ఆ ఎంపిక మీదే

ఆ ఎంపిక మీదే – ”నిశ్చయంగా మేము మానవుణ్ణి పరీక్షించడానికి ఒక మిశ్రమ బిందువుతో పుట్టించాము. మరి మేము అతన్ని వినే వాడుగా, చూసేవాడుగా చేశాము. మేమతనికి మార్గం కూడా చూపాము. ఇక అతను కృతజ్ఞుడుగా వ్యయవహరించినా లేక కృతఘ్నుడుగా తయారయినా. (అతని ఇష్టం. మేము అతని ఎంపిక స్వేచ్ఛను హరించ లేదు)”. (దివ్య ఖురాన్‌-76: 2,3)

నేను నమ్ముతున్న దైవం సత్యమా, మిథ్యనా? నా తాతముత్తాల నుండి నా తండ్రికి, నా తండ్రి నుండి నాకు సంక్రమిం చిన ఈ మతం గాడ్‌మేడా? మ్యాన్‌ మేడా? అని తర్జ్జనభర్జనకు కారణం నఫ్సె లవ్వామా.

‘కనులు తెరిస్తే జననం, కనులు మూస్తే మరణం – ఈ రెప్పపాటులో ఉన్నదే జీవన పయనం’ అన్న మాట అక్షర సత్యం అయినా మనిషికి జీవితం అంటే ఎనలేని మమకారం. అలాంటి  జీవితాన్ని ఎంపిక స్వేచ్ఛ లేకుండా ఒక క్షణం కోసమయినా ఊహించుకోవడం కష్టం. ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఎలా పుట్టాలో అనే ఎంపిక స్వేచ్ఛ మనిషికి లేక పోయినా ఆ తర్వాతి జీవితం మొత్తం ఆ ఎంపిక స్వేచ్ఛ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏ చదువు చదవాలి, ఏ కోర్సు చేయాలు, ఏ కొలువు తీరాలి, ఏ వ్యాపారం చెయ్యలి, ఏ రంగంలో రాణించాలి, ఎవర్ని వివాహమాడాలి, ఎక్కడ , ఎంత ఇన్వెస్ట్‌ చెయ్యాలి, జీవితపు ఏ దశలో విశ్రాంతికై విరమించాలి-ఇలా జీవితంలోని ప్రతి మలుపు దగ్గర ఓ ఎంపిక ఉంటుంది. ‘ఆర్ట్‌ ఆఫ్‌ చూజింగ్‌’ను అర్థం చేసుకోగలిగితే ప్రతి ఎంపిక ఓ విజయ సోపానమే.

దేన్ని ఎంచుకోవాలి? అన్న నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతం. ఎవరి ప్రాధాన్యతలు వారికి ఉంటాయి. ఎలా ఎంచుకోవాలి అన్నది మాత్రం సార్వ త్రికం. కొన్ని నిర్దుష్టమయిన అంశాల ఆధారంగా నిర్ణయించుకోవచ్చు. ఎంపిక ఆధ్యాత్మికమయినదయినా, ఆర్థికమయినదయినా, భావోద్వేగాలకు, భయాలకు, అపోహాలకు, అనుమానాలకు దూరంగా నూరు పాళ్ళు స్వచ్ఛంగా ఉంటుంది అచ్ఛమైన ఎంపిక. మనిషి మనసు రెండు విధాల స్పందిస్తుంది.నఫ్స్‌-అమ్మారహ్‌-దురాత్మ, నఫ్సె-లవ్వామహ్‌-శుభాత్మ.

నఫ్స్‌-అమ్మారహ్‌-దురాత్మ:

తక్షణ ఆనందాన్ని, సంతృప్తిని, తాత్కాలిక సుఖాన్ని ఇష్ట పడుతుంది. ’20లో జుర్రుకోవాల్సిన మజాలు 60లో జుర్రుకోవాలన్న సాధ్య పడదు. ఇదే సరయిన సమయం – అనుభవించు రాజా!’ అంటుంది. ‘ఈ రోజును అనుభవించు, రేపటి చింతనను విరమించు’ అని ఉసిగొల్పుతుంది. ఇక పరలోక శిక్షా బహుమానాల ప్రస్తావన వచ్చినప్పుడు-‘ఇప్పుడు చావు కబుర్లు దేనికి, అదొచ్చినప్పుడు చూసుకుందాం లే’ అని ఊరిస్తంది. ఏది అనుకుంటే అది జరిగిపోవాల్సిందే.’లాభ నష్టాలదేముంది తర్వాత చూసుకోవచ్చులే’ అని రెచ్చగొడుతుంది. ‘మరీ పాపాలు అధికమయిపోతే పోని, ఒక్కసారి తౌబా చేసుకుంటే సరి పోతుందిలే’ అని మరింత అలక్ష్యానికి గురి చేసే ప్రయత్నం చేస్తుంది. ”నిశ్చయంగా మనస్సు చెడు వైపునకే పురికొల్పుతుంది”. (యూసుఫ్‌: 53)

ఏది కావాలంటే అది ఈ గుణం పసి పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. లేదంటే ఇల్లు పీకి పందిరి వేస్తారు.టీనేజీ దాగా ఇదే స్థితి తక్కువా, ఎక్కువ మోతాదులో ఉంటూ వస్తుంది. ఈ పిల్ల చేష్టలు అప్పుడప్పుడు పెద్దల్లో కూడా కనబడుతుాంయి. ‘దిల్‌ తో బచ్చా హై జీ’ అనడం తెలిసిందే!

నఫ్సె-లవ్వామహ్‌: శుభాత్మ:  

ఇది ఆలోచన, విశ్లేషణకు ప్రాధాన్యతనిస్తుంది. ఇది పరిణామాల్ని, పర్వవసానాల్ని ఊహిస్తుంది. సమస్యల్ని, సంక్షోభాల్ని హెచ్చరిస్తుంది. ఫలానా పని చేయాలా, వద్దా? నేను నడుస్తున మార్గం సరయినదా, కాదా? నేను నమ్ముతున్న దైవం సత్యమా, మిథ్యనా? నా తాతముత్తాల నుండి నా తండ్రికి, నా తండ్రి నుండి నాకు సంక్రమిం చిన ఈ మతం గాడ్‌మేడా? మ్యాన్‌ మేడా? అని తర్జ్జనభర్జనకు కారణం నఫ్సె లవ్వామా.
”దానిని (అంతరాత్మను) పరిశుద్ధ పర్చుకున్న వాడు సాఫల్యం పొందాడు. దాన్ని అణచి పెట్టిన వాడు నష్ట పోయాడు”. (అష్షమ్స్‌: 9)

ఈ రెండు వ్యవస్థలు ఒకదానితో ఒకి తలబడుతుంటాయి. నఫ్సె అమ్మారహ్‌ (చెడు మనస్సు) నోరు కట్టేసి, నఫ్సె లవ్వామహ్‌ (నిందించే మనస్సు)ను చైతన్యవంతం చేసినప్పుడే ఎంపికలో నాణ్యత వస్తుంది. అయితే ఇక్కడో చిక్కుంది: అదే మెదడు. దాని ఎంపికలో పూర్వ అను భవాలది కీలక పాత్ర అనే చెప్పాలి. పూర్వం విన్నవి, కన్నని, అనుభవిం చినవి ఏవయినా కావచ్చు. ప్రతి నిర్ణయానికి ముందు మెదడు సకారాత్మక, నకారాత్మక సంఘటనల్ని, సలహాలను మనషికి చూపెడు తుంది. కొన్ని సందర్భాలలో చిన్న చిన్న అనుభవాలు పెద్ద పెద్ద నిర్ణయాల్ని శాసిస్తుంటాయి. ప్రత్యేకించి ఒక వృత్తి పట్ల మమకారాన్నో, ఒక మతం పట్ల వ్యతిరేకతనో పెంచే సందర్భాలుాంయి. బాల్యంలో నూరి పోసిన భయాలు పెద్దయ్యాక ఒక మతం పట్ల, ప్రాంతం, జాతి పట్ల అయిష్టతను పెంచవచ్చు. అంటే ఎంపికలో భావోద్దేగాల పాత్ర ఉంటుంది. మెదడులోని 88 శాతం పూర్వానుభవం, భావోద్వేగం మీద ఆధార పడి ఉంటుంది. రెండు మార్గాలుండి ఏదోక మార్గాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు – అమ్మాననాన్నల కలలు, తాత ముత్తాల పరంపర విలువలు, వంశ, కుల ఆచారాలు అనే కోణంలో మనిషి ఆలోచిస్తాడు. దీని గురించి ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది:

”అల్లాహ్‌ అవతరింపజేసిన (గంథాన్ని) అనుసరించండి” అని వారికి చెప్పినప్పుడల్లా,’మా తాతతండ్రులు అవలంబిస్తూ ఉండగా చూసిన పద్ధతినే మేము పాటిస్తాము’ అని వారు సమాధానమిస్తారు”. (అల్‌ బఖరహ్‌: 170)

ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు భావోద్వేగ ప్రవాహంలో కొట్టుకు పోకుండా విచక్షణా జ్ఞానాన్ని పెద్ద పీట వెయ్య గలగాలి. నా జీవిత లక్ష్యం ఏమి? నా పుట్టుక పరమార్థమేమి? నేనీ లోకంలో ఎందుకు తేబడ్డాను? నా చివరి గమ్యస్థానం ఏమి? అని ఆత్మ సమీక్ష చేసుకో గలిగితే మన ఎంపిక సరైనదే కాకుండా సత్యబద్ధమయినది అవుతుంది.

ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు: ”పూర్వం మేము అజ్ఞానులుగా ఉండే వాళ్ళము, మా నిజ ఆరాధ్యుడు ఎవడో కూడా మాకు తెలిసేది కాదు. అమ్మానాన్నలు పరిచయం చేసిన రాయి-రప్పలను, పాము-పుట్టలను, క్రిమి-కీటకాలను దైవంగా భావించే వాళ్లము. ప్రతి కంకర్‌ శంకర్‌ అన్నది మా న్మకంగా ఉండేది.

చచ్చిన జీవాలను తినేవాళ్ళం. అశ్లీల ఊబిలో కూరుకు పోయి ఉండేవాళ్ళం. కుల, వర్గ, ప్రాంత కలహాలతో సత మతమవుతూ ఉండేవాళ్ళం. అలాంటి దయనీయ స్థితిలో మాకు సత్య ధర్మ పరిచయమయింది. అది నిజ ఆరధ్యుడయిన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలని, మిథ్యా భావాలను, మిథ్యా శక్తులను, మిథ్యా దైవాలను విడనాడాలని ఉపదేశించింది. పుట్టుక రీత్యా అందరూ సమానులే అని ఉపదేశించింది. అందరూ దైవ దాసులే, అందరూ ఆది మానవడయిన ఆదమ్‌ (అ) సంతానమే, ఆదమ్‌ను అల్లాహ్‌ మట్టితో పుట్టించాడు అని తెలియజేసింది. నిజ ఆరాధ్యుడయిన అల్లాహ్‌ పంపిన అంతిమ దైవ గ్రంథం ఖుర్‌ఆన్‌ , అంతిమ ఆదర్శం ముహమ్మద్‌ (స) అని చెప్పింది. కనుక దాన్నే మేము మా జీవన సంవిధానంగా చేసుకున్నాము.

పరిణామం ఎలా ఉంటుంది?

సత్య ధర్మాన్ని ధైర్యం చేసి ఎంపిక చేసుకున్న వారిని పెడత్రోవ పట్టించడానికి చాలా కాకులే కాచుకొని ఉంటాయి. షైతాన్‌ మూకలు మాటు వేసి కూర్చుని ఉంటాయి . అందులో వారు నివసిస్తున్న పరిసరాలు, పరివారం, సమాజం కూడా ఒకి. వీటి ప్రభావం ఏ రకంగా ఉం టుంది అంటే, ”వైట్ ఫోన్‌ కొనాలని వెళ్ళిన ఒక యువకుడు రెడ్‌ కలర్‌ ఫోన్‌ కొనుక్కొని వస్తాడు”. కారణం – అక్కడ అధిక జనం ఆ రంగు ఫొనునే ఎగబడి కొంటున్నారు గనక. ఇలాిం ఎంపిక వస్తువుల వరక యితే ఫరవా లేదు. కానీ, జీవితానికి, ధర్మానికి సంబంధించిన ఎంపిక మీద మాత్రం సమాజం, వ్యక్తుల ప్రభావం లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే, ‘కలర్‌ ఆప్‌ ది ఇయర్‌’ అంటూ బొత్తిగా మనకు నచ్చని అధర్మ అడుసు తొక్కిస్తాయి. సత్య సురభీ అంటూ మిథ్యా మసిని మన నుదుటన పూసే ప్రయత్నం చేస్తాయి. ‘ట్రెండ్‌ ఆప్‌ ది ఫ్రెండ్స్‌’ అంటూ అడ్డదిడ్డమయిన అలవాట్లను బానిసల్ని చేస్తాయి. ‘నేచర్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌’ అంటూ అశ్లీలాన్ని, అనైతికాన్ని నూరి పోస్తాయి.’ఆధునిక అవంతిక’ అంటూ ఆడదాన్ని అంగడి వస్తువును చేస్తాయి.అమ్కకానికి పెడతాయి.

‘పరిపూర్ణ మహిళా సాధికారత’ అంటూ సహజీవనానికి దారులు తెరుస్తాయి. ‘ఉరిమే ఉల్లాసం కోసం, అదిరే ఆనందంకోసం’ అంటూ క్లబ్బు,ప్లబ్బు అనే దుషృతిని ప్రవేశ పెడతాయి.అంతా పైశాచిక ప్రేరణ, అంతా అత్యంత ఆకర్షనీయమయిన మాయాజాలం. ఎండమావిని నీర నుకొని దాని వెంట పడటం ఎంత అవివేకమో దానికన్నా పెను ప్రమా దం పై వాటి బారిన పడటం. ఒక్క మాటలో చెప్పాలంటే, కుడి ఉంది, ఎడముంది. కుడి ఎడమయ్యే ప్రమాదమూ ఉంది. కనుకనే అల్లాహ్‌ా మనల్ని హెచ్చరిస్తున్నాడు: ”ఓ ప్రజాలారా! నిశ్చయంగా అల్లాహ్‌ వాగ్దానం సత్యమైనది. కాబట్టి ప్రాపంచిక జీవితం ఎట్టి స్థితిలోనూ మిమ్మల్ని మోసంలో పడవేయకూడదు. ఆ మాయలమారి (షైతాన్‌) కూడా మిమ్మల్ని మోసగించకూడదు సుమా! నిశ్చయంగా షైతాన్‌ మీ శత్రువు. కనుక మీరు కూడా వాణ్ణి శత్రువుగానే పరిగణించండి. వాడు తన సమూహాన్ని, వారంతా నరకవాసులలో చేరిపోవానికే పిలుస్తు న్నాడు”. ( ఫాతిర్‌: 5,6)

బతుకంటే ఎంపికల సమాహారమే!

ఎంపిక ఏదయినా అది యాదృచ్చికం కాకూడదు. ఎంపిక నైపుణ్య పుష్కలంగా ఉన్నవారే జీవితంలో అత్యధ్భుత విజయాలను సాధిస్తారని అనేక అధ్యాయనాలు చెబుతున్నాయి. ఆ ప్రతిభే గనక లేకపోతే సరయిన స్నేహితుల్ని, సరయిన అలవాట్లను, సరయిన మార్గాన్ని, సర యిన భాగస్వామిని, సరయిన భవిష్యత్తును ఎంచుకోలేము. దేన్ని, ఎప్పుడు, ఎలా, ఎంత మోతాదులో, ఎందుకు ఎంపిక చేసుకోవాలన్న ఒక్క ఐడియా మన జీవితాన్ని మార్చి వేస్తుంది. ఎందుకంటే, మన ఎంపికలే మన నిర్ణయాలు, మన నిర్ణయాలే మన జయాపజాల దిశా నిర్దేశాలు. నేర్చుకోగలిగితే ప్రతి ఎంపికా ఓ గుణపాఠమే.

జీవితాన్ని మంచీ చెడుల ఎంపికార్థమే మనకు ప్రసాదించడం జరిగింది. మనకివ్వబడిన ఈ పరిమిత స్వేచ్చను మనం సద్వినియోగ పరచి సత్యాన్ని, ధర్మాన్ని, మంచిని ఎంపిక చేసుకున్నట్లయితే స్వర్గ వాసుల జాబితాలో చేరతాము. దుర్వినియోగ పరచి ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తే నరక వాసుల సరసన నిలబడాల్సి ఉంటుంది. అల్లాహ్‌ మనందరికి సత్యాన్ని సత్యంగా చూసే సత్య దృష్టిని ప్రసాదించి, స్వీకరించి, అమలు పర్చేలా దీవించి స్వర్గానికి అర్హుల్ని చేయుగాక! ఆమీన్‌.

Related Post