అందరి ప్రవక్త ముహమ్మద్  (సల్లల్లాహు అలైహి వ సల్లం)

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో

అవును … నిజం… ఇది శ్రేయోవాదం.

“కూలి వాని చెమట ఆరక ముందే అతని కూలి చెల్లించండి”.

“సంపన్నులు (వేతనం) వాయిదా వేయడం అనేది కూడా అణచివేత కిందికే వస్తుంది”.

ఎవరీ మాటలు చెప్పింది?

ఈ వాక్యాలు చదివితే కార్మిక ఉద్యమాల్లో నినాదాల్లా ఉన్నాయి కదా!

“మీ ఉద్యోగులు మీ సోదరులు. వారికీ హక్కులున్నాయి. కాబట్టి మీరేమి తింటున్నారో అదే మీ ఉద్యోగికి ఇవ్వాలి. మీరేమి ధరిస్తున్నారో అదే మీ ఉద్యోగికి ఇవ్వాలి. వారి శక్తికి మించిన పని భారం వారిపై వేయ రాదు. పని భారం ఎక్కువ ఉంటే మీరు స్వయంగా వారితో పాటు పని చేయాలి.”

ఉద్యోగుల వేతనాలు, కార్మిక హక్కుల గురించి స్పష్టమైన నిర్దేశాలున్న వాక్యమిది.

“ఉద్యోగిని నియమిస్తున్నప్పుడు ప్రారంభంలోనే అతని వేతనం గురించి చెప్పాలి.”

“తన ఉద్యోగి పని భారాన్ని తగ్గించిన వ్యక్తికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.”

ఈ వాక్యాలన్నీ స్పష్టంగా కార్మిక వేతనాలకు సంబంధించినవి. కార్మిక హక్కులకు సంబంధించినవి. కార్మికోద్యమాలన్నీ ఇలాంటి హక్కులను సాధించడానికి జరిగినవే. ఫ్రెంచి మరియు రష్యా విప్లవాలకంటే ముందే..ఎవరు ఈ హక్కులను నొక్కి వక్కాణించింది.

“కార్మికుడిని నియమించి, అతనితో పని చేయించుకుని, అతని శ్రమకు వేతనం చెల్లించని వ్యక్తికి వ్యతిరేకంగా నేను ప్రళయదినాన నిలబడతాను.” వంటి  ఈ వాక్యంలోని “ప్రళయ దినాన” అనే పదం వాడడం వల్ల ఎవరో మత బోధకుడు చెప్పినట్లుందే!

ఎవరీ బోధకుడు?

అంధుడు అందుబాటు “బేటీ పఢావో బేటీ బచావ్” అనే నినాదాలు తరచూ వింటూంటాం.

కాని పధ్నాలుగు వందల సంవత్సరాల క్రితం చెప్పబడిన ఇలాంటి మహితోక్తులను ఒక్కసారి పరిశీలించండి.

“తల్లి ఒడి మొదటి బడి. తల్లి విద్యావంతురాలైతే మొత్తం జాతి చదువుకున్నదవుతుంది”

“ఆడపిల్లను చదివించడమంటే మొత్తం కుటుంబాన్ని చదివించడమే”

ఆడపిల్లల హక్కుల పట్ల ఇంత శ్రద్ధ చూపిన ఆ బోధకుడి మాటలకు నేటికీ, ఎప్పటికీ ప్రాముఖ్యం ఉంటుంది.

ఎవరీ మహోన్నతుడు! ఆయనే… పధ్నాలుగు వందల సంవత్సరాల క్రితం మదీనాలో ఒక శ్రేయో రాజ్యాన్ని స్థాపించి, అటు రోమన్ మహాసామ్రాజ్యం, ఇటు పర్షియా మహా సామ్రాజ్యం, మరోవైపు అరబ్బు, యూద తెగల కుట్రలు, దాడులను తట్టుకుని అనతి కాలంలోనే యావత్ ప్రపంచంలో విస్తరించిన ఒక గొప్ప ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి స్థాపకుడు, ఇస్లామ్ ప్రవక్త ముహమ్మద్ (ఆయనపై శాంతి కురియుగాక!)

ఆయన గురించి ప్రొఫెసర్ రామకృష్ణారావు ఏమన్నారంటే.. అంది. “ముహమ్మద్ (స) వ్యక్తిత్వాన్ని అందులోని మర్మాలను పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే కష్టసాధ్యం. దాన్ని కేవలం ఓ స్థూల దృశ్యంలో మటుకే చూడగలను నేను. ఎంత రమ్యమయిన దృశ్యాలో! ఎంతో నాటకీయంగా అన్నీ కదలాడుతున్నాయి. అదో ప్రవక్త ముహమ్మద్, ఇదో యోధుడు ముహమ్మద్. అదో వ్యాపారి ముహమ్మద్. ఇదో రాజకీయవేత్త ముహమ్మద్. ఇదో గొప్ప వక్త ముహమ్మద్, ఈయన సంస్కర్త ముహమ్మద్, ఆయన అనాథల ఆశ్రయం ముహమ్మద్, ఈయన బానిసల అండ ముహమ్మద్, ఇదిగో స్త్రీల రక్షకుడు ముహమ్మద్, అదో న్యాయమూర్తి ముహమ్మద్, ఇదో సాధుమూర్తి ముహమ్మద్, ఈ మహత్తరమైన పాత్రలన్నింటిలోనూ మానవ జీవితపు ఈ రంగాలన్నింటిలోనూ ఆయన ఓ హీరోలా ఓ నాయకునిలా దర్శనమిస్తాడు.” (“ముహమ్మద్ ది ప్రాఫెట్ ఆఫ్ ఇస్లామ్”)

కాస్త ఆలోచించండి –

నేడు మానవ సముదాయం ఎన్నో సవాళ్లల్లో, మరెన్నో సంక్షో భాల్లో ఇరుక్కుపోయింది. ఎక్కడ చూసినా అధికారం కోసం, ఆదాయం కోసం సంఘర్షణ కనబడుతుంది. నైతిక విలువలు అడుగంటి పోతున్నాయి. మనశ్శాంతి కనుమరుగైపోయింది. అన్నింటా అయోమయం  తాండవిస్తోంది. సమాజంలో ఏ ఒక్క రంగమూ కాలుష్యానికి అతీతంగా లేదు. సత్యం, న్యాయం, ధర్మం మృగ్యమైపోయింది. నమ్మకం, నిజాయితీల స్థానంలో అపనమ్మకాలు, అవినీతి తాండవిస్తున్నాయి. ఆధ్యాత్మిక విలువలు పతనమయ్యాయి. రాజకీయాల్లో సేవాభావం నశించింది. దాని స్థానంలో స్వప్రయోజనాలకు పాకులాడే ధోరణి ప్రబలింది. అన్ని రంగాల్లో వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. డ్రగ్స్ మత్తు యువతను చిత్తు చేస్తోంది. ఎడతెగని ఇంటర్నెట్ వ్యామోహంలో యువత చిక్కుకుని నిర్వీర్యమైపోతోంది. విద్యావ్యవస్థలోని లోపాలు మనల్ని వెంటాడు తున్నాయి.

 

జ్ఞానజ్యోతులు వెలుగుతున్నాయి కాని ఇవే జ్యోతులు అనేక అపార్ధాలను, అపనమ్మకాలను పెంచుతున్నాయి. ఒకవైపు సంపద గుట్టలు గుట్టలుగా పడి ఉంటే మరోవైపు పెద్ద సంఖ్యలో ప్రజలు కూటికి గతిలేని వారిగా బతుకుతున్నారు. మనిషి మనిషికి మధ్య సోదర సంబంధాలు కనబడడం లేదు. ఇలాంటి సమాజంలో మనం శ్వాస తీసుకుంటున్నాం. ఈ పరిస్థితుల నుండి గట్టెక్కే మార్గం ఏదైనా ఉందా?

ఈ సంక్షోభం నుండి బయటపడేందుకు ఒకే ఒక్క ఆశాకిరణం, కారుచీకటిలో కాంతిరేఖ, మానవాళికి కారుణ్యకెరటంగా ప్రభవించిన ప్రవక్త ముహమ్మద్ (స) మాత్రమే.

రండి! ఆయన గురించి తెలుసుకుందాం!!

ఆయనే ముహమ్మద్ (స). క్రీ.శ. 571, ఏప్రిల్ 20వ తేదీన మక్కా నగరంలో జన్మించారు. ఆనాటి పరిస్థితులకు వ్యధ చెంది వాటిని పరిష్కరించే దిశగా మేధోమథనం చేస్తూ పరిస్థితులకు పరిష్కారంగా సమగ్రమైన, సంపూర్ణమైన, సార్వజనీనమైన బోధనలను మానవాళికి అందించారు. ఆ బోధనలు నేటికీ ఏనాటికైనా మానవులందరికీ చాలా అవసరం. వారి బోధనలు మానవ ఔన్నత్యానికి, స్త్రీ జనోద్దరణకు యువతను సరియైన దిశలో పెట్టడానికి ఎంతైనా  అవసరమని ఒప్పుకోక తప్పదు.

ఆయన (స) గురించి ప్రఖ్యాత బ్రిటీషు రచయిత జార్జి బెర్నార్డ్ షా ఏమన్నారంటే…

“ముహమ్మద్ (స) వంటి మనిషి నేడు ప్రపంచానికి చాలా అవసరం. మధ్యయుగాల్లో మతావలంబీకులు వారి అజ్ఞానం, పక్షపాతాల కారణంగా ఆయన్ను తప్పుగా చిత్రీకరించారు. ఆయన క్రైస్తవానికి శత్రువని భావించడం వల్ల అలా చేశారు. కాని ఆయన జీవిత చరిత్ర తెలుసుకున్న తర్వాత నాకు అద్భుతమనిపించింది. ఆయన ఎన్నడూ క్రైస్తవానికి శత్రువు కాదు. మానవాళి సంరక్షకుడిగా ఆయన్ను అభివర్ణించాలి. నా అభిప్రాయంలో ఆయనలాంటి వ్యక్తి ఆధునిక ప్రపంచాన్ని నిరంకుశంగా పరిపాలిస్తే అతడు ఈనాటి సమస్యల్ని పరిష్కరించడంలో విజయం సాధించి తద్వారా ప్రపంచానికి నేడు అన్నింటికన్నా అధికంగా కావలసిన శాంతి సంతోషాలను పంచి పెట్టగలడని నా దృఢ విశ్వాసం.” (ద జన్యూన్ ఇస్లామ్, సింగపూర్ వాల్యూమ్ – 1, నెం. 8, 1936)

చక్రవర్తిగా పేదరికాన్ని అనుభవించారు

ఆయన రాజ్యానికి అధినేత! మహాప్రవక్త! అరేబియా ద్వీపకల్పానికి పాలకుడు! ప్రధాన న్యాయమూర్తి! సర్వ సైన్యాధ్యక్షుడు! బోధకుడు… రారాజుగా అధికారం పొందినా మదీనాలో ఆయన నివసించిన గృహం మట్టి ఇటుకలతో చేసిన సాధారణ ఇల్లు. ఆయన ఇంట అనేక రోజుల పాటు పొయ్యి వెలిగేది కాదు. కేవలం కొన్ని ఖర్జూరాలు, నీళ్లతోనే గడిపే వారు. రోజుల తరబడి పస్తులుండేవారు. జీవితంలో చివరి వరకూ కప్పుకోవడానికి ఒక చిన్న దుప్పటి సైతం లేని పరిస్థితిని స్వీకరించారాయన.

అమ్మాయి పుట్టుక శుభం

ఆనాటి అరబ్బు సమాజంలో ఇంట్లో ఆడపిల్ల పుట్టుకను నామోషిగా భావించేవాళ్లు. అప్పుడే పుట్టిన పసికందుల్ని, ముక్కుపచ్చలారని ఆడపిల్లలను సజీవ సమాధి చేసేవారు. ముహమ్మద్ (స) ప్రవక్తగా ప్రభవించిన తరువాత ఈ దురాచారాన్ని సంపూర్ణంగా రూపుమాపారు. ఆడపిల్ల పుట్టుకను ఇంటికి శుభోదయంగా మార్చారు. ఆడపిల్లను పెంచి పోషించి స్వర్గాన్ని పొందే అర్హతను సంపాదించు కోవటానికి ఆనాటి ప్రజల్లో పరివర్తన తెచ్చారు. మరి నేడు గొప్ప నాగరికులుగా, ఆధునికులుగా చెప్పుకునే నాగరిక ప్రజల పరిస్థితి చూడండి, గర్భస్థ పిండం ఆడపిల్ల అని తెలిస్తే చాలు, తల్లికడుపులోనే ఆ పసికూనను హతమార్చ డానికి వెనుకాడటం లేదు.

ఇప్పటికీ ఆడపిల్ల పుట్టడాన్ని అవమానంగా భావించే వాతావరణం ఉంది. నేడు కూడా ఆడ పిల్లలను పుట్టకముందే చంపేసే, భ్రూణహత్యలకు పాల్పడే సమాజం ఉంది. కాని ఆనాడు ప్రవక్త ముహమ్మద్ (స) చెప్పిన మాటలు గమనార్హమైనవి.

ఆడ పిల్లలను పెంచి పోషించి దయతో వ్యవహరించిన వ్యక్తికి అల్లాహ్ స్వర్గం ప్రసాదిస్తాడని మహాప్రవక్త (స) బోధించారు.

“కూతుళ్ళను పెంచి పోషించడానికి కష్టాలపాలయినప్పటికీ, సహనంతో వ్యవహరించిన వ్యక్తికి ఆ కూతుళ్ళు నరకాగ్నిని అడ్డుకునే వారవుతారు” అంటూ ఆడపిల్లల పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో చెప్పా రాయన.

తన కూతురు ఫాతిమా (రజి) వస్తే ప్రవక్త (స) వెంటనే లేచి నిలబడేవారు, ఎంతో ఆదరంగా ప్రేమగా, సాదరంగా ఆమెను ఆహ్వానించేవారు.

“ఆడపిల్లలు నరకాగ్ని నుంచి కాపాడే ఢాలు వంటివారు” అన్నారు మరో సందర్భంలో.

మగపిల్లలకు, ఆడపిల్లలకు మధ్య ఎలాంటి వివక్షకు అవకాశం లేదని స్పష్టంగా ప్రకటించారు ప్రవక్త ముహమ్మద్ (స).

“ఎవరైనా ఇద్దరు అమ్మాయిలను పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పి మంచి వరుడితో పెళ్లి చేసినట్లయితే అతడు నాతో స్వర్గంలో ఉంటాడని తెలియజేశారు.” ఆడపిల్లల పుట్టుక, పెంపకం, వారి వివాహం చేయడం ఎంతటి పవిత్ర కార్యమో ఈ బోధన ద్వారా బోధపడుతుంది.

స్త్రీ జాతి అభివృద్ధికి మహోన్నత పునాదులు..

ఆ రోజుల్లో అరేబియాలో గాని, ఇతర దేశాలలోగాని, మహిళల స్థితి చాలా దారుణంగా ఉండేది. మహిళలను కేవలం తమ కామవాంఛ తీర్చే అంగడి సరుకుగా చాలా సమాజాలలో భావించేవారు. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా స్త్రీలకు ఇస్లామ్ ధర్మం ఆస్తి హక్కును ఇచ్చింది. భర్తను కోల్పోయిన స్త్రీలు జీవితాంతం మోడువారిన చెట్టులాగా బ్రతక వలసిన అవసరం లేదని, వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చని ప్రకటించడమే కాదు ముహమ్మద్ ప్రవక్త (స), వితంతువుగా జీవనం సాగిస్తున్న 40 సంవత్సరాల వయస్సుగల ఖదీజా (రజి)ను వివాహమాడి ఆచరణాత్మకంగా నిరూపించారు. తల్లిపాదాల క్రింద స్వర్గం ఉంది అని ప్రవచించి తన తల్లికి సేవ చేసుకుని స్వర్గాన్ని పొందే అర్హతను సంపాదించుకోవాలని ముహమ్మద్ (స) ప్రబోధించారు. ఆ విధంగా మాతృమూర్తికి మహోన్నత స్థానాన్ని ప్రసాదించారు.

దయాగుణం-మానవ సేవ

ఆయన ఒకరోజు… ఏం చేశారో తెలుసా..? అవును సాయంకాలం చీకట్లు కమ్ముకుంటున్న వేళ..

ఒక వృద్దమహిళ భుజాలపై బరువైన మూట ఎత్తుకుని నడవలేక నడవడాన్ని గమనించారు ప్రవక్త (స). ఆమె ఊరు వదలి పోతున్నది. ఆమెకు సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ప్రవక్త ముహమ్మద్ (స) స్వయంగా ఆమె మూటను తన భుజాలపై ఎత్తుకుని ఆమెను మక్కా శివార్ల వరకు తీసుకువెళ్ళారు. నడుస్తూ, ‘ఇంత చీకటివేళ ఊరు వదిలి ఎక్కడికి వెళుతున్నావమ్మా’ అని అడిగారు. ఆమె జవాబిస్తూ “ఎవరో ముహమ్మద్ అట మన పూర్వీకుల ధర్మాన్ని కాదని

ఏకేశ్వరవాదాన్ని బోధిస్తున్నాడట. ఆయన మాటలు విని నేనెక్కడ నా ధర్మాన్ని వదిలిపోతానోనని ఈ నగరం అవతల ఊరిలో సురక్షితంగా బ్రతకవచ్చని మక్కా నగరాన్ని వదిలిపోతున్నానని వాపోయింది. తనకు ఈ పరిస్థితి వచ్చినందుకు ప్రవక్తను నానా విధాలుగా శాపనార్థాలు పెట్టింది. నాకు ఇంత సహాయం చేసిన నీ మేలు మరవలేను అని చివరికి నీవెవరవు నాయనా, నీవు జాగ్రత్త, ఆ ముహమ్మద్(స) వలలో పడబోకు అని కూడా సలహా ఇచ్చింది. అప్పుడు ఆయన చిరునవ్వుతో “నేనే ఆ ముహమ్మద్ ని” అని అన్నారు. ఆ మహిళ నమ్మలేక ఆశ్చర్యంతో ఆ ముహమ్మద్(స) నీవేనా? అని మళ్లీ అడిగింది. ఈ ముహమ్మద్(స) ఇంత జాలి హృదయం కలవాడా. వీధుల్లో తిరుగుతూ ప్రజల బాగోగులు తెలుసుకుంటూ సహాయం చేస్తాడా! అని ఆశ్చర్యపోయి అతనిపై ఆమె విశ్వాసం ప్రకటించింది.

సహనం, క్షమాగుణం

ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలో ఒక అరబ్బు పల్లెవాసి మస్జిదె నబవీకి వచ్చాడు. అక్కడే ఒక మూల మూత్ర విసర్జన చేయసాగాడు. ప్రవక్త సహచరులు అది చూసి కోపంగా అతన్ని కొట్టడానికి సిద్ధ మయ్యారు. ప్రవక్త (స) వారిని అడ్డుకుని, అతడిని వదిలేయమని చెప్పారు. మూత్రం పోసిన చోట నీళ్ళతో శుభ్రం చేయండని చెప్పారు.

‘మీరు ప్రజలకు సదుపాయాలు, సౌలభ్యాలు కలుగజేయడానికి ఉన్నారే కాని వారికి ఇబ్బందులు, కష్టాలు కలుగజేయడానికి కాద’న్నారు ప్రవక్త (స),

విషం పెట్టిన వనితను వదిలేశారు

ఒక యూదస్త్రీ ఆహారంలో విషం కలిపి ప్రవక్త ముహమ్మద్ (స) ముందుంచింది. ముహమ్మద్ (స) దేవుని ప్రవక్త, దైవికంగా ఆయనకు అందులో విషం ఉన్న విషయం తెలిసింది. ఆ యూద స్త్రీని

పిలిచి ఇలా ఎందుకు చేశావన్నారు. ఆమె స్పష్టంగా నిన్ను చంపడానికే విషం కలిపా నని చెప్పింది. ప్రవక్త (స) జవాబిస్తూ, “అల్లాహ్ నీకు నా పై అదుపు ఇవ్వడమన్నది అసంభవం” అన్నారు. మానవాళికి కారుణ్యంగా అవతరించిన ప్రవక్త ముహమ్మద్ (స) తన స్వవిషయంలో మాత్రం ఆమెను క్షమించి పంపించి వేశారు. (ముత్తఫకున్ అలైహ్)

ప్రాణం తీయాలన్న వారికి ప్రాణ భిక్ష

” ప్రవక్త ముహమ్మద్ (స)పై ఎన్నో సార్లు హత్యాయత్నాలు జరిగాయి. ప్రతిసారీ హత్యాయత్నానికి పాల్పడిన వారిని ఆయన క్షమించారు. అన్నింటికి మించి మక్కా విజయం తర్వాత శత్రువులకు క్షమాభిక్ష ప్రసాదించారు. అందులో ఆయన పినతండ్రిని చంపి కాలేయం నమిలిన కిరాతకురాలు కూడా ఉంది. ఇంకా ఆయన (స) ఇలా బోధించారు; “ప్రతీకారం తీర్చుకునే శక్తి ఉన్నప్పటికీ తన కోపాన్ని అదుపు చేసుకున్న వ్యక్తిని ప్రళయదినాన అల్లాహ్ పిలిచి స్వర్గం ప్రసాదిస్తాడు. (తిర్మిజీ, అబూ దావూద్, ఇబ్నెమాజ)

“కుస్తీలో (మల్ల యుద్ధంలో) ప్రత్యర్థిని చిత్తు చేసేవాడు పహిల్వాన్ కాదు. కోపం వచ్చి నప్పుడు తనను తాను నిగ్రహించుకున్నవాడే నిజమైన పహిల్వాన్” (ముస్లిమ్)

తల్లిదండ్రుల హక్కులు

“నీ ప్రభువు ఇలా నిర్ణయం చేశాడు: మీరు కేవలం ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించకండి. తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహ రించండి. ఒకవేళ మీవద్ద వారిలో ఒకరు గాని ఇద్దరు గాని ముసలివారై ఉంటే, వారి ముందు విసుగ్గా “ఛీ” అని కూడా అనకండి. వారిని కసురుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి. మృదుత్వమూ, దయా

భావమూ కలిగి వారి ముందు వినమ్రులై ఉండండి. ఇలా ప్రార్థిస్తూ ఉండండి: ‘ప్రభూ! వారిపై కరుణ జూపు, బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించినట్లు” బండి

(దివ్యఖుర్ఆన్ 17: 23)

ఇంకా ఆయన (స) ఇలా బోధించారు; భగవాడు “తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది. తండ్రి స్వర్గపు ముఖ ద్వారం”.

“అల్లాహ్ ప్రసన్నత తల్లిదండ్రుల ప్రసన్నతలో దాగి ఉంది. అలాగే అల్లాహ్ ఆగ్రహం తల్లిదండ్రుల ఆగ్రహంలో ఉంది.” (తిర్మిజి)

పొరుగువారి హక్కులు అందరం

ఇరుగు పొరుగు వారితో స్నేహం చేసి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటే కలిగే ఆనందం చక్కటి ఆరోగ్యానికి బాట వేస్తుంది. పొరుగు వారితో సఖ్యతగా ఉండటమే మనిషి మనుగడకు సోపానమని నేడు నిపుణులు చెబుతున్నారు. ” ఈ మాటలను ప్రవక్త ముహమ్మద్ (స) 14 శతాబ్దాల క్రితమే పొరుగువారి హక్కుల గురించి ఇలా చెప్పారు.

“మీ పొరుగువాడు మీ సహాయం కోరితే మీరు సహాయం చేయండి. అతను మీ నుంచి రుణం కోరితే మీ శక్తి మేరకు రుణసహాయం చేయండి. అతనికి ఏమైనా అవసరం ఉంటే ఆ అవసరాన్ని పూర్తి చేయండి. అతను జబ్బుపడితే పరామర్శించండి. అతని ఇంట్లో ఏదన్నా శుభకార్యం ఉంటే శుభాకాం క్షలు చెప్పండి. అతను కష్టాల్లో ఉంటే సానుభూతి చూపించండి. పొరుగు వాని ఇంటికన్నా ఎత్తుగా మీ ఇల్లు కట్టి అతనికి గాలి, ఎండ రాకుండా అడ్డు పడకండి. ఒకవేళ అనివార్యమైతే అతని అనుమతి తీసుకోవాలి. మీ ఇంట ఏదైనా మంచి కూర వండుతుంటే దానిని (నీళ్లు కలిపి అయినా సరే ఎక్కువ చేసి) కొంత కూర పొరుగువారికి పంపండి. ఏవైనా పండ్లు కొంటే కొన్నింటిని పొరుగువారి ఇంటికి కూడా పంపండి.” (తబ్రానీ)

“పొరుగువాడు ఆకలితో ఉంటే తాను కడుపునిండా తినేవాడు నిజమైన దైవవిశ్వాసి కాజాలడు” అన్నారు.

అనాథలు, వితంతువుల పట్ల ప్రేమా, వాత్సల్యాలు

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (స) తన మనుమలను భుజాలపై ఎక్కించుకుని ఆడిస్తున్నారు. అది చూసి ఒక అనాథ పిల్లవాడు బాధ పడడం ఆయనకు కనబడింది. వెంటనే మనుమలను దించి ఆ పిల్ల వాడిని భుజాలపై ఎక్కించుకుని ఓదార్చారు. అనాథల పాలిట ప్రవక్త (స) చూపించిన దయాగుణం సాటి లేనిది “వితంతువుల కోసం, అనాథల కోసం కష్టపడేవ్యక్తి పగలంతా ఉపవాసం ఉండి, రాత్రులలో ఆరాధనల్లో గడిపిన వ్యక్తితో సమానం” అన్నారు ప్రవక్త ముహమ్మద్ (స).

అనాథను సంరక్షించే వ్యక్తికి అల్లాహ్ స్వర్గం ప్రసాదిస్తాడని చెప్పారు.

సేవకుల పాలిట శ్రేయోభిలాషి

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (స) తన సేవకుడు పనిచేయడంలో ఇబ్బంది పడడాన్ని గమనించారు. వెళ్ళి చూస్తే అతనికి జ్వరముంది. వెంటనే ప్రవక్త ఆ పనిని తాను తీసుకుని అతన్ని వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. అంతేకాదు, ఎప్పుడైనా పనిలో ఇబ్బంది ఉంటే తనను పిలవాలని, సంకోచించవలసిన అవసరం లేదని చెప్పారు.

“సేవకుల విషయంలో, వారి శక్తికి మించిన భారం వేయకండి. అలాంటి పని ఉంటే వారికి సహాయపడండి. పనిలో పాలు పంచు కోండి.” (ముత్తఫకున్ అలైహ్)

“మీరు భూవాసులపై దయచూపండి. ఆకాశవాసి మీపై దయ చూపుతాడు” అని కూడా ప్రబోధించారు. (తబ్రానీ, హాకిమ్)

భూతదయ

జంతువుల పట్ల దేవునికి భయపడండి అని స్పష్టంగా హెచ్చరించారు.

ఒకసారి కొందరు ఒక పక్షి పిల్లలను చూసి వాటిని పట్టుకెళ్లారు. ఆ తల్లి పక్షి ఆకాశంలో చక్కర్లు కొడుతుంది. కోపంగా, బాధగా రెక్కలు కొట్టుకుంటోంది. ప్రవక్త (స) అక్కడికి వచ్చి అది చూసి; ఆ తల్లి పక్షిని బాధ పెట్టిందెవరు, వెంటనే ఆ పిల్లలను గూట్లో వదిలి రండి అని మందలించారు.

బక్కచిక్కిన ఒక ఒంటెపై చాలా బరువు వేసి ఒక వ్యక్తి తీసు కెళ్ళడం చూసి, దేవుని పట్ల నీకు భయం లేదా? ఆ జంతువును అంత బాధ పెడుతున్నావెందుకని కోప్పడ్డారు.

ప్రవక్త ముహమ్మద్ (స) ఒకసారి తన సహచరులకు ఒక గాథను చెప్పారు. ఒక మనిషి నడిచి నడిచి అలసిపోయాడు. అతడికి చాలా తీవ్రమైన దాహమేసింది. దారిలో ఒక బావి కనబడింది. ఆయన నీరు తాగి వెళుతుండగా ఒక కుక్క కనబడింది. దప్పికతో ఆ కుక్క నాలుక

వేలాడుతోంది. దాహం తీరడానికి ఆ కుక్క తడి మట్టి నాకుతోంది. దప్పికగొన్న ఆ కుక్కను చూసి అతను చాలా జాలిపడ్డాడు. తన దాహం కూడా గుర్తొచ్చింది. చివరకు బావిలో దిగాడు. తన తోలు మేజోళ్ళలో నీళ్ళు నింపి కుక్కకు తాపించాడు. ఆ మనిషి చేసిన పని చూసి అల్లాహ్ కూడా చాలా సంతోషించాడు. అతడికి మన్నింపు ప్రసాదించాడు. ప్రవక్త (స) చెప్పిన ఈ మాటలు విని సహచరులు, ప్రవక్తా! జంతువు లపై కరుణ చూపించినా పుణ్యం లభిస్తుందా అని అడిగారు. ప్రవక్త (స) జవాబిస్తూ ఏ ప్రాణికైనా నీరు తాపిస్తే పుణ్యం లభిస్తుందని అన్నారు. (బుఖారీ)

పర్యావరణం-పరిశుభ్రత

“ప్రళయం వస్తున్నప్పటికీ చేతిలో ఒక మొక్క ఉంటే దాన్ని నాటండి” అన్నారాయన.

“మీరొక మొక్క నాటినా, ఒక విత్తనం నాటినా ఆ తర్వాత దాని నుంచి వచ్చే పండ్లను ప్రజలు, జంతువులు, పక్షులు ఏవి తిన్నా ఆ పుణ్యం అంతా మీకే దక్కుతుంది” అని ప్రోత్సహించారు.

ప్రజలు కూర్చునే నీడ ప్రదేశాల్లో, నీటి వనరులున్న ప్రదేశాల్లో, బాటల్లో మలమూత్ర విసర్జనను తీవ్రంగా వారించారు.

ప్రజలు నడిచే బాటలో పడి ఉన్న ముండ్లను తీసివేయడం కూడా ఒక సత్కార్యంగా ప్రోత్సహించారు. ముస్లిమేతరులతో సంబంధాలు

ఇస్లామ్ ను ఆయన కరవాలంతో వ్యాపింపజేశారని చాలా మంది అనుకుంటారు… నిజమా… అంటే ఆయన ముస్లిమేతరులందరికీ పెద్ద విరోధిగా ఉండాలి. కాని వాస్తవమేమిటి? మక్కాలో ఆయన(స)పై శత్రువులు హత్యాయత్నానికి పాల్పడినప్పుడు, మక్కా నుంచి మదీనా తరలిపోక తప్పని పరిస్థితిలో, మక్కా శత్రువుల కంటపడకుండా, ఎడారి దారుల్లో మదీనాకు చేరుకోవడానికి ఆయన గైడ్ లా నియమించుకున్న వ్యక్తి ఒక ముస్లిమేతరుడే. అప్పటి పరిస్థితిలో, ఆయన తలపై మక్కా శత్రువులు చాలా పెద్ద బహుమతి ప్రకటించిన నేపథ్యంలో ఒక ముస్లిమేతరుడిని పూర్తిగా నమ్మి తనకు గైడ్ గా నియమించుకుని ఆయన తన సహచరుడు అబూ బక్ర్ (రజి)తో కలిసి మదీనా వెళ్ళారు. ముస్లిమేతరులతో ఆయన సంబంధాలకు ఇంతకు మించి ఉదాహరణ కావాలా? ఈ వైఖరి ప్రవక్త (స) జీవిత కాలమంతా కనిపిస్తుంది.

మూఢనమ్మకాల ను మొగ్గలోనే త్రుంచేశారు

ప్రవక్త ముహమ్మద్ (స) కుమారుడు ఇబ్రాహీమ్ చిన్నవయసు లోనే చనిపోయాడు. ప్రవక్త అత్యంత విషాదానికి గురయ్యారు. అంత్యక్రియలు జరిగి స్మశానవాటిక నుంచి వెనక్కి వచ్చిన కొన్ని గంటల్లో సూర్యగ్రహణం సంభవించింది. ఆ సూర్యగ్రహణం ప్రవక్త కుమారుడి మరణం వల్లనే వచ్చిందని, ఇదొక కీడుకు సంకేతమని చూసిన వాళ్ళు చెప్పుకోవడం ప్రారంభించారు. దేవుడు తన ప్రవక్త (స)కు దీనిద్వారా ఏదో సందేశం ఇస్తున్నాడని కూడా చెప్పుకున్నారు. ఈ అభిప్రాయా లన్నింటిని ప్రవక్త ఖండించారు. ఆయన గట్టిగా చెబుతూ “సూర్య చంద్రులు రెండూ దేవుడి సృష్టితాలే. ఎవరి మరణం వల్లనూ వాటి కాంతి తగ్గదు” అన్నారు. ఆ విధంగా ప్రవక్త ఆ క్లిష్ట సమయంలో కూడా అనుచరులకు సరయిన మార్గంలో శిక్షణ ఇచ్చారు. మానవ జాతి ప్రళయం వరకు మూఢనమ్మకాలకు గురి కాకుండా దారి చూపారు.

మానవులంతా సమానులే

“ప్రజలారా! మీ ప్రభువు ఒక్కడే, మీ తండ్రి ఒక్కడే. మీరందరూ ఆదమ్ సంతతికి చెందిన వారు. ఆదమ్ మట్టితో చేయబడ్డారు.

జాగ్రత్త! ఒక అరబ్బుకు అరబ్బేతరుని పైగాని, అరబ్బేతరునికి అరబ్బుపై గాని, తెల్లవాడికి నల్లవాడిపై గాని, నల్లవాడికి తెల్లవాడిపై గాని ఎలాంటి ఆధిక్యతా లేదు. ఆధిక్యత కేవలం దైవభీతి ఆధారంగా మాత్రమే. మీలో అందరికన్నా ఎక్కువ ధర్మపరాయణుడే ఆదరణీయుడు.” అసమానత లను రూపుమాపి, సమానత్వ భావాన్ని పెంపొందించేందుకు ప్రవక్త(స) చెప్పిన ఈ మాటలు ఇప్పటికీ అనుసరణీయమే కాదు ఆవశ్యకం కూడా.

అంతరిక్షంలో కాలుమోపుతున్న నేటి మనిషి వీటి గురించి ఎంతైనా ఆలోచించవలసిన అవసరం ఉంది. అసమానతలన్నింటినీ నిర్మూలించి ఒక సత్సమాజాన్ని స్థాపించారాయన. ఆయనకు అత్యంత సన్నిహితుడైన సహచరుడు హజ్రత్ బిలాల్ (ర) ఓ నల్ల బానిస. మరో సహచరుడు సల్మాన్ ఫారసీ కూడా బానిసే. హజ్రత్ బిలాల్ (ర)కు ఇస్లామీయ చరిత్రలో ఎంత గొప్ప గౌరవం లభించిందంటే, మక్కా విజయం తర్వాత ప్రవక్త ముహమ్మద్ (స) ఆయన్ను పిలిచి కాబాగృహం పైకి ఎక్కి అజాన్ ఇవ్వమని అన్నారు. అలా మక్కా విజయం తర్వాత కాబా పైన నిలబడి అజాన్ ఇచ్చే గౌరవం లభించిందాయనకు. బానిసలను చక్రవర్తులుగా నిలబెట్టగలిగిన ఘనత ఆయన బోధనలదే.

జీవించే హక్కు

“… ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపి చనట్లే, ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడినవాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే.” (దివ్యఖుర్ఆన్ 5 : 32) – ప్రవక్త (స) స్పష్టంగా చేసిన ఒక ప్రకటన కూడా ఇక్కడ గమనించ దగ్గది. “ఇస్లామీయ రాజ్యంలో ముస్లిమేతర పౌరుడిని ఎవరైనా అణిచి వేతకు గురిచేస్తే, తీర్పుదినాన అతడి పక్షాన నేను వాదిస్తాను.” న్యాయం పొందే హక్కు:

“విశ్వసించిన ప్రజలారా! న్యాయ ధ్వజవాహకులుగా నిలబడండి, అల్లాహ్ కొరకు సాక్షులుగా ఉండండి. మీ న్యాయం మీ సాక్ష్యం మీకూ, మీ తల్లిదండ్రులకూ, మీ బంధువులకూ ఎంత హాని కలిగించినా సరే, కక్షిదారులు భాగ్యవంతులయినా, నిరుపేదలయినా అల్లాహ్ వారి శ్రేయస్సును మీకంటే ఎక్కువగా కాంక్షిస్తాడు.” (దివ్యఖుర్ఆన్ 4 : 135)

ప్రతి కేసును ప్రవక్త (స) ప్రత్యేకంగానే విచారించేవారు. నిష్పక్షపాతానికి, న్యాయానికి అత్యున్నత ఆదర్శంగా నిలిచారు. ఆయన (స) చెప్పిన తీర్పులు పరిశీలిస్తే న్యాయ వ్యవహారాల్లో ఆయన ఎంత అవగాహనతో వ్యవహరించారో తెలుస్తోంది.

మఖ్జూమ్ తెగకు చెందిన ఒక స్త్రీ దొంగతనం చేస్తూ దొరికి పోయింది. ఆమెకు ఇస్లామీయ శిక్షాస్మృతి ప్రకారం చేయి నరికే శిక్ష విధించడం ఖురైషులకు ఇష్టం లేదు. ఆమె పక్షాన ఎవరైనా కలుగజేసు కుని ప్రవక్తకు సిఫారసు చేయాలని వారు భావించారు. ప్రవక్త ముహమ్మద్ (స) ఎంతగానో అభిమానించే ఉసామా అనే యువకుడితో సిఫారసు చేయించాలని భావించారు. ఆ రకంగా ఆ మహిళను శిక్ష నుంచి కాపాడాలనుకున్నారు. కాని ఉసామా ఈ విషయాన్ని ప్రవక్త వద్ద ప్రస్తావించినప్పుడు ఆయన ముఖం ఆగ్రహంతో కందిపోయింది. “దేవుని చట్టాల్లో మార్పు చేయాలని మీరెలా అనుకున్నారు. గతంలో చాలా జాతులు కులీనులు నేరాలు చేస్తే ఉపేక్షించి, పేదలను మాత్రమే శిక్షించేవి. అదే వారి వినాశానికి కారణమయింది. నా ప్రాణాలు ఎవరి అధీనంలో ఉన్నాయో ఆ దేవుని సాక్షి ఒకవేళ నా కుమార్తె ఫాతిమా(ర) ఈ నేరం చేసినా, నేను ఆమె చేయి నరికే శిక్ష విధించేవాణ్ణి” అన్నారాయన.

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (స) ప్రసంగిస్తున్నప్పుడు మస్జిదులో బనీ తలాబా తెగను చూసిన ఒక అన్సారీ (మదీనా ముస్లిమ్) లేచి “ప్రవక్తా (స)! వీళ్ళు బనీ తలాబా తెగ వాళ్లు, వాళ్ళ పూర్వీకులు నా కుటుంబ సభ్యులను హత్యచేశారు. దానికి ప్రతీకారంగా వారిలో ఒకడికి మరణశిక్ష విధించండి” అన్నాడు. ప్రవక్త(స) జవాబిస్తూ “తండ్రిపై పగను కొడుకు పై తీర్చుకోలేము” అన్నారు.

“ఆగ్రహంగా ఉన్నప్పుడు న్యాయమూర్తి తీర్పు చెప్పరాదు” అని హితవు పలికారు.

ఇస్లామ్ లో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా, పాలనా వ్యవస్థకు సంబంధం లేకుండానే వ్యవహరించాలి. న్యాయమూర్తి ఇస్లామీయ షరీఅత్ ను అమలు చేయడానికి మాత్రమే బాధ్యుడు. ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా ఆ విధిని నిర్వర్తించాలి. ఆయన అధికార పీఠానికి జవాబు చెప్పుకోవలసిన అవసరం లేదు. కేవలం దేవుడికి మాత్రమే జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. స్వతంత్ర న్యాయ వ్యవస్థను ప్రారంభించిన ఘనత ముహమ్మద్ ప్రవక్త(స)కే దక్కుతుంది.

ప్రజాస్వామ్యం పరిఢవిల్లిన వేళ.. ..

ప్రశ్నించడం ప్రజాస్వామ్యానికి పునాదన్నది మరిచిపోతున్నారు. నేడు ప్రశ్నిస్తే మన పాలకులు ప్రశ్నించడం మంచిది కాదంటున్నారు. కాని ప్రశ్నించడాన్ని ప్రవక్త ముహమ్మద్ (స) ప్రోత్సహించారు. అందు వల్లనే ఆ తర్వాత ఖలీఫాల కాలంలోను పాలకులను నిలదీసిన సంఘట నలు కోకొల్లలు. ఉదాహరణకు; ఆడు హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (ర) ఖలీఫాగా ఉన్న కాలంలో ప్రజా ధనాగారంలోకి చాలా వస్త్రాలు వచ్చాయి. వచ్చిన వస్త్రాల్ని ఆయన ప్రజ లందరికీ సమానంగా పంచేశారు. ఆయన వాటాకు వచ్చిన వస్త్రంతో కుర్తా కుట్టించుకున్నారు. అది ధరించి ఆయన మస్జిదులో నిలబడి ప్రసంగిస్తూ “ప్రజలారా! వినండి. ఆదేశాలను పాటించండి” అన్నారు. వింటున్న శ్రోతల్లో ఒక వ్యక్తి లేచి నిలబడి మేము వినేదీ లేదు, ఆదేశా లను పాటించేది కూడా లేదన్నాడు. ఎందుకని? అని హజ్రత్ ఉమర్ (ర) ప్రశ్నించారు. ఆ వ్యక్తి జవాబిస్తూ ప్రజలందరికీ సమానంగా వస్త్రం దొరికింది. అంత చిన్న వస్త్రంతో మీరు ఇంత పెద్ద చొక్కా కుట్టించడం ఎలా సాధ్యం ? మీరింత పెద్ద చొక్కా ఎలా కుట్టించారో చెప్పండి అని నిలదీశాడు. హజ్రత్ ఉమర్ (ర) తన కుమారుడు అబ్దుల్లా(ర)కు సైగ చేసి జవాబు చెప్పమన్నారు. ఆయన లేచి తాను తన వాటాగా వచ్చిన వస్త్రాన్ని కూడా తన తండ్రికి ఇచ్చేశానని, రెండింటిని కలిపి ఆయన కుర్తా కుట్టించుకున్నారని వివరించాడు. ఈ జవాబు విన్న తర్వాత ఆ వ్యక్తి సంతృప్తిగా, “ఇప్పుడు చెప్పండి! మీ మాట వింటాము, ఆదేశాలు పాటిస్తాము” అన్నాడు.

హాస్యం

ప్రవక్త (స) ఎంత పనుల ఒత్తిడిలో ఉన్నప్పటికీ చాలా సరదాగా ఉండేవారు. పిల్లలతో ఆడుకునేవారు. పిల్లలు ఆయనపై నీళ్ళు చిలకరించడం వంటివి కూడా చేసేవారు. ఒకసారి ఒక వృద్ధ మహిళ ఆయన వద్దకు వచ్చి నేను స్వర్గంలో ప్రవేశించగలనా? అని అడిగింది.

ఆయన, లేదు అలా కుదరదన్నారు. స్వర్గంలో ముసలివాళ్లు ప్రవేశించలేరని అన్నారు.

ఈ మాటలు విని ఆమె పాపం దిగాలు పడిపోయింది. నిరాశగా వెనుతిరుగుతుంటే ప్రవక్త మళ్ళీ ఆమెతో, “ముసలి వాళ్లకు మళ్ళీ యవ్వనం వచ్చేలా చేసి స్వర్గంలో పంపిస్తాడు దేవుడు” అన్నారు నవ్వుతూ.

సమగ్ర జీవితానికి సంపూర్ణ స్వరూపం

ఒక భర్తగా ముహమ్మద్ (స)

ఒకసారి ఒంటెల బిడారు ముందు పోతుంది. ప్రవక్త (స) భార్య వెనుకబడిపోయారు. ఆమె ఒంటె చాలా నెమ్మదిగా నడుస్తోంది. మిగిలిన వారిని అందుకోలేనందుకు ఆమెకు ఏడుపు కూడా వచ్చేసింది. ప్రవక్త (స) ఆమె వద్దకు వెళ్ళి స్వయంగా కన్నీళ్ళు తుడిచి ముందుకు తీసుకువెళ్ళారు. భార్యాభర్తల మధ్య సంబంధానికి ఆయన జీవితం అత్యుత్తమ ఉదాహరణ. ఆయన తన భార్య ఒడిలో తల ఉంచి పడుకునే వారు. నవ్వుతూ మాట్లాడేవారు. ఇది చాలా చిన్న విషయంలా కనిపిం చవచ్చు. కాని భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలను పెంచేవి ఇలాంటి చిన్న చిన్న విషయాలే. హజ్రత్ ఆయిషా (ర) తన భర్తకు తలదువ్వేవారు. తలకు నూనె రాసేవారు. తన భార్య తాగిన ఎంగిలి పాత్రలోనే ఆయన(స) తాగేవారు.

“భార్య నోటికి ఒక ముద్ద అందించడం కూడా సదాచరణే” అన్నారాయన (స).

ఇంటి పనుల్లో ఆయన (స) చేయందించేవారు. ఇల్లు శుభ్రం చేసే వారు. పశువులకు మేత వేసేవారు. మేకల పాలు పితికేవారు. తన బట్టలకు అవసరమైతే మాసికలు వేసుకునేవారు. పాదరక్షల మరమ్మత్తు తానే చేసుకునేవారు. బజారుకు వెళ్ళి ఇంటికి కావలసిన సామానులు తెచ్చు కునేవారు. పిండి విసిరేవారు. అవసరమైతే తన నౌకర్లకు కూడా చేయందించేవారు. వారితో పాటు పని చేసేవారు.

భార్యలతో నవ్వుతూ మాట్లాడేవారు. హాస్యమాడేవారు. కథలు చెప్పేవారు. ఒకసారి విలువిద్య ప్రదర్శించబడుతోంది. ప్రవక్త (స) తన భార్య ఆయిషా(ర)తో కలిసి చూస్తూ నిలబడ్డారు. ఆమె విలువిద్య ప్రదర్శన ఆసక్తిగా చూస్తుందని గుర్తించారు ప్రవక్త(స). తాను వెళ్ళిపోతే ఆమె కూడా వెళ్ళిపోతుంది, కాబట్టి ఆమె అక్కడి నుంచి వెళ్ళే వరకు ఆయన(స) కూడా నిలబడ్డారు.

ఆయన (స) దుస్తుల విషయంలోను, సువాసనలు వాడడం విషయం లోను భార్య ఇష్టాయిష్టాలను దృష్టిలో ఉంచుకునేవారు.

మన “తన భార్య గురించిన ఆంతరంగిక విషయాలను మరొకరితో చెప్పేవాడు మహా నీచుడు” అన్నారాయన(స).

“జీవితంలో అల్లాహ్ స్మరణ మినహా చేసేవన్నీ వ్యర్థమే, కేవలం నాలుగు విషయాలు తప్ప, వాటిలో ఒకటి భార్యతో సరదాగా మాట్లా డడం… ” అన్నారు.

వ్యవహారాల్లో మీ భార్యలతో కూడా సంప్రదించండి.

మీకు మీ భార్యలపై హక్కులున్నట్లే, వారికి మీపై హక్కులున్నాయని స్పష్టం చేశారు. ఆ

“భర్త భార్యను అసహ్యించుకోరాదు. ఆమెలో ఒక గుణం అతనికి నచ్చకపోవచ్చు. కాని అతనికి నచ్చే వేరే గుణాలుంటాయి, వాటిని మరిచి పోరాదు” అన్నారు.

పాలకుడిగా ముహమ్మద్ (స)

మదీనాలో ప్రవక్త ముహమ్మద్ (స) అప్పట్లో నెలకొల్పిన చిన్న రాజ్యంలోని పాలనా యంత్రాంగాన్ని గమనిస్తే నేటి అనేక ఆధునిక ఏర్పాట్లకు మూలాలు అక్కడే ఉన్నాయని తెలుస్తుంది. ఆయన(స)కు ఒక సెక్రటేరియేట్ ఉండేది. ప్రవక్త(స)కు కార్యదర్శులుగా, లేఖకులుగా పని చేసిన కనీసం యాభై మంది సహచరుల పేర్లు మనకు చరిత్రలో కనబడతాయి.

అధికారిక పత్రాలు, ఒప్పందాలు, చార్టర్లు, అధికారులకు సూచ నలు, జనాభా లెక్కలకు సంబంధించి దాదాపు 400 పత్రాలు భద్రపరచ బడ్డాయి. ప్రవక్త (స) అనేకమంది రాజులకు, చక్రవర్తులకు లేఖలు కూడా పంపించారు. ఇస్లామ్ స్వీకరించాలని వారికి ఆహ్వానాలు పంపించారు.

మదీనాలో ఇస్లామ్ ప్రవేశించక ముందు యూదులు జనాభా లెక్కలు తీయడాన్ని పాపంగాను, దేవుని సృష్టిలో జోక్యంగాను భావించే వారు. ప్రవక్త (స) మదీనాకు రాగానే నగర జనాభా లెక్కలు సేకరించా లని ఆదేశించారు. అందులో నగరంలో మొత్తం జనాభా 10,000 ఉండేది. అందులో ముస్లిముల సంఖ్య మొదట కేవలం 500. ప్రవక్త (స) మదీనా నగరంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రారంభించారు. దాన్ని ‘బలదియా’ అని పిలిచేవారు. బలద్ అంటే పట్టణం. ఇప్పుడు కూడా చాలా చోట్ల మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌ను బల్దియా అంటారు. బల్దియా విభాగం నగర నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించేది. మదీనాకు రాగానే ప్రవక్త (స) చేపట్టిన మరో పని మురికినీటి పారుదలకు తగిన ఏర్పాట్లు చేయించడం. ఆ తర్వాత రోడ్లపై ట్రాఫిక్ కదలికలకు అనుగుణంగా రోడ్లను విస్తరించారు. నేడు నాలుగు లైన్ల రోడ్ల మాదిరిగా అప్పట్లో ఒకే వైపు రెండు ఒంటెలు ఒక దాని పక్కన ఒకటి నడిచే వెడల్పుతో రోడ్లను నిర్మించారు. రోడ్లకిరుపక్కలా మొక్కలు నాటించారు. ఆ విధంగా ప్రయాణీకులకు సదుపాయాలు కల్పించారు.

అప్పట్లో ప్రజా నీటి సరఫరా అనే భావన లేదు. మదీనాకు వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తికి చెందిన మంచినీటి బావి ఉండడాన్ని ప్రవక్త (స) చూశారు. ప్రవక్త(స) ఒక ప్రకటన చేసి ఎవరైనా ఆ బావిని కొని ప్రజోపయోగానికి విరాళంగా ఇస్తే వారికి స్వర్గంలో అంతకన్నా మంచి బహుమతి లభిస్తుందన్నారు. ఉస్మాన్ (ర) బావిని కొని విరాళంగా ఇచ్చారు.

ఇస్లామ్ రాక ముందు అరబ్బులు స్వంత వైద్యమే చేసుకునేవారు. ప్రజావైద్య వ్యవస్థ అనేది లేదు. కాని ప్రవక్త (స) ఆ తర్వాత ప్రజా వైద్య వ్యవస్థను స్థాపించారు. ప్రవక్త (స) అనుచరుల్లో ఒకరు వైద్య శిబిరం నిర్వహించారు. ఆ తర్వాత వైద్య శిబిరాలు, శాశ్వత ఆసుపత్రుల నిర్మాణంలో ఇస్లామ్ ప్రధాన భూమిక వహించింది.

ప్రవక్త (స) మదీనాలో ఒక రెగ్యులర్ మార్కెట్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. తూనికలు కొలతలను ప్రమాణీకరించారు. వాణిజ్యంలో ఎవరో ఒకరి గుత్తాధిపత్యం లేకుండా చేశారు. అక్రమ నిల్వలు దాచిపెట్టడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించారు. భవిష్యత్తులో వ్యాపారం చేయడానికి సరుకులను దాచి పెట్టడాన్ని నిషేధించారు. ప్రవక్త (స) స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేసేవారు. ఒకసారి మార్కెట్టులో ఒక వ్యాపారి పొడి ధాన్యాన్ని తడి ధాన్యంపై ఉంచి అమ్ము తున్నాడు. ఆ ధాన్యం కుప్పలోపల ప్రవక్త చేయి పెట్టి చూశారు. వ్యాపారి చేస్తున్న మోసం అర్థమయ్యింది. “ఎందుకిలా చేస్తున్నావని” ప్రశ్నించారు. వ్యాపారి మాట్లాడుతూ “వర్షం కురవడం వల్ల ధాన్యం తడిసింద”ని అబద్దామాడాడు. ప్రవక్త వెంటనే “ఇతరులను మోసం చేసేవాడు దైవ విశ్వాసి కాదు” అన్నారు. ఆ అల తనిఖీలు, శిస్తు వసూళ్ళకు ప్రవక్త (స) స్త్రీ పురుష ఇన్ స్పెక్టర్లను నియమించారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన శిక్షలు ఉండేవి. ఇలాంటి ఇన్ స్పెక్టర్లలో సయీద్ బిన్ ఆస్(ర), అబ్దుల్లా బిన్ సయీద్(ర), ఉమర్ (ర) ముఖ్యులు. మహిళల్లో మదాబా కుమార్తె సమ్రా(ర), అబ్దుల్లా కుమార్తె షిఫా (ర) ముఖ్యులు. మదీనా మార్కెట్ ఇన్ స్పెక్టరుగాను, కస్టమ్ అధికారిగాను షిఫా (ర) పని చేశారు. మహిళా వ్యాపారులు తీసుకొచ్చే వ్యాపార సామగ్రి తనిఖీలకు, పర్యవేక్షణకు ఈ మహిళా ఇన్ స్పెక్టర్లు పని చేసేవారు.

ప్రవక్త ముహమ్మద్ (స) రాజ్యంలో పేదవారి కోసం, బలహీనుల కోసం ఒక పెన్షన్ వ్యవస్థను రూపొందించారు. మదీనాలో బనూ ఆరిజ్ పేరుతో ఒక యూద తెగ ఉండేది. వారి వ్యవహారశైలి మెచ్చుకున్న ప్రవక్త (స) వారికి ఏటా కొంత పెన్షన్ (ఆసరా పెన్షన్‌గా) నిర్ధారిం చారు. అసహజ మరణానికి గురైన వారి కుటుంబాలను ఆదుకోడానికి పరిహారం చెల్లించే వ్యవస్థను కూడా ప్రవక్త (స) ప్రవేశపెట్టారు.

ఆలోచించండి! ఇస్లాం కత్తితో వ్యాపించిందా?

ప్రవక్త ముహమ్మద్ (స) కరవాలంతో ఇస్లామ్ ను వ్యాపింప జేశారని ఇస్లామ్ శత్రువులు, పక్షపాత వైఖరి కలిగిన వాళ్ళు ఆరోపించడం వినిపిస్తుంది. యుద్ధాలు చేయడమే ఆయన (స) పనిగా పెట్టుకున్నట్లు చిత్రీకరిస్తుంటారు. నిజానికి ఆయన(స) మదీనాలో గడిపిన పది సంవత్సరాల జీవితంలో కేవలం 95 రోజులు మాత్రమే యుద్ధ రంగా ల్లోను, పోరాటాల్లోను ఉన్నారు. చాలా యుద్ధాలు ఆయన(స) కేవలం ఒక్క రోజులోనే గెలిచారు. పది సంవత్సరాల్లో మిగిలిన రోజులు, అంటే దాదాపు 3,555 రోజులు ఆయన (స) ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు సాధించడానికి, సమాజాన్ని సంస్కరించడానికి పని చేశారు. అరబ్బు ద్వీపకల్పంలో శాంతి భద్రతలను స్థాపించారు. దుర్మార్గం, అణిచివేతలు అన్యాయాలను తుదముట్టించి మంచితనం, ధర్మం, న్యాయం, శాంతిసౌహార్ధతలు వర్ధిల్లేలా చేశారు.

ప్రవక్త ముహమ్మద్ (స) పాల్గొన్న అన్ని యుద్ధాల్లోను కలిపి మొత్తం ప్రాణనష్టం కేవలం 1014 మంది మాత్రమే. ఈ యుద్ధాల్లో పాల్గొన్న వారిలో చనిపోయిన వారి శాతం చూస్తే 1.5 శాతానికి మించదు. యుద్ధాలతో, హింసాత్మక పోరాటాలతో నడిచిన విప్లవాల్లో చనిపోయిన వారి సంఖ్యను ప్రవక్త ముహమ్మద్ (స) పాల్గొన్న యుద్ధాల్లో జరిగిన ప్రాణనష్టంతో పోల్చి చూస్తే ఈ తేడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సంవత్సరాల తరబడి కొనసాగిన యుద్ధాల్లో అనేక లక్షల మంది అమాయక ప్రజలు చనిపోతున్నారు. అలాగే వివిధ విప్లవాల్లో మరణించిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మరో విషయ మేమంటే యుద్ధాల్లో పాల్గొన్న సైనికుల కన్నా సాధారణ పౌరుల మరణాలే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య (సాధారణ పౌరులతో సహా),

యుద్ధంలో పోరాడిన సైనికుల సంఖ్యతో పోల్చితే 517% ఉంది. ఆసక్తికరమైన మరో వాస్తవమేమంటే, ఇస్లామీయ సామ్రాజ్యం లోని చాలా ప్రాంతాలను మంగోలు సైన్యాలు ఆక్రమించుకుని విజేత లుగా అక్కడికి ప్రవేశించినప్పటికీ వారు ఇస్లామ్ ను ధ్వంసం చేయలేక పోగా, నిజానికి ఇస్లామ్ లోని సుగుణాల కారణంగా మంగోలు జాతి ఇస్లామ్ ను స్వీకరించింది. చరిత్రలో ఇలాంటి సంఘటన మరెక్కడా కనబడదు. నేడు ప్రపంచంలో అతిపెద్ద ముస్లిమ్ దేశం ఇండోనేషియా. అక్కడ ముస్లిమ్ సైన్యాలేవి యుద్ధానికి వెళ్ళలేదు. కత్తిబలంతో ఇస్లామ్ వ్యాపించిందని చెప్పడానికి అక్కడ అవకాశమే లేదు. ఆధ్యాత్మికంగా సాఫల్యమార్గాన్ని చూపించే, నైతికతకు కట్టుబడి ఉండేలా చేసే ఇస్లామ్ ఎవరినైనా బలవంత పెట్టడం ఎలా సాధ్యం?

ఇదంతా ఆయన కేవలం రెండు దశాబ్దాల కాలంలో సాధిం చారు. ఆ రెండు దశాబ్దాలు నేటికీ చరిత్రపై చెరగని ముద్రగా కొనసాగు తున్నాయి.

మానవత్వాన్ని నిలబెట్టిన ఆ మహానుభావుడి గొప్ప ఆదర్శాలివి. ఈ ఆదర్శాలు నేడు మనకు వారసత్వంగా అందాయి. ఆయన (స) చేపట్టింది ఒక సంస్కరణా ఉద్యమం. అది ఆయన (స) సాధించి చూపించారు. అందరికీ ఆదర్శంగా జీవించారు. తన ఆచరణలతో తన జీవితాన్నే ఉదాహరణగా వారి ముందు ఉంచారు. ప్రవక్త (స) సమస్త మానవాళి కొరకు దైవసందేశాన్ని తీసుకుని వచ్చారు. దేవుడు ప్రజలం దరికీ పంపిన ఈ సందేశం నిజదైవాన్ని తెలుసుకోవాలని, తీర్పుదినాన్ని విశ్వసించాలని తెలియజేసింది.

అందుకే మన జాతి పిత మహాత్మాగాంధి ముహమ్మద్ ప్రవక్త (స) ఆదర్శ జీవితం గురించి ఇలా చెప్పారు; రాత “నేను లక్షలాది మానవుల హృదయాలను నిర్ద్వంద్వంగా వశ పరుచుకున్న ఆ ఉత్తమ వ్యక్తిని గురించి తెలుసుకోదలిచాను. ఆ కాలపు జీవన పంథాలో ఇస్లాంకు ఓ స్థానాన్ని సాధించగలిగింది కత్తి కాదని నాకు గట్టి నమ్మకం కుదిరింది. కేవలం ప్రవక్త (స) చూపిన నిరాడంబరత, త్యాగనిరతి, వాగ్దానపాలన పట్ల శ్రద్ధ, మిత్రుల సహచరులపట్ల అమితమయిన అంకితభావం, స్థిరచిత్తం, ఆయనలోని నిర్భీతి, దైవం పట్ల, తన ధ్యేయం పట్ల అచంచల విశ్వాసం – కేవలం ఇవే కాని కత్తి కాదు”. (యంగ్ ఇండియాలో 16 సెప్టెంబర్, 1964)

విజయంలోనూ నమ్రత-క్షమాగుణం

అది క్రీ.శ. 630వ సంవత్సరం. దాదాపు పదివేల సైన్యంతో మక్కాను జయించడానికి ప్రవక్త ముహమ్మద్ (స) బయలుదేరారు.

కానీ ఈ రోజు పోరాటం జరగరాదని తన సహచరులను ఆదేశించారు. ఆరోజు మక్కా నగరం మొత్తం ఆయన (స) ఆధీనంలోకి వచ్చింది. ఆ విధంగా ఒక వ్యక్తి కూడా నేలకొరగకుండా, ఒక్క రక్తపు బొట్టు కూడా నేల రాలకుండా మహోన్నతమైన శాంతియుతమైన విజయం లభిం చింది. తనను మక్కాలో మాటిమాటికీ హింసించిన వారు, కష్టాల పాలు చేసిన వారందరూ మక్కాలో తారసించారు. ఇక తమ పని అయిపోయి నట్లేనని వారు అనుకున్నారు. కానీ మానవ మూపకారి కారుణ్య మూర్తి ప్రవక్త ముహమ్మద్ (స) వారిపైన పూర్తి పగ, కక్షసాధించే శక్తి ఉన్నప్పటికీ సామూహికమైన, సంపూర్ణ క్షమాపణ ప్రకటించారు.

ఈరోజు ఏ చిన్న సాకు దొరికినా దేశాలకు దేశాలనే నాశనం చేసే ఈనాటి పాలకులకు ఈ మహాసంఘటన ఒక గొప్ప గుణపాఠం కావాలి.

లంచం సంస్కర్తగా ముహమ్మద్ (స) పరమత సహనం: “ధర్మం విషయంలో నిర్బంధం కాని, బలాత్కారం కానీ లేవు” (దివ్యఖుర్ఆన్ 2 : 256)

దివ్యఖుర్ఆన్ స్పష్టంగా చెప్పిన ఉపదేశమిది. ప్రవక్త ముహమ్మద్ (స) జీవితంలో పర మత సహనానికి సంబంధించిన ఉదాహరణలు కోకొల్లలు.

ముస్లిమేతరులతో సత్సంబంధాలు

ఆచరణాత్మకంగా ఆయన జీవితంలో కనబడతాయి. ఒకసారి ఆయన(స) తన సహచరులతో కూర్చుని ఉన్నప్పుడు ఒక శవయాత్రను చూసి ఆయన (స) వెంటనే లేచి నిలబడ్డారు. సహచరులు ఆయన(స)తో “ప్రవక్తా(స)! ఆ మృతదేహం ముస్లిముది కాదే” అన్నారు. ప్రవక్త (స) జవాబిస్తూ, “మనిషిదే కదా” అన్నారు. పరమత సహనం మాత్రమే కాదు, పరమతస్తుల పట్ల గౌరవానికి ఇంతకు మించి ఉదాహరణేం కావాలి? ఆ “వారు అల్లాహ్ ను కాదని వేడుకునే ఇతరులను దూషించకండి.” (దివ్యఖుర్ఆన్ 6: 108)

ప్రవక్త ముహమ్మద్ (స) చాలా స్పష్టంగా ఇతరుల పట్ల నాగరిక మైన భాష ఉపయోగించాలని చెప్పారు. ఇతరుల దేవతలు, వారి పవిత్ర  గ్రంథా లను అవమానించరాదని బోధించారు. ఇతరుల దేవతలను చెడు పేర్లతో పిలవరాదని వారించారు.

మానవ చరిత్రలో మనిషి జీవితాన్ని సంపూర్ణంగా, అన్ని రంగాల్లో సంస్కరించారు. తత్ఫలితంగా ఆరాధనా స్థలమైన మస్జిదు మొదలు ఆర్ధిక కార్యకలాపాలు కొనసాగే మార్కెట్టు వరకు, పాఠశాల నుంచి న్యాయస్థానం వరకు, ఇంటి నుంచి యుద్ధరంగం వరకు అన్ని చోట్ల దైవభీతి, దైవభక్తి అలుముకున్నాయి. ప్రజల ఆలోచనా విధానం మారింది. భావాలు మారాయి. భావావేశాల్లో మార్పు వచ్చింది. దృక్కోణం మారింది. అలవాట్లు మారాయి. ఆచరణలు మారాయి. ఆచారాలు, సంప్రదాయాలు మారిపోయాయి. జీవనరంగాలన్నింటినీ ప్రభావితం చేసిన మార్పు ఇది. ఈ మార్పుల్లో ప్రతిచోట మనకు శ్రేయోశుభాలే కనబడతాయి. ఈ మార్పుల్లో ఎక్కడా చెడు మచ్చుకు కూడా కనబడదు. ఎక్కడా విచ్ఛిన్నం లేదు. అన్ని వైపులా నిర్మాణమే. ఎటు చూసినా ప్రగతి వికాసాలే. నిజం చెప్పాలంటే సర్వ మానవాళికి మార్గదర్శి అయిన ప్రవక్త ముహమ్మద్ (స) వల్ల యావత్తు మానవ జీవితానికి సరికొత్త జీవితం లభించింది. ప్రవక్త ముహమ్మద్ (స) వల్ల మానవాళికి ఒక కొత్త ఉదయం ప్రాప్తమయ్యింది. ఆయన మానవాళికి ఇచ్చిన సందేశం ఏమిటి? ప్రవక్త ముహమ్మద్ (స) ఇచ్చిన విప్లవాత్మక నినాదం – లా యిలాహ ఇల్లల్లాహ్ – ఇది క్లుప్తమైనదే అయినా సాటిలేని బలమైన ప్రభావం వేసే నినాదం. అల్లాహ్ (దేవుడు) తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన జన్మనిస్తాడు కానీ జన్మించడు. మరణాన్నిస్తాడు కానీ మరణించడు. అందరికీ తినిపిస్తాడు కానీ తాను తినడు. నిద్ర, కునుకులు రానివాడు, రాగద్వేషాలు లేనివాడు అయిన అల్లాహ్ పట్ల మానవాళి విధేయత చూపాలి. ఆయన్నే దేవునిగా

భావించాలి, ప్రేమించాలి. ఆయన్నే ఆరాధించాలి. ఆయన్నే స్తుతించాలి. ఆయన్నే స్మరించాలి. ఆయన్నే అర్థించాలి. ఆయన నుంచే మనం అన్ని విధాల మంచిని ఆశించాలి. ఆయన ఆగ్రహానికి మనం భయపడాలి. ఆయన పుణ్యాత్ములకు బహుమతి ఇస్తాడు. పాపాత్ములను శిక్షిస్తాడు. ఆయనే యజమాని, పాలకుడు, శాసనాల ప్రదాత, ముక్తి దాత. ఆయన ఆదేశాలను శిరసావహించాలి. ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉండాలి. ఆయన విధిగా చెప్పిన వాటిని తూ.చ.తప్పక పాటించాలి. ఆయన అభీష్టానికి అనుగుణంగా మన సంపూర్ణ జీవితాన్ని మలచుకునే ప్రయత్నం చేయాలి. ఆయన ప్రసన్నతే జీవిత ధ్యేయంగా చేసుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ (స) ఇచ్చిన ఏకదైవారాధన నినాదంలో ఒక సంపూర్ణ మైన, సమగ్రమైన ఆధ్యాత్మిక భావన ఉంది.

రండి! ఆయన(స) గురించి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన(స) సర్వయుగ పురుషుడు. చిట్టచివరి ప్రవక్త(స). మానవ మహోపకారి. ఆచరణాత్మకమైన, స్ఫూర్తి ప్రదాత. వారి ఆదర్శవంతమైన జీవితాన్ని మన జీవితాలలో ఆచరణాత్మకంగా స్వీకరించి జన్మధన్యం కావించుకుందాం.

రండి! అందరి ప్రవక్త ముమమ్మద్ (స) గురించి కుల, మత, జాతి, వర్గ, వర్ణ, ప్రాంత, భాష, భేదాలకు,  రాగద్వేషాలకు అతీతంగా ఒక్కటైన మానవజాతిగా తెలుసుకుని ఈ ప్రపంచాన్నే శాంతియుత, వసుధైక కుటుంబంగా మార్చుదాం.

ముహమ్మద్ (స) బోధనలు నాకు స్ఫూర్తిదాయకం – కూలి వాని చెమట ఆరకముందే అతని కూలి చెల్లించండి – తల్లిపాదాల క్రింద స్వర్గం ఉంది. తండ్రి స్వర్గానికి ముఖ ద్వారం. – నీవు నీ కోసం ఏది కోరుకుంటావో అదే ఇతరుల కోసం కోరుకో. – లంచం ఇవ్వడం, పుచ్చుకోవడం మహా పాపం – భూ వాసులపై మీరు దయ చూపిస్తే అల్లాహ్ ఆకాశం నుంచి మీపై కారుణ్య వర్షం కురిపిస్తాడు. . – పర స్త్రీపై నీ చూపు ఆనక ముందే నీ దృష్టిని మరల్చుకో. – మీలో ఎవరైతే తన భార్య పట్ల ఉత్తమంగా ప్రవర్తిస్తాడో అతడే అత్యుత్తమమైన వ్యక్తి. – మద్యపానం సేవించకండి, అది సమస్త చెడులకు మూలం. – పారే నది ఒడ్డున కూర్చున్నా సరే, నీటిని వృధా చేయకండి. • న్యాయం పలకండి, వ్యవహారం మీ బంధువులదైనా సరే.

 

Related Post