మొహమాటం మోతాదు మించితే…

‘మాట అనే ఆయుధంతో మట్టి మనిషి కూడా మహోన్నతుడు కాగలడు’ అంటారు పెద్దలు. నిజమే. కాని ఆ మాటకు ముందు మొహం వచ్చి చేరితే ఆ మాటే ‘మొహమాటం’ అయి మనిషిని కుడుతూనే ఉంటుంది. మాట మనిషిని మహా మనీషిలా మార్చే యంత్రం అయితే, మొహమాటం అనేది చలి చీమలాంటిది. కాటు వేసినప్పుడల్లా విపరీతమైన మంటగా ఉంటుంది. ప్రాణం పోదు. కానీ ఆ మంట ప్రాణం తోడేస్తుంది. ఇది రోజూ ఏదో ఒక టైమ్ కుడుతూనే ఉంటుంది. మొహమాటస్తులు లేనిపోని బాధ్యతల భారాన్ని తమపై వేసుకుని నిరంతరం బాధపడుతూనే ఉంటారు. ఒకరికి సహాయపడాలనే ఆలోచన సరైనదే… అది ఇప్పటి సమాజంలో చాలా అవసరం కూడా. అయితే వీలుకానప్పుడు కాదనడం కూడా ఒక కళే అని గ్రహించాలి.

మొహమాటం మంచిది కాదని ఎవ్వరూ అనరు. కాకుంటే అది కాస్త హద్దులో, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మన వంటికి, మనసుకు కూడా చాలా మంచిది. అతిగా మొహమాటపడి.. సిగ్గుతో మెలికలు తిరిగిపోయి అవతలివాళ్ళు ఏమనుకుంటారోనని ఇష్టంలేనివి బలవంతాన ఎక్కువ తిన్నా, ఉపయోగపడని బహుమతులను వద్దనలేక తీసుకున్నా ఆ తరువాత బాధపడాల్సింది మనమే. బంధుమిత్రులను, ఇరుగుపొరుగును ఇష్టపడటం, గౌరవించడం తప్పక చేయవలసిన పనే అయినా.. అది మన ఇష్టాయిష్టాలను, మన సొంత పనులను, మన సమయాన్ని త్యాగం చేసి మరీ చేసేది కాకూడదు. ‘క్షమించండి… ఇప్పుడు మీతో నేను బయటికి రాలేను.. సారీ.. మీరు చెప్పిన పని ఇప్పుడు నేను చేయలేను.. నాకు ఆఫీసుకు టైమ్ అవుతోంది.’వంటి చిన్న చిన్న తిరస్కారాలతో మన సంగతి మనం చూసుకుంటే అందులో తప్పేమీ లేదు. వాళ్ళుకూడా అర్థం చేసుకుంటారు. ఒకవేళ అర్థం చేసుకునే సంస్కారం లేని వాళ్ళయి ఒక మాట పెడసరంగా అన్నా, సాధించినా మనమేమీ పశ్చాత్తాప పడవలసిన అవసరం లేదు.

మొహమాటం మోతాదు మించితే...

మొహమాటం కారణంగా అవతలివారి కోసం ఏదో ఒక పని చేసి, తర్వాత తీరిగ్గా కూర్చోని బాధపడటం మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవం అయ్యే ఉంటుంది. పోతే మనలో కొందరు మొహమాటానికి ‘మంచితనం’ అన్న నిర్వచనం ఇచ్చుకొని తెగ సంబర పడి పోతుంటారు. ‘నో’ అని గట్టిగా చెప్పగలిగే స్థితిలో ఉండి కూడా అవతలివారికి మంచి చేయాలన్న ఉద్దేశ్యంతో చెప్పకపోతే అదో పద్ధతి, మనం చేసిన పని అవతలివాళ్ళకి లాభం కలిగించేదైతే, అప్పుడు అది మన మంచితనం అవుతుంది. అలా కాని ఎడల ‘మన చేతగానితనానికి వేసుకున్న ముసుగు అది’ అని తెలుసుకోవాలి. ఎందుకంటే- ఒక్కోసారి ఇది దారుణమైన పరిణామాలకి కూడా దారి తీయచ్చు.

అప్పు అడిగినవారిని గట్టిగా లేదని చెప్పలేకపోవడం, ఇచ్చేశాక బాధపడటం, తిరిగి వసూలు చేసుకోవడానికి అదేదో పరాయి సొమ్ము అన్నట్టు మొహమాటపడటం, మన వద్ద చేయాల్సిన పని బోలెడంత ఉన్నా ఎవరైనా వచ్చి ఇక్కడికెళదాం, అక్కడికి వెళదాం అంటే మొహమాటానికి పోయి రాజీపడటం, ఆనక దుఃఖించడం, మనల్ని ఎవరైనా డామినెట్ చేసినప్పుడు ప్రతిఘటించలేక పోవడం ఇవన్నీ మొహమాటపు పరిణామాలు. ఒక రకంగా చెప్పాలంటే మొహమాటం అభద్రతాభావానికి మరో పరిణామం. ఇది ఎందుకు కలుగుతుంది. అంటే – ఎవరైనా మన గురించి చెడుగా అనుకుంటారేమో అన్న ఆత్మనూన్యత భావమే మనల్ని మొహమాటానికి గురి చేస్తుంది. ‘ప్రపంచంలో అందరి చేతా మంచి అన్పించు కోవటం అసాధ్యం’ అనే చిన్న సూత్రాన్ని మర్చి పోవడం వల్ల వచ్చే జబ్బు మొహమాటం.

మొహమాటం కారణంగా అవతలివారి కోసం ఏదో ఒక పని చేసి, తర్వాత తీరిగ్గా కూర్చోని బాధపడటం మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవం అయ్యే ఉంటుంది. పోతే మనలో కొందరు మొహమాటానికి ‘మంచితనం’ అన్న నిర్వచనం ఇచ్చుకొని తెగ సంబర పడి పోతుంటారు. ‘నో’ అని గట్టిగా చెప్పగలిగే స్థితిలో ఉండి కూడా అవతలివారికి మంచి చేయాలన్న ఉద్దేశ్యంతో చెప్పకపోతే అదో పద్ధతి, మనం చేసిన పని అవతలివాళ్ళకి లాభం కలిగించేదైతే, అప్పుడు అది మన మంచితనం అవుతుంది. అలా కాని ఎడల ‘మన చేతగానితనానికి వేసుకున్న ముసుగు అది’ అని తెలుసుకోవాలి. ఎందుకంటే- ఒక్కోసారి ఇది దారుణమైన పరిణామాలకి కూడా దారి తీయచ్చు.

ఉదాహరణకు: ‘స్త్రీలలో మొహమాటం ఎక్కువ’ అన్నది అందరికీ తెలిసిన విషయమే. అందులో పెళ్లికాని ఆడపడుచులకు మరీను. ఓ వ్యక్తి వయసులో తనకన్నా పెద్దవాడైనా, చిన్నవాడైనా లేదా సమవయస్కుడైనా తనని ముట్టుకుంటున్నాడు, బుగ్గలు గిల్లుతున్నాడు, అశ్లీలత నిండిన జోక్స్ వేస్తున్నాడు – స్త్రీగా ఆమెకు ఇబ్బందిగానే ఉంటుంది. “జో హంసీ ఓ ఫన్సీ” అని తీర్మానించుకునే పురుషాహంకార సమాజంలో మొహమాటానికి పోయి లేనిపోని ఇక్కట్లు కొని తెచ్చుకుంటుంది. స్త్రీలలో ఉన్న ఈ బలహీనత తెలిసిన ఆ పరమ శ్రేయోభిలాషి వారినిలా హితవు చేస్తున్నాడు:

“మీరు అల్లాహ్ కు భయపడేవారైతే (పర పురుషులతో మాట్లాడేటప్పుడు) మెతకదనం (మోహమాటం) కనబడేలా మెల్లిగా మాట్లాడకండి. అంతర్యంలో ‘చెడు’ (ఉద్దేశ్యం, కామం) ఉన్నవాడ్ని ఈ (మోహమాటం) మెతకదనం పేరాశకు పురిగొల్పే ప్రమాదం ఉంటుంది. అందువల్ల (సూటిగా) స్పష్టంగా, కరాఖండిగా మాట్లాడండి.” (అహజాబ్: 32)

ఇక పురుషుల విషయానికొస్తే….పిచ్చాపాటి మాట్లాడుతూ ఒక్కసారిగా టాపిక్ మార్చి అసభ్యకరమైన కూతలు మొదలెడతారు. కొందరికి వారి ఈ వైఖరి నచ్చకపోయినా, ఇబ్బందిగా ఫీలవుతూనే అక్కడే అంటబెట్టుకుని ఉంటారు. కారణం – లేచి వెళితే స్నేహం ఎక్కడ పాడవుతుందోనన్న మొహమాటం (భయం?). అటువంటి వ్యక్తులకు దేవుడిచ్చే సలహా:

“ప్రజలు మా సూక్తుల గురించి కువిమర్శలు చేస్తూ అపహాస్యం చేస్తుంటే నీవు వారి దగ్గర కూర్చోకు. అక్కడ్నుంచి లేచి వెళ్ళిపో. వారా విషయం మానేసి మరో విషయం మాట్లాడుకునేదాక వారి చెంతకు వెళ్ళకు. ఎప్పుడైనా పైతాన్ నిన్ను మరిపింపజేస్తే జ్ఞాపకం వచ్చిన వెంటనే అలాంటి దుర్మార్గుల దగ్గర నుంచి లేచి వెళ్ళిపో. (మా ఈ ఆదేశాన్ని విస్మరించి) మీరు కూడా వారితోపాటు కూర్చుంటే అప్పుడు మీరు కూడా వారి మాదిరిగానే అయిపోతారు.. అయితే హితోపదేశం మాత్రం చేస్తూనే ఉండాలి. బహుశా వారు వీటన్నింటని విడనాడి గొప్ప దైవభీతిపరులు కావచ్చు…(అఆమ్: 68,69)

ఇక మొహమాటానికి పోయి చెడును చూస్తూ కూడా గుడ్డిగా సమర్ధిస్తూ అరికట్టకపోతే అలాంటివారు దైవ శిక్షకు అర్హులు అవుతారు. ఖుర్ఆన్లో ఇలా ఉంది: “ఇస్రాయీల్ సంతతిలో సత్యాన్ని తిరస్కరించినవారు దావూద్ నోట, మర్యం కుమారుడు ఈసా నోట శపించబడ్డారు. దానికి కారణం వారు అవిధేయిలై హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఉండటమే. అదీ కాక వారు ఒకర్నొకరు చెడుల నుండి వారించుకునేవారు కాదు. వారు చేసింది. చాలా చెడ్డ పని అనడంలో ఎలాంటి సందేహం లేదు”. (మాయిదా: 78,79)

అంటే వారు చేసిన నేరాల్లో ఓ నేరం చెడుని చెడు అని చెప్పకపోవడం, ఆపకపోవడం అని తెలుస్తుంది.

ఇక ఇటువంటి మాటలకు చేష్టలకు పాల్పడే వారంటారా? వారి కోసం దుర్భర యాతన ఎదురు చూస్తుంది. “విశ్వాసులలో అశ్లీల విషయాలు వ్యాపించాలని కోరుకునేవారు ఇటు ప్రపంచంలోనూ, అటు పరలోకంలోనూ వ్యధా భరితమైన శిక్షకు అర్హులవుతారు. (సమాజం మీద అశ్లీలం ఎంత దుష్ప్రభావం వేస్తుందో) అల్లాహు మాత్రమే తెలుసు. మీకు తెలియదు”. (నూర్: 19)

నిస్వార్థంగా జీవిస్తున్నామనీ, అవతలివాళ్ళని బాధపెట్టడం లేదని రాజీ పడే మనిషి ఇతరుల కోసం తనని తాను కోల్పోతాడు. తన బలహీనతల్ని ఆత్మవంచనతో సమర్ధించుకుంటాడు. ఇతరుల కోసం రాజీ పడి బ్రతికే మనిషి రానురాను మానసికంగా కృంగి పోతాడు. ఈ మార్పు అతనిలో ఆలోచనా విధానాన్ని దెబ్బతీస్తుంది. ఒక విధమైన సెల్ఫ్ పీటీని (విరక్తి) తనమీద తనకే కలుగుతుంది. తెలివి తేటలు, వ్యవహార జ్ఞానం మనిషి ముందుకి – నడిపిస్తుంటే, ఈ రకమైన ఆత్మనింద వెనక్కి తోస్తుంది

ప్రవక్త (స) వలీమా విందు సందర్భంగా ఆహ్వానితులు విందు ఆరగించిన వెంటనే వెళ్ళిపోకుండా అక్కడే పంచాయితీ పెట్టి లోకాభిరామాయణంలో మునిగిపోయారు. వారు ఎంత సేపటికీ కదలనందుకు దైవప్రవక్త (స) వాళ్ళను వెళ్ళమని చెప్పలేక సతమతమయ్యారు. అప్పుడు స్వయంగా ఆ పరమోన్నత ప్రభువు కలుగజేసుకుని ఈ ఆజ్ఞను జారీ చేశాడు.

“విశ్వాసులారా! అనుమతి లేకుండా దైవ ప్రవక్త (స) ఇండ్లలోకి దూరకండి. భోజన సమయంలో (అనవసరంగా అక్కడ తార్లాడుతూ ఉండకండి. ఒకవేళ మిమ్మల్ని భోజనానికి పిలిస్తే నిరభ్యంతరంగా వెళ్ళ వచ్చు. అయితే భోజనం చేయగానే అక్కడ్నుంచి లేచి వెళ్ళండి. అంతేగానీ ఖబుర్లు చెప్పుకుంటూ అక్కడే కూర్చోకండి. అతను (ప్రవక్త) బిడియం, మొహమాటం వల్ల మిమ్మల్ని ఏమి అనలేదు. మరి అల్లాహ్ యదార్థం చెప్పడానికి ఏ మాత్రం మొహమాట పడడు”. (అహిజాబ్ : 53)

ఇందులో ఆలోచించేవారికి చాలా చక్కటి హితబోధ ఉంది. ఒకరి ఇంటికి వెళ్ళేటప్పుడు పాటించాల్సిన మర్యాదలతోపాటు మొహమాటం, బిడియం ఉన్న వ్యక్తుల్ని మరింత ఇబ్బందికి గురి చేయకూడదని చెప్పబడింది. ఆయన (స) ప్రవక్త గనక ప్రభువు సమస్యను పరిష్కరించాడు. మన సమస్యల్ని మాత్రం మనమే పరష్కరించుకోవాలి. ఎందుకంటే మన మొహమాటం వల్ల మనం అవతలివాళ్ళ పనులు చేస్తూపోతే కొంత కాలానికి వాళ్ళు మన మంచితనాన్ని చేతగానితనంగా భావిస్తారు. మన మీద అధికారం సంపాదించుకున్నట్టు ఫీలవుతారు. ఇలాంటి మొహమాటం వల్ల చివరికి మనిషి అసమర్ధ స్థాయికి చేరుకుంటాడు. అలా తానో జీవచ్ఛవంలా బ్రతకడం మాత్రమే తనకి మిగులుతుంది. ఈ లోకంలో సనువిస్తే మన నెత్తినెక్కి సూక్ష్మ జీవులలాగా బ్రతకడానికి ఎంతో మంది రెడీగా ఉంటారు. కాబట్టి మనకేం కావాలో, మనకేది సాధ్యమవుతుందో కరెక్ట్ గా తెలుసుకోగలిగి ఉండాలి. పరుల కోసం ఎన్నో పనులు చేసిన ఎందరో తమసొంత భార్యాపిల్లల్ని నిర్లక్ష్యం చేయడం మనం గమనిస్తూనే ఉంటాం. అందరితో మంచి అన్పించుకోవాలన్న కోరికే దీనికి పునాది. అందుకే “నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు” అన్న సుమతీ శతకం ఇక్కడ కరెక్ట్ గా సూటవుతుంది.

ఎలా అంటారా? ఏదన్నా పని మన వల్ల కాదు అని చెప్పడం వల్ల అవతలి వ్యక్తికి మన మీద దురభిప్రాయం కలుగదు. అదే చేస్తానని చెప్పి తర్వాత మాట తప్పడం ద్వారా విశ్వాసాన్ని కోల్పోతాం. పైగా అలాంటి మాటలు అవతలి వాళ్ళకి లేనిపోని ఆశలు కలిగిస్తాయి. మొదటి సారి కాదనటం వల్ల కలిగే నిరాశకన్నా – చేస్తానని చెప్పి, చెయ్యలేకపోవడం వల్ల అవతలి వ్యక్తికి కలిగే ఆశాభంగం మన మీద ఆ వ్యక్తికి ఎక్కువ ద్వేషాన్ని కలిగిస్తుంది. కాబట్టి నేటి నుండి అమర్యాద లేకుండా ‘నో’ అని చెప్పడం అలవర్చుకొండి. మీరు ఎందుకు ‘నో’ అంటున్నారో వివరాలు ఇవ్వద్దు. ‘నో’ అని చెప్పడం వేరు. మన ఆశక్తతని వివరించి సానుభూతి ఆశించడం లేదు.

ఇకపోతే – ఈ మొమాటం అనేది ఒక్కోక్కప్పుడు కాస్త గారాబంగా కూడా మారుతుంది అంటే కొందరికి నమ్మబుద్ధి కాదు. పిల్లలు ఏది అడిగినా కాదనకపోవడం, వాళ్ళు ఏది కావాలంటే అది కొనివ్వడం, అశ్లీల సాహిత్యం చదివినా, సినిమాలు చూసినా, తుంటరి చేష్టలు చేసినా, మద్యం సేవించినా, మట్కా ఆడినా, జులాయిగా తిరిగినా, మహల్లాలోని మహిళల్ని వేధించినా – ‘మా కాలంలో మేమేమీ అనుభ వించలేదు కదా, కనీసం మన పిల్లలన్నా అనుభవించని’ అని సమర్ధించే ఆదర్శ తల్లిదండ్రులు కూడా కొందరుంటారు. ఈ వైఖరి దేశం అవతల పరదేశాల్లో, గల్ఫ్ లో పని చేసే తల్లిదండ్రుల వద్ద ఎక్కువే అనడం అతిశయోక్తి కాదు. ఇవన్నీ మొహమాటం క్రిందికే వస్తాయి. నిక్కచ్చిగా – కాదు/లేదు అని చెప్పలేకపోవడం తల్లిదండ్రులగా మన బలహీనత. కనీసం మన పిల్లలక్కూడా అలా చెప్పలేకపోవడం వాళ్లకు మేలు చేస్తున్నట్లు కాదు. వీలైనంత హాని చేస్తున్నట్లే లెఖ్క, కాబట్టి మొహమాటస్తులయిన వారందరికీ గగన యాత్ర (మేరాజ్) సందర్భాన దైవప్రవక్త (స) వారు చూసిన దృశ్యం కనివిప్పు కావాలి.

మేరాజ్ సందర్భాన దైవ ప్రవక్త (స) వారికి ఒక వ్యక్తి కానవచ్చాడు. వాడు కట్టెలు పోగు చేసి ఎత్తుకునేందుకు తిప్పలు పడుతున్నాడు. కానీ ఆ కట్టెల మోపు లేవకపోవడంతో (కట్టెలు తగ్గించే బదులు) మరిన్ని కట్టెలు వేసుకుని ఎత్తుకోబోతున్నాడు. ‘ఎవరీ మూర్ఖుడు?’ అని దైవ ప్రవక్త (స) అడగ్గా. “వాడు అడ్డూ ఆపూ లేకుండా (మొహమాటం కొద్దీ) అదే పనిగా తనపై బరువు బాధ్యతలను వేసుకునేవాడు. (లేదా మితి మీరిన ఆత్మ విశ్వాసంతో ఆక్షల భారాన్ని పెంచుకునేవాడు) కాని వాటిని నెరవేర్చలేకపోయేవాడు. అయనప్పటికీ (బుద్ధి తెచ్చుకొని) ఆ బరవు బాధ్యతలను తగ్గించుకునే బదులు మరిన్ని బాధ్యతలను తన నెత్తిన వేసుకునేవాడు” అని చెప్పబడింది. అంటే కాదని చెప్పడానికి ఇబ్బంది పడే వారికన్నా, అవునందుకు బాధపడేవాళ్ళే ఎక్కువ. కాబట్టి సోదరులారా! నిజంగా కష్టంలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం మనసుకి ఏనలేని సంతృప్తిని ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే అలా ఆదుకోవడం అనేది మన సామర్థ్యం వల్ల అయి ఉండాలే తప్ప మొహమాటం వల్ల కాకూడదు. ఎందుకంటే రెండవదాని వల్ల మనకు ఇబ్బందే తప్ప సంతృప్తి లేదు, ఉండదు.

అసలు సంగతేమంటే- మొహమాటం అందరికీ ఉండాలి గానీ మరీ అంత మొహమాటం అవసరం లేదని! ‘దాని మోతాదు ఎంత’అన్నది సమయ, సందర్భాలను బట్టి, అవతలి వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి ఎవరికివారే నిర్ణయించుకోవలసినది. అతి మొహమాటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులే కాదు.. పెద్దపెద్ద నష్టాలు, కష్టాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. లేకుంటే ఎన్నో సంఘటనలు మనకు గుణపాఠాలు నేర్పడానికి సిద్ధంగా ఉంటాయి. తేనె పూసినట్టుండే తియ్యటి మాటలతో తెగ మొహమాట పెట్టేసి- ఏ కాగితం మీదంటే ఆ కాగితం మీద సంతకాలు పెట్టించుకుని, తాము చేసే అప్పులకు ఇవతలి వాళ్ళను ష్యూరిటీగా నిలబెట్టిన వాళ్ళు, ఆస్తులు రాయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మొహమాటాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా ఉత్తమం.

ఉదా: మనం చాలా శ్రద్ధతో చదవటంగాని, వ్రాయటంగాని ఏదో ఒకటి చేస్తుంటాము. ఆ సమయంలో ఎవరైనా ఒక స్నేహితుడు వచ్చి కబుర్లు చెబుతూ వుంటే మనకు చాలా ఇబ్బందిగా వుంటుంది. మనసులో మనం చదివేదో, రాసేదో పూర్తి చేయాలని వుంటుంది, కాని వచ్చిన స్నేహితుడితో కలిసి మాట్లాడక పోతే తను ఏమైనా అనుకుం టాడేమోనని మనం మొహమాట పడి మన చదువును ఆపి వాళ్ళతో కబుర్లు చెప్తూ వుంటా ము. తద్వారా మన సమయం కాస్తా వృథా అవుతుంది. ఈ రోజు చెయ్యవలసిన పనిని రేపటికి వాయిదా వేస్తుం టాము. ఇలా చెయ్యటం అనేది మంచి పద్దతి కాదు. ఇలా మొహ మాటానికి పోవటం వల్ల చాలా రకాలుగా ఇబ్బంది పడవలసివస్తుంది. ఇలా ఒక్క చదువు విషయమే కాదు. ఇంకా చాలా రకాల విషయాలలో మనం మోహమాటానికి పోయి మన కాలాన్ని వృధా చేసుకుంటాము. మనలో మొహమాటం అనేది వున్నప్పుడు మనం ఎప్పటికీ పైకిరాలేము.

Related Post