హజ్జతుల్ విదా (చివరి హజ్) – 2

ప్రసంగం తరువాత హజ్రత్ బిలాల్ (రజి) ఆజాన్ పలికి నమాజు కోసం అఖామత్ కూడా పలికారు. మహాప్రవక్త (సల్లం) జొహ్ర్ నమాజు చేయించారు. ఆ తరువాత హజ్రత్ బిలాల్ (రజి) మరోసారి అఖామత్ పలుకగా దైవప్రవక్త (సల్లం) అస్ర్ నమాజు కూడా చేయించారు. ఈ రెండు నమాజుల మధ్య కాలంలో మరే నమాజు చేయలేదు.

“సరే వినండి, మీ ఈ నగరం, మీ ఈ నెల మరియు మీ ఈ రోజు ఎలా నిషిద్ధం (హరాం) గావించబడిందో, అలానే మీ రక్తం, మీ సంపద, మీ మానం పరస్పరం ఒకరిపై ఒకరికి నిషిద్ధం గావించబడ్డాయి.

ఆ తరువాత వాహనమెక్కి తాము విడిది చేసిన చోటికి వెళ్ళిపోయారు మహాప్రవక్త (సల్లం). తన ఒంటె కస్వా పొట్టను బండరాళ్ళ వైపునకు మళ్ళించి కూర్చోబెట్టారు. ‘జబ్లె ముషాత్’ (కాలినడకన వెళ్ళేవారి మార్గంలో ఉన్న మట్టి తిన్నె)ను ముందు ఉండేటట్లు చూసి తన ముఖాన్ని కాబాకు అభిముఖంగా చేసి అక్కడనే ఉండిపోయారు. ప్రొద్దుగ్రుంకుతూ, బాగా ఎరుపెక్కి అస్తమించే వరకు వేచి చూశారు. సూర్యబింబం పూర్తిగా మటుమాయమైపోగానే హజ్రత్ ఉసామా (రజి)ను తన ఒంటెపై వెనుక  కూర్చోబెట్టుకొని బయలుదేరి ‘ముజ్ దల్ఫా’కు వచ్చేశారు. ముజ్’దల్ఫా లో మగ్రిబ్ మరియు ఇషా నమాజులు ఒకే ఆజాన్ మరియు రెండు అఖామత్ లతో చేశారు. ఆ రెండు నమాజుల మధ్యలో ఎలాంటి నఫిల్ నమాజు చేయలేదు. ఉషోదయం వరకు అలా మేనువాల్చారు. తెల్లవారుతూ ఉండగా ఆజాన్ కాగానే అఖామత్ చెప్పి ఫజ్ర్ నమాజు చేశారు. పిదప కస్వాపై ఎక్కి ‘మష్అరిల్ హరామ్’కు వెళ్ళిపోయారు. అక్కడ కిబ్లా దిశగా (కాబా అభిముఖంగా) నిలబడి దుఆ చేశారు. ఆయన ఏకత్వం, ఔన్నత్యం గురించి ప్రస్తుతిస్తూనే ఉండిపోయారు. సూర్యోదయం అయ్యే ముందు ‘మినా’కు బయలుదేరారు.

ఈ సారి హజ్రత్ ఫజ్ల్ బిన్ అబ్బాస్ (రజి)ను తన వెనుకగా ఎక్కించుకోవడం జరిగింది. ‘బత్నె ముహస్సిర్’కు చేరగా తన వాహన వేగాన్ని కొంత పెంచి పరుగెత్తించారు. ‘జమ్రయె కుబ్రా’కు వెళ్ళే మార్గాన్ని అనుసరించి అక్కడికి చేరుకున్నారు – ఆ కాలంలో అక్కడ ఓ చెట్టు ఉండేది. ‘జమ్రయె కుబ్రా’ ఆ చెట్టు పేరుతోనే గుర్తించబడేది. ఇదే కాకుండా ‘జమ్రయె కుబ్రా’ను ‘జమ్రయె అక్బా’ మరియు ‘జమ్రయె ఊలా’గా కూడా పిలుస్తారు – అక్కడికి చేరిన తరువాత మహాప్రవక్త (సల్లం) జమ్రయె కుబ్రా పై ఏడు గులకరాళ్ళను విసిరారు. ఒక్కో గులకరాయి విసురుతూ తక్బీర్ (అల్లాహు అక్బర్) అని పలికారు. అవి రెండు వ్రేళ్ళతో పట్టి విసరేటంత చిన్నవి. ఈ గులకరాళ్ళను ఆయన బత్నె వాదిలో నిలబడి విసిరారు. ఆ తరువాత బలి స్థానానికి వెళ్ళి తన చేత్తో 63 ఒంటెల్ని జిబహ్ చేశారు. తక్కిన ఒంటెలను జిబహ్ చేయమని హజ్రత్ అలీ (రజి)కి అప్పగించారు. ఆయన మిగిలిపోయిన 37 ఒంటెల్ని జిబహ్ చేయడం జరిగింది. ఇలా ఖుర్బానీ ఇచ్చిన ఒంటెల సంఖ్య మొత్తం నూరు అయింది.

దైవప్రవక్త (సల్లం), హజ్రత్ అలీ (రజి)ను కూడా తన హదీ (ఖుర్బానీ)లో చేర్చుకున్నారు.

దైవప్రవక్త (సల్లం) ఆదేశం మేరకు ఆ ఖుర్బానీ ఒంటెల మాంసం నుండి ఒక్కో ముక్కను కోసి వండడం జరిగింది. మహాప్రవక్త (సల్లం) మరియు హజ్రత్ అలీ (రజి) ఆ వండిన మాంసాన్ని కొంత భుజించి దాని పులుసును కూడా త్రాగారు.

ఖుర్బానీ అయిన తరువాత దైవప్రవక్త (సల్లం) తన ఒంటెనెక్కి మక్కాకు బయలుదేరారు. బైతుల్లాహ్ (కాబా గృహం) తవాఫ్ (ప్రదక్షిణ) చేశారు – దీన్ని ‘తవాఫె అఫాజా’ అంటారు – మక్కాలోనే జొహ్ర్ నమాజు చేశారు. పిదప (జమ్ జమ్ చెలమ) దగ్గర ఉన్న బనూ అబ్దుల్ ముత్తలిబ్ వారి దగ్గరకు వెళ్ళారు. వారు హాజీలకు జమ్ జమ్ నీరు త్రాగిస్తున్నారప్పుడు. వారిని చూసి మహాప్రవక్త (సల్లం), “బనూ అబ్దుల్ ముత్తలిబ్! మీరు నీళ్ళు తోడుతూనే ఉండండి. నీరు త్రాగించే ఈ కార్యంలో ప్రజలు మిమ్మల్ని మించిపోతారనే భయమే లేకపోతే నేను కూడా మీతోపాటే వచ్చి నీళ్ళు తోడేవాణ్ణి” అని సెలవిచ్చారు – అంటే ప్రవక్త (సల్లం) గారి అనుచరగణం దైవప్రవక్త (సల్లం)ను నీళ్ళు తోడుతూ చూసి ప్రతివాడు ముందుకెళ్ళి నీటికి తోడడానికి ప్రయత్నం చేసేవాడు. ఇలా హాజీలకు నీరు త్రాగించే హోదా, గౌరవం ఏదైతే బనూ అబ్దుల్ ముత్తలిబ్ కు దక్కిందో, ఆ వ్యవస్థ కాస్తా చిన్నాభిన్నమైపోయేది అని అర్థం – బనూ అబ్దుల్ ముత్తలిబ్ జమ్ జమ్ బావి నుండి ఓ బొక్కెన నీటిని తోడి ఇవ్వగా మహాప్రవక్త (సల్లం) అందులో నుండి తనివితీరా నీరు త్రాగారు.

ఆ రోజు యౌమున్నహ్ర్. అంటే జిల్ హజ్జా పదవ తేది. దైవప్రవక్త (సల్లం) ఆ రోజు ప్రోద్దెక్కిన తరువాత (చాష్త్ సమయం) ఓ ఖుత్బా (ప్రసంగం) ఇచ్చారు. ప్రసంగించేటప్పుడు ఆయన (సల్లం) కంచర గాడిద (ఖచ్చర్)నెక్కి ఉన్నారు. దైవప్రవక్త (సల్లం) గారి ప్రవచనాలను హజ్రత్ అలీ (రజి), సహాబా (రజి)లకు వినబడేటట్లు బిగ్గరగా చెబుతున్నారు. సహాబా (రజి)లు ఆ సమయాన కొందరు నిలబడి, మరికొందరు కూర్చుని వింటూ ఉన్నారు. ప్రవక్తశ్రీ (సల్లం) ఈ రోజు ప్రసంగంలోనూ, నిన్నటి ఎన్నో మాటలను వల్లించారు. ‘సహీహ్ బుఖారి’ మరియు ‘సహీహ్ ముస్లిం’ గ్రంథాల్లో అబూబక్ర్ (రజి) గారి ఉల్లేఖనం ఉంది. ఆయన (రజి) యౌమున్నహ్ర్ (పదవ జిల్ హజ్జా) నాడు దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రసంగించారని చెప్పారు.

{ “కాలం పరిభ్రమిస్తూ, మళ్ళీ అల్లాహ్ భూమ్యాకాశాలు సృజించిన ఈ రోజుకు తిరిగివచ్చింది. సంవత్సరానికి పన్నెండు నెలలు. ఈ పన్నెండు నెలల్లో నాల్గు నెలలు హరామ్ నెలలు. మూడు ఒకదాని తరువాత ఒకటి వరుసగా వచ్చేవి. అంటే జీఖాదా, జిల్ హజ్జా మరియు ముహర్రం. ఇంకొకటి రజబె ముజర్. అది జమాదిల్ ఉఖ్రా మరియు షాబాన్ నెలలకు నడుమన ఉన్న నెల.”

ఇంకా ఆయన (సల్లం), “ఇది ఏ మాసం?” అని అడిగారు. మేము జవాబుగా, “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లం)కే బాగా తెలుసు” అన్నాము.

ఇది విన్న మహాప్రవక్త (సల్లం) కొంచెంసేపు మౌనం పాటించారు. మేము, ఈ నెలకు ఆయన మరేదైనా పేరు పెట్టనున్నారేమో అని అనుకున్నాం. కాని ఆ తరువాత ఆయన తిరిగి, “ఇది జిల్ హజ్జా మాసం కాదా?” అని అడిగారు. “అవును, ఎందుకు కాదు” అన్నాం మేము.

ఆయన (సల్లం) మళ్ళీ, “ఇది ఏ నగరం?” అని ప్రశ్నించారు. మేము, “అల్లాహ్ కు, ఆయన ప్రవక్త (సల్లం)కు బాగా తెలుసు.” అని సమాధానమివ్వగా, ఆయన మళ్ళీ మౌనం వహించారు. మేము, ఆ మౌనాన్ని చూసి ఈ నగరానికి మరే పేరేదైనా పెడతారేమో అని అనుకుంటూ ఉండగా, తమ మౌనాన్ని వీడి, “ఇది బల్దాహ్ (మక్కా) కాదా?” అని ప్రశ్నించారు. “ఔను. తప్పకుండా” అని సమాధానమిచ్చాం మేము.

“సరే, ఈ రోజు ఏ రోజు?” అని అడిగారు ఆయన (సల్లం). “అల్లాహ్ కు, ఆయన ప్రవక్త (సల్లం)కే బాగా తెలుసు” అన్నాము మేము. మా సమాధానం విన్న ఆయన (సల్లం) తిరిగి మౌనం వహించారు. మౌనాన్ని చూసి, ఈ రోజుకు మరే పేరేదైనా పెడతారేమో అని అనుకుంటూ ఉండగానే ఆయన (సల్లం), “ఈ రోజు యౌమున్నహ్ర్ (ఖుర్బానీ రోజు అంటే జిల్ హజ్జా పదవ తారీకు) కాదా?” అని అడిగారు. “ఔను, ఎందుకు కాదు” అని అన్నాము మేము. అప్పుడాయన ఇలా సెలవిచ్చారు:

“సరే వినండి, మీ ఈ నగరం, మీ ఈ నెల మరియు మీ ఈ రోజు ఎలా నిషిద్ధం (హరాం) గావించబడిందో, అలానే మీ రక్తం, మీ సంపద, మీ మానం పరస్పరం ఒకరిపై ఒకరికి నిషిద్ధం గావించబడ్డాయి.

మీరు అతి త్వరలోనే మీ ప్రభువును చేరుకుంటారు. ఆయన మిమ్మల్ని మీ కర్మలను గురించి అడుగుతాడు. కాబట్టి చూడండి! నా తరువాత ఒకరి మెడలను మరొకరు నరుక్కునేలా ధర్మభ్రష్టులు కాకండి. నేను దైవసందేశాన్ని మీకు అందించి నా విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చుకున్నానా? చెప్పండి” అని అడిగారు.

సహాబాలందరూ ముక్త కంఠంతో “అవును” అని పలికారు.

అప్పుడు ఆయన (సల్లం), “ఓ అల్లాహ్! నీవే సాక్షి!” అంటూ, “ఎవరైతే ఇక్కడ హాజరుగా ఉన్నారో (ఈ మాటలను) హాజరుగా లేనివారికి అందించాలి. ఎందుకంటే, ఎవరికైతే (ఈ మాటలు) అందించడం జరుగుతుందో ప్రస్తుతం కొందరు (హాజరుగా) వినేవారికంటే నా ఈ మాటల పరమార్థాన్ని తెలుసుకోగలరు.”}

మరో ఉల్లేఖనంలో ఈ ఖుత్బాలో ఆయన (సల్లం) ఇలా కూడా సెలవిచ్చినట్లుంది:

“ఏ నేరం చేసినవాడైనా తనకు తాను తప్ప మరొకరికి నేరం చేయడు అనే విషయాన్ని గుర్తించండి (అంటే ఆ నేరం చేసినందుకు మరొకరు కాకుండా స్వయంగా తానే ఆ నేరం క్రింద పట్టుబడతాడని అర్థం). గుర్తుంచుకోండి! ఏ నేరగాడు అయినా తన కుమారునిపై గాని లేదా ఏ కుమారుడైనా తన తండ్రిపై గాని నేరం చేయడు (అంటే, తండ్రి చేసిన నేరానికి కుమారుణ్ణిగాని, కుమారుడు చేసిన నేరానికి తండ్రినిగాని పట్టుకోవడం జరుగదు అని). జ్ఞాపకం ఉంచుకోండి! షైతాన్ ఇప్పుడు, మీ ఈ నగరంలో ఎవ్వరూ అతణ్ణి పూజించేవారు లేరు గనుక నిరాశకు లోనైపోయాడు. ఏ కర్మలనైతే మీరు తుచ్ఛమైనవిగా నీచమైనవిగా తలుస్తున్నారో ఆ కర్మలలోనే అతణ్ణి మీరు విధేయించడం జరుగుతుంది. వాటి ద్వారానే అతడు సంతుష్టుడవుతూ ఉంటాడు.” (అంటే ఎలాంటి ప్రాధాన్యత లేని విషయాల్లో మీరు అతణ్ణి అనుసరిస్తారు అని అర్థం).

ఆ ప్రసంగం అయిన తరువాత ప్రవక్త మహనీయులు (సల్లం) అయ్యామె తష్రీక్ (11, 12, 13 జిల్ హజ్జా తేదీలు)లో ‘మినా’లోనే ఉండిపోయారు. ఈ మూడు రోజుల్లో ఆయన (సల్లం) ‘హజ్ మనాసిక్’ను (హజ్ లో నిర్వర్తించవలసిన పనులను) కూడా ఆచరించారు. అదేకాకుండా ప్రజలకు ఇస్లాం ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలను గురించి బోధిస్తూ దైవాన్ని ప్రస్తుతించారు. ఇబ్రాహీం (అలైహి) నిర్వహించిన ఖుర్బానీ ఆచారాన్ని నెలకొల్పుతూ షిర్క్ కు సంబంధించిన గురుతులన్నింటినీ నామరూపాల్లేకుండా చెరిపేశారు. ‘అయ్యామె తష్రీక్’లో ఓ రోజు ప్రసంగించారు కూడా. ‘సునన్ అబూ దావూద్’ గ్రంథంలో ఉటంకించిన ఓ ఉల్లేఖనంలో, హజ్రత్ సరాఅ బిన్తె నిభాన్ (రజి) గారి కథనం ఇలా ఉంది:

మహాప్రవక్త (సల్లం) ‘రఊస్’ రోజున ఖుత్బానిస్తూ మాకు ఇలా బోధించారు: “ఈ దినం అయ్యామె తష్రీక్ లోని మధ్య రోజు” అని అన్నారు.

నేటి ఖుత్బా కూడా నిన్నటి (యౌమున్నహ్ర్) ఖుత్బాలాంటిదే. ఇది నస్ర్ అధ్యాయం అవతరణ తరువాత ఇచ్చిన ఖుత్బా.

అయ్యామె తష్రీక్ అయిపోయిన తరువాత మరునాడు ‘యౌమున్నఫ్ర్’ అంటే 13 జిల్ హజ్జా రోజున ప్రవక్త మహనీయులు (సల్లం) మినా నుండి బయలుదేరారు. వాదియె అబ్తహాలో నివసించే ‘ఖైఫ్ బనీ కనానా’ వారి దగ్గర ఆగి సేద తీర్చుకున్నారు. మిగిలిన ఆ పగలు, రాత్రి కూడా అక్కడనే గడిపేశారు. అక్కడే జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా నమాజులు చేశారు. అయితే ఇషా నమాజు తరువాత కొంచెం సేపు నిద్రించి లేచి మళ్ళీ బైతుల్లాహ్ కు బయలుదేరారు. అక్కడికి చేరి ‘తవాఫె విదా’ (కాబా గృహపు చివరి తవాఫ్) చేశారు.

ఇప్పుడిక హజ్ మనాసిక్ (హజ్ లో ఆచరించవలసిన ఆచారాలు) పూర్తి చేసుకొని తమ వాహనాన్ని మదీనా వైపునకు మరల్చి బయలుదేరారు. మదీనాకు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకునే ఉద్దేశ్యంతో కాకుండా, ఇప్పుడు అల్లాహ్ కోసం, అల్లాహ్ మార్గంలో తిరిగి ఓ క్రొత్త కృషికి నాంది పలకడానికే ఆ ప్రస్థానం.

Related Post