New Muslims APP

సామూహిక నమాజు అనివార్యమా?

ప్రశ్న: నేను ఒక ఎడారి ప్రదేశంలో పని చేస్తున్నాను. అక్కడి నుంచి మస్జిద్‌కు వెళ్ళాలంటే 25 కి.మీ ప్రయాణించాలి. అందుకే నేను ఐదు పూటలు నమాజులు ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఇది అభ్యంతరకరమా? (ఒక సోదరుడు)

మనిషిలో సంకల్పశుద్ధి ఉండి, ఒక కార్యాన్ని నెరవేర్చే అవకాశం దొరకనప్పుడు, అల్లాహ్‌ తన కృపతో ఆ కార్యాన్ని నెరవేర్చిన పుణ్యం అతనికి ప్రసాదించగలడు

జ: ఇస్లాం ఒక సులభ ధర్మం. దైవదాసులు మోయగలిగినంత బరువు మాత్రమే వారిపై విధించబడింది. ”శాయశక్తులా అల్లాహ్‌కు భయపడండి” (అత్తగాబున్‌ -16) అని అల్లాహ్‌ ఆదేశిస్తున్నాడు.
”మేము దేని నుంచి మిమ్మల్ని వారించామో దాన్నుండి మీరు ఆగిపోండి. మరి మేము దేనిని చేెయమని ఆజ్ఞాపించామో దానిని శాయశక్తులా చేయండి” అని దైవ ప్రవక్త (స) ఉపదేశించారు. (బుఖారీ, ముస్లిం)

మీరు మస్జిద్‌కు 25 కి.మీ దూరంలో ఉంటున్నారు కాబట్టి సామూహిక నమాజులో పాల్గొనాల్సిందేనన్న ఆజ్ఞ మీకు వర్తించదు. మీరున్న చోటే ఒంటరిగా నమాజ్‌ చేసుకోవచ్చు. అయితే మీరుంటున్న ఎడారి ప్రదేశంలో మరి కొంత మంది ముస్లింలు కూడా ఉంటే వారితో కలిసి నమాజు చేయటం వాంఛనీయం. ఇదే ఉత్తమం కూడా. ఒకవేళ ఎవరూ లేని పక్షంలో మీరు ఒంటరిగా నమాజు చేసినాసరే మీకు సామూహిక నమాజ్‌ నెరవేర్చిన పుణ్యం లభిస్తుంది. ఒక యుద్ధ సందర్భంగా మహా ప్రవక్త (స) ఇలా వక్కాణించారు: ”మదీనాలో కొంతమంది ఉన్నారు. మీరెంత దూరం ప్రయాణం చేసినా, ఎన్ని లోయలు దాటివెళ్ళినా వారు కూడా మీ వెంటే ఉన్నారని భావించండి. ఎందుకంటే అనారోగ్యం వారిని మదీనాలో ఉండిపోయేలా చేసింది”. (ముస్లిం)

దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే మనిషిలో సంకల్పశుద్ధి ఉండి, ఒక కార్యాన్ని నెరవేర్చే అవకాశం దొరకనప్పుడు, అల్లాహ్‌ తన కృపతో ఆ కార్యాన్ని నెరవేర్చిన పుణ్యం అతనికి ప్రసాదించగలడు. కాబట్టి ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. కాని రోజూ ఐదు పూటల నమాజు మాత్రం విధిగా చేస్తూ ఉండండి. వేళకు చేస్తూ ఉండండి.

ప్రశ్న: అఖీఖా ఏ వయస్సు వరకు చేయవచ్చు? (అలీ – కువైట్)

జ: ‘అఖీఖా’ అనేది శైశవంతో ముడిపడి ఉంది. తల్లి కడుపు నుంచి బయటపడిన శిశువు శిరోముండనం చేయడమే అఖీఖా. దాంతోపాటు స్థోమత ఉంటే దైవం తమకు బిడ్డ రూపంలో అనుగ్రహాన్ని వొసగినందుకు కృతజ్ఞతా సూచకంగా పశువును జిబహ్‌ చేయటం సంప్రదాయం (సున్నత్‌). ఎందుకంటే దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”ప్రతి శిశువు తన అఖీఖాకి బదులు తాకట్టు (కుదువ)గా ఉంటుంది. కాబట్టి పుట్టిన ఏడు రోజులకు ఆ శిశువు తరఫున పశువును జిబహ్‌ చేయాలి. (శిశువుకు) పేరు పెట్టాలలి. తల వెంట్రుకలు తీయాలి”. (సుననె తిర్మిజీ)
ఈ హదీసు ద్వారా సుబోధకమయ్యేదేమిటంటే, ఏడవ రోజున అఖీఖా చేయాలి. ఒకవేళ కారణాంతరాల వల్ల ఏడవ రోజున చేయలేకపోతే 14వ రోజున చేయాలి, అదీ కుదరకపోతే 21వ రోజున చేయాలి. ఒకవేళ ఎవరయినా ఒక వయోజనుడు కూడా తన అఖీఖా జరగలేదని తెలిస్తే – ఎప్పుడయినాసరే – తన తరఫున అఖీఖా బాధ్యతను నెరవేర్చడం తప్పు కాదు.

ప్రశ్న: పీడ కల మూలంగా నేను తరచూ రాత్రి పూట భయాందోళనకు గురవుతూ ఉంటాను… (ముహమ్మద్‌ అబ్దుల్‌ జబ్బార్‌ – కువైట్)

జ: రాత్రిపూట మీరు నిద్రలో భయపడటం, భయంతో, వ్యాకులతతో అరవటం – ఇదంతా షైతాను వల్లనే. హజ్రత్‌ జాబిర్‌ (ర) కథనం ప్రకారం ఒక పల్లెటూరి వ్యక్తి దైవప్రవక్త (స) సన్నిధికి వచ్చి ”నేను ఒక కల గన్నాను. ఆ కలలో ఒకతను నా తల తీసేశాడు. నేనేమో అతని వెనకే పరుగులు తీస్తున్నాన”ని అన్నాడు. ఇదంతా విన్న దైవప్రవక్త (స) ”నిద్రలో షైతాన్‌ నీ పట్ల చేసిన వెకిలి చేష్టల గురించి ఇతరులతో చెప్పుకోకు” అని సూచించారు.
నిద్రకు ఉపక్రమించినప్పుడు షరీయతు సూచించిన రీతిలో ‘ధ్యానం’ చేసుకుంటే ఇలాంటి పైశాచిక విన్యాసాల నుండి ఉపశమనం లభించవచ్చు. కాబట్టి మీరు నిద్రకు ముందు వుజూ చేసుకుని మస్నూన్‌ దుఆలు చేసుకోండి. ఉదాహరణకు: ఆయతుల్‌ కుర్సీ, నాలుగు ‘ఖుల్‌’ సూరాలు పఠించి, మీ రెండు చేతులపై ఊది, వాటిని మీ శరీరంపై స్పర్శించండి. ముందు మీ ముఖాన్ని, తర్వాత తలను, ఆ తర్వాత ఇతర శరీర భాగాలను తుడుచుకోవాలి. అల్లాహ్‌ మీ వ్యాకులతను దూరం చేయుగాక!

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.