New Muslims APP

ముహర్రమ్ అల్లాహ్ మాసం సందేహాలు – సమాధానాలు

ముహర్రమ్ అల్లాహ్ మాసం సందేహాలు – సమాధానాలు –  సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్‌ కొన్ని కాలాలను మరికొన్ని కాలాలపై, కొన్ని ప్రదేశాలను మరికొన్ని ప్రదేశాలపై ప్రాధాన్యతనిచ్చాడు. శుక్ర, సోమ, గురు వారాలు వారాంతరంలో ఉంటే, చంద్రమానపు 13,14, 15 తేదీలు – అయ్యామె బీజ్‌ నెలల్లో ఉంటే, నాలుగు గౌరప్రదమయిన మాసాలు యేడాదిలో ఉంటే, రమజాను మాసం, జుల్‌ హిజ్జా మాసపు తొలి 10 రోజులు, ముహహ్రమ్‌ మాసపు ఆషూరా దినం, షాబాన్‌ మాసం లాంటి వాటిని ప్రత్యేకమయిన రుతువులుగా చెప్పుకో వచ్చు. అలాగే స్థల పరంగా తీసుకుంటే, మస్జిద్‌లు, మక్కా, మదీనా, బైతుల్‌ మఖ్‌దిస్‌, మస్దిదె హారమ్‌, కాబహ్‌, మస్జిదె నబవీ, మస్జిదె అఖ్సా మొదలయినవి ఉన్నాయి. ఈ క్రమంలో ఇస్లామీయ క్యాలెండర్‌లో తొలి మాసంతో ముడి పడి ఉన్న కొన్ని విషయాలను ప్రశ్నోత్తరాల రూపంలో పాఠక మహోదయులకు అందజేయడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం! మా ఈ కృషిని అల్లాహ్‌ స్వీకరించి ఆమోద ముద్ర వేయాలని కోరుకుంటున్నాము.

హజ్రత్‌ అబూ జర్‌ గిఫారీ (ర) గారి కథనం- నేను ప్రవక్త (స) వారిని అడిగాను: ‘రాత్రిలో ఏ ఘడియ గొప్పది? లేదా మాసాలలో ఏ మాసం గొప్పది’ అని. దానికి ప్రవక్త (స) ఇలా సమాధామిచ్చారు: ”రాత్రి నడి రేయి సమయం గొప్పది. మాసాల్లో అల్లాహ్‌ మాసం, దేన్నయితే మీరు ముహర్రమ్‌ అని పిలుస్తారో అది గొప్పది”. (ముస్నద్ అహ్మద్)

ప్రశ్న: అల్లాహ్‌ గ్రంథంలో నెలల సంఖ్య ఎంత? వాటి పేర్లు ఏమిటి?

జవాబు: ”నిశ్చయంగా నెలల సంక్య అల్లాహ్‌ దగ్గర – అల్లాహ్‌ గ్రంథంలో పన్నెండు మాత్రమే.ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచీ (ఈ లెక్క ఇలానే సాగుతున్నది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమయినవి (గౌరవప్రదమయినవి). ఇదే సరయిన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి”. (తౌబహ్‌: 36)
పై ఆయతులో యేడాదికి 12 నెలలు అని వాటిలో నాలుగు గౌరవ ప్రదమయిన మాసాలని, వాటిలో దౌర్జన్యానికి పాల్పడ రాదని, ఇదే సరయిన ధర్మం అని చెప్పండం జరిగింది. ఆ రకంగా ప్రపంచ వ్యాప్తంగా సూర్య మానాన్ని అనుసరించి, చంద్ర మానాన్ని అనుసరించి చేసుకోబడిన క్యాలెండర్లలో నెలల సంక్య 12గానే ఉంది. కొన్ని ప్రాంతాల్లో తప్ప. ఉదాహరణకు ఇథియోఫియాలో నెలల సంక్య 13. నెలకి 30 రోజులు, మిగిలిన 5 లేదా 6 రోజుల్ని వారు మత పరమయిన విశ్వాసంతో ముడి పెట్టి ఒక నెలగా ఖరారు చేసి, ఆ నెలను బాగ్మీ అని పిలుస్తుంటారు.

ఇస్లామీయ క్యాలెండర్‌లోని నెలల పేర్లు ఇలా ఉన్నాయి. ముహర్రమ్, సఫర్‌, రబీవుల్‌ అవ్వల్‌, రబూవుస్సానీ, జుమాదివుల్‌ ఊలా, జుమాదివుల్‌ ఆఖర్‌, రజబ్‌, షాబాన్‌, రమజాన్‌, షవ్వాల్‌, జుల్‌ ఖఅదహ్‌, జుల్‌ హిజ్జహ్.

ప్రశ్న: నిషిద్ధ మాసాలుగా ఫేర్కునబడిన వాటి పేర్లు ఏమిటి?
జవాబు: ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”కాలం తిరిగి భూమ్యాకాశాలను పుట్టించిన నాటి స్థితికి వచ్చేసింది. యేడాదికి 12 నెలల. వాటిలో నాలుగు నిషిద్ధ మాసాలు. మూడు ఒకదాని తర్వాత మరోకటిగా వస్తాయి – జుల్‌ ఖఅదహ్‌, జుల్‌ హిజ్జహ్.ముహర్రమ్. రజబ్‌ ముజర్‌ అనే మాసం జుమాదివుల్‌ ఆఖర్‌ మరియు షాబాన్‌ నెలకి మధ్యన వస్తుంది”. (బుఖారీ)

ప్రశ్న: ‘వాటిలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి’ అంటే అర్థం?
జవాబు: ఇమామ్‌ ఖుర్తుబీ (రహ్మ) ఇలా అన్నారు: అల్లాహ్‌ పవిత్ర మాసాలను తన స్మరణ-జిక్ర్‌ కోసం ప్రత్యేకించాడు. దౌర్జన్యం, దుర్మార్గం, పాప కార్యాల నుండి వారించాడు. ఇవి అన్ని వేళలా పాటించాల్సిన ఆదేశాలే అయినా, ఈ నాలుగు మాసాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి.
అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) గారు – ‘వాటిలో’ అంటే 12 మాసాలలో అని అభిప్రాయ పడ్డారు.

ప్రశ్న; ఈ నాలుగు మాసాలలో యుద్ధ అనుమతి ఉందా?
జవాబు: ఈ విషయంలో పండితుల మధ్య భేదాభిప్రాయలున్నాయి. ఒక వర్గ అభిప్రాయం – ఇది రద్దు చేయబడింది అన్నది. దానికి వారు చూపే ఆధారం-ఇదే ఆయతులో అవిశ్వాసులతో పోరాడాల్సిం దిగా అల్లాహ్‌ ఆదేశం ఉండటం. అలాగే ప్రవక్త (స) వారు సయితం నిషిద్ధ మాసమయిన జుల్‌ ఖఅదాలో తాయిఫ్‌ వారిని నిర్భందించారు అన్నది.
మరో వర్గ అభిప్రాయం – అది రద్దు చేయబడ లేదు. వారు చూపే ఆధారం – ”విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌ చిహ్నాలనుగానీ, ఏ నిషిద్ధ మాసాన్నిగానీ అగౌరవ పర్చకండి”. (అల్‌ మాయిదహ్‌: 2)
”నిషిద్ధ మాసాలలో యుద్దం చెయ్యడం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికి చెప్పు: ఈ మాసాలలో యుద్ధం చేయడం మహాపరాధం”. (అల్‌ బఖరహ్‌: 217)
ఈ రెండు అభిప్రాయాలను నిశితంగా పరిశీలించిన మీదట – ”ఒకవేళ అవిశ్వాసుల తరఫు నుంచి యుద్ధం రగిలించ బడి ఉంటే, అలాంటి విపత్కర పరిస్థితిలో విశ్వాసులకు ఆత్మ రక్షణార్థం యుద్ధ అనుమతి ఇవ్వబడింది” అన్నది పండితులు తేల్చి చెప్పిన మాట.

ప్రశ్న: ఈ నాలుగు మాసాలలో ముహర్రమ్‌ మాసానికి గల ప్రత్యేకత ఏమిటి?
జవాబు: ఇబ్ను రజబ్‌ (రహ్మ) ఇలా అన్నారు: ”నిషిద్ధ మాసాలలో ఏ మాసం గొప్పది అనే విషయంలో పండితుల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. హసన్‌ బశ్రీ (రహ్మ) ఇలా అన్నారు: ”అల్లాహ్‌ యేడాదిని పవిత్ర మాసంతో ప్రారంభించాడు. పవిత్ర మాసంతో ముగించాడు. యేడాదిలో రమజాను మాసాన్ని మినహాయించి ముహర్రమ్‌ మాసానికన్నా ఘనతరమయిన మాసం మరొకటి లేదు. ప్రవక్త (స) దీన్ని అల్లాహ్‌ మాసంగా పేర్కొనేవారు”.
హజ్రత్‌ అబూ జర్‌ గిఫారీ (ర) గారి కథనం- నేను ప్రవక్త (స) వారిని అడిగాను: ‘రాత్రిలో ఏ ఘడియ గొప్పది? లేదా మాసాలలో ఏ మాసం గొప్పది’ అని. దానికి ప్రవక్త (స) ఇలా సమాధామిచ్చారు: ”రాత్రి నడి రేయి సమయం గొప్పది. మాసాల్లో అల్లాహ్‌ మాసం, దేన్నయితే మీరు ముహర్రమ్‌ అని పిలుస్తారో అది గొప్పది”. (ముస్నద్ అహ్మద్)

ప్రశ్న: ముహర్రమ్‌ మాసంలో ఉపవాస ఘనతను గురించి తెలియ జేయండి?
జవాబు: ఒకరి ప్రశ్నకు సమాధానంగా ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ఉపవాసాలలో రమజాను తర్వాత ఘనతరమయిన ఉపవాసం ముహర్రమ్‌ ఉపవాసం. నమాజులలో ఫర్జ్‌ నమాజు తర్వాత రాత్రి – తహజ్జుద్‌ నమాజు”. (ముస్లిం)
ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (రహ్మ) ఇలా అన్నారు: ”నఫీల్‌ ఉపవాసాల రీత్యా ముహర్రమ్‌ పూర్తి మాసం ఘనతరమయినది. దినాల విషయంలో దాని కాన్న గొప్ప దినాలు ఉన్నాయి – ఉదాహరణకు, అరఫా దినం, జుల్‌ హిజ్జా మసానికి చెందిన తొలి పది రోజులు”. అంటే ముహర్రమ్‌ మాసంలో అత్యధికంగా ఉపవాసాలుండేందుకు ప్రయత్నించాలి.

ప్రశ్న: ఇస్లామీయ హిజ్రీ క్యాలెండర్‌కి పునాది ఎలా పడింది?
జవాబు: అది హి.శ.17 – ద్వితీయ ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ (ర) గారి పరిపాలనా కాలం. ఆయన యమన్‌ దేశానికి గవర్నర్‌గా హజ్రత్‌ అబూ మూసా అష్ అరీ (ర) గారిని నియమించారు. అవసరాన్ని బట్టి ఉత్తరాల ద్వారా సలహా సంప్రదింపులు జరిగేవి. అలా వచ్చే ఉత్తరాల్లో తేది ఉండేది కాదు. ఈ ఉత్తరం ఎప్పటిది? అన్న స్పష్టత ఉండేది కాదు. ఇదే విషయాన్ని ఆయన హజ్రత్‌ ఉమర్‌ (ర) గారితో చర్చించగా, ఆయన అప్పుడున్న సహాబాను సంప్రదించి ఇస్లామీయ హిజ్రీ క్యాలెండర్‌ను రూపు ఇవ్వడం జరిగింది. అలా రూపు ఇవ్వబడిన ఆ క్యాలెడర్‌ – హిజ్రత్‌ మహా ఘట్ట ఆధారంగా ఉన్నా అందులో తొలి మాసంగా ముహర్రమ్‌ మాసాన్నే పెట్టడం జరిగింది. కారణం – ప్రవక్త (స) మక్కా నుండి మదీనాకు జుల్‌ హిజ్జా మాసపు చివర్లో హిజ్రత్‌ చేశారు, ఆయన మదీనా హిజ్రత్‌ చేసి వేళ్లాక చూసిన తొలి నెలవంక ముహర్రమ్‌ మాసానిదే గనక.

ప్రశ్న: ఇస్లామీయ హిజ్రీ క్యాలెండర్‌కి అన్య క్యాలెండర్లకి మధ్య గల వ్యత్యాసం ఏమిటి?
జవాబు: ఇతర క్యాలెండర్లు వ్యక్తుల జనన, మరణాలతో, జయాపజాలతో ప్రారంభమవుతాయి. ఇస్లామీయ క్యాలెండర్‌ హిజ్రత్‌ మహా ఘట్టంతో ప్రారంభమవుతుంది. అలాగే హిజ్రీ క్యాలెండర్‌ చంద్ర మానాన్ని అనుసరించి ఉంటుంది.

ప్రశ్న: హిజ్రత్‌ మనకిచ్చే సందేశం ఏమిటి?
జవాబు: మనిషి సత్య ధర్మమయిన ఇస్లాంను స్వీకరించి దాని ఉన్నతి కోసం పాటు పడుతున్న తరుణంలో అతనిపై కష్టాల కడగండ్లు వచ్చి పడతాయి. ఊరి జనం అతన్ని వ్యతిరేకిస్తారు. దగ్గర బంధువులు సయితం ద్రోహానికి పాల్పడతారు. సంఘం అతన్ని బహిష్కరించాలని చూస్తుంది. అతని చంపితేగానీ సమమస్య ఒక కొలిక్కి రాదు అన్న కుట్ర పూరిత ప్రచారం జరుగుతుంది. ఒక్క మాటలో చెఆప్పలంటే, సామ, దాన, భేద, దండోపాయాలనే అస్త్రాలు ప్రయోగించి అతన్ని లొంగదీసుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి విపత్కర పరిస్థితిలో అతనేం చెయ్యాలి? అసత్యం, అధర్మంతో రాజీ పడాలా? సత్యోపదేశాన్ని ఆపేయాలా? తన విశ్వాసంలో సర్దుబాటుకి సిద్ధమయి పోవాలా? ప్రాపంచిక ప్రయోజనం, ప్రాణం నిలుపుకోవడం కోసం అసభ్య సమాజంతో అడ్జస్ట్‌ అవ్వాలా? అవిశ్వాసుల మత పరమయిన పండుగల్లో పాల్గొని నేను మీలోని ఒకడిని అని చాటుకోవాలా? అంటే, లేదు. ఇలా చెయ్యడం ఒక విశ్వాసికి ఎంత మాత్రం శోభించదు. దీనికి ఇస్లాం చూపే పరిష్కారమే హిజ్రత్‌. అవిశ్వాస భూభాగాన్ని వదిలి విశ్వాస భూభాగం వైపునకు హిజ్రత్‌ చెయ్యాలి. వేరే మార్గం లేక పోతే ప్రాణాన్ని తృణప్రాయం త్యాగం చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అల్లాహ్‌తోపాటు అన్యుల్ని భాగస్వాములుగా చేసి షిర్క్‌కి పాల్పడకు, ఒకవేళ నిన్ను కాల్చేసినా, నరికేసినా”. (ముస్నద్ అహ్మద్)

ప్రశ్న: ఆషూరా దినపు ఘనత ఏమిటి?
జవాబు: ఆషూరా దినం ఎంతో ఘనమయినది. దీని పవిత్రత చాలా ప్రాచీనమయినది. ఆషూరా దినాన ప్రవక్త మూసా (అ) మరియు ఆయన జాతిని ఫిర్‌ఔన్‌ కబంద హస్తాల నుండి అల్లాహ్‌ కాపాడాడు. కృతజ్ఞతగా ప్రవక్త మూసా (అ) ఈ దినాన ఉపవాసం ఉన్నారు. యూదులు ఈ రోజున ఉపవాసం ఉంటారు. మక్కా అవిశ్వాసులు ఈ దినా ఉపవాసం ఉండేవారు. స్వయంగా ప్రవక్త ముహమ్మద్‌ (స) ఈ దినపు ఉపవాసం గురించి నొక్కి వక్కాణించారు. ఈ దినపు ఉపవాసం గురించి తెలియజేస్తూ ఇలా అన్నారు: ”నాకు అల్లాహ్‌పై పూర్తి నమ్మకం ఉంది. ఆయన ఈ ఒక్క రోజు ఉపవాస కారణంగా గత యేడాది పాపాలను మన్నిస్తాడ”ని. (ముస్లిం హథీసు గ్రంథం)

హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) గారి కథనం – ”ప్రవక్త (స) ఈ దినం – ఆషూరా దినపు ఉపవాసానికి, ఈ మాసం- రమజాను మాసపు ఉపవాసానికి ఇచ్చినంత ప్రాధాన్యత, చూపినంత ఆసక్తి మరే ఇతర దినం, ఇతర మాసం గురించి నేను చూడ లేదు” అన్నారు. (బుఖారీ)
”ఆషూరాకు ఒక రోజు ముందు లేదా ఒక రోజు తర్వాత ఉపవాసం ఉండండి” అని ప్రవక్త (స) సెలవిచ్చారు. (ముస్నద్‌ అహ్మద్‌)
ఆ రకంగా ఆషూరా ఉపవాసాన్ని స్థాయి రీత్యా ఇలా విభ జించడం జరిగింది. 9,10 ఇది ఉత్తమ స్థాయి. 10,11 ఇది దాని తర్వాతి స్థాయి. 9,10,11 ఆ తర్వాతి స్థాయి. కేవలం 10 ఇది అన్నింటికన్నా తక్కువ స్థాయి.

ప్రశ్న: హజ్రత్‌ హుసైన్‌ (ర) గారికి ముహర్రమ్‌ మాసంతో గల సంబంధం ఏమిటి?
జవాబు: కర్బలా సంఘటన పరంగా తీసుకుంటే, ఆయన ఈ మాసంలో షహీద్‌ అయ్యారు. అలా షహీద్‌ అయిన వారు ఆయన ఒక్కరు మాత్రమే కాదు. హజ్రత్ ఉమర్‌ (ర) కూడా ముహర్రమ్‌ 1వ తేదీ పరమ పదించారు. కాబట్టి ఎవరి మరణం వల్లయినా సరే ఏ మాస స్థాయిని పెంచడం, తగ్గించడం సబబు కాదు. ముఖ్యంగా ముహర్రమ్‌ మాసానికి గల ఘనత, ఔన్నత్యం భూమ్యాకాశాలను సృష్టించిన నాటిది. అలాంటి పవిత్ర మాసాన్ని గూగల్‌లో సెర్చ్‌ చేస్తే స్క్రీన్‌ మొత్తం రక్తమోడుతున్న హింసాత్మక దృశ్యాలతో నిండి పోతుంది. ఈ రక్తపు మరకల్ని గౌరవప్రదమయిన ఈ మాసానికి అద్దింది ఎవరు? అసలు ఈ సందర్భంగా జరిగే స్యీయ హింసతో హజ్రత్‌ హుసైన్‌ (ర) గారి షహాదత్‌కి సంబంధం ఏమిటి? శోక ప్రకట అనుమతి భార్యను మినహాయించి బంధువులకు మూడు రోజులు మాత్రమే అని హదీసు గ్రంథాలు ఘోషిస్తుంటే, ఇలా యేండ్ల తరబడి ప్రతి సంవత్సరం మాతమ్‌ చెయ్యడం ఎవరి సంప్రదాయం? ఇది ధర్మంలో బలవంతాన దూర్చ బడిన అధర్మ చేష్ట తప్ప మరేమి కాదు.

హజ్రత్‌ హుసైన్‌ (ర) గారి విశిష్ఠను గురించి తెలుప గలరా?
జవాబు: ప్రవక్త (స), హజ్రత్‌ హసన్‌ మరియు హజ్రత్‌ హుసైన్‌ (ర) గారిని ఎంతగానో ప్రేమించేవారు. హజ్రత్‌ హుసైన్‌ (ర), ప్రవక్త (స) వారికి దగ్గర పోలిక గలవారు. ఆయన (స) ఇద్దరిని గురించి అల్లాహ్‌తో దుఆ చేశారు: ”ఓ అల్లాహ్‌! నేను వీరిద్దరిని ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా వీరిని ప్రేమించు”. (ముస్నద్‌ అహ్మద్‌).
”వీరద్దరూ నా ప్రాపంచిక ముద్దు మందారాలు” అని వేరొక సందర్భంగా ప్రవక్త (స) సెలవిచ్చారు. (బుఖారీ)
”ఇప్పుడు నా వద్దకు వచ్చిన ఈ దైవ దూత ఇంతకు మునుపెన్నడూ భూలోకానికి దిగి రాలేదు.అతను నాకిచ్చిన శుభవార్త – ఫాతిమా(ర.అ) స్వర్గపు స్త్రీలకు నాయకురాలు. హసన్‌ మరియు హుసైన్‌ (ర) స్వర్గపు యవతకు నాయకులు” అని అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ)
ఓ సందర్భంగా ఆయన ఇరు భుజాల మీద ఇద్దరినీ కూర్చోబెట్టుకొని ఒక సారి హసన్‌ (ర)గారని, ఒక సారి హుసైన్‌ (ర) గారిని ముద్దాడుతుండగా చూసిన ఓ వ్యక్తి – ”మీరు ఇంతలా వీరిరువురిని ఇష్ట పడతారా? అని ప్రశ్నించగా – ”వీరిద్దరిని ప్రేమించిన వ్యక్తి నన్ను ప్రేమించినట్లు. వీరద్దరిని ద్వేషించిన వ్యక్తి నన్ను ద్వేషించినట్లు” అని సెలవిచ్చారు. (ముస్నద్‌ అహ్మద్‌)

ప్రశ్న: ఈ మాసంలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి శోకం పాటించడం, రోధించడం, గుండెలు బాదుకోవడం, కత్తులతో రక్తం వచ్చేలా కొట్టుకోవడం, బట్టలు చించుకోవడం ఎంత వరకు సబబు?
జవాబు: ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అజ్ఞాన కాలానికి చెందిన నాలుగు దురాచారాలు నా సముదాయంలో కూడా ఉంటాయి. జాతి (ప్రాంత, భాష) దురభిమానం, వంశాన్ని తూలనాడటం, నక్షత్రాల ద్వారా వర్షాన్ని కోరుకోవడం, గుండెలు బాదుకుంటూ ఏడ్వడం”. (ముస్లిం) ఆ తర్వాత ఆయన ఇలా హెచ్చరించారు: ”బట్టలు చించుకొని, గుండెలు బాదుకుంటూ, ముఖాన్ని రక్కుతూ రోధించే స్త్రీ మరణానికి ముందు వరకూ తౌబా చేసుకోకపోతే ప్రళయ దినాన ఆమెని తిరిగి బతికించి లేప బడినప్పుడు – ఆమెకు తారు వస్త్రాలు మరియు గజ్జి వస్త్రాలు తోడిగించ బడి స్థితిలో లేప బడుతుంది”. (ముస్లిం)
వేరొక సందర్భంలో ఆయన ఇలా అన్నారు: ”ముఖం మీద కొట్టుకునే వారు, బట్టలు చింపుకునే వారు, అజ్ఞాన కాలపు మాటలు మాట్లాడే వారు మాలోని వారు కారు”. (బుఖారీ)

ప్రశ్న: ఈ మాతమ్‌ – శోక పరంపర ఎప్పుడు మొదలయ్యింది?
జవాబు: గుండెలు బాదుకొని, బట్టలు చింపుకొని, వెంట్రుకలు విరబోసుకొని శోకం పాటించడం అన్నది చాలా కాలంగా ఉన్న ఆచారం. ప్రవక్త (స) దాన్ని నిషేధించారు. ఆ తర్వాత అరకొరగా అక్కడక్కడ ఇలాంటి చేష్టలు కనిపించినా, దానికి చట్టబద్ధతను కల్పించినది మాత్రం హిజ్రీ శకం 352లో అహ్మద్ బిన్ బువైహ్‌ అద్దయిలమీ అనే రాజు. ఆషూరా సందర్భంగా దుకాణాలు బందు చేయాలని, శోకాన్ని సూచించే నల్లటి వస్త్రాలు ధరించాలని, ముఖం మీద, గుండెల మీద కొట్టుకుంటూ శోక ప్రదర్శన చేయ్యాలని, స్త్రీలు సయితం నల్లటి వస్త్రాలు ధరించి శోకాన్ని సూచించే కవితలు పాడుకుంటూ వీధుల గుండా వెళ్లాలని ఆదేశించాడు. వ్యతిరింకించిన వారిని శిక్షించాడు. తర్వాతి కాలంలో ఈ వికృత చేష్ట కొత్త పుంతలు తొక్కి, చిన్న, చిన్న పిల్లల్ని సయితం బ్లేడుతో కోసి ఆనందించే స్థాయికి చేరుకుంది. ఇవి చాలవన్నట్లు ముహర్రమ్‌ మాసం ప్రారంభం అవ్వగానే కొందరు స్నానం చెయ్యరు, స్త్రీలు ధరించిన నగలను తీసేస్తారు, పొయ్యిని బోర్లా చేసి పెడతారు, నూతన వధువుని పుట్టింటికి సాగనంపేస్తారు. అల్లాహ్‌ అందరిని ఇలాంటి దిక్కుమాలిన ఆచారాల బారి నుండి కాపాడు గాక! ఆమీన్‌.

ప్రశ్న: ఈ మాసంలో సమాధుల్ని అలంకరించడం జరుగుతుంది కదా?
జవాబు: సమాధుల్ని అలంకరించడం అన్ని వేళలా నిషిద్ధమే. ముహర్రమ్‌ మాసంలో మొదలవగానే ఖనన వాటికను శుభ్ర పర్చడం, సుననం పూయడం, అగరవొత్తులు, కొవ్వొత్తులు వెలిగించడం ప్రారంభం అయిపోతుంది. స్త్రీలు, పురుషులు, పిన్నలు,పెద్దలు అందరు ఖనన వాటికకు తరలి వెళ్ళి ఒక మేళ లాంటి వాతవరణాన్ని సృష్టిస్తారు. సమాధుల దగ్గరికెళ్ళి అర్థిస్తారు. ఇవన్నీ షిర్క్‌ మరియు బిద్‌అత్‌ పనులు. ఇలాంటి వెకిలి చేష్టలు చోటు చేసుకుంటాయని తెలిసే ప్రవక్త (స) ఇలా వేడుకున్నారు: ”ఓ అల్లాహ్‌! పూజింపబడే విగ్రహంగా నా సమాధిని చెయ్యకు స్వామీ! ప్రవక్తల సమాధులను సజ్దా స్థలాలుగా చేసుకున్న జాతి యెడల అల్లాహ్‌ ఆగ్రహోదగ్రుడయ్యాడు” అన్నారు ప్రవక్త (స). (మిష్కాతుల్‌ మసాబీహ్‌)

ప్రశ్న: ఈ సందర్భంగా రకరకాల వంటకాలు చేసి పంచడం ఎలాంటిది?
జవాబు: ప్రవక్త (స) ఇలా అన్నారు: ”సలామ్‌ను సర్వవ్యాప్తం చెయ్యండి. అన్నదానాలు చేపట్టండి. బంధుత్వ సంబంధాలను బల పర్చండి. ప్రజలు నిద్రిస్తుండగా రాత్రి సమయాన మీరు లేచి నమాజు చెయ్యండి. ఇలా గనక మీరు చేస్తే స్వర్గంలో నిశ్చింతగా ప్రవేశిస్తారు” అన్నారు. (ముస్నద్ అహ్మద్)
‘అన్నదానానికి మించిన దానం లేదంటారు’ పెద్దలు. అన్నదానం చాలా మహత్పూర్వక కార్యం – సందేహం లేదు. అయితే దాని కోసమంటూ కొన్ని రోజులను కేటాయించడం, కొన్ని రుతువులు, మాసాలతో దాన్ని ముడి పెట్టడం సమంజసం కాదు. కనుక ముహర్రమ్‌ సందర్భంగా హలీమ్‌, బిర్యానీ, మటర్‌ ఫలావ్‌, ఫిన్రీ, షర్బత్‌ వంటివి చేసి పంచడం, లేదా వాటిని తీసుకెళ్లి – దానా గన్జ్‌ బఖ్ష్‌, హజ్రత్‌ మియాఁ మీర్‌, హజ్రత్‌ పీర్‌ మక్కీ, హజ్రత్‌ మధులాల్‌ హుసైన్‌, హజ్రత్‌ ఖాజా తాహిర్‌ బందగీ, హజ్రత్‌ ఇనాయతుల్లా హుసైన్‌ ఖాద్రీ, హజ్రత్‌ మౌజ్‌ దర్యా వంటి దర్గాలపై హజ్రత్‌ హుసైన్‌ (ర) పేరుతో నజర్‌, నియాజ్‌ సమర్పించడం ముమ్మాటికీ గర్హనీయం.

ప్రశ్న: మధ్యాహ్నపు గుర్రపు సవారీ అంటే ఏమిటి?
జవాబు: ఇదో రకమయిన గుర్రపు ఊరేగింపు. ఈ గుర్రాన్ని ‘జుల్‌ జనాహైన్‌’ రెండు రెక్కల గుర్రంగా అభివర్ణిస్తారు. కొన్ని చోట్ల అలాంటి గుర్రపు చిత్ర పటాన్ని ఊరేగిస్తే, కొన్ని చోట్ల జీవం ఉన్న గుర్రాన్ని ఊరేగింపుగా తీసుకెళతారు. ఇది ముమ్మాటికీ ఇస్లామేతర ఆచారం.

ప్రశ్న: ముహర్రమ్‌ సందర్భంగా అలావా పేరుతో అగ్ని గుండాన్ని త్రవ్వి అందులో దూకడం, పంజాల పేరుతో ఒక్కో వ్యక్తి పేరిట విగ్రహ ప్రతిమల్ని ప్రతిష్టింప జేయడం, పుణ్యాత్ముల ఆత్మలు ఆవహిస్తాయి అని భావించడం గురించి మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు: ముహర్రమ్‌ సందర్భంగా అగ్ని గుండాన్ని ఏర్పాటు చేసే ఆచారం ప్రస్తుతం అన్ని చోట్ల లేదు అని చెప్పవచు. ఇది అన్యుల మతాచారాల నుండి దిగుమతి చేసుకో బడ్డ ఆచారం. ఇనుము, వెండి, బంగారపు విగ్రహ ప్రతిమల్ని – పంజాలను పది రోజుల పాటు కూర్చో బెట్టడం, సదివింపులు చెయ్యడం వినాయకుని నిమజ్జనం వంటిదే. ఆత్మలు ఆవహిస్తాయి అనడం ఇస్లామీయ విశ్వాసమే కాదు. అంటే ఇవన్ని కూడా అరువుకి తెచ్చుకున్న ఆచారాలే.

ప్రశ్న: తఅజియా ఆచారం ఎలాంటిది?
జవాబు: అర్థం, పర్థం లేని ఈ ఆచారాన్ని తొలూత ప్రారంభించిన వారు — అబూ మిఖ్నఫ్‌ లూత్‌ బిన్‌ యహ్య, ముహమ్మద్‌ బిన్‌ సాయిబ్‌ కల్బీ, హిషామ్‌ బిన్‌ సాయిబ్‌ కల్బీ మొదలయిన వారు. ఇందులో ఏం చేస్తారు? అంటే, కాగితాలతో లేదా కొయ్య, ఇతర వస్తువులతో సమాధి ఆకారాన్ని తయారు చేస్తారు. ఇది ముహర్రమ్‌ మాతానికి, శోకానికి పరాకాష్ఠగా చెప్పుకుంటారు. ఈ ఆచారం వల్ల కాస్తో కూస్తో మిగిలి ఉన్న విస్వాసం కూడా బూడిదలో కలిసి పోతుంది. ఎలా అంటా రా?
అ) తాజియాలో గల సమాధిలో హజ్రత్‌ హుసైన్‌ (ర) గారు సజీవంగా ఉంటారని, ఆయనకు అగోచరాల జ్ఞానం ఉంటుందని భావించి ఆయన్ను వేడుకోవడం జరుగుతుంది.
ఆ) ఈ తాజియా ఎత్తేటప్తుడు చిన్న పిల్లలను దాని క్రింది నుండి పోనిస్తారు. అలా వారు హజ్రత్‌ హుసైన్‌ (ర) గారి రక్షణలో వస్తారు అన్నది పిల్లి నమ్మకం.
ఇ) సమాధుల దగ్గర నిలబడటం, సజ్దా చెయ్యడం, మొక్కుబడులు చెల్లించుకోవడం వంటివే ఇక్కడ కూడా జరుగుతాయి. ”ఎవరయితే మృతుడు లేని సమాధిని దర్శించుకున్నాడో అతను విగ్రహాన్ని కొలచినట్లే” అన్న యదార్థం పాపం వీరి తెలీదు.
ఈ) ఈ ఊరేగింపులో అందరూ ఉంటారు. ముఖ్యంగా యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. అధర్మ కార్యాలు ఎన్నో చోటు చేసుకుంటాయి.
ఉ) చిన్నా, పెద్ద, అడ, మగ అందరూ కలిసి నృత్యాలు చేస్తూ, రకరకాల విన్యాసాలు చేస్తూ కనిపిస్తారు. చివరి రోజున పల్లె ప్రాంతాల్లో పంజే మిల్నే కి జగా – పీర్లు కలుసుకునే చోటుకెళ్లి ఈ మొత్తం తతంతగానికి ముగింపు చెబుతారు. ఆ తర్వాత ఆ పీర్లను తీసుకెళ్ళి ఏ బావిలోనూ, బోరు దగ్గరో కడిగి తాబూత్‌లో పెట్టి మరుసటి యేడాది వరకు సర్ది పెట్టేస్తారు.
ఒక్క నిమిషం ఆలోచించండి! ఈ వెకిలి చేష్టలకు కర్బలాలో జరిగిన సంఘటనకు, హజ్రత్‌ హుసైన్‌ (ర) గారి జీవితానికి ఎలాంటి పొంతన, పోలికయినా ఉందా? కాంక్షా దాస్యం తప్ప.

ప్రశ్న: ఈ సందర్భంగా సహాబా గురించి, ప్రవక్త (స) వారి సతీమణుల గురించి అనుచితంగా వాగే వాగుడుకాయలు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటారు. వీరిని గురించి మీరేమాంరు?
జవాబు: ప్రవక్త (స) ఇలా అన్నారు: ”మీరు నా సహాబాను తిట్టకండి. మీలోని ఒక వ్యక్తి ఉహద్‌ పర్వతమంతటి బంగారాన్ని దానం చేసినా, నా సహాబాలోని ఒక సహాబీ దానం చేసిన గుప్పెడు ధాన్యానికి అది సరి తూగదు, అందులోని సగానికి కూడా సరి తూగదు”. (బుఖారీ)
అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) ఇలా అన్నారు: ”మీరు ముహమ్మద్‌ (స) వారి సహాబాను తిట్టకండి. మీరు 40 సంవత్సరాలు చేసిన ప్రార్థన వారిలోని ఒక వ్యక్తి ప్రవక్త (స) వారితో గడిపిన ఒకే ఒక్క ఘడియకు సరి పోదు”. (ఇబ్బు బత్తహ్‌)
హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (ర) ఇలా అన్నారు: ”మీరు ముహమ్మద్‌ (స) వారి సహాబాను దూషించకండి. మీరు జీవితాంతం చేసిన సత్కలు వారు ప్రవక్త (స)తో గడిపిన ఒక్క ఘడియకు సరి తూగవు”. (ఇబ్ను మాజహ్‌)
ప్రవక్త (స) చెప్పిన మాట గమనార్హం! ” వీరిని (సహాబాను) విశ్వాసి మాత్రమే ప్రేమిస్తాడు. వీరిని కపటి మాత్రమే ద్వేషిస్తాడు. వీరిని ప్రేమించిన వారిని అల్లాహ్‌ ప్రేస్తాడు. వీరిని ద్వేషించిన వారిని అల్లాహ్‌ ద్వేషిస్తాడు”. (బుఖారీ)
ఒక్క మాటలో చెప్పాలంటే, రజియాల్లహు అన్హుమ్‌ వ రజూ అన్హు అన్న కితాబు స్వయంగా అల్లాహ్‌ నుండి అందుకున్న సజ్జనులను, పవిత్ర మాసమయిన ముహర్రమ్‌లో తిట్టడం, శాపనార్థాలు పెట్టడం మహా నేరం! దీని పరిణామం మహా భయంకరంగా ఉంటుంది. అలాగే ప్రవక్త (స) సతీమణుల మీద ఆభాండాలు మోపడం, వెకిలి నవ్వులు నవ్వడం మహా మహా భయంకరమయిన నేరం. ఇలాంటి వ్యక్తులతో చెట్టా పట్టాలేసుకొని తిరగడం గర్హనీయం. అలా చేసే వ్యక్తులతో అన్ని విధాల తెగత్రెంపులు చేసుకోవాలి. దీన్నే వలా మరియు బరా అంటారు.

ప్రశ్న: శాపనార్థాలు పెట్టే ఈ దుష్చర్య ఎప్పుడు మొదలయ్యింది?
జవాబు: అహ్మద్‌ బిన్‌ బువైహ్‌ దైలమీ అనే రాజు బాగ్దాద్‌లోని జామె మస్జిద్‌ తలుపు మీద హజ్రత్‌ ముఆవియా (ర) గారిని శాపనార్థాలు పెడుతూ వాక్యాలను చెక్కించాడు. అంటే, అంతకు పూర్వం సయితం శాపనార్థాలు పెట్టే సంకుచిత మనస్కులు, కపట నాటక సూత్రధారులు ఉన్నప్పటికి చట్ట బద్ధత ఇతనే కల్పించాడు.

ప్రశ్న: ఇమామ్‌ మరియు అలైహిస్సలామ్‌ అని ఒక వ్యక్తిని అనొచ్చా? రహ్మతుల్లాహి అలైహి అని ఒక దుర్మార్గుని మరణానంతరం చెప్పొచ్చా?
జవాబు: ఈ రెండు పదాలు గౌరవార్థం వాడ బడాతయి. ఉదాహరణకు ఇమామ్‌ షాఫయీ, ఇమామ్‌ మాలిక్‌ వగైరా. అలాగే హజ్రత్‌ హాజరా అలైహస్సలామ్‌, హజ్రత్‌ మర్యమ్‌ అలైహస్సలామ్‌. అయితే ఇలాంటి పద ప్రయోగాలు ఆ స్థాయి, గౌరవం గల కొందరికి వర్తింపజేసి, దానికన్నా మించిన స్థాయి, గౌరవం ఉన్న మరికొందరిని మినహాయిస్తే మాత్రం ఆలోచించాలి! ఎందుకంటే అహ్లుస్నున్నహ్‌ వల్‌ జమాఅహ్‌ దగ్గర ప్రవక్తలు మాత్రమే పాప రహితులు. ఇతర కొన్ని వర్గాల దగ్గర వారి ఇమాములను సయితం వారు పాపరహితులుగా భావిస్తారు. ఉదాహరణకు – ఇమామ్‌ అలీ (ర) అనే వారు, ఇమామ్‌ అబూ బకర్‌ (ర) అని ఎందుకు అనరు? హసైన్‌ అలైహిస్సలామ్‌ అనేవారు ఉమర్‌, ఉస్మాన్‌, అబూ హురైరా అలైహిస్సలామ్‌ అని ఎందుకు అనరు? కాబట్టి పద ప్రయోగం, ఒక పారభాషిక పద ప్రయోగంలో కడు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. ఇక రహ్మతుల్లాహి అలైహి అని ఒక దుర్మార్గుని మరణానంతరం చెప్పొచ్చా? అంటే, దర్మార్గుడయిన ముస్లిం మరణిస్తే అతని కోసం జనాజా నమాజు చదవుతాం కదా! జనాజా నమాజు అంటే మన్నింపు. మృతుని మన్నింపు కోసం వేడుకోవడం. ఈ పదాన్ని వాడి తీరాలన్న నిబంధనయితే లేదు గానీ, ఎవరయినా వారి తాలూకు మరణించిన వ్యక్తి పేరు తీసుకుంటూ అలా చెబితే అభ్యతరం లేదు.

ప్రశ్న: సజ్జనులయిన మన పూర్వీకుల విషయంలో మనం ఎలా ఉండాలి?

జవాబు: అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌ లో ఉండమన్నట్టుగా ఉండాలి. ”వారి తర్వాత వచ్చిన వారు ఇలా వేడుకుంటారు: ‘మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయంలో ఎలాంటి ద్వేష భావాన్నీ కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదుత్వం కలిగిన వాడవు, కనకరించే వాడవు”. (అల్‌ హష్ర్‌: 10)
ఓ అల్లాహ్‌! సత్యాన్ని సత్యంగా చూపించి, దానిని పాటించే సద్బుద్ధిని మాకు ప్రసాదించు. అధర్మాన్ని అధర్మంగా చూపించి, దాని నుండి దూరంగా ఉండేలా దీవించు స్వామీ! ఆమీన్‌.

 

 

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.