ఘన సంస్కృతి మనది / greatest culture is ours

ఘన, సంస్కృతి మనది – సంస్కృతి మానవ జీవితం నుండి విడదీయరాని అవిభాజ్యాంశం. మానవాళి ఉనికి, ఊపిరే సంస్కృతి. ఉన్నతి, ఊర్ధ్వగమన  గతీ సంస్కృతి. అవనిలో అనాదిగా ప్రవహిస్తూ వస్తున్న అమృత ధార సంస్కృతి. ప్రతి పనిలో, ప్రతి కదలికలో, ప్రతి కార్యంలో ఒక ఏకీకరణ, సామూహిక అనుసరణ – సంస్కృతి. ఏ సమాజానికైనా ఆత్మలాంటిది సంస్కృతి. యుద్ధ మైదానంలో ఓటమిని చవి చూసిన జాతి మళ్ళీ శక్తిని పుంజు కుని రణ రంగాన్ని తన కైవసం చేసుకో వచ్చేమోగానీ, సంస్కృతిని, సభ్యతను కోల్పోయిన జాతి మనుగడ మాత్రం సవ్యంగా సాగదు. ఒకసారి ఈ రంగంలో ఓడిపోతే ఇక ఊడిగమే ఆ జాతికి శాపంగా పరిణమిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలటే సంస్కృతి విహీనమై ఏ జాతి కూడా మనుగడ సాగించలేదు. అందుకే ప్రతి జాతికి, దేశానికి, ఆటవికులకు సయితం ఒక సంస్కృతి ఉండటం మనం గమనించవచ్చు.

నిన్న మొన్నటి వరకు పూర్తి ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించిన ఘన కీర్తి మనది. అన్ని రంగాల్లోనూ ప్రపంచ చరిత్రపై చెరగని ముద్ర వేసిన అవిరళ కృషి మనది. లోకం మొత్తానికి మానవత్వ పాఠాలు బోధించిన ఉత్తమ రివాజు మనది. బాధిత జనాల పక్షం వహించి, దౌర్జన్యపరులను ప్రతిఘటించిన అత్యుత్తమ చరిత్ర మనది. ఇన్ని విశిష్టతలు, విశేషాలు గల మన సముదాయం గత కొన్నేళ్ళుగా నిద్రా వస్థలో పడి కొట్టుమిట్టాడుతుండటం కడు శోచనీయం! మన ప్రస్తుత పరిస్థితి మిక్కిలి విచారకరం!!

ఇన్ని సంస్కృతుల మధ్య ఇస్లామీయ సంస్కృతీ నాగరికతలకు గల ప్రత్యేకత ఏమిటంటే- సాత్వికమైనది, సార్వజనీన మైనది ఇస్లామీయ సంస్కృతి. అది ఒక వర్గానికో, జాతికో, దేశానికో పరిమిత మైనది కాదు. అది అన్ని కాలాల్లో, అన్ని ప్రాంతాల్లో సర్వాంగ సుందరమైనది, శాంతి ప్రదానమైనది. ఏకేశ్వరోపాసన (తాహీద్) దాని పునాది. వివాహం, వ్యవహారం, వ్యాపారం, కుటుంబ జీవనం, అతిథి సత్కారం, సంస్కారం, తల్లి దండ్రుల సేవ, పెద్దల పట్ల గౌరవం, పిల్లల పట్ల అవ్యాజానురాగం, అనాథల ఆదరణ, వితంతువుల, వికలాంగుల, నిరుపేదల, అభాగ్యజీవుల సంక్షేమాభిలాష, త్యాగం, విరాగం, సార్వజనిక, సాత్విక శ్రేయోకామన ఇస్లామీయ సంస్కృతి. ఏకదైవభావన (తాహీద్), ప్రార్ధనలు, జకాతులు, రోజాలు, హజ్జలు – ధర్మ పోరాటాలు అపురూప ఇస్లామీయ సంస్కృతి.
సృష్టికర్త పట్ల అపార నమ్మకం, అగోచర సృష్టిజీవులైన దైవదూతలపై విశ్వాసం, దైవగ్రంథాల మధ్య సమన్వ యం, దైవ ప్రవక్తలందరి పట్ల సమరస భావం, పరలోక చింతన, స్వర్గ ప్రీతి,  నరక భీతి, అదృష్టాదురదృష్టాల పట్ల విశ్వాసం ఇస్లామీయ అనుపమ సంస్కృతి. ధ్యాన లీనం, జ్ఞాన సముపార్జనం, ఖుర్ఆన్ పారాయణం, ఆత్మ పరిశీలనం, ఆత్మ విశ్వాసం, మనో ధైర్యం ఇస్లామీయ నిరుపమాన సంస్కృతి. మంచిని బోధించటం, చెడు నుండి వారించడం, దూరంగా ఉండటం, విశ్వ జనుల్లో కాంతిని, విశ్వంలో శాంతిని నింపడం అనాదిగా ఇస్లామీయ సంస్కృతి. అది మనందరి  శ్రేయోసాఫల్యం కోసం స్వయాన ఆ మాధవుడే ఎన్నుకున్న అనంత సంస్కృతి. ఆయన ఇలా సెలవిస్తున్నాడు:
“ఈ రోజు అవిశ్వాసులు మీ ధర్మం (సభ్యతా సంస్కృతిని మట్టి పాలు చేయాలన్న దుష్ట సంకల్పం) గురించి ఇక ఆశను వదులుకున్నారు. జాగ్రత్త! మీరు భయపడవలసింది వారికి (ఏ పాశ్చాత్య సంస్కృతికో, పాడుబడ్డ ఆచారానికో) కాదు, మీరు నాకు భయపడండి. ఈ రోజు మీ కొరకు (అన్నింటికన్నా శ్రేష్ఠతర గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. ఇంకా, ఇస్లాంను మీ (జీవన) ధర్మం (మీకు శాశ్వతమైన ఘనకీర్తినిచ్చే సంస్కృతి)గా సమ్మతించి ఆమోదించాను”. (అల్ మాయిదా: 3)

మరో చోట ఇలా అనబడింది: “ఆయనే తన ప్రవక్తకు సన్మార్గాన్ని, సత్య ధర్మాన్ని (సంపూర్ణ సంస్కృతీ నాగరికతలను) ఇచ్చి పంపినవాడు. దాన్ని (ఇతర) మత ధర్మా (సంస్కృతీ నాగరికత) లన్నింటిపై ఆధిక్యం వహించేలా చేయడానికే (ఈ ఏర్పాటు)”. (అస్సఫ్: 9)

(విడ్డూరం ఏమిటంటే) “వారు అల్లాహ్ జ్యోతి (ఇస్లామీయ సంస్కృతీ నాగరికతల)ని తమ నోళ్ళతో (కలిమి, బలిమిని ఉపయోగించి) ఊది ఆర్పివేయ దలుస్తున్నారు. (ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా) అల్లాహ్ మాత్రం తన జ్యోతిని పరిపూర్ణం గావిస్తాడు – అవిశ్వాసులకు అది ఎంతగా సహించరానిదైనా సరే!”
(అస్సఫ్: 8)
(గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది) “(ఓ ప్రవక్తా!) ఎవరు తమ ధర్మాన్ని ఆటగా, వినోదంగా (విలాసానిచ్చే వస్తువుగా) చేసుకున్నారో, ఎవరినయితే ప్రాపంచిక జీవితం మోసపుచ్చిందో వారికి దూరంగా ఉండు. అయితే ఈ ఖుర్ఆన్ ద్వారా వారికి (వారు మరచిన సభ్యతా సంస్కృతుల్ని ‘ గుర్తు చేస్తూ) ఉపదేశం మాత్రం చేస్తూ ఉండు. ఏ వ్యక్తీ  తన చేష్టల మూలంగా ఇరుక్కుపోయే దుర్గతి పట్టకుండా ఉండటానికి, అల్లాహ్ తప్ప వేరెవరూ సహాయం చేయని, సిఫారసు చేసేవాడెవడూ ఉండని దురవస్థ దాపురించకుండా ఉండటానికి, ప్రపంచమంతటినీ పరిహారంగా ఇచ్చి బయట పడాలని తహ తహలాడినా అది అతన్నుంచి స్వీకరించబడని (గడ్డు) స్థితి ఏర్పడకుండా ఉండటానికి గాను, (నీవు వారికి ఇస్లామీయ సంస్కృతీ నాగరికతలను బోధపరుస్తూ ఉండాలి సుమా!)”. (అల్ అస్ఆమ్: 70)

(అలాగే ఈ నగ్న సత్యాన్ని సయితం వారికి బోధ పర్చు) “ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని (సంస్కృతిని, జీవన విధానాన్ని) అన్వే షించి (మోక్షం పొందగోరి)తే అతని ఆ విధానం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరి పోతాడు”. (ఆలి ఇమ్రాన్: 85)

సోదర సోదరీమణులారా! సర్వలోక సృష్టికర్త, పోషకుడు, పాలకుడు, ఆరాధనలకు అన్ని విధాల అర్హుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించే మహోత్కృష్ట సంస్కృతి మనది. దైవ గ్రంథాలన్నింటినీ, దైవప్రవక్తలందరిని సమానంగా గౌరవించే విశాల దృష్టి గల సముదాయం మనది. దివ్య ఖుర్ఆన్ విశిష్ట వచనాల్ని, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వారి సుమధుర ప్రవచనాల్ని ప్రాణంగా, ప్రాణాధికంగా భావించే మహత్తర సంప్రదాయం మనది. జగమంతటినీ దైవ కుటుంబంగా, దైవ దాసులుగా అభిమానించే విశ్వజనీన సంస్కారం మనది. మంచిని పెంచి, చెడుని తుంచి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రభువు ప్రసన్నతయే లక్ష్యంగా ఎంచే శ్రేష్ఠ సముదాయం మనది. ఇంటికొచ్చిన అతిథిని సతీ, సంతానం సమేతంగా పస్తులుండి మరీ సత్కరించిన త్యాగమయ సంస్కృతి మనది. ప్రాణ శత్రువుల్ని జయించి కూడా శిక్షించకుండా క్షమించి పొంగి పోయిన ఉదార సంస్కృతి మనది. అన్నం పెట్టడంలో, అనాథల్ని చేరదీయటంలో, అభాగ్యుల్ని ఆదుకోవటంలో ఆనందాన్ని ఆస్వాదించిన మహానుభావులు మన పూర్వీకులు. తల్లిదండ్రుల అనురాగ ఫలాలు, ఆశా దీపాలు, కంటి చలువలు అయిన చిన్నారుల్లో బాల్యం నుండే తౌహీదను, సాత్విక ప్రేమను, విశాల దృక్పథాన్ని నూరిపోసే ఆదర్శ సమాజం మనది. నిన్న మొన్నటి వరకు పూర్తి ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించిన ఘన కీర్తి మనది. అన్ని రంగాల్లోనూ ప్రపంచ చరిత్రపై చెరగని ముద్ర వేసిన అవిరళ కృషి మనది. లోకం మొత్తానికి మానవత్వ పాఠాలు బోధించిన ఉత్తమ రివాజు మనది. బాధిత జనాల పక్షం వహించి, దౌర్జన్యపరులను ప్రతిఘటించిన అత్యుత్తమ చరిత్ర మనది. ఇన్ని విశిష్టతలు, విశేషాలు గల మన సముదాయం గత కొన్నేళ్ళుగా నిద్రా వస్థలో పడి కొట్టుమిట్టాడుతుండటం కడు శోచనీయం! మన ప్రస్తుత పరిస్థితి మిక్కిలి విచారకరం!!

మన శత్రువుల కురహకాల వల్లనే, కుతంత్రాల మూలంగానే ఇలా జరిగిందని కొందరు వాగ్వివాదానికి దిగొచ్చు. నిజమే. ప్రవక్త నూహ్ కు , ఇబ్రాహీమ్ కు, మూసాకు, యహ్యాకు, ఈసాకు (అ ), అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స)కు కూడా శత్రువులుండే వారు. మనకన్నా పెద్ద శత్రువులు ఉండేవారు. అందువల్లే ప్రవక్త జకరియ్యా రంపంతో రెండుగా చీల్చివేయబడ్డారు. యహ్యా వధించ బడ్డారు. ఈసా వేధింప బడ్డారు. ముహమ్మద్ (స) బాధించ బడ్డారు. వీరి శత్రువులు మన శత్రువుల కన్నా పాషాణ హృదయులు. ఆ మాట కొస్తే శత్రువులు లేనివారంటూ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఎక్కువ విజయాలు సాధించినవారికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఎందుకంటే – గెలుపు – అది ఆర్థిక పరమైనదైనా, ఆధ్యాత్మికమైనదైనా, విద్యా విషయకమైనదైనా, వైజ్ఞానికమైనదైనా, సాంకేతికమైనదైనా మరింత మంది శత్రువుల్ని ప్రోగు చేస్తుంది. అయితే ఇంత మంది శత్రువుల మధ్య ఉంటూనే విజయం సాధించడాన్ని, రాజ్యాల్ని, మనుషుల్ని కాకుండా మనసుల్ని, హృదయాల్ని ఏలడాన్ని ఇష్టపడతారు పురుషోత్తములు, అందులోనే నిరతం శ్రమైకానందాన్ని పొందుతుంటారు. కాబట్టి వారి జీవితాలు ఒక ఛాలెంజీ, ఛేంజీయే మనకు ప్రవక్తల జీవితాల్లో ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తూ కన్పిస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించిన, ఈ ఆదర్శాన్ని అనుసరించిన వ్యక్తి – సాకులు వెతకడం మానుకుని శ్రమకి, సాధనకి, కృషికి ప్రాధాన్యత నిస్తాడు. కారణం – ‘కృషి ఉంటే మనుషులు కూడా ఋషులవుతారు’ అన్నది అతను నమ్మిన సిద్ధాంతం.

అవును, ఇది నిత్య ప్రస్థానం – ఇందులో ఎగుళ్ళు దిగుళ్ళు తప్పవు. ఇది నిత్య ప్రయోగం. ఎదురు దెబ్బలు తప్పవు. వల్లకాటి దిబ్బల చుట్టూ ఊళ్ళ కాపురాలు. మండే ఎడారి చుట్టూ పసిమి పండే మాగాణాలు. మారణ ధూమాన్ని ఊదేసే జీవన పవనాలు. విచ్చిన్న విష సంస్కృతుల తమస్సుని చీల్చుకువచ్చే ఉషోదయ కిరణాలు. ఆకులు రాలిపోతేనేమీ? చిగురాకులు పుట్టవా? నీళ్ళు ఇగిరిపోతేనేమి? వాన మబ్బులు గజ్జె కట్టవా?

అలలు చలించినప్పుడే జలానికి ఉద్దీపనం. రక్తం ప్రసరించినప్పుడే నరాలకు ఉజ్జీవనం. అణువు నుండి అంతరిక్షానికి, అంబరం నుంచి అవనీతలానికి, అనుభూతి నుంచి ఆకృతికి, అదృశ్యం నుంచి అభివ్యక్తికి జరుగుతున్న అవిరళ శోధనమిది. జారిపడుతున్నా మెట్టు మెట్టుగా ఆరోపిస్తున్న నిత్య సాధనమిది. ఇక్కడ రహదారే గమ్యం , అలుపెరగకుండా సాగిపోవడమే లక్ష్యం. ఏ మసక సందెలు అలుముకున్నా, ఏ అప్రాచ్య సంస్కృతీ నీలినీడలు కమ్ముకున్నా ఇస్లామీయ సంస్కృతి మాత్రం కాంతి బాటయే. ఏ మంచు గడ్డలు పేరుకున్నా ఖుర్ఆన్ బోధ జ్వలన ధాతువే. ఆ కాంతిని హరించాలని, ఆ బోధను కబళించాలని తమస్సు తీండ్రించినప్పుడు, వలపన్ని వలయాకారంలో చుట్టు ముట్టినప్పుడు, దివ్య వచనమే ఆయుధంగా, ప్రవక్త ప్రవచనమే అంతశ్చేతన ఆలంబనగా, మానవత్వమే మహాస్త్రంగా పురోగమించాలి మనం. ప్రతికూల పరిస్థితులకు, పరిసరాల పైకెగిసి అడ్డొ స్తున్న అవరోధాలను అవలీలగా దాటి, సమస్యల సునామీలను జయించి నిండు నవ్వులుగా మలచుకోవాలి మనం. మానవత్వాన్ని మాడ్చివేసే గ్రీష్మంలో మమతల మల్లెలు జల్లుతూ సాగాలి మనం. కరుణను కాటి పాలు చేసివేసే తుఫానుగాలుల మధ్యనే దయాదీపాలు వెలిగించాలి మనం. రాబందులు తలెత్తి తాండవిస్తున్న చోటే పావురాల్ని ఎగురవేయాలి మనం. ముళ్ళకంపలు తలలు బలిసి నిలుచున్న స్థానంలోనే ఉద్యాన వనాలు నాటాలి మనం.రాళ్ళు రువ్వే రక్కసి చీకట్ల మధ్య ప్రశాంతంగా పలుకరించే కిరణాలవ్వాలి మనం. విత్తనం అనుకొని మనల్ని మట్టిలో విసిరి కొడితే, మహా వృక్షాలై నిలవాలి మనం.

చీకటి ఒళ్ళు మండుతుంది ‘చీకటి’ అని పిలిస్తే. అజ్ఞానం ఉరిమి చూస్తుంది ‘అజ్ఞానం’ అని నిలదీస్తే. అది ఒక్క నోటిని నొక్కేయాలని చూస్తే లక్ష కంఠాలై మోగాలి మనం. ఆత్మస్థయిర్యం మన ఏకైక ఆయుధం. అల్లాహ్ మన ఏకైక దైవం. ముహమ్మద్ (స) మన ఏకైక ఆదర్శం. ఖుర్ఆన్ మన ఏకైక మార్గదర్శక గ్రంథం. అలుముకున్న ఆధునిక చీకట్లలో వేగు చుక్కలై వెలగాలి మనం. పేరుకున్న పాశ్చాత్య సంస్కృతిలో ఇస్లామీయ సంప్రదాయాల్ని ఆవిష్కరించాలి మనం. కోరికల జీబురు పొదల్లో నీతి చంద్రికలై కదలాలి మనం. సంగీత శ్రవణాల పందిళ్ళలోన సత్య సౌరభాలు వెదజల్లాలి మనం. తోళ్ళు కప్పుకున్న తోడేళ్ళ మధ్య మానవతామూర్తులై ఎదగాలి మనం. దివ్య వచనాల స్వాతి చినుకుల్లో తడిసి ముత్యాలై సత్యామృతాన్ని ఆస్వాదించి, సంతృప్తితో ఓలలాడి పుడమి నిండా ఉషస్సులు పంచుతూ పయనించాలి మనం. కొడిగట్టిన మనో సీమల్లో కాంతిని, క్రాంతిని, శాంతిని ఆవిష్కరించాలి మనం.

ఎందుకంటారా? బండలు లేని చోట ఉన్న నీరు రమ్యంగానే ఉంటుంది. నీరు లేని చోట ఉన్న బండలు కూడా రమ్యంగానే ఉంటాయి. ఇక, నీరు ప్రవహించే జాలులో బండలున్నా, లేక బండలగుండా నీరు ప్రవహిస్తున్నా ఆ దృశ్య లావణ్యం అద్భుతంగా ఉంటుంది. ఎంత సేపు అయినా బండల గుండా ప్రవహిస్తున్న ఆ నీటిని, ఆ నీటిని ప్రవహించనీయకుండా అడ్డుపడుతున్న ఆ బండలను చూడాలని ఉంటుంది. కదలనిది పాషాణం. కదిలే చైతన్యాన్ని కదలని జడత్వం ఆపజాలదు. అందుకే బండలను అధిగమించి నీరు నిరంతరంగా తన ప్రయాణాన్ని, ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. నిజమే మరి-,

ఏ రంగులు పులుముకున్నా ఎప్పుడైనా గెలిచిందా చీకటి?

ఏ ఆంక్షలు నిషేధించినా ఉదయించకుంటుందా కిరణ సంపుటి?
సౌమనస్యాన్ని ప్రసరింపజేసేందుకు మనం వేసే ఆ అడుగు, వైమనస్యాన్ని ప్రతిఘటించే తొలి నుడుగు అవ్వాలి. అందుకు దైనందిన ఆరాధన, విధేయతతో మనం పొందే శిక్షణ   అన్ని విధాల దోహదపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Post