శీల సంపదే ముఖ్యమని మరువబోకుమా

సోదర సోదరీమణులారా! శీల సంపదే ముఖ్యమని మరువబోకుమా… నేడు ఎటు చూసినా అశ్లీలత, నీతి బాహ్యత, విశృంఖలత్వం పెచ్చరిల్లినట్లు కానవస్తుంది. స్త్రీ పురుషులు కలిసి విచ్చలవిడిగా విహరిస్తున్నారు. ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఒక నిజమైన విశ్వాసి, ముఖ్యంగా తన ఇల్లూ వాకిలినీ, కుటుంబీకులను వదలి దూరదేశంలో జీవన పోరాటం సాగిస్తున్న యువతీయువకులు తమ శీలాన్ని, మాన మర్యాదలను రక్షించుకోవటానికి సదా అప్రమత్తులై ఉండాలి – అందుకే ఈ సందర్భంగా దైవ ప్రవక్త హజ్రత్ యూసుఫ్ (అలైహిస్సలాం) గారి సౌశీల్యాన్ని గురించి చెప్పదలిచాము.

దైవ ప్రవక్త యూసుఫ్ (అ) ప్రవక్తల వంశంలో పుట్టారు. తండ్రి యాకూబ్ (అ) ఆ అబ్బాయిని ఎంతో ప్రేమతో పెంచేవారు. దీన్ని ఇతర సోదరులు ఓర్చుకోలేకపోయారు. విహార యాత్ర పేరుతో యూసుఫ్ (అ) ను అడవికి తీసుకెళ్ళి బావిలో పడవేశారు. దారిన పోయే ఒక వర్తక బిడారు ఆ పసి వాణ్ణి ఈజిప్టు దేశానికి తీసుకెళ్ళి ఒక బాని సగా అమ్మివేసింది. ఆ అబ్బాయిని ఈజిప్టు అధికారి (అజీజ్) కొనుగోలు చేశాడు.

“అవును. భయభక్తులతో, సహన స్థయిర్యాలతో మెలిగే సజ్జనుల పుణ్యఫలాన్ని అల్లాహ్ వృథా చేయదు”. (యూసుఫ్-90)

శీల సంపదే ముఖ్యమని మరువబోకుమా

ఆలోచించండి! యూసుఫ్ (అ) యుక్త వయస్కుడు. ఆ ఇంట్లో ఒక నౌకరు. పరువం ఉరకలు వేస్తోంది. కళ్ళు చెదిరే అందాలతో, వయ్యారాలతో యజమానురాలు మరో వైపు తనను మోహిస్తోంది. కవ్విస్తూంది. తన కోరిక తీర్చకపోతే వ్యవహారం దారుణంగా ఉండగలదని హెచ్చరిస్తోంది…. ఒకవైపు కామంతో కళ్ళు మూసుకుపోయిన దొరసాని! మరోవైపు తండ్రి నేర్పిన సంస్కారం! దైవభక్తి! – వీటి మధ్య తీవ్రమైన సంఘర్షణ.

ఎట్టకేలకు ఆయనలోని సౌశీల్య మూర్తి’ దే పైచేయి అయింది. ఆయన ఇలా అన్నారు; – ” నన్ను మంచి స్థితిలో ఉంచిన స్వామికి నేను ద్రోహం తలపెట్టను. నేను అల్లాహ్ శరణు కోర్తున్నాను”. కాని బరితెగించిన ఆ ఆడది ఇక ఏమీ వినే స్థితిలో లేదు. యూసుఫ్ (అ)ని వెంటాడింది. యూసుఫ్ బయటికి పరుగులు తీశారు. సరిగ్గా అదే సమయంలో ఆమె భర్త అజీజ్ ఎదురు పడ్డాడు. క్షణాల్లో జులైనా ప్లేటు ఫిరాయించింది. “నీ దురుద్దేశంతో కన్నే సిన వాడ్ని చెరసాలపాలు చేయటమో, లేక మరేదైనా కఠిన శిక్ష విధించటమో తప్ప వేరే శిక్ష ఏముంటుంది?” అంటూ శిక్ష కూడా ప్రతిపాదించింది. కాని అజీజుకు అసలు సంగతి బోధపడింది. సంస్కారం లేని ఈ ఆడవాళ్ళు పురికొల్పే పాడు పనులు చేయటం కన్నా చెరసాల జీవితమే మిన్న అని యూసుఫ్ (అ) కూడా కోరుకున్నారు. ఆ విధంగా చేయని నేరానికి జైలుకు వెళ్ళారు. కాని శీలం’ విషయంలో రాజీ పడలేదు.

నిజం నిప్పులాంటిది. రాజు గారికి యూసుఫ్ (అ) లాంటి మేధావి అవసరం ఏర్పడింది. యూసుఫ్ సేవలు రాజ్యానికి అవసరమని భావించగానే ఆయన్ని జైలు నుంచి విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు రాజు. కాని యూసుఫ్ అందుకు ఒప్పుకో లేదు. తనపై వల విసిరిన అంతఃపుర మహి కల కేసును తేల్చమని ఆయన పట్టుపట్టారు. జులైఖా తన తప్పును ఒప్పుకుంది. యూసుఫ్ (అ) నిర్దోషి అని సాక్ష్యమిచ్చింది. రాజుగారు యూసుఫ్ను చేరదీశాడు.

కీలకమైన రాజ్యాధికారాలను యూసుఫ్కు కట్ట బెట్టాడు. ఒక బానిసగా అమ్ముడుపోయిన దేశంలోనే యూసుఫ్ (అ) అత్యున్నత అధికారిగా వెలుగొందారు. నిస్వార్ధమైన తన ప్రతిభతో ఈజిప్టు రాజ్యాన్ని ఆర్థిక సంక్షోభం నుండి కాపాడారు. సౌశీల్యానికి, పారిశుద్ధ్యానికి, శ్రేయోభిలాషా భావానికి దేవుడు ఇచ్చే ‘ప్రతిఫలం’ ఎంత గొప్పదో చెప్పకనే చెప్పారు.

“అవును. భయభక్తులతో, సహన స్థయిర్యాలతో మెలిగే సజ్జనుల పుణ్యఫలాన్ని అల్లాహ్ వృథా చేయదు”. (యూసుఫ్-90)

జీవనోపాధి కోసం అనేక ప్రాంతాల్లో, దేశాల్లో కాలు మోపిన సోదర సోదరీమణులారా! మీ జీవితం మచ్చలేనిదిగా ఉండాలి. మీ శీలానికి కళంకం అంటకూడదు. మీ శీలాన్ని కాపాడుకోవలసింది. ఎవరో కాదు, స్వయంగా మీరే. వందల, వేల కిలోమీటర్లు దూరంగా ఉంటూ మీ కుటుంబీకుల నుంచి మీరు ‘దేన్ని’ ఆశిస్తున్నారో ‘దాన్నే’ మీ కుటుంబీకులు కూడా మీ నుండి ఆశిస్తున్నా రన్న సంగతిని మరువకండి.

Related Post