సూరతు మర్‌యమ్‌

నామకరణం: సూరతు మర్‌యమ్‌

ఈ సూరహ్‌కి ‘మర్యమ్‌’ అన్న నామకరణం చెయ్యడానికి గల కారణం ఈ సూరహ్‌లోని 16వ ఆయతులో వచ్చిన మర్యమ్‌ (అ) ప్రస్తావనే. ఈ సూరహ్‌లో మానవ చరిత్రలోనే కని, విని, ఎరుగని ప్రవక్త ఈసా (అ) వారి జనన ప్రస్తాన ఉంది. ఆయన తండ్రి లేకుండా జన్మించారు. ఆదమ్‌ (అ)ను మట్టితో పుట్టించిన అల్లాహ్‌ ఈసా (అ) వారిని తండ్రి లేకుండా పుట్టించాడు.

కొందరు పిల్లలు ప్రవక్త యహ్యా (అ) వారి వద్దకు వచ్చి తమతోపాటు ఆడుకోవాల్సిందిగా కోరారు. అందుకాయన ఇలా అన్నారు: ‘నేను ఆటాడుకోవడానికి పుట్టించ బడ లేదు”.

సూరహ్‌ పరిచయం:

1) ఇది మక్కీ సీరహ్‌. 58,71వ ఆయతులు తప్ప ఇవి మదీనాలో అవతరించాయి అంటారు.

2) ఇది మసానీ సూరాలలోనిది.

3) క్రమానుసారం ఇది 19వ సూరహ్‌.

4) ఆయతుల సంఖ్య 98

5) ఇది హురూప్‌ ముఖత్తఆత్‌ كهيعص   కాఫ్ -హా-యా-ఐన్-సాద్.తో ప్రారంభమవుతుంది.

6) స్త్రీ పేరు ప్రస్తావన గల తొలి సూరహ్‌ ఇది.

7) ఇందులో 58వ ఆయతు దగ్గర సజ్దా ఉంది.

ముఖ్యాంశాలు:

ఈ సూరహ్‌ మక్కీ సూరహ్‌ గనక తౌహీద్‌, రిసాలత్‌, ఆఖిరత్‌ గురించి చర్చించడమే కాక, సన్మార్గాన ఉన్న వారి దారిని, అపమార్గాన ఉన్న వారి వైఖరిని ఇది విడమరచి చెబుతుంది.  ఈ సూరహ్‌లో ఇబ్రాహీమ్‌ ప్రవక్త (అ) గాథ గురించిన ప్రస్తావన, నూహ్‌, మూసా, హారూన్‌, ఇస్మాయీల్‌, ఇద్రీస్‌ (అలైహిముస్సలామ్‌ల) ప్రస్తావనలు కూడా ఉన్నాయి.

అవతరణ నేపథ్యం:

1) కొందరు పిల్లలు ప్రవక్త యహ్యా (అ) వారి వద్దకు వచ్చి తమతోపాటు ఆడుకోవాల్సిందిగా కోరారు. అందుకాయన ఇలా అన్నారు: ‘నేను ఆటాడుకోవడానికి పుట్టించ బడ లేదు”. అదే విషయాన్ని అల్లాహ్‌ ఇలా అన్నాడు: وَآتَيْنَاهُ الْحُكْمَ صَبِيًّا

మరియు మేము అతనికి బాల్యంలోనే వివేకాన్ని ప్రసాదించాము.

2) అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) కథనం – మక్కా అవిశ్వాసులు ప్రవక్త (స) వారిని గుహ వారిని గురించి, ఆత్మను గురించి, జుల్‌ ఖర్‌నైన్‌ గురించి విచారించినప్పుడు  వారికి ఏమి సమాధానం చెప్పాలో ప్రవక్త (స) వారికి తోచ లేదు. దైవ దూత జిబ్రీల్‌ (అ) వస్తే బాగుండు అన్న ఎదురు చూపు ఆయనలో మొదలయింది. అయితే ఆయన రావడం ఆలస్యం అయ్యింది. అప్పుడు ప్రవక్త (స) తీవ్ర ఆవేదన చెందారు. కొంత కాలానికి జిబ్రీల్‌ (అ) వచ్చినప్పుడు ప్రవక్త (స) కాసింత ఆలస్యం అయ్యిందేమి? అని ఆరా తీశారు అప్పుడు జిబ్రీల్‌ (అ) ఇలా అన్నారు: నన్ను మీ ప్రభువు వెళ్లమంటే వస్తాను, లేదంటే రాలేను. ఇదే విషయాన్ని అల్లాహ్‌ ఇలా పేర్కొన్నాడు: وَمَا نَتَنَزَّلُ إِلَّا بِأَمْرِ رَبِّكَ ۖ

(దేవదూతలు అంటారు): ”మరియు మేము కేవలం నీ ప్రభువు ఆజ్ఞతో తప్ప క్రిందికి దిగిరాము. (64)

ఈ సూరహ్‌ ఘనత:

సహాబా అబీసీనియాకు హిజ్రత్‌ చేసి వెళ్లినప్పుడు – మక్కా అవిశ్వాసులు ఓ సమస్యను లేవనెత్తగా జవాబుగా అక్కడి రాజు నజాషీ ముందర హజ్రత్‌ జాఫర్‌ బిన్‌ అబీ తాలిబ్‌ (ర) ఇదే సూరహ్‌ాను చదివి విన్పించారు. అది విన్న రాజు, దర్బారులో ఉన్న పాస్టర్లు సయితం అశ్రుసిక్తం అయ్యారు. ఆ సందర్భంలో నజాషీ ఇలా అన్నాడు: ఇది మరియు ప్రవక్త మూసా (అ) తీసుకు వచ్చింది ఒకే జ్యోతి నుండి వెలువడిన  కాంతులు.

 

Related Post