మనః శుద్ధి మనందరి అవసరం!

మనిషి సంస్కరించుకోవాల్సిన, శుద్ధి పర్చుకోవాల్సిన వాటిలో అతని పక్కలో ఉండే హృదయానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అదే అతని సకల ఆలోచనలకు, ఆచరణలకు కేంద్రం. అది దేహావయవాలకు సర్దారు వంటిది. అది బాగుంటే దేహం బాగుంటుంది. అది పాడయితే దేహం పాడవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పర్యావరణ కాలుష్యం కంటే మనో మాలిన్యం ఎన్నో రెట్లు ప్రమాదకరం. మన ఆలోచనా ధార బాగుంటే మనః శుద్ధి కలిగి మన హృదయం ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే రోగగ్రస్తం అయి మానసిక మరణానికి దారి తీస్తుంది.

”ఆ రోజు సిరి సంపదలు గానీ, సంతానం గానీ దేనికీ పనికి రావు. నిష్కల్మషమైన మనసుతో అల్లాహ్‌ సన్నిధిలోకి వచ్చినవాడు మాత్రమే (ఆ నాడు మోక్షం పొందుతాడు)”. (అష్‌ షుఅరా: 88,89) 

మహినీయ ముహమ్మ్దద్‌ (స) హృదయం గురించి ఎక్కువ శ్రద్ధ వహించేవారు. ”ఓ అల్లాహ్‌!  తెల్ల బట్టను మురికి నుండి శుభ్ర పరచినట్లు, నా హృదయాన్ని పాపాల నుండి పవిత్రం చెయ్యి” అని వేడుకునేవారు. (తిర్మిజీ)
 ‘ప్రవక్త (స) ఎక్కువగా ఏ దుఆ చేసేవారు’ అని విశ్వాసుల మాత ఉమ్మె సలమా (ర.అ) గారిని అడగడం జరిగింది. దానికి ఆమె ఇచ్చిన సమాధానం: ‘యా ముఖల్లిబల్‌ ఖులూబ్‌ సబ్బిత్‌ ఖల్బీ అలా దీనిక’ – ఓ హృదయాలను మరల్చే వాడా! నా హృదయానికి   నీ ధర్మం మీద నిలకడను ప్రసాదించు”. (తిర్మిజీ)
హజ్రత్‌ అబూ హురైరా (ర) గారి కథనం – దైవప్రవక్త (స) ఇలా ప్రబోధించారు: ”నిశ్చయంగా అల్లాహ్‌ మీ శరీరాలను గానీ, మీ ముఖాలను గాని చూడడు. కానీ ఆయన మీ హృదయాలను, మీ కర్మలను తప్పకుండా చూస్తాడు”.   (బుఖారీ, ముస్లిం)
 రేపు ప్రళయ దినాన నిష్కల్మష హృదయం మాత్రమే అల్లాహ్‌ సమక్షంలో పనికొస్తుంది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఆ రోజు సిరి సంపదలు గానీ, సంతానం గానీ దేనికీ పనికి రావు. నిష్కల్మషమైన మనసుతో అల్లాహ్‌ సన్నిధిలోకి వచ్చినవాడు మాత్రమే (ఆ నాడు మోక్షం పొందుతాడు)”. (అష్‌ షుఅరా: 88,89)
 నిజ దైవం పట్ల స్వచ్ఛమయిన విశ్వాసం గల మనస్సే నిష్కల్మషమైన మనసు. అసూయాద్వేషాల నుండి సురక్షింతంగా ఉన్న మనస్సే నిష్కల్మషమైన మనసు.  పగ, ప్రతీకార జ్వాలల్లో మాడి మసి కానిదే  నిష్కల్మషమైన మనసు.  నిష్కల్మష హృదయానికి పెద్దలు చెప్పిన తాత్పర్యం – ఆత్మకు గురువు జ్ఞానం.  ఆత్మకు బంధువు మృదుత్వం. ఆత్మకు చెరశాల భయం.  ఆత్మ విశాలతకు ప్రేరకం ఆశ.  ఆత్మ బృందావనం ఏకాంతం. ఆత్మ సంపద సంతృప్తి.  ఆత్మ సరంజామా భరోసా. ఆత్మ వాహనం  ఐహిక అనాసక్తత. ఆత్మకు ఆహారం ప్రేమ.
 సజ్జనులయిన మన పూర్వీకులు చెప్పిన మాట: ”శంకకు సందేహానికి దూరంగా ఉండే స్వచ్ఛమయిన హృదయం గలవారికే స్వచ్ఛమయిన జీవితం గడిపే భాగ్యం లభిస్తుంది. పాడు మనసు గల వారి బతుకు పాడు బతుకవుతుంది. ఎవరి పగలు బాగుంటుందో వారి రాత్రి బాగుంటుంది. ఎవరి రాత్రి బాగుంటుందో వారి పగలు బాగుంటుంది. మోహాన్ని విడనాడిన వ్యక్తి హృదయాన్ని అల్లాహ్‌ పవిత్రం గావిస్తాడు”.
 ”నిష్కల్మషమయిన హృదయం గల వ్యక్తి నిజమయిన దూరదృష్టి గలవాడయి ఉంటాడు. అతను తన దేహంపై,  దుస్తులపై  ఎలాంటి  సువాసన పూసుకోక పోయినా పవిత్రాత్మలు అతని ప్రవర్తనా పరిమళాలను పసి గడతారు. కల్మష మనస్కుడు ఎన్ని సుగంధాల్ని పూసుకున్నా అతని దుష్ప్రవర్తన దుర్గంధాల కంపు సర్వత్రా వ్యాపిస్తుంది. ఈ కారణంగానే ఇమామ్‌ ఇబ్బు తైమియా (రహ్మ) ఇలా అన్నారు: ”దాసుడు తన మనః శుద్ధి కోసం కొంత సమయం కేయించాలి. అల్లాహ్‌ను స్మరిస్తూ, అల్లాహ్‌ను వేడుకుంటూ, అల్లాహ్‌ను ప్రార్థిస్తూ, ఆయన సృష్టి బ్రహ్మాండం గురించి యోచిస్తూ, స్వీయ కర్మల్ని సమీక్షించుకుంటూ తన ఆత్మతో కాసింత సమయం గడపాలి”.
చివరి మాట: దేహానికి ఆహార పానీయాల అవసరంకన్నా, హృదయానికి అల్లాహ్‌ స్మరణ, ఖుర్‌ఆన్‌ పారాయణ అవసరం ఎంతో ఎక్కువ. కాబట్టి  సదా ఈ దుఆతోపాటు ఖుర్‌ఆన్‌ మరియు హథీసుల్లో పేర్కొనబడిన మనఃశుద్ధికి సంబంధించిన ఇతర దుఆలు కూడా చేస్తూ ఉండాలి మనం: ”అల్లాహుమ్మజ్‌అలిల్‌ ఖుర్‌ఆన రబీఆ ఖల్బీ వ నూర సద్రీ, వ జలాఅ హుజ్నీ, వ జహాబ హమ్మీ వ గమ్మీ” – ఓ అల్లాహ్‌! ఖుర్‌ఆన్‌ను నా మనో వసంతంగా చెయ్యి. నా ఆత్మ జ్యోతిగా మార్చు. నా ఖేదను, దుఃఖాన్ని భస్మీపటం చేసేదిగా మలచు. నా ఆందోళనను, నా బాధను దూరం చేసిగా చెయ్యి స్వామీ!.

Related Post