పాము పగ బట్టుతుందా…?

నిశ్శబ్ధ స్థలం…జల పాతాల ఘోష….నదుల గలగలలు….దూర తీరాల్లో ఉదయించే….అస్తమించే సూర్యుడు….ఎత్తయిన చెట్ల సౌందర్యం…..వాటి మధ్య ఎండ నీడల మిశ్రమం….చెట్ల కొమ్మల చివర కోయిల రాగం…లోయ అంచుల్లో నిర్మించబడిన అందమైన భవంతులు….ఇవన్నీ పుష్కలంగా ఉన్న అతి సుందర ప్రాంతం తలకోన… అక్కడే సమీపంలో అమర్చబడివున్న చెక్క కుర్చీల మీద సేదదీరి ఉన్నారు ముగ్గురు మిత్రులు….పరస్పరం ముచ్చటించుకుంటూ…!పిచ్చాపాటి జోకులేసుకుంటూ..!! నెలకోసారి గజిబిజి ప్రపంచానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో సరదాగా గడపటం వారి హాబి…!!!

ప్రశ్నలతో నిండిన మనస్సులోని చీకటిని తొలగించటానికి పరిశోధన, పరిశీలన అనే ఆయుధం ఎంతో అవసరం. మరి ఎప్పటివరకైతే ప్రశ్నకు జవాబు అనే వెలుగు రాదో, విచక్షణాజ్ఞాన దీపిక వెలుగదో, మనస్సులో చోటు చేసుకున్న ఆ అపోహల చీకటి మరింత దట్టమై నిలుస్తుంది. ఈ అజ్ఞానాంధకారం ఎంత దట్టంగా ఉంటుందో మనిషి కూడా అంతే భయభీతుడవుతాడు.

అలా మానసిక ఉల్లాసంతోపాటు ఆధ్యాత్మిక వికాసం చెందుతుంటారు. సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకునేవారు నేడు కూడా కొన్ని విషయాల గురించి మాట్లాడుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి ఈ సంభాషణ ఉద్ధేశ్యం నిజాలను నిగ్గు తేల్చి న్యాయ వ్యవస్థ కోసం తమ వంతు కృషి చేయడమే. కేవలం ఈ ముగ్గురి కృషితో అది సాధ్యమా? అని నివ్వెరబోతున్నారా?!
సాధ్యమే –

కార్కొన్న మహాంధకార
కారాటని గుబురులోన
చాలునొక్క వేగు చుక్క
చండ తమస్సును చీల్చగా

సుడులుగొన్న ఏటిలోన
పడిపోయిన నావికునికి
చాలునొక్క కొయ్య ముక్క
జాలు నుండి దరి చేరగ
చీకాకుల పెనుకాకుల
మూకలు ఎదురైనప్పుడు
చాలునొక్క ఆశరెక్క
సమస్యలను దాటిపోగ
ఆశావాదం మనిషి ఆరో ప్రాణం
అదిలేనిది బ్రతుకేమిటి? నరకప్రాయం
అన్నారు సి.నా.రె…

ప్రభాకర్‌: ఆటపాటలయ్యాయి. ఇక మనం మన వద్దనున్న సమయంలో కొన్ని సందేహాల్ని అడిగి తెలుసుకోవడం మంచి దన్నది నా అభిప్రాయం. ఈ రోజు మనం ముగ్గురమే కాక మనతోపాటు అబ్దుల్‌ ఖాదిర్‌ గారు కూడా ఉన్నారు. మంచి మేధాసంపన్నులు. కాబట్టి ఇది మనకు లభించిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను.

పీటర్‌: సోదరులు ప్రభాకర్‌ చెప్పినట్లు మాతో మీరు రావడం నిజంగా మా అదృష్టం. నాదో ప్రశ్న. ”పాము పగ బడుతుంది” అంటారు కదా! ఇందులో ఎంత వరకు నిజం ఉందంటారు?
అ.ఖ:- ముందు సర్పాలకి సంబంధించిన కాసింత సమాచారాన్ని తెలుసుకుందాం. పూర్తి ప్రపంచంలో విష సర్పాలు అనేవి ఐదు రకాలు. త్రాచు పాము. కట్ల పాము. మిన్నాగు. రసల్‌ టైపర్‌. రక్త పింజరి. ఇవి కరచి, సమయానికి విరుగుడు మందు తీసుకోకపోతే మంత్రం తంత్రం జాన్తా నై! ఒకేసారి పైపైకే. సరైన మందు సమయానికి తీసుకుంటే మనిషి కోలుకుంటాడు. మిగిలిన సర్పాలన్నీ విషం కాస్తోకూస్తో ఉన్నా పెద్దగా ప్రమాదం లేనివి. అవి కేవలం మనిషినే కాదు తన ఎదుట కదిలిన ప్రతి రాయి, రప్ప, చెట్టు, ఆకును కరుస్తాయి భయంతో. ఆ జడపదార్థాలు భయపడవు కాబట్టి అవి చావవు. పాము అనగానే మనిషికి ఎక్కడ లేని భయం గనక అధికశాతం మంది ప్రమాదకరం కాని సర్పాలు కాటేసినా మరణించడం మనం చూస్తుంటాము. కారణం భయం. అంటే సర్పాల్లో దాదాపు 90 శాతం విషం లేనివే.

ఇక ‘పాము పగబడుతుంది, దాన్ని చంపక తరిమితే’ అన్నది వేలాది నాలుకల మీద నానే పిల్లి మూఢ నమ్మకం. వాస్తవంగా పగబట్టే ధైర్యం, తీరిక ఏ పాముకీ ఉండదు. పోతే పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం – పాము అడుగులు గుర్తు పట్టలేదు. అందులో మనుషుల్ని వేర్వెరుగా, విడివిడిగా గుర్తు పట్టడం అస్సలు దానికి తెలీదు. కాబట్టి పగబట్టే సమస్యే లేదు. ఇక విషమున్న పాముల విషయానికొస్తే అవి కాటేసిన చోటును బట్టి దాని ప్రభావం ఉంటుంది. విషం అన్నది నేరుగా రక్తంలో వెళ్ళి కలిస్తేనే హాని చేస్తుంది తప్ప అన్యదా ప్రమాదం లేదు.
పోతే పాము విషం అనేక విధాల ఉపయోగపడుతుంది కూడా. అందుకే దానికి మార్కెట్‌లో అంత గిరాకీ. ఒక్క గ్రాము విషం పదిహేను వేలు ఖరీదు పలుకుతోంది.

ప్రభాకర్‌: ‘నాగుల చవితి’ అని ప్రత్యేకంగా పండుగ చేస్తారు కదా! అందులో పాముల్ని, ముఖ్యంగా నాగు పాముల్ని పూజిస్తారు కూడా. దీనికి మీరేమంటారు?
అ.ఖ:- ప్రపంచంలోని పలు దేశాల్లో పాముని గొప్పగా భావించడం జరుగుతుంది. వారిలో గ్రీకులు, యూదులు, హైందవులు ప్రముఖులనవచ్చు. వారి వారి కారణాలు, లాజిక్సు వారికున్నా ‘నాగుల చవితి’లో పాడే పాటల ఆధారంగా మనం కొన్ని విషయాలను గ్రహించగలం. చూడండి!
అర్థ రాత్రి వేళ అపరాత్రి వేళ
పాపమెరుగని పసులు తిరిగేని,
ధరణి జీవనాధారాలు సుమ్మ!
వాటిని రోషాన కాటేయబోకు!

అంటే- నోరు లేని మూగ జీవాలు (అప్పట్లో) మనిషి జీవనాధారాలు – పాపం పశువులకు ఎలాంటి హాని జరక్కుండా చూడమనటమే ఈ పాట పరమార్థం.
పాపమెరుగని పసికూనలోయి!
కోపించి బుసలు కొట్టకోయి!
నాగుల్ల చవితికి నాగెంద్ర నీకు
పొట్ట నిండా పాలు పోసేము తండ్రి!

అంటే- పసికూనలకు ఏమి జరగకూడదనే వారి అంతరంగం. ఇక పెద్దవారి విషయానికొస్తే – ఇందులో ముఖ్యంగా రాత్రి పూట పనిపాట నిర్వహించవలసిన రైతు జనాలు వేళాపాళా లేకుండా చేలల్లో, మడుల్లో తిరుగాడుతుంటారు. అలాగే విద్యుత్‌ సౌకర్యం, వాహన సౌకర్యం లేని ఆ కాలంలో దూర ప్రాంతాలకు కాలి నడకన వెళ్ళాల్సి వచ్చేది. అలాగే ఏదైనా అవాంతరం వచ్చిపడ్డప్పుడు అర్థరాత్రి అయినా బయలు దేరాల్సి వచ్చేది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇలా అనడం జరిగింది:
చీకటిలోన నీ శిరము తొక్కెము
కసి తీరా మమ్మల్ని కాటెయ్యబోకు
కోవ పుట్టలోని కోడె నాగన్న
పగలు సాధించి (?) మా ప్రాణాలు దీకు!

చివరికి తన ప్రాణసఖి అయిన భార్య ప్రాణ రక్షణ కోసం కూడా ఇటువంటి పాటలు ‘నాగుల చవితి’ దినాన వినవస్తాయి.
పగలనక రేయనక పనిపాటలందు
మునిగి తేలేటి నా మోహాలబరిణె
కంచెలూ కంపలూ గడిచేటు వేళ
కంప చాటున నుండి కొంపదీకోయి!
పాముని తీసుకుని అనేక లోకోక్తులు ప్రాచుర్యంలో ఉన్నాయి. ‘ఏ పుట్టలో ఏ పాముందో’, ‘పుట్ట మీద పెట్టినట్టు’, ‘పాలు పోసిన చేతినే కాటు వేస్తుంది’, ఏరా, మన్ను తిన్న పాములా అలా ఉన్నావు’ అని.

పీటర్‌:- మా ఊరిలో పాడుబడిన ఒక బంగళా ఉంది. ఆ బంగళాలో ‘దెయ్యం’ తిరుగుతుందని ప్రతీతి. అందుకే మేమంతా ఆ బంగళాను ‘భూత్‌ బంగళా’, ‘దెయ్యాల కొంప’ అని పిలుస్తాము.
అ.ఖ:- ‘దెబ్బకు దెయ్యం పారిపోయింది’ అనో, ‘దెయ్యానికి పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయి’ అనో, ‘దెయ్యం జుట్టు విరబోసుకుని, తెల్ల చీర కట్టుకుని మా ఊరి పొలిమేర దగ్గర ఊడల మర్రి చెట్టు మీద కూర్చోంటుంది’ అనో, ‘అది ముందు కాలంలో ఎంతో మందిని తినేసింది’ అనో ప్రజలు మామూలుగా చెప్పుకుంటుంటారు. దాన్నే ముద్దుగా ‘మర్రి చెట్టు దెయ్యం’ అని కూడా నామకరణం వారే చేస్తారు. ఎంత విచిత్రంగా ఉంది కదూ!

సరే దెయ్యం ఉందే అనుకుందాం. అది తెల్ల చీర ఎక్కడ కొన్నది? తెల్ల చీరంటే కాటనా? సిల్కా? ‘చీర కట్టుకుని జుట్టు విరబొసుకుందంటా’ అంటే- అది ఆడ దెయ్యమా? మరి మగ దెయ్యాలు ఎలా ఉంటాయో మరి? దెయ్యాల గురించి పుంఖాలు పుంఖాలుగా చెప్పుకునే ఈ కథలు వినడానికి బాగుంటాయేమోగానీ ఇవి ఎంత మాత్రం నిజం కాదు.

ప్రభాకర్‌:- మనిషిలోని భయమే – దెయ్యం అంటారా?
అ.ఖ:- ఏదైతే అందరికీ కనబడదో… వినబడదో రూపురేఖ ఉండదో…దానిని పెంచి – పెద్ద చేసి ప్రచారంలో ముంచితే అదే భయం అవుతుంది. ఆ భయమే దెయ్యంగా ప్రజల్ని మానసికంగా పీడిస్తుంది. ఇదే పాము విషయంలో సైతం మనం చూడగలం.

ప్రభాకర్‌:- మరి కొన్ని వేల సంవత్సరాలుగా ఇది ప్రచారంలో ఉంది. కారణం ఏమైయి ఉంటుందంటారు?
అ.ఖా:- ఇందుకు ముఖ్య కారణం సృష్టి రహస్యాలను శోధించి ఛేదించకపోవడమే. ఉదాహరణకు: దేవుడు మనిషిని మట్టితోనూ, జిన్నాతులను అగ్నితోనూ, దూతలను కాంతితోనూ సృజించాడన్న వాస్తవం ఎంత మందికి తెలుసు? తెలిసినా పూర్తి విషయ పరిజ్ఞానం ఎందరికుంది? అనేది వేయి దీనార్ల ప్రశ్న. ‘జిన్నాతులు’ అనబడే ఈ సృష్టి చాలా విచిత్రమైనది. చాలా సూక్ష్మమైనది కూడా. వీటి గురించి రెండు మూడు చోట్ల ఖుర్‌ఆన్‌లో వచ్చింది. మరి వీటికి సంబంధించిన వివరాలన్నీ, వాటి కీడు నుండి రక్షింపబడే సూచనల గురించి ప్రవక్త (స) వారి ప్రవచనాల్లో సవివరంగా పేర్కొనడం జరిగింది. కొరివి దెయ్యం గురించిన కబుర్లు కూడా ఈ జిన్నాతుల పట్ల సరైన అవగాహన లేమి కారణంగా ఏర్పడినవే.

కాబట్టి ప్రశ్నలతో నిండిన మనస్సులోని చీకటిని తొలగించటానికి పరిశోధన, పరిశీలన అనే ఆయుధం ఎంతో అవసరం. మరి ఎప్పటివరకైతే ప్రశ్నకు జవాబు అనే వెలుగు రాదో, విచక్షణాజ్ఞాన దీపిక వెలుగదో, మనస్సులో చోటు చేసుకున్న ఆ అపోహల చీకటి మరింత దట్టమై నిలుస్తుంది. ఈ అజ్ఞానాంధకారం ఎంత దట్టంగా ఉంటుందో మనిషి కూడా అంతే భయభీతుడవుతాడు. భయమున్న వ్యక్తి చైతన్యవంతుడు కాలేడు. చలనం లేని ఆలోచనల వల్ల అంధకార ఊబిలో మరింత లోతుకు కూరుకుపోతాడు. కాబట్టి సృష్టి రహస్యాలను ఛేదించేందుకు మరింత ప్రయత్నం జరగాల్సి ఉంది. అలా జరిగితే గాని నిజం వెలుగులోకి రాదు.

Related Post