మధ్య దళారుల మిథ్యావాదం మనకొద్దు

మధ్య దళారుల మిథ్యావాదం మనకొద్దు -‘నొసట నామాలు, నోట బండ బూతులు’ అన్నట్టుగా మనుషులు కేవలం వేషధారులై జీవించడాన్ని ప్రవక్తలు కోరుకోలేదు. ప్రతి ప్రవక్త నిజాయితీపరుడయి కపటత్వాన్ని నిర్మూలించే ప్రయత్నం చేశారు. కాని నేడు ముస్లిం సమాజంలో విచ్చలవిడిగా కనబడే దురాచారాల్ని చూస్తే విసుగేస్తుంది. ఏదోక నేపంతో ఊరేగిుంలు చేయడం, ఎవరోకరి పేరుతో జెండాలెత్తడం, గంథం తీయడం, పీరులెత్తుకుని వీరావేశంతో నిప్పులు తొక్కటం చిరాకు తెప్పిస్తుంది. ఇదా ప్రవక్తల సందేశం? అన్న సందేహం కలుగుతుంది. అంతిమ దైవగ్రంథం ఖుర్‌ ఆన్‌ సురక్షితంగా ఉండగా, అంతిమ దైవప్రవక్త వారి అమృత పలుకులు అందుబాటులో ఉండగా జనం ఇంత పిచ్చివాళ్ళయ్యారేమిటి? అనిపిస్తుంది.

 మధ్య దళారుల మిథ్యావాదం మనకొద్దు

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారి ప్రవర్తనను మనము అలవాటు చేసుకోవాలి. ఆయన ఏ దర్గాలకు వెళ్ళలేదు. ఏ దళారులనూ ఆశ్రయించలేదు. ఆర్థిక, సాంఘిక, రాజకీయ, నైతిక రంగాలలో ధర్మనీతిని, దైవాభీష్టాన్ని ప్రతిష్టించారు. అలానే మనం సయితం ప్రవరిస్తే మన జీవితానికి సార్థకత చేకూరుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే – ప్రవక్తలను, మహనీయులను, పుణ్యాత్ముల ను గౌరవించండి కానీ; పూజిమచకండి. ఒకే నిజ ఆరాధ్యుడయిన అల్లాహ్‌ వైపు మరలి చెల్లాచెదురుగా ఉండి, ఉన్న చోటు నుండి కదలలేని చిల్లర దైవాలను వదలండి.

ధైర్యం లేని ఆవేశం, తూటాలు లేని తుపాకీ, ఆచరణ లేని ఆర్భాటం వ్యర్థమే. అల్లాహ్‌, అల్లాహ్‌ అని చెప్పే ప్రతి వాడూ స్వర్గానికి ఏగలేడు. అల్లాహ్‌ చిత్త ప్రకారం అమలు చేసినవాడే స్వర్గంలో ప్రవేశించడానికి అర్హత కలిగి ఉంటాడు. ఇక ఎవరయితే ‘నావను ఏరు దాటించేస్తాము’ అని ప్రగల్బాలు పలుకుతూ పబ్బం గడుపుకుంటున్నారో వారికి ఈ అధికారం ఎవరిచ్చినట్టో? అల్లాహ్‌ దగ్గరకు పోయి మధ్యవర్తి త్వం నెరపడానికి ఈ పీర్లు, ముర్షిద్లకు, బాబాలు, మౌల్వీలకు అనుమతి ఎవరు కట్టబెట్టారో?

అల్లాహ్‌ అనుమతి, ఆదేశం లేకుండా ఎవరి రికమండేషన్‌ పారదు అని వీరికి మాత్రం తెలీదా? ‘మానవుడా! నన్నే ఆరాధించు, నా ఆజ్ఞలననుసరించు’ అని అల్లాహ్‌ ప్రవక్తల ద్వారా చెప్పించాడు. ఆయన మధ్య దళారులను ఎర్పరచ లేదు. చేతిలో అన్నం చెరువు లోకి విసిరి, చెయ్యి నాకి చెరువు నీళ్లు త్రాగినట్లు మనషులు నిజ ఆరాధ్యుడయినా అల్లాహ్‌ను వదలి ఆయన పంపిన ప్రవక్తలను, పుణ్యాత్ములను, వారి సమాధులనే విగ్రహాలుగా
మలచుకొని పూజి స్తూ, సృష్టికర్త అయిన అల్లాహ్‌కు దూరం అవుతున్నారు.

పంట పండించే రైతుకీ గిట్టుబాటు ధర రావడం లేదు. కొనే వినియోగదారుడికి ధర అందుబాటులో ఉండటం లేదు. మధ్య దళారీలు మాత్రం యమ లాభాలు గుంజేస్తున్నారు. అలాగే మధ్యలో ఈ దళారీ దర్గాలు, చర్చీలు, మందిరాలు ఉన్నాయి. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. నిజమేనా? అయితే ఎవరికి చెప్పుకోవాలి? దళారీలకా? పురోహితులకా? పీరుబాబాలకా? పాస్టర్లకా? పోపులకా? ప్రవక్తలకా? ఎవరికీ కాదు గాని అల్లాహ్‌కే! పోపు చెవిలో పాపం చెబితే పోతుందా? పాప ప్రాయశ్చిత్త పత్రం కొనుక్కుంటే పాపం పోతుం దా? అసలు మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసే కెపాసిటీ మహా ప్రవక్తకు కూడా లేదు. మనుషులు చేసే ప్రార్థనలు విని నా దగ్గర వారిని గురించి రికమెండ్‌ చేయమని అల్లాహ్‌ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిని నియమించ లేదు. ఆయన ఆదేశం ఏమిటంటే,
”ఓ ప్రవక్తా! నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపుని ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు. కాబట్టి వారు నా ఆదేశాన్ని శిరసా వహించాలి. నన్ను విశ్వసించాలి. తద్వారానే వారు సన్మార్గభాగ్యం పొంద గలుగుతారు”. (బఖరా: 186)

మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) మీద, ఇతర ప్రవక్తల మీద మాటి మాటికి దరూద్‌ పంపేవారు, వారు చెప్పినట్టు నడుచుకొకపోతే ఫలం ఏమిటి? కూడు వండెది గంజి కోసం కాదు. వండిన కూడు అవతల పారేసి కుండ నాకితే ప్రయోజనం ఏమిటి? వేషభాషలోనూ ఆచార పరంపరలోనూ గొప్ప ఆసక్తి చూపే మనిషి, జీవితంలోని అన్ని రంగాలలో అదే రకం ఆసక్తిని కొనసాగించాలి. వట్టి కూర తింటే ఆకలి తీరుతుందా? అల్లాహ్‌ గురించ మనకు తెలిసింది. అదీ ఆయనే తన ప్రవక్తల ద్వారా మనకు తెలియ పరిచాడు. ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన నిత్య శక్తి, దైవత్వము అనేవి జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేట తెల్లమవుతున్నాయి. కాని అక్షయుడయిన అల్లాహ్‌ మహిమను క్షయమయిన మనుషులు, పక్షుల, పశువుల ప్రతిమా స్వరూపంగా మనుషులు మార్చారు. వారు దేవుని సత్యాన్ని అసత్యంగా మార్చి, సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు.

అందుకని, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారి ప్రవర్తనను మనము అలవాటు చేసుకోవాలి. ఆయన ఏ దర్గాలకు వెళ్ళలేదు. ఏ దళారులనూ ఆశ్రయించలేదు. ఆర్థిక, సాంఘిక, రాజకీయ, నైతిక రంగాలలో ధర్మనీతిని, దైవాభీష్టాన్ని ప్రతిష్టించారు. అలానే మనం సయితం ప్రవరిస్తే మన జీవితానికి సార్థకత చేకూరుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే – ప్రవక్తలను, మహనీయులను, పుణ్యాత్ముల ను గౌరవించండి కానీ; పూజిమచకండి. ఒకే నిజ ఆరాధ్యుడయిన అల్లాహ్‌ వైపు మరలి చెల్లాచెదురుగా ఉండి, ఉన్న చోటు నుండి కదలలేని చిల్లర దైవాలను వదలండి.
(ఇదే మీ అందరికీ మా అభిజ్ఞత! ఇదంతా చదివినందుకు మీరందరికీి మా కృతజ్ఞత!)

Related Post