ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు

ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు ”అదే విధంగా మేము మిమ్మల్ని ఒక ‘న్యాయశీల సమాజంగా’ (ఉమ్మతె వసత్‌గా) చేశాము”. (అల్‌ బఖరహ్‌: 143) అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి, వాటిలో కొన్నింటిని ఇక్కడ పొందు పరుస్తున్నాము.

 

మొధటి ప్రత్యేకత:

శ్రేష్ఠ సముదాయం.
”మానవుల కోసం ఉనికిలోకి తీసుకు రాబడిన శ్రేష్ట సముదాయం మీరే. మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు. ఇంకా మీరు అల్లాహ్‌ను విశ్వసిస్తారు”. (ఆల్‌ ఇమ్రాన్‌: 110)
ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”మీ ఆగమనంతోటి 70 సముదాయాల సంఖ్య పుర్తయింది. వాటన్నింటిలోనూ మీరు అల్లాహ్‌కు మిక్కిలి ప్రియులు, మిక్కిలి గౌరవనీయులు”. (తిర్మిజీ)
హజ్రత్‌ అబూ హురైరా (ర) ఈ హదీసును గురించి ఇలా వ్యాఖ్యానించారు: ”ప్రజల మేలు కోరే ఉత్తములు మీరు. ఎన్నో ఆంక్షల సంకెళ్ళతో సతమత మయ్యే వారిని తీసుకొచ్చి (ఉత్తమ హితబోధ ద్వారా) వారు ఇస్లాం స్వీకరిం చేలా చేస్తారు. ఆ రకంగా మీరు వారిపై పడి ఉన్న అనవసర ఆంక్షల బరువును దించిన వారుగా, వారి సంకెళ్ళను త్రెంచిన వారుగా ఘనకీర్తి గడిస్తారు”.
”ఇతర ఏ ప్రవక్తకు ఇవ్వబడని కొన్ని ప్రత్యేకతలు నాకు అనుగ్రహించ బడ్డాయి” అన్నారు ప్రవక్త (స). ‘అవేమిటి? ఓ దైవప్రవక్తా!’ అని సహాబా ప్రశ్నించగా – ”(ఒక నెలంతటి దూరం గల) భయం, తేజస్సుతో నాకు సహకరించడం జరిగింది. నాకు భూమండలపు తాళం చెవులు ఇవ్వ బడ్డాయి. నేను అహ్మద్‌ అని నామకరణం చెయ్యబడ్డాను. మట్టి నా కోసం పరిశుద్ధమయినదిగా చెయ్య బడింది. నా సముదాయం అన్ని సముదాయాల్లోకెల్లా ఉత్తమమయినది చెయ్యబడింది”. (ముస్నద్‌ అహ్మద్‌)

”ఎందుకు ఉత్తమయినది అంటే, హజ్రత్‌ ఉమర్‌ (ర) గారి మాటే దీనికి సూటి సమాధానం. ”మేము అప్రతిష్ట అట్టగున కొట్టుమిట్టాడే జాతిగా ఉండే వారము. కానీ అల్లాహ్‌ ఇస్లాం ధర్మం మూలంగా మాకు గౌరవాదరణల్ని ప్రసాదించాడు. ఇస్లాం ధర్మాన్ని వీడి పేరు ప్రఖ్యాతల కోసం మనం ఎక్కడ ఎంత ప్రాకులాడినా అల్లాహ్‌ మాత్రం మనల్ని అవమానం పాల్జేసి తీరతాడు”.
యూదులకు ఈ ప్రత్యేకత ఎందుకు లభించ లేదు అంటే, కారణం- వారు ప్రవక్తలను హతమార్చి అల్లాహ్‌ ఆగ్రహానికి గురయి ‘మగ్జూబ్‌’ గా మిగిలి పోయారు. ఈ ప్రత్యేకత క్రైస్తవులకు ఎందుకు లభించ లేదు అంటే, ”వారు ప్రవక్త ఈసా (అ) వారిని అభిమానించడంలో అతిశయిల్లారు గనక ‘జ్వాల్లీన్‌’గా ముద్ర వేసుకున్నారు. అయినా వారి బలుపు తగ్గ లేదు. ”మేము అల్లాహ్‌ బిడ్డలము, ఆయన ప్రియతమ జనము” (మాయిదహ్‌: 18) అని బీరాలు పోతారు.

రెండవ ప్రత్యేకత: ధర్మ శాస్త్రం పరిపూర్ణమయినది.

”ఈ రోజు నేను మీ ధర్మాన్ని మీ కోసం పూర్తి చేసేశాను. మీ కోసం ఇస్లాంను మీ జీవన సంవిధానం సమ్మతించి ఆమోదించాను”. (మాయిదహ్‌: 3)

మూడవ ప్రత్యేకత: ధర్మ శాస్త్రంలో సౌలభ్యం, సౌకర్యం.

”ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ధర్మ విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందినీ ఉంచ లేదు”. (అల్‌ హజ్జ్‌: 78)
మనిషి భరించ లేనంతటి క్లిష్టతరమయినటువంటి విధులు ఏవీ అల్లాహ్‌ విధించ లేదు. పైగా గత సముదాయాల్లో ఉన్న కఠిన ఆదేశాలను రద్దు చేశాడు. ఇలా అన్నాడు: ”అల్లాహ్‌ మీకు సౌలభ్యాన్ని కలుగజేయాలనుకుంటున్నాడు. సంకట స్థితికి మిమ్మల్ని నెట్టేయ్యాలన్నది ఆయన అభిమతం కానే కాదు”. (అల్‌ బఖరహ్‌: 185)
”అల్లాహ్‌ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికి గురి చేయదలచుకోడు. మీరు కృతజ్ఞులయ్యేందుకు, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి, మీపై తన అనుగ్ర హాన్ని సంపూర్ణం గావించాలన్నదే ఆయన అభిలాష!” (మాయిదహ్‌: 06)
”మీపై ఉన్న బరువును తగ్గించాలన్నది అల్లాహ్‌ అభిలాష. ఎందుకంటే మానవుడు బలహీనుడిగా పుట్టించ బడ్డాడు”. (అన్నిసా: 28)
”నిశ్చయంగా బనీ ఇస్రాయీల్‌కి చెందిన ఒక వ్యక్తికి కాసింత మూత్రం అంటితే ఆ భాగాన్ని అతను కత్తెరతో కోసేసే వాడు”. (బుకారీ)
దీన్నీ బట్టి తెలిసేమిటంటే, ముహమ్మద్‌ (స) తీసుకొచ్చిన ధర్మ శాస్త్రం, సంపూర్ణ జీవన సంవిధానం అవ్వడమే కాకుండా ఎంతో సులభమయినది కూడా.

మూడవ, నాల్గవ, అయిదవ ప్రత్యేకత: విజయ ప్రాప్తి సంపద (మాలె గనీమత్‌)ను ధర్మ సమ్మతంగా మరియు మట్టిని శుద్ధి పొందే సాధనంగా, భూమిని సజ్దా స్థలంగా చెయ్యడం జరిగింది.

ఈ మూడు ప్రత్యేకతల ప్రస్తావ ప్రవక్త (స) వారి ఒక హదీసులో పేర్కొన బడ్డాయి: ”నాకు పూర్వం ఎవ్వరికీ ఇవ్వ బడని అయిదు విషయాలు నాకు ఇవ్వ బడ్డాయి. పూర్వం ప్రతీ ప్రవక్త తన జాతి వైపునకు మాత్రమే పంప బడేవాడు. నన్ను ప్రతి ఎర్రవాని, నల్లవాని వైపునకు (సమస్త మానవాళి వైపునకు) ప్రవక్తగా చేసి పంపడం జరిగింది. నా కోసం విజయ ప్రాప్తి సొమ్ము హలాల్‌ చెయ్య బడింది. నాకు పూర్వం ఏ ప్రవక్తకు అది హలాల్‌ చెయ్యబడ లేదు.భూమి నా కోసం పరిశుద్ధమయినదిగా, శుద్ధత పొందే స్థలంగా, మస్జిద్‌గా చెయ్య బడింది. మనిషి ఎక్కడ ఏ అవస్థలో ఉన్నా నమాజు వేళ అయితే తనున్న చోటే అతను నమాజు చదువుకోవాలి. ఒక పూర్తి మాసపు దూరమంతటి గాంభీర్య, భయం, తేజస్సుతో నాకు మద్దతునివ్వడం జరిగింది. నాకు సిఫారసు చేసే అవకాశం ఇవ్వబడింది”. (బుఖారీ) పై పేర్కొన్న వాటిలో కొన్ని ప్రవక్త (స) వారిక ప్రత్యేకతలయితే మూడు మాత్రం మొత్తం ముస్లిం సమాజపు ప్రత్యేకతలు.

ఆరవ ప్రత్యేకత: మరుపు, మనో భావాలు, బలవంతం, అయిష్టంతో చేసేవి మన్నించ బడ్డాయి.

”నిశ్చయంగా అల్లాహ్‌ నా సముదాయం నుండి దాని మనసులో చోటు చేసుకునే భావాలను నోటితో పలకనంత వరకూ, వాటికి క్రియా రూపం ఇవ్వనంత వరకూ మన్నించాడు” అన్నారు ప్రవక్త (స). (బుఖారీ)
”నిశ్చయంగా అల్లాహ్‌ నా సముదాయం నుండి పొరపాటును, మరుపును, బలవంతంగా వారితో చేయిపించే వాటిని మన్నించాడు”అన్నారు ప్రవక్త (స).
(ఇబ్ను మాజహ్‌)

ఏడవ ప్రత్యేకత: మొత్తం ముస్లిం సమాజం నాశనం అవ్వదు.

”నేను మహోన్నతుడయిన నా ప్రభువుతో మూడు విషయాలకై అర్థించాను. ఆయన నాకు రెండింటిని ప్రసాదించి, ఒక దాన్ని ఆపి ఉంచాడు.
1) ”నేను మహోన్నతుడయిన నా ప్రభువుతో – గత సముదాయాలను నాశనం చేసిన (నూహ్‌ జాతీ, సమూద్‌ జాతి, హూద్‌ జాతి, ఆద్‌ జాతి సమూలంగా తుడుచి పెట్టుకు పోయిన) విధంగా నా సముదాయాన్ని నాశనం చెయ్యకు” అని వేడుకున్నాను. ఆయన నా మొరను ఆలకించి ఆమోదించాడు.
వేరొక ఉల్లేఖనంలో – నేను నా ప్రభువుతో – ”నా సముదాయాన్ని కరువుకి గురి చెయ్యబడి నాశనం కాకూడదు” అని వేడుకున్నాను. ఆయన నా మొరను ఆమోదించాడు. (ముస్లిం)
మరో చోట – నేను నా ప్రభువుతో – ”నా సముదాయం ముంపుకు గురి చెయ్యబడి నాశనం కాకూడదు” అని వేడుకున్నాను. ఆయన నా మొరను ఆమోదించాడు.(ముస్లిం)
2) నేను మహోన్నతుడయిన నా ప్రభువుతో – ”మాలోని వాడు కాని శత్రువుకి మాపై (మొత్తం ముస్లిం సమాజం మీద ఏక ఛత్రాధిపత్యం చేసే) ఆధిపత్యాన్ని ఇవ్వకు” అని వేడుకున్నాను. ఆయన నా మొరను ఆలకించి ఆమోదించాడు.
3) నేను మహోన్నతుడయిన నా ప్రభువుతో – ”మమ్మల్ని తెగలుగా, వర్గాలు గా విభజించకు” అని వేడుకున్నాను. కానీ ఆయన నా ఈ మొరను స్వీకరించ లేదు. (నసాయీ)
వేరొక ఉల్లేఖనంలో: నేను ఆయనతో – ”నా సముదాయం పరస్పరం కయ్యానికి కాలు దువ్వకుండా, వారి మధ్య ఒండొకరితో విభేదించే తత్వం ఉండ కూడదు” అని వేడుకున్నాను. కానీ ఆయన నా ఈ మొరను స్వీకరించ లేదు. (ముస్లిం)

ఎనిమిదవ ప్రత్యేకత: మొత్తం ముస్లిం సమాజం ఏక సమయంలో అపమార్గం మీద ఐక్యం కాజాలదు.

”నిశ్చయంగా అల్లాహ్‌ నా పూర్తి సముదాయం మార్గబ్రష్టత్వం మీద ఐక్యం కాకుండా కాపాడాడు” అన్నారు ప్రవక్త (స). (సహీహుల్‌ జామె)
”నా సముదాయంలోని ఒక పక్షం ఎప్పుడూ సత్యం మీద స్థిరంగా ఉంటుంది. వారిని వ్యతిరేకించిన వ్యక్తి వారినేమి చెయ్యలేడు. చివరికి అల్లాహ్‌ ఆదేశం (ప్రళయం) వచ్చేంత వరకు వారు అలానే ఉంటారు”. (ముస్లిం)
వారు ఎలాంటి ప్రక్షిప్తాల జోలికి పోకుండా, ఎలాంటి పంథా (మస్లక్‌) సంబంధితన విభేదాలలో చిక్కుకోకుండా, అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స), మరియు సహాబాల పక్షం వహించే వారుగా ఉంటారు అని ఇతర కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తున్నది.

తొమ్మిదవ ప్రత్యేకత: క్షమించబడిన సముదాయం.

”నా ఈ సముదాయం క్షమించబడిన సముదాయం. దానిపై పరలోకంలో ఎలాంటి శిక్ష ఉండదు. దాని శిక్ష మొత్తం ఇహలోకంలోనే ఉపద్రవాల రూపంలోనూ, భూకంపాల రూపంలోనూ, హత్యాకాండ రూపంలోను ఉంటుంది”. అన్నారు ప్రవక్త (స). (అబూ దావూద్‌)

పదవ ప్రత్యేకత: ప్రవక్త (స) సముదాయపు పంక్తులు దైవ దూతల పంక్తుల్ని పోలి ఉంటాయి.

”మాకు ఇతర ప్రజల మీద మూడు విషయాలతో ప్రత్యేకత ఇవ్వ బడింది. మా పంక్తులు దైవ దూతల పంక్తుల్ని పోలి ఉంాయి. మా కోసం భూమి మొత్తం సజ్జాద స్థలంగా చెయ్య బడింది. దాని మట్టి మా కోసం నీరు లభించని పక్షంలో శుద్ధి పొందే సాధనంగా చెయ్య బడింది” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)

11వ ప్రత్యేకత: పని తక్కువ వెతనం ఎక్కువ.

”గత సముదాయాలకు ఇవ్వబడిన పని గడువును పోల్చుకుంటే మీకివ్వబడి పని గడువు అస్ర్‌ జమాజు నుండి మొదలు సూర్యాస్తమయం వరకు మాత్రమే”. అన్నారు ప్రవక్త (స).
తర్వాత పై విషయాన్ని వివరిస్తూ ఇలా అన్నారు: ”యూద, క్రైస్తవులు మరియు మీ ఉపమానం ఎలాంది అంటే, ఒక వ్యక్తి కొందరు కూలీల వద్దకు వచ్చి – మీరు ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ ఒక ఖీరాత్‌కి బదులు పని చేస్తారా? అని అడిగాడు. అందుకు యూదులు ఒక ఖీరాత్‌కి బదులు మధ్యాహ్నం వరకు పని చేశారు. ఆ తర్వాత అతను – ‘జుహ్ర్‌ నమాజు నుండి అస్ర్‌ నమాజు వరకు ఒక ఖీరాత్‌కి బదులు ఎవరు పని చేస్తారు? అని మళ్ళి అడిగాడు. దానికి జుహ్ర్‌ నమాజు నుండి అస్ర్‌ నమాజు వరకూ ఒక ఖీరాత్‌కి బదులు పని చెయ్యడానికి క్రైస్తవులు ఒప్పుకున్నారు. ఆ తర్వాత వచ్చి ఇలా అన్నాడు: ”అస్ర్‌ నమాజు తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు రెండు ఖీరాత్‌లకి బదులు ఎవరు పని చేస్తారు? ఇది చెప్పిన తర్వాత ప్రవక్త (స) ఇలా అన్నారు: ‘గుర్తు పెట్టుకోండి! అస్ర్‌ తర్వాత నుండి సూర్యాస్తమయం వరకూ రెండు ఖీరాత్‌లకు బదులు పని చేసేవారు మీరే. గుర్తుంచుకోండి! మీకు రెట్టింపు వెతనం ఇవ్వబడింది’.
ఇది చూసి యూద, క్రైస్తవులు అలిగారు. ‘మేము ఎక్కువ పని చేశాము. తక్కువ వెతనం పొందాము ఎందుకు?’ అని అడిగారు. దానికి అల్లాహ్‌: ”మీ (తో కుదుర్చుకున్న కూలి) హక్కు విషయంలో నేనేమయినా మీకు అన్యాయం చేశానా?” అని ప్రశ్నించాడు. ‘లేదు’ అన్నారు వారు. అప్పుడు అల్లాహ్‌ ఇలా అన్నాడు: ”ఇది నా అనుగ్రహం నేను తలచిన వారికి దీన్ని ఇస్తాను”. (బుఖారీ)

ప్రవక్త (స) వారి ఇతర హదీసుల ఆధారంగా – ప్రవక్త (స) వారి సముదాయపు వయస్సు 60 మరియు 70కి ఇటు అటు ఉంటుంది. అల్లాహ్‌ ప్రత్యేక కాక్షం ఏమిటంటే, ఆయన మనకు కొన్ని పుణ్య రుతువులను అనుగ్రహించాడు. ఉదాహరణకు రమజాన్‌ మాసంలోని లైలతుల్‌ ఖద్ర్‌ ఒక్క రాత్రి ఆరాధనకు బదులు దాదాపు 83 సంవత్సరాల కన్నా ఎక్కువ పుణ్యం లభిస్తుందని చెప్పడం జరిగింది. మస్జిద్‌ హారామ్‌లో ఒక నమాజుకి బదులు ఒక లక్ష నమాజుల పుణ్యం, మస్జిద్‌ నబవీలో 1000 నమాజుల పుణ్యం, మస్జిద్‌ అఖ్సాలో 500 నమాజుల పుణ్యం, జమాతుతో నమాజు చేస్తే 27 రెట్లు ఎక్కువ పుణ్యం మొదలయినవి.

పన్నెండవ ప్రత్యేకత: శుక్ర వారం వైపునకు మార్గదర్శకత్వం.

ప్రవక్త (స) ఇలా అన్నారు: ”మాకన్నా పూర్వం సముదాయాలకు మాకన్నా ముందు గ్రంథాలు ఇవ్వబడ్డాయి, మాకు వారి తర్వాత ఇవ్వ బడిందన్న మాట నిజమే అయినా, ప్రళయ దినాన మేమే అందరికన్నా ముందుండే చివరి సముదాయంగా ఉంటాము. ఇదే రోజు (శుక్ర వారం) వారిపై విధిగావించ బడింది. కానీ వారు దాని విషయంలో విభేదించుకున్నారు. ఆ దిన విషయమయి అల్లాహ్‌ మాకు మార్గదర్శకత్వం వహించాడు. ఈ విషయంలో వారు మా అనుయాయులుగా ఉంటారు. యూదుల కోసం రేపు (శనివారం), క్రైస్తవుల కోసం మరుసటి రోజు (ఆదివారం) పండుగ దినానులుగా ఉన్నాయి” అన్నారు ప్రవక్త (స). (బుఖారీ)
వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”మాకు పూర్వం ఉన్న సముదాయాలను (వారి నిర్వాకాల కారణంగా) అల్లాహ్‌ జుమా దినం నుండి తప్పించాడు. యూదుల కోసం శనివారం, క్రైస్తవుల కోసం ఆదివారం ఉండేది. తర్వాత అల్లాహ్‌ మమ్మల్ని తీసుకొచ్చాడు. మమ్మల్ని జుమా దినం వైపునకు మార్గదర్శకత్వం చేశాడు. అలా రోజుల క్రమాన్ని శుక్ర, శని, ఆదిగా చేశాడు. ఇలాగే వారు రేపు ప్రళయ దినాన కూడా మా తర్వాతనే ఉంటారు. ప్రపంచ జనులలో మేము చివరి వారమే కానీ, ప్రళయ దినాన మాత్రం మేము మొదటి వారంగా ఉంటాము. అన్ని సముదాయాలకన్నా ముందు మా విషయంలో తీర్పు చెప్పడం జరుగుతుంది.

పదమూడవ ప్రత్యేకత: వుజూ అవయవాలు ప్రకాశిస్తాయి.

ఓ సందర్భం గా – ”మీరు నా సహాబా. ఇంకా రాని వారు (తర్వాత వచ్చేవారు) మా సోదరులు” అన్నారు ప్రవక్త (స). దానికి సహాబా: ”మరి మీ సముదాయానికి చెందిన వారు ఇంకా రాలేదు కదా? వారిని మీరు ఎలా గుర్తు పడతారు?” అన్నారు. అందుకు ప్రవక్త (స) ఇలా అన్నారు: ”దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఒక వ్యక్తికి నల్ల గుర్రాల మధ్య కాళ్ళు, చేతులు, ముఖము మెరుస్తూ ఉండే గుర్రాలుంటే తన గుర్రాలను ఆ వ్యక్తి గుర్తు పట్టలేడా?” సహాబా అన్నారు: ‘సులభంగా గుర్తు పడతాడు’. అప్పుడు ప్రవక్త (స) అన్నారు: ‘నా సముదాయానికి చెందిన వారు, వారి కాళ్ళు, చేతులు, ముఖారవిందాలు కాంతులీనుతుండగా (ప్రళయ దినాన) నా వద్దకు వస్తారు. అప్పుడు నేను నా హౌజ్‌ (కౌసర్ టి చెలమ) దగ్గర నిలబడి వారికి ఘన స్వాగతం పలుకుతాను”. అన్నారు ప్రవక్త. (ముస్లిం)

పదయిదవ ప్రత్యేకత: లెక్క తీసుకోబడే మొదటి సముదాయం.

”ప్రంపంచంలో మేము సముదాయాల్లోకెల్లా చిట్టచివరి సముదాయము. ప్రళయ దినాన మొట్ట మొదట లెక్క తీసుకోబడే సముదాయం. ”ఎక్కడ ఉమ్మీ సముదాయం మరియు దాని ప్రవక్త ఎక్కడ?” అని అడగడం జరుగుతుంది. మేము చివరి వారమే అయినా ప్రళయ దినాన మొదటి వారంగా ఉంటాము” అన్నారు ప్రవక్త (స). (ఇబ్ను మాజహ్‌)
వేరొక ఉల్లేఖనంలో – ”సముదాయలన్నీ మాకు దారి కల్పించి ప్రక్కకు జరుగుతాయి. వుజూ ప్రభావంతో మన చేతులు, కాళ్ళు, ముఖాలు ప్రకాశిస్తుండగా మేము బయలుదేరి వెళతాము. అది చూసిన సముదాయాలన్నీ ఆశ్చర్యచకితులయి ఇలా అంటారు: ”బహుశా ఈ సముదాయం మొత్తం ప్రవక్తలే కాబోలు” అని. (ముస్నద్‌ అహ్మద్‌)

పదహారవ ప్రత్యేకత: ప్రవక్తల విషయంలో ముహమ్మద్‌ (స) వారి సముదాయపు సాక్ష్యం.

హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ (ర) కథనం – ”ప్రళయ దినాన ఒక ప్రవక్త వస్తాడు, ఆయనతోపాటు ఒకే ఒక్క మనిషి (ఆనుయాయుడు) ఉంటాడు. మరో ప్రవక్త వస్తాడు, ఆయనతో ఇద్దరే ఇద్దరుంటారు. మూడో ప్రవక్త వస్తాడు, ఆయనతో ముగ్గురే ఉంటారు. ఇదే విధంగా ప్రవక్తలు వస్తారు. వారిలో కొందరితో ఎక్కువ, కొందరితో తక్కువ వ్యక్తులు ఉంటారు. అలా వచ్చిన ప్రతి ప్రవక్తను ప్రశ్నించడం జరుగుతుంది. ”మీరు అల్లాహ్‌ సందేశాన్ని మీ జాతి వారి వరకు చేర వేశారా?” అని. దానికి ప్రతి ప్రవక్త: ”అవును” అంటాడు. అప్పుడు వారి జాతి వారిని పిలిపించి – ‘ఇతను మీ వరకు అల్లాహ్‌ సందేశాన్ని చేర వేశాడా?’ అని అడగడం జరుగుతుంది. దానికి వారు ‘లేదు’ అంటారు. అప్పుడు మీ మాటకు సాక్ష్యం ఏమి, సాక్షులు ఎవరు? అని ప్రవక్తను ప్రశ్నించడం జరుగుతుంది. ”ముహమ్మద్‌ (స) మరియు ఆయన సముదా యం” అని ఆ ప్రవక్త చెబుతాడు. ఆనక ముహమ్మద్‌ (స) వారి ఉమ్మత్‌ను పిలిపించి – ”ఈ ప్రవక్త తన జాతి వరకు అల్లాహ్‌ సందేశాన్ని చేర వేశాడా?” అని ప్రశ్నించడం జరుగుతుంది. ”అవును” అని వారు చెబుతారు. దానికి అల్లాహ్‌ – ”మీకెలా తెలుసు?” అని తిరిగి ప్రశ్నిస్తాడు. వారంటారు: ”ఈ సమాచారం మాకు మా ప్రవక్త (స) వారి ద్వారా అందింది. అదేమంటే, ప్రవక్తలందరూ అల్లాహ్‌ సందేశాన్ని వారి జాతి వారి వరకు చేరవేశారు అని. మేము ఆ విషయాన్ని సత్యమని నమ్మాము. ఆ తర్వాత ప్రవక్త (స) ఖుర్‌ఆన్‌లో ఈ ఆయతును చదివి విన్పించారు: ”అదే విధంగా మేము మిమ్మల్ని ఒక ‘న్యాయ శీల సమాజం’గా చేశాము. మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త మీపై సాక్షిగా ఉండటం కోసం (మేమిలా చేశాము”. (అల్‌ బఖరహ్‌: 143)

పదహేడవ ప్రత్యేకత: సిరాత్‌ వారధిని దాటే తొలి బృందం.

”నరకం మీద సిరాత్‌ వారధిని అమర్చడం జరుగుతుంది. తర్వాత నేను నా సముదాయానికి చెందిన ప్రజలందరూ తొలూత ఆ వారధిని దాటి వెళతాము” అన్నారు ప్రవక్త (స). (ఇబ్ను మాజహ్‌)

పద్నెమిదవ ప్రత్యేకత: స్వర్గవాసులలో అధిక సంఖ్యాకులు.

హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ కథనం – ప్రవక్త (స) ఇలా అన్నారు: ”స్వర్గ వాసులలో నాలుగో వంతు భాగం మీరయి ఉండటం మీకిష్టమేగా.” అని. సహాబా సంతోషంతో ‘అల్లాహు అక్బర్‌’ అన్నారు.
తర్వాత ఇలా అన్నారు: ”స్వర్గ వాసులలో మూడో వంతు భాగం మీరయి ఉండటం మీకు సమ్మతమేగా.” అని. మళ్ళీ సహాబా సంతోషంతో ‘అల్లాహు అక్బర్‌’ అన్నారు. ఆనక ప్రవక్త (స) అన్నారు: ”నాకు పూర్తి నమ్మకం ఉంది – ”సగం స్వర్గ వాసులు మీరే అయి ఉంటారు”. (బుఖారీ)
”స్వర్గ వాసుల పంక్తులు 120 అయి ఉంటాయి. అందులో 80 పంక్తులు ఈ సముదాయానికి చెందినవి, 40 పంక్తులు మిగతా సముదాలన్నింటికి చెందినవయి ఉంటాయి”. అన్నారు ప్రవక్త (స). (ఇబ్ను మాజహ్‌)

పంతొమ్మిదవ ప్రత్యేకత: కనీసం నాలుగు వందల కోట్లకు పైగా ముస్లింలు ఎలాంటి లెక్క లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు.

”నా ప్రభువు నాకు మాటిచ్చాడు, నా సముదాయపు 70 వేల మందిని ఎలాంటి లెక్క, మరెలాంటి శిక్ష లేకుండా స్వర్గంలో ప్రవేశింప జేస్తాను అని. వారిలోని ప్రతి వెయ్యి మందితోపాటు మరో 70 వేల మందిని, మరియు నా ప్రభువు మూడు గుప్పెడులంత మందిని ఎలాంటి లెక్క, మరెలాంటి శిక్ష లేకుండా స్వర్గంలో ప్రవేశింప జేస్తాను” అని. అన్నారు ప్రవక్త (స) (ఇబ్ను మాజహ్‌)
అల్లాహ్‌ మనల్ని, మన పరివారాన్ని, మా సోదరుల్ని, స్నేహితుల్ని ఆ భాగ్య వంతుల జాబితాలో చేర్చాలని సవినయంగా వేడుకుందాం! ఆమీన్‌.

Related Post