షాబాన్ నెల యెుక్క వాస్తవికత – 2

సంకలనం: షేక్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామీయి.
రెండవ భాగం–హదీసుల–వెలుగులో!
నా ధార్మిక సహోదర సహోదరిమణులారా! అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతహు –
మెదటి బాగంలో ఖుర్ఆన్ లో వచ్చిన ‘శుభప్రదమైన రాత్రి’ అంటే రంజాన్ నెలలో చివరిదశలో వచ్చే లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రాత్రి) అని తెలుసుకున్నాము. హదీసుల వెలుగులో షబే బరాత్ కు సంభందించిన హదీసులు ప్రామాణికమైనవేనా? తెలుసుకుందాం ఇన్ షా అల్లాహ్
షాబాన్ 15వ రాత్రి (షబే బరాత్) కి సంబందించిన హదీసుల్లో ఒకటి మాత్రమే సహీహ్ (హసన్) గా మరియు మిగితా హదీసులు ప్రామాణికమైనవి కావు.!
ఆ హదీసుల్లో కొన్నిటిని గురించి శ్రద్ధగా చదవి సత్యాన్ని తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్!

అల్లాహ్ ప్రతి రాత్రి మూడవ భాగం మిగిలి ఉండగా ప్రపంచపు ఆకాశం వైపునకు వచ్చి ఎవరైనా అడుగుతారా వారికి ఇస్తాను, ఎవరైనా దుఆ చేస్తారా అంగీకరిస్తాను, ఎవరైనా పాప మన్నింపు కోరుతారా మన్నిస్తాను అని ఫజ్ర్ వరకు ప్రకటిస్తూ ఉంటాడు.

1) మెుదటి హదీసు

హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు, ఒకసారి షాబాన్ 15 వ రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నా పడకపై లేకపోవడం వలన వెదుకుతూ ఉండగా బఖీ స్మశానంలో అగుపించగా నేను అక్కడికెళ్లి కారణం అడుగగా – ఈ రాత్రి అల్లాహ్ ప్రపంచం వైపు దృష్టిసారిస్తాడు, బని కల్బ్ వారి గొర్రెల వెంట్రుకల కంటే అధిక రెట్లో మానవుల పాపాలను క్షమిస్తాడు అని చెప్పారు.
ఈ హదీసు ముస్నద్ అహ్మద్, తిర్మిది, ఇబ్నెమాజాలో ఉంది.
పై మూడు గ్రంథాల్లో కూడా ఈ హదీసు ఆయిషా రజియల్లాహు అన్హా ద్వార ఉర్వా, ఉర్వా ద్వారా యహ్ యా, యహ్ యా ద్వారా హజ్జాజ్ విన్నట్లు ఉంది.
అయితే ఇమాం తిర్మిజి ఈ హదీసు చివరిలో ఎంతో స్పష్టంగా చెప్పారు: నేను ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ ద్వారా విన్నాను ఆయన దీనిని బలహీనమైనదని, ప్రామాణికమైనది కాదని చెప్పారు, ఎందుకంటే ఉర్వా ద్వారా యహ్’యా మరియు యహ్’యా ద్వారా హజ్జాజ్ వినలేదు.
తిర్మిజి, అబ్వాబుస్ సియాం, బాబు మా జాఅ ఫీ లైలతిన్ నిస్ఫి మిన్ షాబాన్. 739

2) రెండవ హదీసు

హజ్రత్ అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా సెలవిచ్చారు:
షాబాన్ 15 వ రాత్రి అల్లాహ్ యెుక్క ఆరాధనలో నిలబడు. మరునాడు నీవు ఉపవాసం పాటించు. అల్లాహ్ షాబాన్ 14 నాటి సూర్యాస్తమయం వెంటనే ప్రపంచపు ఆకాశంపై వచ్చి, ఫజ్ర్ వరకు తన పాపాల మన్నింపు కోరేవాడున్నాడా నేను అతడ్ని మన్నిస్తాను, ఉపాధి కోరేవాడున్నాడా నేను అతనికి ఉపాధిని ప్రసాదిస్తాను, ఆపదలో ఉన్నవాడెవడూ అతనికి స్వస్థత ప్రసాదిస్తాను అంటూ ఇలాంటి నినాదాలు ప్రకటిస్తాడు.
ఇబ్నుమాజా, కితాబు ఇఖామతిస్ సలాతి వస్సున్నతు ఫీహా, బాబు మా జాఅ ఫీ లైలతిన్ నిస్ఫి మిన్ షాబాన్ 1388
ఈ హదీసు గురించి షేఖ్ అల్బాని రహిమహుల్లాహ్ తెలిపారు ఇది దయీఫ్ మరియు మౌదూ అని (అంటే ప్రామాణికమైనది కాదు, కల్పించబడినది).
ఈ హదీసులో ఇబ్ను అబి సబ్రా అనే వ్యక్తి గురించి ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ మరియు ఇమామ్ ఇబ్నె ముయీన్ ఇలా చెప్పారు: అబూ సబ్రా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పని హదీసులు తానె చెప్పి ప్రవక్త వైపు ఆపాదించాడు. అందువలన అతనిని కల్పిత హదీసుల బోధకుడిగా పేర్కోన్నారు.
3) మూడవ హదీసు హసన్ మరియు సహీగా కొందరు ఉలమాలు పేర్కొన్నారు.
దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉల్లేఖించారు: షాబాన్ 15వరాత్రి అల్లాహ్ తఆలా తన దాసుల పట్ల దృష్టి సారిస్తాడు. అల్లాహ్ వారి పాపాలను క్షమిస్తాడు. కాని ఇద్దరి వ్యక్తుల పాపాలను క్షమించడు. వారిలో ఒకడు : అల్లాహ్ కు బాగాస్వామిని నిలబెట్టేవాడు (షిర్క్ చేసేవాడు) రెండో వాడు: మనసులో కపటం, కీడు గలవాడు.

ఈ హదీసు ఇబ్నెమాజా, ఇబ్ను హిబ్బాన్ లలో ఉంది.
ఈ హదీసు కొందరి దగ్గర దయీఫ్ గా వుంటే ఎక్కువ ఉలమాలు దీనిని ఇతర హదీసుల ఆదారంగా సహీగా ప్రకటించారు.
పై హదీసులు మరికొన్ని వేరే బలహీన, లేదా కల్పిత హదీసుల ద్వారా ఈ క్రింది విషయాలను సత్కార్యాలుగా భావించి, వాటిని ప్రత్యేకంగా 15వ షాబాన్ సందర్భంగా చేయటం పుణ్యకార్యం అని అంటారు:

1- 15వ షాబాన్ రాత్రి జాగారం
2- ప్రత్యేక నమాజులు
3- పగలు ఉపవాసం పాటించడం.
4- సమాధులను దర్శించడం
5- గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు చనిపోయిన వారి ఆత్మలు తిరిగి వస్తాయని, అంతే కాదు ప్రత్యేక వంటకాలు చేసి, వాటిని ఆ ఆత్మలు తినిపోతాయని భ్రమపడడం జరుగుతుంది.
అయితే సోదర సోదరిమణులారా! పై ఐదు విషయాలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గానీ, సహాబాలు, తాబియిన్లు గానీ పాటించలేదు. అలాంటి మూఢనమ్మకాలు అసలు వారికి లేనే లేవు.
కొందరి అభిప్రాయమేమిటంటే ఆ రాత్రి ఇద్దరిని తప్ప అందరిని అల్లాహ్ క్షమిస్తాడు అని వచ్చిన హదీసు సహీ అయినప్పుడు నమాజు, రోజాలు పాటించడంలో తప్పు ఏమిటి అని అంటారు?

కాని వాస్తవంగా ఆలోచిస్తే, ఆ హదీసులో అలాంటి భావమేమీ లేదు.
అలా అనుకుంటే సహీ బుఖారీ హదీసు నంబర్ 758లో ఉంది:
అల్లాహ్ ప్రతి రాత్రి మూడవ భాగం మిగిలి ఉండగా ప్రపంచపు ఆకాశం వైపునకు వచ్చి ఎవరైనా అడుగుతారా వారికి ఇస్తాను, ఎవరైనా దుఆ చేస్తారా అంగీకరిస్తాను, ఎవరైనా పాప మన్నింపు కోరుతారా మన్నిస్తాను అని ఫజ్ర్ వరకు ప్రకటిస్తూ ఉంటాడు.
గమనించండి ఇది బుఖారీలోని హదీసు, ఏ ఒక్కరు దీనిని బలహీనమైనది అని అనలేదు, అనలేరు కూడా.

ఇక పై హదీసు కొందరు పండితులు బలహీనమైనదంటే మరి కొందరు సహీ అన్నారు.
అయితే బుఖారీ హదీసు ప్రకారం ప్రతి రోజు మేల్కొని అల్లాహ్ ను వేడుకుంటూ మన్నింపు కూరుతూ అన్ని మేల్లు అడుగుతూ ఉంటే ఎంత బావుంటుంది. అలా కాకుండా నిరాధరమైన హదీసుల ఆధారంగా కేవలం ఒక రాత్రి, పగలు పాటించడం అసలు ఇది ప్రవక్త పద్ధతే కాదు.
ప్రవక్త పద్ధతి కానప్పుడు పుణ్యానికి బదులుగా పాపం మూట గట్టుకున్నట్లవుతుంది. జాగ్రత్తా!

Related Post