శాఖా చంద్ర న్యాయం – షిర్క్‌ పుట్టు పూర్వోత్తరాలు -6

ఆకాశంలో చంద్రుడి మీద నుంచి మేఘాలు కదిలిపోతున్నప్పుడు చంద్రుడే కదులుతున్నట్టుగా భ్రమ కలుగుతుంది. అలా భ్రమపడేవారిని ఏదైనా ఓ చెట్టు కొమ్మ కిందకు తీసుకెళ్ళి ఆ చెట్టు రెండు శాఖల (కొమ్మల) మధ్య నుంచి చంద్రుడిని చూపిస్తే ఆ చంద్రుడు కదలకుండా అక్కడే ఉన్నట్టు కన్పిస్తుంది. అలా వారి భ్రమ తొలిగిపోతుంది.

నేడు ముస్లిం సమాజంలోని అధికులు తన ఆస్తిని, ఐశ్వర్యాన్ని దర్గాలు నిర్మించడంలో, ఉరుసులు ఊరేగింపుల్లో, సమాధులపై పెద్ద పెద్ద గుంబద్లు కట్టడంలో దుర్వినియోగపరుస్తూ- దాన్నో మహా కార్యంగా భావించి బీరాలు పోతున్నారు. ఇలాంటి దుష్ట సంప్రదాయాలు ముస్లింలలో సయితం ఉండటం చూసి, ఇస్లాం అంటే ఇష్ట పడేవారు కూడా ముస్లింలంటే విరక్తి చెంది, ధర్మానికి, దైవానికి దూరంగా బ్రతుకుతున్న ముస్లిమేతర మేధావులు ఎంతో మంది మనకు అగుపిస్తారు.

అలాగే నేడు ముస్లిం సమాజంలో ప్రబలి ఉన్న ద్వంద్వ నీతి, దురాచార సంస్కృతిని చూసి ఒక సామాన్యుడు ఇస్లాం ధర్మం అంటే ఇదేనేమోనని మోసపోవచ్చు. అలా అపోహకి, అపార్థానికి గురైన వారి ముందు సత్యాన్ని సుస్పష్టంగా సాక్షాత్కరించి, దురాచారాలనేవి వ్యక్తులు ప్రవేశపెట్టినవేగానీ, ఇస్లాంకు వాటితో దూరపు సంబంధం కూడా లేదు, అది స్వచ్ఛమైన ప్రకృతి ధర్మం, మానవాళికి దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం అని తెలియజేయడమే ఈ వ్యాస పరంపర ముఖ్యోద్దేశ్యం. ఈ శాఖాచంద్ర న్యాయం ద్వారా వాస్తవాన్ని తెలుసుకుని వారి హృదయాలు తేలికవ్వాలన్నదే మా ఆకాంక్ష!

రండి! మనం మన విశ్వాసాన్ని పునఃపరిశీలించుకుందాం. ఖుర్‌ఆన్‌ మనకు ఈ విషయంలో ఎలా మార్గదర్శనం చేస్తుందో గమనిద్దాం!!
”మీరు అల్లాహ్‌ను వదలి ఎవరిని (విగ్రహాలు, పీర్లు, ముర్షిద్లు, ఔలియాలు, దర్గాలను) ఆరాధిస్తున్నారో వారు మీలాంటి దాసులే. మీ నమ్మిక నిజం అయితే వారిని మొరబెట్టుకోండి, వారు మీ మొరలను ఆలకిస్తారేమో చూద్దాం. నడవడానికి (విగ్రహం, శవంగా ఉన్న) వాటికేమన్నా (సహజసిద్ధమైన) కాళ్ళున్నాయా? పట్టుకోవడానికి వాటికే మన్నా చేతులున్నాయా? పోనీ చూడానికి వాటికేమైనా కళ్ళున్నాయా? వినడానికి వాటికేమైనా చెవులున్నాయా?” (దివ్య ఖుర్‌ఆన్‌-7: 194, 195)
”మీరు వాటిని మొరపెట్టుకున్నా అవి మీ మొరల్ని ఆలకించలేవు. ఒకవేళ ఆలకించినా మీకు ఎలాంటి సమాధానమివ్వలేవు. (పైగా) అవి ప్రళయ దినాన మీ బహుదైవారాధన (షిర్క్‌)ను ఖండిస్తాయి”. (ఖుర్‌ఆన్‌-35:14)
”ఆ సర్వేశ్వరుడ్ని వదలి మీరు పూజిస్తున్న మిథ్యా దైవాలు ఓ గడ్డిపోచకు కూడా యజమానులు కారు”. (దివ్య ఖుర్‌ఆన్‌-35: 13)

”గ్రంథ ప్రజలారా! (మార్గం మరచిన యూద, క్రైస్త, ముస్లింలారా!) దైవ ప్రవక్తల ఆగమనం ఆగిపోయి ఓ సుదీర్ఘ కాలం గడిచిపోయింది. అలాంటి పరిస్థితిలో మా ఈ ప్రవక్త (ముహమ్మద్‌) ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నిజ ధర్మం గురించి మీకు బోధిస్తున్నాడు. ఇక మీరు శుభవార్త అందజేసే, హెచ్చరించే ప్రవక్త ఎవరూ రాలేదే!? అని సాకులు చెప్పడానికి ఎలాంటి ఆస్కారం లేదు. శుభవార్తనంద జేసేవాడు, హెచ్చరించేవాడు వచ్చేశాడు. (మా బాధ్యత తీరిపో యింది). అల్లాహ్‌ ప్రతి విషయంపై అధికారం గల అసాధారణ శక్తి సంపన్నుడు”. (దివ్యఖుర్‌ఆన్‌-5:19)

నేడు ముస్లిం సమాజంలోని అధికులు తన ఆస్తిని, ఐశ్వర్యాన్ని దర్గాలు నిర్మించడంలో, ఉరుసులు ఊరేగింపుల్లో, సమాధులపై పెద్ద పెద్ద గుంబద్లు కట్టడంలో దుర్వినియోగపరుస్తూ- దాన్నో మహా కార్యంగా భావించి బీరాలు పోతున్నారు. ఇలాంటి దుష్ట సంప్రదాయాలు ముస్లింలలో సయితం ఉండటం చూసి, ఇస్లాం అంటే ఇష్ట పడేవారు కూడా ముస్లింలంటే విరక్తి చెంది, ధర్మానికి, దైవానికి దూరంగా బ్రతుకుతున్న ముస్లిమేతర మేధావులు ఎంతో మంది మనకు అగుపిస్తారు.
(పూర్వం యూదులు, క్రైస్తవులు) ”వారు తమ ధర్మాన్ని ఆటగా, వినోదంగా, తమాషా వస్తువుగా చేసుకున్నారు. ప్రాపంచిక జీవితం వారిని మోసగించింది”. (దివ్యఖుర్‌ఆన్‌-7:51) అంటే, మరి మనం చేస్తున్నదేమి? నమాజులోని ప్రతి ఖఅదాలో – ”వాక్కు సంబంధిత, ధన సంబంధిత, ఆచరణ సంబంధిత సకల ఆరాధనలు కేవలం అల్లాహ్‌ కోసమే ప్రత్యేకం” అంటూనే, అన్నింని దైవేతర మార్గంలో వినియోగించడం దేన్ని సూచిస్తున్నదో కాస్త ఆలోచించండి.

ముస్లిం సమాజంలో ప్రబలి ఉన్న దురాచారాలను చూసే కొందరు మేధావులు ‘మతం అంటే మత్తు’ అన్న అభిప్రాయానికి వచ్చారు. ”క్రైస్తవ సమాజంలోని దురాగతాలను చూసి ఇస్లాం కూడా అలాగే ఉంటుందన్న తప్పుడు దృక్పథంతో చెప్పిన మాటలివి అంటే-, మరి ముస్లిములైన మనకు ఇస్లాం గురించి, అది ప్రతిపాదించే సిద్ధాంతాల గురించి పూర్తి అవగాహన ఉందా? ఉంది అంటారా? అయితే మన చేతలు చెప్పేది మరోలా ఎందుకున్నాయో! ‘నిప్పు ఉంటేనేగా పొగ వచ్చేది’ అన్నట్టు మనలో లోపం ఉండబట్టేగా ఇతరులు వేలెత్తి చూపేది! అంతా సవ్యంగా ఉన్నా వక్ర బుద్ది గలవారు విమర్శిస్తారు అనంటారా? కావచ్చు. అయితే ఆత్మ స్తుతిని మాని, ముందు మనలో లోపమేదైనా ఉందా అని ఆత్మ విమర్శ చేసుకోవాలి.

ముందు మనం ఇస్లాం ప్రకారం జీవించాల్సి ఉంది. మన సంతానానికి సయితం చక్కగా ఇస్లామీయ శిక్షణ ఇవ్వాల్సి ఉంది. అలా చేయకపోతేనో..!? నేడు యూరప్‌ దేశాల్లో క్రైస్తవులు తమ చర్చీలకు వేలం పాట పాడి అమ్మేస్తున్నారు. రేపు మన సంతానం కూడా మస్జిద్‌లను భూత్‌ బంగళాలుగా, గబ్బిళ నివాసాలుగా మార్చివేస్తారేమో! అంగడి సరుకులా చౌకబారు ధరకే అమ్మి వేస్తారేమో!! అల్లాహ్‌ ఏమంటున్నాడో ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి!

”వారి ముందు కరుణామయుని సూక్తులు పఠిస్తుంటే వారు కన్నీటి ధారతో (అల్లాహ్‌ సన్నిధిలో) సాష్టాంగ పడుతుండేవారు. ఆ తర్వాత అనర్హులు, అయోగ్యులు వారికి వారసులయిపోయారు. వారు నమాజు (ప్రార్థన)ను వదిలేసి మనోవాంఛలకు బానిసలైపోయారు”. (దివ్య ఖుర్‌ఆన్‌-19:58,59)

Related Post