ఇస్లాంలో మానవ హక్కులు

అపార కృపామయుడై న అల్లాహ్ పేరుతో

ఇస్లాంలో మానవ హక్కులు  – సకల మానవాళికి, యావత్ విశ్వానికి ఏకైక సంపూర్ణాధికారి అల్లాహ్. ఆయనే సార్వభౌముడు. ఆయనే జీవికనిచ్చేవాడు, పోషించేవాడూను. అపార కరుణామయుడు. ఆయన కరుణా కటాక్షాల వల్ల సమస్త జీవజాలం ధన్యమవుతుంది. అంతేకాదు, ఆయన ప్రతి మనిషికి గౌరవ ప్రతిష్ఠలను ప్రసాదించాడు. ఆయన మనిషిలో తన ఆత్మను ఊదాడు. కాబట్టి, మానవులంతా అల్లాహ్ దృష్టిలోను ఆయన కారణంగాను ఒక్కటే. తమ సహజ లక్షణాలు ఎలా ఉన్నప్పటికి మానవులందరూ నిర్ద్వంద్వంగా సమానులే. మనుష్యుల మధ్య ఉన్న యాధృ చ్చిక భిన్నత్వం – జాతీయత, రంగు, జాతిలాంటి దాని ప్రాతిపదికన వారి మధ్య ఎలాంటి వ్యత్యాసాలనూ పాటించ లేము. ప్రతి మనిషికి అందరితోనూ బాంధవ్యముంది. అందరిదీ ఒకే వర్గం. సౌభ్రాత్రతతో, సంతోషంతో, అనంత కరుణామయుడైన విశ్వప్రభువును సేవించే వర్గమిది. అలాంటి స్వర్గతుల్యమైన వాతావరణంలో ఇస్లాంలోని ఏకేశ్వరభావన బలవత్తరమయింది. వాతావరణానికి కేంద్రంగా నిలుస్తుంది. మానవ సమానత సర్వమానవ సౌభ్రాత్రతా భావనలకు ఊతంగా నిలుస్తుంది.

ఇస్లామీయ రాజ్యం భూమి పై ఎక్కడయినా ఏర్పడ వచ్చు. అయితే ఇస్లాం మాత్రం మానవ హక్కులను మానవ అధికారాలను భూసరిహద్దులకు మాత్రమే పరిమితం చేయదు. సర్వ మానవాళి కొరకు ఇస్లాం కొన్ని ప్రాథమిక మానవ హక్కుల్ని ప్రతిపాదించింది. ఈ హక్కులు అన్ని పరిస్థితులలోనూ గౌరవించదగ్గవి, ఆచరించదగ్గవి. ఇస్లామీయ రాజ్య పరిధుల్లో ఉన్న వ్యక్తి అయినా లేక బయట ఉన్న వ్యక్తి అయినా సరే, శాంతి సమయంలో అయినా లేక యుద్ధ సమయంలోనయినా ఎల్లవేళలా ఈ హక్కులు మానవులందరి పట్లా పాటించదగ్గవి. ఈ విషయమై ఖురాన్ స్పష్టంగా చెబుతుంది.

ఇస్లాంలో మానవ హక్కులు

“మీ ప్రాణం, మీ ఆస్తులు ప్రళయంలో మీరు మీ ప్రభువు సన్నిధిలో హాజరయ్యే వరకు ఒండొరులకు నిషిద్ధమైనవి.”ఇస్లాంలో మానవ హక్కులు

విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కొరకు సత్యం పై స్థిరంగా ఉండే వారుగా, న్యాయానికి సాక్షులుగా నిలబడండి. (ఏదైనా) వర్గంలో ఉన్న వైరం కారణంగా మీరు ఆవేశానికి లోనయి న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి , ఇది దైవభక్తి పరాయణతకు చాలా సన్నిహితం. (5 : 8)

ఎట్టి పరిస్థితులలోనయినా మానవ రక్తం పవిత్రమైనది. తగిన కారణమేదీ లేకుండా మానవ రక్తాన్ని చిందించరాదు. ఎలాటి కారణమూ లేకుండా ఓ వ్యక్తిని చంపడం ద్వారా మానవ రక్తానికి గల పవిత్రతకు ఎవరయినా భంగపరిస్తే ఆ అకృత్యాన్ని సకల మానవాళిని హత్య చేయడంతో సమానంగా పరిగణిస్తుంది ఖురాన్.
ఎవరయితే ఓ మనిషిని, హత్యకు ప్రతి హత్య (శిక్ష)గానో లేక భువిలో అల్లకల్లోలాన్ని సృష్టించినందుకు (శిక్ష)గానో తప్ప మరే కారణంగానయినా హత్య చేసినట్లయితే అతను మానవాళినంతటినీ హత్య చేసినట్లు. (5 : 32)

మహిళలు, పిల్లలు, వృద్ధులు, రోగగ్రస్తుల పై అణచివేత అనుమతించరాదు, మహిళల మాన మర్యాదలను అన్ని పరిస్థితులలోనూ గౌరవించాలి. అన్నార్తులకు ఆహారమందాలి. కట్టుబట్టల్లేనివారికి దుస్తులనివ్వాలి. రోగగ్రస్తులకు, క్షతగాత్రులకు – వారు ఇస్లామీయ రాజ్యంలోని ముస్లిములై నా ముస్లిమేతరులయినా లేక శత్రువర్గం వారు అయినా సరే – వారికి తప్పక వైద్య సహాయం అందాలి.

ఇస్లాంలో మానవ హక్కుల గురించి మాట్లాడడమంటే వాస్తవానికి ఈ హక్కులు అల్లాహ్ ప్రసాదించినవని ఒప్పుకోవడమన్నమాట. ఈ హక్కులను ఏ రాజుగాని, లేక ఏ చట్ట సభగాని ఇవ్వలేదు. రాజులు, చట్టసభలు ఇచ్చిన హక్కులు ఏ విధంగా ప్రాప్తించాయో అదే విధంగా రద్దు కానూవచ్చు. అదేవిధంగా నియంతలు ఇచ్చిన హక్కులు సయితం అశాశ్వతమైనవి. నియంతలు, రాజులు తమ కిష్టం ఉన్నప్పుడు ఆయా హక్కులను అంగీకరిస్తారు. తమకు కష్టంగా తోచినప్పుడు నిరాకరిస్తారు. ఆయా హక్కులను తమకిష్టం వచ్చినప్పుడు కాలరాస్తారు. కాని, ఇస్లాంలో మానవ హక్కులను అల్లాహ్ ప్రసాదించాడు కనుక ప్రపంచంలోని ఏ చట్టసభకు, ఏ ప్రభుత్వానికి, దైవ ప్రసాదితమైన ఈ హక్కులలో మార్పులు, చేర్పులు చేసే అధికారం గాని – ఈ హక్కుల్ని నిరాకరించే, రద్దుపరచే అధికారంగాని లేదు.

కేవలం ప్రదర్శనా లక్ష్యంతో కాగితాలకే పరిమితమై, ప్రదర్శన ముగిసిన తరువాత వాస్తవ జీవితానికి అందని హక్కులు కావివి. అలాగే కేవలం తాత్విక భావనలు, ఆచరణకు నోచుకోలేని వాదాలు కావివి. ఐక్యరాజ్యసమితి చార్టరు, తీర్మానాలు, ప్రకటనలను అల్లాహ్ ప్రసాదితమైన ఈ హక్కులతో పోల్చలేము. ఎందుకంటే ఇస్లాంలోని హక్కులు ఇస్లామీయ విశ్వాసంలోని భాగాలు. ప్రతి ముస్లిం, ముస్లింగా ప్రకటించుకునే ప్రతి పాలకుడు ఈ హక్కులను అంగీకరించాలి. ఈ హక్కులను గుర్తించాలి. అమలులోకి తేవాలి, ఆచరించాలి. ఈ హక్కులను అమలు పరచలేకపోతే, దైవప్రసాదితమైన హక్కులను త్రోసి పుచ్చడం ప్రారంభిస్తే, ఈ హక్కులలో మార్పులు, చేర్పులు చేయనారంభిస్తే కేవలం నోటి మాటను హక్కులుగా గుర్తించి ఆచరణలో నిరాకరిస్తే అలాటి ప్రభుత్వాల గురించి దివ్య ఖుర్ఆన్ స్పష్టంగా, నిర్ద్వంద్వంగా ఇలా అంటుంది :అల్లాహ్ అవతరింపజేసిన చట్టం ప్రకారం ఎవరైతే తీర్పు చెయ్యరో, వారే తిరస్కారులు. (5 : 44)

ఇస్లామీయ రాజ్యంలో మానవ హక్కులు

1. ప్రాణరక్షణ; ఆస్తి రక్షణ :
ఆఖరి హజ్ యాత్ర సందర్భంగా ప్రవక్త మహనీయులు చేసిన ప్రసంగంలో “మీ ప్రాణం, మీ ఆస్తులు ప్రళయంలో మీరు మీ ప్రభువు సన్నిధిలో హాజరయ్యే వరకు ఒండొరులకు నిషిద్ధమైనవి.” అని ఉద్బోధించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘జిమ్మి’ (ఇస్లామీయ రాజ్యంలోని ముస్లిమే తరు)ల గురించి ఇలా అన్నారు: “ఒడంబడిక రక్షణలో ఉన్న వ్యక్తి (అంటే జిమ్మి)ని హత్య చేసిన వ్యక్తి స్వర్గం సువాసనను కూడా ఆఘ్రాణించలేడు.”

2. మానమర్యాదల రక్షణ :
దివ్య ఖుల క్రింది విధంగా ఆదేశిస్తుంది.
1. విశ్వసించిన వారలారా ! ఓ జాతి ప్రజలు మరో జాతి ప్రజలను అపహాస్యం చేయనీయవద్దు. 2. ఒండొరులను అప్రదిష్ఠపాలు చేయవద్దు. 3. యెగతాళిగా పేరు మార్చి అవమానించవద్దు. 4. ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడవద్దు. (49 : 11,12)

3. వ్యక్తిగత జీవిత పవిత్రత, రక్షణ :
దివ్య ఖర్ఆన్ క్రింది విధంగా ఆదేశిస్తుంది. ఆ 1. ఒకరిపై ఒకరు నిఘావేసి వెంటాడరాదు.
2. అనుమతి లేనిదే ఎవరి ఇంటిలోనికి జొరబడరాదు.

4. వ్యక్తిగత స్వేచ్చకు రక్షణ :

ఏ వ్యక్తి నేరమయిననూ బహిరంగ న్యాయస్థానంలో నిరూపితం కావంతవరకు ఏ పౌరుడినీ నిర్బంధించరాదు అని దివ్య ఖుర్ఆన్ నిర్దేశిస్తుంది. కేవలం అనుమానమున్నంత మాత్రాన ఏ వ్యక్తినయినా నిర్బంధించడం వ్యాయస్థానంలో తగిన వ్యవహారం నడుపకుండా కారాగారంలో పెట్టడం, ఆ వ్యక్తికి తాను నిర్దోషినని నిరూపించుకునే అవకాశాన్ని ఇవ్వకపోవడం – ఇలాటి చర్యలకు ఇస్లాంలో అనుమతి లేదు.

5. దౌర్జన్యాన్ని నిరోధించే హక్కు :
ఇస్లాం మానవాళికి ప్రసాదించిన హక్కుల్లో ప్రభుత్వ దమననీతిని నిరోధించే హక్కు ఒకటి. ఈ విషయమై ఖుర్ఆన్ ఇలా అంటుంది : మనిషి బహిరంగంగా చెడును మాట్లాడటాన్ని అల్లాహ్ ఇష్టపడడు. అయితే అన్యాయానికి గురయిన వ్యక్తికి ఆ హక్కు ఉంది. (4 : 148)

ఇస్లాంలో ఇంతకుముందు వివరించినట్లు, సర్వాధి కారాలు, ఆధిపత్యం అల్లాహ్ కే చెందుతాయి. మనిషి వద్ద కేవలం ప్రాతినిధ్యం వహించే అధికారం మాత్రమే ఉంది. మానవునికి ఉన్న అధికారం కేవలం దైవదత్తమయింది. అది మానవునికడ ఉన్న దేవుని ఓ అప్పగింత. అలాటి అధికారమును గ్రహించినవాడు, తాను ఎవరిపై ఎవరి కోసం, ఈ అధికారాన్ని ఉపయోగించడానికి వచ్చాడో ఆ ప్రజల ముందు జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. ఈ విషయం హజ్రత్ అబూబకర్ రజి) చేసిన మొదటి ప్రసంగం ద్వారా విదితమవుతుంది.
“నేను సక్రమంగా వ్యవహరిస్తున్నంతకాలం నాతో సహకరించండి, కాని నేను పొరపాటు చేస్తే సరిదిద్దండి. దైవం, దైవ ప్రవక్త ఆదేశాలను నేను అనుసరించినంతకాలం నాకు విధేయత చూపండి. నేను దైవ ఆదేశాలను ఉల్లంఘిస్తే నాకు ఎదురుతిరగండి.”

6. వాక్ స్వాతంత్ర్యం :
ఇస్లాం ఆలోచనా స్వాతంత్ర్యాన్ని భావప్రకటనా స్వేచ్చను దేశ పౌరులందరికీ సమానంగా ఇస్తుంది. అయితే ఈ స్వేచ్చ కేవలం మంచినీ, సత్యాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే వినియోగించాలి. చెడును, చెడు నడతను ప్రచారం చేయడానికి వాడరాదు అన్న ఆంక్ష విధిస్తుంది. పాశ్చాత్య దేశాల్లోని భావప్రకటనా స్వేచ్చ భావన కన్నా ఇస్లాం ప్రతిపాదించే భావన ఎంతో ఉన్నతమైనది. ఎలాంటి పరిస్థితులలోను ఇస్లాం చెడుల ప్రచారానికి అనుమతినివ్వదు. విమర్శల పేరుతో దూషించే, ఇతరులను కించపరిచే అధికారాన్ని ఇస్లాం ఎవరికీ ఇవ్వదు. ప్రవక్త కాలంలో ముస్లింలు ఏదైనా విషయంపై తమ భావాలను ప్రకటించే ముందు దైవ ప్రవక్తను సంబంధిత విషయమై దైవాదేశాలు అవతరించాయా అని అడగడం అలవాటుగా ఉండేది. ఆయన ఆ విషయంలో ఎలాటి దైవాదేశాలు అవతరించలేదని చెబితే అప్పుడు ముస్లింలు స్వేచ్ఛగా తమ భావాలను ప్రకటించేవారు.

7. కూటముల నేర్పరిచే స్వేచ్చ :
పార్టీలను, సంస్థలను, కూటములను ఏర్పరిచే స్వేచ్ఛను సయితం ఇస్లాం ప్రసాదించింది. అయితే ఈ స్వేచ్ఛ సయితం కొన్ని నిర్దిష్ట నియమాలకు లోబడి ఉంటుంది.

8. మనస్సాక్షిని అనుసరించే, అవలంబించే స్వేచ్చ :
“ధర్మంలో ఎలాటి బలత్కారమూ ఉండరాదు” అని శాసిస్తూంది ఇస్లాం.
ఇందుకు విరుద్ధంగా ఏక సత్తాక (Totalitarian) సమాజాలు వ్యక్తుల స్వేచ్ఛను పూర్తిగా నిరాకరించాయి. ఈ అన్యాయ భరితమైన రాజ్యాధికారం వాస్తవానికి వ్యక్తులను బానిసలుగా, దాసులుగా పరిగణిస్తుంది. పూర్వం బానిసత్వానికి అర్థం, ఓ మనిషిపై మరో మనిషి సర్వాధికారం కలిగి ఉండటం, కాగా నేడు అలాటి బానిసత్వం న్యాయపరంగా రద్దయినప్పటికీ, దాని స్థానే ఏకసత్తాక (Totalitarian) సమాజాలు వ్యక్తుల పై అదే విధమైన బానిసత్వాన్ని రుద్దుతున్నాయి.

9. మత విశ్వాసాల రక్షణ :
మనస్సాక్షిని ఆచరించే స్వేచ్ఛతో పాటు ఇస్లాం మత విశ్వాసాల పట్ల తగిన గౌరవాన్ని చూపాలని నిర్దేశిస్తుంది. ఎవరూ మరొకరి మత విశ్వాసాలను గాయపరచే విధంగా, వ్యక్తి హక్కులను భంగం కలిగేలా మాట్లాడరాదు, వ్యవహరించ రాదు.

10. నిరంకుశ నిర్బంధాన్ని నిరోధించే రక్షణ :
ఇతరులు చేసిన నేరానికిగాను ఏ వ్యక్తి అరెస్టు కాకుండా ఉండే హక్కును ఇస్లాం గుర్తిస్తుంది. దివ్య ఖుర్ఆన్ క్రింది విధంగా సూచిస్తుంది. “ఒకరి భారాన్ని మరే వ్యక్తి పై వేయడమూ జరుగదు.” (6 : 164)

11. కనీస జీవితావసరాల హక్కు :
అవసరార్డులకు సహాయ సహకారాలు అందించాలని, అది వారి హక్కు అని ఇస్లాం గుర్తిస్తుంది.
“దైవం వారికి ప్రసాదించిన వారి సంపదలో అగత్య పరులకు అనాధలకు హక్కు ఉంది. ” (70 : 24,25)

12. చట్టం ముందు సమానత్వం :
చట్టం దృష్టిలో పౌరులందరూ అన్ని విధాల సమాను లన్న హక్కుని ఇస్లాం పౌరులకిస్తుంది.

13. పాలకులు చట్టానికి అతీతులు కారు ?
ఉన్నత గౌరవనీయ వంశానికి చెందిన ఓ మహిళ దొంగతనం నేరం మీద నిర్బంధించబడింది. ఈ కేసు మహా ప్రవక్త (సఅసం) వద్దకు వచ్చింది. ఆమెను దొంగతనం శిక్షనుండి మినహాయింపునివ్వాలన్న సిఫారసులు వచ్చాయి. అప్పుడు ప్రవక్త ఇలా బదులిచ్చారు; “మీకన్నా ముందు గతించిన జాతులను దైవం నాశనం చేసాడు. ఎందుకంటే వాళ్ళు సామాన్య పౌరులను వారి నేరాలకుగాను శిక్షించేవారు, ఉన్నత వర్గాలకు శిక్షనుండి మినహాయించేవారు. నా ప్రాణం ఎవరి చేతుల్లో ఉందో నేను ఆయన పేర ప్రమాణం చేస్తున్నాను. ముహమ్మద్ కుమార్తె ఫాతిమా ఈ నేరం చేసినా నేను ఆమె చేతులు ఖండిస్తాను.”

14. రాజ్య వ్యవహారాల్లో పాల్గొనే హక్కు :
వారి వ్యవహారాలు పరస్పర సంప్రదింపుల ద్వారా జరగాలి.” (42:38) ఆషూరా’ లేక శాసన సభకు అంతకుమించి వేరే అర్థం లేదు. ప్రభుత్వ అధినేత, శాసన సభ సభ్యులు ప్రజల ద్వారా స్వేచ్ఛగా ఎన్నికవ్వాలి.

చివరిగా ఇస్లాం పైన ఉదాహరించిన మానవ హక్కులను స్థాపించాలని ప్రయత్నిస్తుంది. ఇంకా అనేక హక్కులను – కేవలం న్యాయపరమైన రక్షణ కల్పించటం ద్వారా మాత్రమే కాదు, మానవ జాతిని జంతు స్థాయినుండి పైకి లేపి, జాత్యహంకారం, భాషా దురభిమానం ఆర్థిక ఆధిపత్యాలకు అతీతంగా ఎదిగేలా చేయాలని ప్రయత్నిస్తుంది.
మానవ జాతి మొత్తం ఒక సమాజంగా ఉనికిలోకి రావాలని, మనిషి తన అంతర పరిణతిననుసరించి విశ్వమానవ సౌభ్రాత్రతను గుర్తించాలని అది ఆహ్వానిస్తుంది.

 

Related Post