూ ప్రవక్తగా పంపబడినారు” అని సాక్ష్యం ఇస్తున్నాడు అని అర్ధం. ఖుర్’ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడుః

[قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللهِ إِلَيْكُمْ جَمِيعًا……….] الأعراف:158

“ఖుల్ యా అయ్యుహన్నాసు ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుమ్ జమీఆ” (అల్ ఆరాఫ్ 158)
“ముహమ్మద్ ! చెప్పుః ప్రజలారా! నేను మీ అందరి కోసం వచ్చిన దైవప్రవక్తను” (అల్ ఆరాఫ్ 158)

అంతేగాక ప్రవక్త ఇలా అన్నారుః“ఉ’తీతు ఖమ్సన్ లమ్ యు’తహున్న అహదుమ్మినల్ అంబియాఇ ఖబ్ లీ …. వకానన్నబియ్యు యుబ్అసు ఇలా ఖౌమిహి ఖాస్సతన్ వ బుఇస్ తు ఇలన్నాసి కాఫ్ఫతన్” (బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథం).

“నాకు (అల్లాహ్ చేత) నాకంటే ముందు వచ్చిన ఏ ప్రవక్తకూ ఇవ్వబడని ఐదు ప్రత్యేకతలు ఇవ్వబడ్డాయి….. (వాటిలో ఒకటి) ఇంతకు పూర్వం వచ్చిన ప్రతి ప్రవక్త కేవలం తన జాతి ప్రజలకు మాత్రమే ప్రవక్తగా పంపబడితే, (అల్లాహ్ చేత) నేను సర్వ మానవాళికీ ప్రవక్తగా పంపబడ్డాను” (బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథం).

కనుక ప్రవక్త కాలం నుంచి చివరికి తీర్పుదినం వరకు జన్మించే ప్రతి ఒక్కరూ ప్రవక్త ను విశ్వసించి, ఆయనను అనుసరించడం ఒక విధిగా (Obligation) చేయబడింది. ఒక వ్యక్తికి ఇస్లాం యొక్క సందేశం విస్పష్టంగా చేరిన తర్వాత కూడా అతను ప్రవక్త ను విశ్వసించడానికి, ఆయనను అనుసరించడానికి తిరస్కరించినట్లైతే అతడు అవిశ్వాసిగా పరిగణింప బడతాడు. ఇందుకు అతడు పశ్చాత్తాపపడి ఇస్లాంను స్వీకరించక పోయినట్లైతే అతను శాశ్వతంగా నరకాగ్నిలో వేయబడతాడు.

ప్రవక్త యొక్క ఉపదేశాలు, ఆదేశాలు మరియు ఆయన (జీవన) విధానం, ఆయన అనుసరించిన మార్గం ప్రామాణికమైనవని, తీర్పుదినం వరకు వచ్చే మానవాళి అంతా విధిగా అనుసరించ వలసినవని, పైన తెలిపిన వివరాలు సూచిస్తున్నాయి. ఆయన తన జీవనవిధానం ద్వారా స్థిరీకరించి, వ్యవస్థీకరించి స్థాపించిన ఉదాహరణ, ఆయన జీవించి ఉన్న కాలంలో ఆయన చుట్టూ ఉన్న అరేబియావాసుల కోసం మాత్రమే కాదని, ప్రపంచంలో ఎక్కడున్నా, ఈనాటి ప్రతి ముస్లింకు కూడా అంతే ముఖ్యమని గమనించాలి.

ప్రవక్త యొక్క ఉదాహరణను అన్ని విషయాలలోనూ అనుసరించాలి అనే ఆలోచనను నిరోధిస్తున్నట్లు, ప్రతిరోదిస్తున్నట్లు (జీర్ణించుకోలేక పోతున్నట్లు) కొద్దిమందిని గమనిస్తే అనిపిస్తుంది. ఇదేగానీ నిజమైతే, తాము ప్రకటించిన “షహాదా” కు తామే వ్యతిరేకంగా పోతున్నామని, తామే వ్యతిరేకిస్తున్నామని వారు గ్రహించాలి. ఖుర్’ఆన్ మరియు ప్రవక్త యొక్క జీవన విధానం (సున్నత్), ఈ రెంటి సమ్మేళనం అయిన ఆయన సందేశం, ఈ రోజు జీవించి ఉన్న వారితో సహా సర్వ మానవాళికోసం అని తాము సాక్ష్యమిచ్చిన విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకోవాలి.

3 – పరిపూర్ణ బోధన

మూడవ విషయం – ఒకవ్యక్తి “షహాదా” ను ప్రకటిస్తున్నాడూ అంటే అతను “ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశాలను, ఆదేశాలను తు.చ. తప్పకుండా అందజేశారని, సంపూర్ణంగా అందజేశారని, ఏ విధమైన దాపరికం గానీ, వాటిలో ఏ విధమైన మార్పులు చేర్పులు గానీ లేకుండా, పరిపూర్ణంగా అందజేశారని సాక్ష్యం ఇస్తున్నాడు అని అర్ధం. ఖుర్’అన్ లో అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడుః

[………وَمَا عَلَى الرَّسُولِ إِلَّا البَلَاغُ المُبِينُ(54) ]. {النور}.

“వమా అలర్రసూలి ఇల్లల్ బలాగుల్ ముబీన్”(అల్ నూర్–54)
“ప్రవక్త యొక్క బాధ్యత (అల్లాహ్ యొక్క) సందేశాన్ని స్పష్టంగా అందజేయడమే” (అల్ నూర్ – 54)
ఒక హదీసు లో ప్రవక్త ఇలా అన్నారుః“ఖద్ తరక్తుకుమ్ అలల్ బైదాఇ లైలుహా కనహారిహా లా యజీగు బ’దీ ఇల్లా హాలికున్”(ఇబ్నె మాజా హదీథ్ గ్రంథం)

“మిమ్మల్ని, పగలూ, రాత్రి కూడా ఒకేలా ప్రకాశవంతంగా ఉండే ఒక రహదారి పై వదిలాను. నేను వెళ్ళిన తర్వాత (ఆ రహదారి నుంచి) ఎవరూ కూడా మార్గభ్రష్ఠులు కాలేరు – కేవలం తమను తాము భ్రష్ఠుపట్టించుకునే వారు తప్ప.” (ఇబ్నె మాజా హదీథ్ గ్రంథం).

ప్రవక్త అల్లాహ్ నుంచి తనపై అవతరించిన మార్గనిర్దేశక సందేశాలు, ఆదేశాలనన్నిటినీ ఆసాంతంగా అందించారు. అందించడమే కాకుండా చాలా స్పష్టంగా వాటిని వివరించారు కూడా. కనుక ఒక వ్యక్తి “షహాదా” ను ప్రకటిస్తున్నాడూ అంటే, అతను “ప్రవక్త ఇస్లాం ధర్మానికి సంబంధించిన ప్రతి చిన్న వివరం నుంచి మొదలుకుని, ప్రతి దృక్పథాన్నీ, ఇస్లాం యొక్క మూలాధారాలనుంచి మొదలుకుని, చిట్టచివరి సంకేతం వరకూ ప్రతి విషయాన్నీ అందజేశారని” ప్రకటిస్తున్నాడూ అని అర్థం. “ఈ విషయాన్ని గురించి ప్రవక్త గానీ, అల్లాహ్ గానీ మర్చిపోయే అవకాశం ఉంది” అనే అనుమానానికి ఇసుమంతైనా ఆస్కారం లేకుండా, ఇస్లాం ధర్మానికి సంబంధించి మానవాళి మనుగడకు అవసరమయ్యే ప్రతి చిన్న మార్గనిర్దేశకం నిస్సందేహంగా మానవాళికి అందజేయబడింది.

కనుక ఇంత ప్రస్ఫుటమైన, ఇంత కాంతివంతమైన, ఇంత స్పష్టమైన, ఇంత సుబోధమైన మార్గనిర్దేశనం ప్రవక్త నుంచి అందజేయబడిన తర్వాత, ఒక ముస్లింకు వేరే ఏ యితర మార్గనిర్దేశకం వైపుకూ దృష్టి మళ్ళించాల్సిన అవసరం లేదు; యూదుల లేదా క్రైస్తవుల గ్రంథాల వైపుకు మరలవలసిన అవసరం లేదు. వాస్తవానికి ఉమర్ రదిఅల్లాహు అన్ హు ఒకసారి తౌరాత్ గ్రంథాన్ని చదువుతూ ఉండడం చూసి, కోపంతో ముఖం ఎర్రగా కందిపోగా ప్రవక్త ఇలా అన్నారు “ఓ ఉమర్! ప్రవక్త మూసాయే ఇప్పుడుగానీ బ్రతికి ఉంటే, ఆయనకు కూడా నన్ను అనుసరించడం మినహా మరో మార్గం లేదు” అని. నిజానికి ఒక ముస్లింకు మార్గనిర్దేశం కోసం వేరే ఏ యితర ధార్మిక, ఆధ్యాత్మిక బోధనలవైపుకూ మరల వలసిన అవసరం లేదు. అతనికి కావలసిన ఈ సమాచారమంతా ఖుర్’ఆన్ మరియు ప్రవక్త యొక్క సున్నత్ లలో అతను పొందగలడు. నిజానికి ఇదంతా కూడా “షహాదా” స్పష్టపరిచే అర్థంలోని భాగమే.

ఒక ముస్లిం “ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త” అని (సాక్ష్యపు వాక్యాన్ని) ప్రకటించాడు అంటే, అతను ముహమ్మద్ అల్లాహ్ చేత పంపబడిన చిట్టచివరి ప్రవక్త అని కూడా ప్రకటిస్తున్నాడు అన్నమాట. ఖుర్’ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడుః

[مَا كَانَ مُحَمَّدٌ أَبَا أَحَدٍ مِنْ رِجَالِكُمْ وَلَكِنْ رَسُولَ اللهِ وَخَاتَمَ النَّبِيِّينَ …] {الأحزاب40 }

“మాకాన ముహమ్మదున్ అబా అహదిమ్మిర్రిజాలికుమ్ వలాకిన్ రసూలల్లాహి వ ఖాతమన్నబియ్యీన్”
“(ప్రజలారా) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవరికీ తండ్రి కాడు. ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు. దౌత్యపరంపరను అంతమొందించిన అంతిమ దైవప్రవక్త” (సూరా అల్ అహ్ జాబ్ 40).

ముహమ్మద్ తర్వాత ఇంక ఏ ప్రవక్త కూడా రాబోవడం లేదు. ఇంక ఏ క్రొత్త ప్రవక్త కూడా రాడు; ముహమ్మద్ అందజేసిన సందేశాన్ని రద్దుచేసే ఏ క్రొత్త శాసనం కూడా రాదు. అంతే కాకుండా ముహమ్మద్ కాలం తర్వాత ఎవరైనా తనను తాను అల్లాహ్ యొక్క ప్రవక్తగా ప్రకటించుకున్నట్లైతే, అతను అబధ్ధాలకోరు అని, మోసగాడు అని చెప్పనవసరం లేకుండానే తెలిసి పోతుంది. అటువంటి వ్యక్తిని అడ్డుకోవాలి. ప్రజలందరికీ అతని మోసాన్ని తెలియజేయాలి. ముహమ్మద్ తర్వాత అటువంటి వ్యక్తిని అల్లాహ్ యొక్క ప్రవక్తగా అంగీకరించడం అంటే ప్రకటించిన “షహాదా” ను భంగపరిచినట్లే.

4 – షహాదా యొక్క విధులు

ఒక వ్యక్తి “షహాదా” ను ప్రకటించడం అంటే “షహాదా” సూచించే విషయాలను విశ్వసించడం మాత్రమే కాకుండా, అందునుంచి ఉత్పన్నమయ్యే కొన్ని బాధ్యతలను కూడా స్వీకరిస్తున్నాడని అర్థం. ఉదాహరణకు, “అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఏ విధమైన ఆరాధనకు అర్హులు కారు” అని ప్రకటిస్తున్నాడు అంటే, అతను కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించే బాధ్యతను స్వీకరిస్తున్నాడు అని అర్థం. అదే విధంగా “ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త” అని ప్రకటిస్తున్నాడు అంటే, ముహమ్మద్ కు సంబంధించిన కొన్ని బాధ్యతలను స్వీకరిస్తున్నాడు అని అర్థం. ఈ కర్తవ్యాలను స్వీకరించి వాటిని అమలు చేయడంలో ఏ విషయంలోనైనా కొరత వహిస్తే, తాను ప్రకటించి స్వీకరించిన “షహాదా” ను సమగ్రంగా అమలు చేయడంలో కొరత వహించినట్లే. ఈ స్థితి ఎంతవరకూ, ఏ స్థాయి వరకూ వెళ్తుంది అంటే, అతను “షహాదా” కు సంబంధించిన బాధ్యతల, కర్తవ్యాల నిర్వహణను ఖండించే స్థాయికి తద్వారా ప్రవక్త కు సంబంధించిన బాధ్యతల నిర్వహణను నిరారించే స్థాయి వరకూ వెళ్తుంది.

ప్రేమ“షహాదా” ప్రకటించి న వ్యక్తి పై ముహమ్మద్ కు సంబంధించి ఉండే విధులలో ఒకటి ఆయన పై ప్రేమ కలిగి ఉండడం. ఇలా అనడంలో ఫలానా రకమైన ప్రేమ అనే సూచన ఏమీ లేదు. కానీ సంపూర్ణమైన, సమగ్రమైన విశ్వాసం (ఈమాన్) కలిగి ఉండే ఒక ముస్లిం కు, ప్రవక్త పై మిగతా అందరి మీద ఉండే ప్రేమ కన్నా, మిగతా ఏ విషయం, లేదా ఏ వస్తువు లేక ఏ ప్రాణి పై ఉండే ప్రేమ కన్నా అత్యంత అధికమైన ప్రేమ ఉండాలి. ఖుర్’ఆన్ లో అల్లాహ్ ఇలా అంటున్నాడుః
]قُلْ إِنْ كَانَ آَبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ وَإِخْوَانُكُمْ وَأَزْوَاجُكُمْ وَعَشِيرَتُكُمْ وَأَمْوَالٌ اقْتَرَفْتُمُوهَا وَتِجَارَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَمَسَاكِنُ تَرْضَوْنَهَا أَحَبَّ إِلَيْكُمْ مِنَ اللهِ وَرَسُولِهِ وَجِهَادٍ فِي سَبِيلِهِ فَتَرَبَّصُوا حَتَّى يَأْتِيَ اللهُ بِأَمْرِهِ وَاللهُ لَا يَهْدِي القَوْمَ الفَاسِقِينَ]التوبة 24

“ఖుల్ ఇన్ కాన ఆబాఉకుం, వ అబ్నాఉకుం, వ ఇఖ్వానుకుం, వ అజ్వాజుకుం, వ అషీరతుకుం, వ అమ్వాలున్ ఉఖ్ తరఫ్ తుహా, వ తిజారతున్ తఖ్ షౌన కసాదహా, వ మసాకిను తర్దౌనహా అహబ్బ ఇలైకుమ్మినల్లాహి వ రసూలిహి, వజిహాదిన్ ఫీ సబీలిహి, ఫతరబ్బసూ హత్తా య’తియల్లాహు బి అమ్రిహి. వల్లాహు లా యహ్ దీ ఖౌమల్ ఫాసిఖీన్” (సూరా అల్ తౌబా 24).

“ప్రవక్తా! వారికిలా చెప్పుః “మీ తండ్రులు, మీ కొడుకులు, సోదరులు, భార్యలు, బంధుమిత్రులే గాక మీరు కూడబెట్టుకున్న ఆస్తులు, (సత్యాన్ని విశ్వసిస్తే – “షహాదా” ను ప్రకటించి ఇస్లాంను స్వీకరిస్తే) మందగించి పోతాయేమోనని మీరు భయపడుతున్న మీ వ్యాపారాలు, మీకు ప్రీతికరమైన మీ ఇండ్లు – ఇవన్నీ మీకు అల్లాహ్ కంటే, ఆయన ప్రవక్త కంటే, ఆయన జరిపే పోరాటం కంటే ఎక్కువ ప్రియమైనవైతే – మీ విషయంలో అల్లాహ్ యొక్క నిర్ణయం వచ్చేవరకు ఎదురు చూడండి. (అలాంటి) దుర్జనులకు అల్లాహ్ ఎన్నటికీ సన్మార్గావలంబన బుధ్ధి ప్రసాదించడు.” (అల్-తౌబా – ఆయత్ 24).

5 – ఒక ఆదర్శ నమూనాః

రెండవ విషయం: ఒక వ్యక్తి “షహాదా” ను ప్రకటించడం అంటే, జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భంలోనూ సరియైన మార్గంలో, అల్లాహ్ కు ప్రీతికరమైన విధంగా మసలుకుంటూ జీవితాన్ని గడపడం కోసం ప్రవక్త ను ఒక ఆదర్శమూర్తిగా, (ఆయన జీవితాన్ని) ఒక ఆదర్శ నమూనాగా స్వీకరిస్తున్నానని ప్రకటించడం అన్నమాట. ఖుర్’ఆన్ లో అల్లాహ్ ఇలా అంటున్నాడుః

[لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللهِ أُسْوَةٌ حَسَنَةٌ لِمَنْ كَانَ يَرْجُو اللهَ وَاليَوْمَ الآَخِرَ وَذَكَرَ اللهَ كَثِيرًا(21) ]. {الأحزاب}.
“లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన, లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమల్ ఆఖిర వ జకరల్లాహ కసీర” (సూరా అల్ అహ్ జాబ్ 21).

“(విశ్వాసులారా!) దైవప్రవక్త (జీవనసరళి) లో మీకు మంచి ఆదర్శం ఉంది. అల్లాహ్ ను అంతిమ దినాన్ని నమ్మి, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే వారికి ఈ ఆదర్శం ఎంతగానో ఉపయోగ పడుతుంది”
ఖుర్’ఆన్ లో మరో చోట అల్లాహ్ ఇలా అంటున్నాడుః

[قُلْ إِنْ كُنْتُمْ تُحِبُّونَ اللهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ (31)] {آل عمران}

“ఖుల్ ఇన్ కున్తుమ్ తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊనీ యుహ్ బిబ్ కుముల్లాహు వ యగ్ ఫిర్లకుం జునూబకుమ్”
“(ఓ ప్రవక్తా) వారికిలా చెప్పు! “మీరు నిజంగా అల్లాహ్ ను అభిమానిస్తుంటే నన్ను అనుసరించండి. అల్లాహ్ మిమ్మల్ని అభిమానిస్తాడు. మీ పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్ ఎంతో క్షమించే వాడు, కరుణించే వాడు” (సూరా ఆలి ఇమ్రాన్ 31)

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొంతమంది “అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఏ విధమైన ఆరాధనకు అర్హులు కారు మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త” అని “షహాదా” ను ప్రకటించి (సాక్ష్యమిచ్చి) కూడా, ప్రవక్త ను, ఒక విశ్వాసి జీవితానికి సంబంధించి అనుసరిచ వలసిన ఆదర్శ నమూనాగా భావించరు. వారు ప్రవక్త ను ఆదర్శ నమూనాగా భావించక పోవడమే కాకుండా, ఆయనను ఆదర్శ నమూనాగా భావించి, ప్రతి విషయంలోనూ ఆయన యొక్క మార్గనిర్దేశనాన్ని అనుసరించే వారిని చూసి అడ్డుతగులుతూ ఉంటారు. ఇది వారు ప్రకటించిన “షహాదా” పట్ల, అది సూచించే విషయాలు, విధుల పట్ల అతి స్పష్టంగా కనిపించే వారి అవగాహనా రాహిత్యమే తప్ప మరేమీ కాదు.
ప్రవక్త ఈ విధంగా అన్నారుః“అమా వల్లాహి ఇన్నీ ల అఖ్ షాకుం లిల్లాహి వ అత్ ఖాకుం లహు లకిన్నీ అసూము వ ఉఫ్ తిరు వ ఉసల్లీ వ అర్ ఖుదు వ అతజవ్వజున్నిసాఅ ఫమన్ రగిబ అన్ సున్నతీ ఫలైస మిన్నీ” (బుఖారి హదీథ్ గ్రంథం)

“అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను – నేను మీ అందరికంటే ఎక్కువగా అల్లాహ్ కు భయపడతాను, మీ అందరికంటే ఎక్కువగా దైవచింతన కలవాడిని నేను. ఐనా, (నా జీవితంలో భాగంగా – నా సున్నత్ లో భాగంగా) నేను ఉపవాసాలు ఆచరిస్తాను, కొన్నిసార్లు ఆచరించను కూడా, రాత్రి సమయాలు దైవారాధనలో గడుపుతాను, నిద్ర కూడా పోతాను, నేను స్త్రీలను వివాహమాడాను కూడా. ఎవరైతే నా సున్నత్ నుంచి దూరమైపోతారో, వారు నానుంచి దూరమైనట్లే (అంటే అతను నా యొక్క నిజమైన అనుచరుడు కాడు).” (బుఖారి హదీథ్ గ్రంథం)

ఈ హదీసు లో ప్రవక్త అల్లాహ్ పట్ల ఎంత భయభీతులు మరియు భక్తి కలవారో మరియు ఎంతగా దైవచింతన కలవారో తెలియజేయ బడింది. కనుక ఎవరికైనా ప్రవక్త జీవన విధానాన్ని ఆదర్శ నమూనాగా ఎంచుకోకపోవడానికి ఎటువంటి కారణమూ కానరాదు. ఈ హదీసు మరో విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. అదేమిటంటే ఎవరైతే ప్రవక్త సున్నత్ నుంచి దూరంగా తొలిగి పోతారో వారు ఆయన నుంచి దూరంగా తొలిగి పోయినట్లే అని. “షహాదా” ప్రకటన యొక్క రెండవ భాగమైన “నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త ” అని ప్రవక్త లో సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించి, ఆయనను అల్లాహ్ యొక్క ప్రవక్త గా స్వీకరించి, అదే సమయంలో ప్రవక్త జీవన విధానాన్ని ఆదర్శ నమూనాగా ఎంచుకోవడానికి నిరాకరించే వ్యక్తి – తాను నిజంగానే ప్రవక్త లో సంపూర్ణ విశ్వాసాన్నికలిగి ఉన్నానని, ఆయనను అల్లాహ్ యొక్క ప్రవక్త గా స్వీకరించినానని నిజాయితీగా చాటలేడు.

“షహాదా”ను ఉల్లంఘించే వ్యక్తికి సంబంధించిన ఆజ్ఞః- ఎవరైనా బుధ్దిపూర్వకంగా, ఉద్దేశ్యపూర్వకంగా “షహాదా” ను ఉల్లంఘించినట్లైతే అతను అవిశ్వాసిగా మారుతాడు. ఈ విషయంపై ఇస్లామీయ విద్వాంసులందరి (ఉలమా) ఏకాభిప్రాయం ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి అల్లాహ్ ను ఆరాధించడంతో పాటు, ఇంకెవరినైనా లేక దేనినైనా (ప్రవక్తలను, పుణ్యపురుషులను, దర్గాలను, బాబాలను, విగ్రహాలను, చిత్రపటాలను, పాములను, పుట్టలను, చెట్లను, భూమ్యాకాశఆలను, సూర్యచంద్రులను, నక్షత్రాలను) పూజించినా లేక వాటికి సహాయపడే శక్తి ఉన్నట్లు నమ్మినా అతను అవిశ్వాసి అవుతాడు. అదే విధంగా ఎవరైనా ప్రవక్త ను దూషించినా లేక ఆయనను ఒక అబధ్ధాలకోరు గా చిత్రించినా – అతను “షహాదా” యొక్క రెండవ భాగాన్ని ఉల్లంఘించిన వాడవుతాడు. ఆ కారణంగా అతను ఇస్లాం పరిధినుంచి బహిష్కరించబడిన వాడై నరక శిక్షకు అర్హుడవుతాడు.
అల్లాహ్ మనల్నందరినీ అటువంటి ప్రమాదం నుంచి కాపాడుగాక (ఆమీన్)

Related Post