షైతాన్‌ పవ్రేశ మార్గాలు

షైతాన్‌ పవ్రేశ మార్గాలు – ”నిశ్చయంగా షైతాన్‌ మీ శత్రువు. కనుక మీరు కూడా వాణ్ణి శత్రువు గానే పరిగణించండి. వాడు తన సమూహాన్ని, వారంతా నరకవాసులలో చేరిపోవడానికే పిలుస్తున్నాడు”. (ఫాతిర్‌: 06)

ధూమ పానం, తంబాకు నమలడం, పరాయి స్త్రీపురుషలుతో చాటింగ్‌, చూపులు కలపడం, చాటు మాటు కలయిక, అంతర్జాలం మీద అశ్లీల విషయాల్లో లీనమవ్వడం మొదలయి వాటి ద్వారా షైతాన్‌ మనిషిని త్రోవ తప్పించ చూస్తాడు.

ప్రవక్త (స) ఇలా అన్నారు: ”నిశ్చయంగా షైతాన్‌ మనిషి నరాల్లో రక్తం వలె ప్రవహిస్తుంటాడు”. (బుఖారీ)

మనిషి పుట్టింది మొదలు గిట్టేంత వరకూ వెంటాడుతూ,వేటాడుతూ ఉండే బహిరంగ శత్రువు షైతాన్‌. తను మన జీవితంలో ప్రవేశించి మనల్ని త్రోవ తప్పించే మార్గ్గాల గురించి తెలుసుకుందాం! ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహ్మ) గారు తెలియజేసిన ఏడు మార్గాలను ఇక్కడ పొందు పరుస్తున్నాము.

మొది ప్రవేశ మార్గం: షిర్క్‌కు గురి చెయ్యడం.

వాడు మానవునితో, ‘తిరస్కార వైఖరిని అవలంబించు – కుఫ్ర్‌ చెయ్యి’ అని అంటాడు. తీరా అతను కుఫ్ర్‌కి పాల్పడినప్పుడు ”నీతో నాకెలాంటి సంబందం లదు, పో. నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కు భయ పడుతున్నాను” అని అంటాడు. (అల్‌ హష్ర్‌: 16)
ధర్మం, అఖీదా గురించి అంతగా తెలియని జనం వద్దకు వచ్చి జాతి పెద్దల, పూణ్యాత్ముల విషయంలో అతిశయిల్లాల్సిందిగా ప్రేరేపిస్తాడు. వారిని మధ్య దళారులుగా చేసి కొలవమంటాడు. దీనికి గొప్ప ఉదాహరణ – మానవ చరిత్రలో మొదట అతను విగ్రహారాధనను ప్రవేశ పెట్టిన విధానం. అలా అతని వసీకరణల బారిన పడి విగ్రహారాధన చేసిన తొలి జాతి – నూహ్‌ (అ) వారి జాతి. వద్‌, సుఆ, యగూస్‌, యవూఖ్‌, నస్ర్‌ అను పుణ్యాత్ములు మానవ చరిత్రలో నిజ ఆరాధ్యుడయిన అల్లాహ్‌ను వదలి కొలవబడిన తొలివారు. అలాగే అన్య మతాలు కూడా సత్యమయి ఉండొచ్చు కదా? ఇస్లాంలో కూడా లోపాలుండొచ్చు కదా? అని అపోహను సృష్టిస్తాడు. దీనికి విరుగుడు మనం మన అఖీదాను తెలుసుకొని కాపాడుకోవడమే.

రెండవ ప్రవేశ మార్గం: బిద్‌అత్‌.

ఖుర్‌ఆన్‌ మరియు హథీసులో రూఢీ కాని విధంగా అల్లాహ్‌ను ఆరాధించడం బిద్‌అత్‌ అనబడుతుంది. ఉదాహరణకు – నమాజు కనీస ఆచ్ఛా దనతో చెయ్యాలి. కానీ షైతాన్‌ వసీకరణకు గురయిన వ్యక్తి నమాజు అయితే చేస్తాడు కానీ, నగ్నంగా. అదీ ఏ అనివార్య కారణం లేకుండా. బిద్‌అత్‌కి మనిషి పాల్పడానికి గల కారణం సదరు వ్యక్తికి ప్రవక్త (స) వారి సున్నత్‌ పట్ల అవగాహన లేకపోవడమే. కాబట్టి బిద్‌అత్‌కి విరుగుడు సున్నత్‌ అవగాహన.

మూడవ ప్రవేశ మార్గం: ఘోర పాపాలకు గురి చెయ్యడం.

కబీరా గునాహ్‌ – ఘోర పాపానికి ఒడి గట్టేలా చెయ్యడం. అలా చేస్తే ఏం జరుగుతుంది? అంటే, పాపం వల్ల విశ్వాసం క్ష్షీణిస్తుంది గనక, మనిషి మళ్ళీ షిర్క్‌ వైపునకు మళ్ళే ప్రమాదం ఉంటుంది, అల్లాహ్‌ ఇలా హెచ్చరించాడు: ”ఓ విశ్వాసులారా! షైతాన్‌ అడుగు జాడల్లో నడవకండి. అయినా ఎవరయితే షైతాన్‌ అడుగుజాడల్లో నడుచుకుంటారో నిశ్చయంగా వాడు వారికి అశ్లీలతను, చెడు పనులను గురించి మాత్రమే ఆదేశిస్తాడు. అల్లాహ్‌ చలువ, ఆయన దయా దాక్షిణ్యమే గనక మీపై లేకపోతే మీలో ఎవడూ, ఎన్నిటికీ పరిశుద్ధుడు అయ్యే వాడు కాడు. అయితే అల్లాహ్‌ తాను కోరిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు అల్లాహ్‌ అంతా వినేవాడు, అన్నీ తెలిసిన వాడు”. (అన్నూర్‌: 21) దీనికి విరుగుడు, మనం మన అఖిదాను, ఆరాధనను కాపాడు కోవడంతోపాటు, సజ్జన, పండిత సాంగత్యాన్ని అలవర్చుకోవాలి.

నాల్గవ ప్రవేశ మార్గం: చిన్న పాపాలకు గురి చెయ్యండి.

ధూమ పానం, తంబాకు నమలడం, పరాయి స్త్రీపురుషలుతో చాటింగ్‌, చూపులు కలపడం, చాటు మాటు కలయిక, అంతర్జాలం మీద అశ్లీల విషయాల్లో లీనమవ్వడం మొదలయి వాటి ద్వారా షైతాన్‌ మనిషిని త్రోవ తప్పించ చూస్తాడు. మనిషి ఈ వ్యసనాలకి ఎంతగా బానిస అవుతాడంటే, ఇవి పాపం, హరామ్‌ అన్న సృహే అతనికుండదు, ప్రవక్త (స) ఇలా హెచ్చరించారు: ”సాధారణమయినవిగా భావించి చెయ్యబడే పాపాల నుండి జాగ్రత్త! సాధారణమయినవిగా భావించి చెయ్యబడే పాపాల ఉపమానం ఎలాంది అంటే, ఒక బృందం ఓ లోయలో బస చేసింది. వారిలో ఒక్కోక్కరు ఒక్కొక్క కట్టేను మాత్రమే తీసు కచ్చాడు. చివరి అలా ప్రోగు చెయ్యబడిన కట్టెలతో వారు రొట్టెలు కాల్చుకున్నారు. నిశ్చయంగా సాధారణమయినవిగా భావించి చెయ్యబడే పాపాలు మనిషిని చుట్టుముట్టినప్పుడు అతన్ని నాశనం చేసేస్తాయి”. (తబ్రానీ) అంటే, పాపం చిన్నదయినా దాన్ని మాటి మాటికీ చేస్తూ ఉంటే అది మహ భయంకర పాప రూపం దాలుస్తుంది. దీనికి విరుగుడు, చెడు విషయాల దరిదాపులకు కూడా వెళ్ళకుండా జాగ్రత్త పడటమే.

అయిదవ ప్రవేశ మార్గం: అనుమతించ బడిన విషయాలలో నిమగ్నం చెయ్యడం.

”ప్రవక్త యహ్యా (అ) ‘నువ్వు మనిషిని ఎలా బోల్తా కొట్టిస్తావు?’ అని అడిన ప్రశ్నకు – ‘నేను కడుపు నిండా తినమని ప్రోత్సహి స్తాను. అలా అతనిలో బద్ధకం వచ్చేస్తుంది. తర్వాత అతను విధుల నిర్వాహణలో జాప్యం చేస్తాడు. ఆనక అతన్ని మట్టి కరపించడం చాలా సులువు’ అన్నాడు షైతాన్‌. అది విన్న ప్రవక్త యహ్యా – ”నేను ఎప్పుడూ కడుపు నిండా తినను’ అని అల్లాహ్‌ మీద ప్రమాణం చేస్తున్నాను అన్నారు. అప్పుడు షైతాన్‌ – ‘నేను కూడా ఇక మీదట ఏ విశ్వాసికి సలహా ఇవ్వనని ప్రతీన బూన తున్నాను’ అన్నాడు. దీనికి విరుగుడు – మనసును, కోరికలను అదుపులో పెట్టుకోవడమే.

ఆరవ ప్రవేశ మార్గం: అప్రధానమయిన వాటికి ప్రాధాన్యత ఇవ్వడం.

”నమాజును దాని తొలి వేళలో చెయ్యడం ఉత్కృష్ట కార్యం” అని ప్రవక్త (స) చెప్పారు. కానీ షైతాన్‌, చివరి వేళలో చెయ్యమని ఉసిగొల్పుతాడు. నమాజులో కేవలం నమాజు మీద మనసు లగ్నం చెయ్యాల్సి దాసుణ్ణి పరధ్యానానికి గురి చేస్తాడు. దీనికి విరుగడు – ఉత్తమ విధానం కోసం నిరంతర పరిశ్రమే.

ఏడవ ప్రవేశ మార్గం: లోకుల పేరుతో భయ పెట్టడం.

ఒక వ్యక్తి గొప్ప ధర్మ పరాయణుడిగా మారాలనుకుంటే, అప్డెడ్‌ అవ్వు బాబూ! నువ్వు ఏ యుగంలో ఉన్నావు సామీ? ఆటవిక చర్యలు ఆధునికంలోనా? తుప్పు పట్టిన సిద్ధాంతాలు తప్పు, తప్పుకోవయ్యా! అని ఉసిగొల్పుతాడు. దీనికి విరుగుడ – స్థిరచిత్తం, నిలకడ.

చివరి మాట అల్లాహ్‌ నోట:

”షైతాన్‌ తరఫు నుంచి ఏదైనా దుష్ప్రేరణ కలిగినట్లయితే అల్లాహ్‌ శరణు వేడుకో” (అవూజు బిల్లాహి మినష్షయితానిర్రజీమ్‌ అను). (ఆరాఫ్‌: 200)

Related Post