సుభిక్షం – దుర్భిక్షం

సుభిక్షం – దుర్భిక్షం – సకలలోక సృష్టికర్త అయిన అల్లాహ్ మనిషికి మహీతలంపై తన మనుగడ సవ్యంగా సాగించేందుకు కావాల్సి ఒనరుల్ని, అవసరమైన వసతులను అతను అడగకుండానే ప్రసాదించాడు. సృష్టిలో సృష్టికర్త చేసిన లోటు ఏమి లేదు. సకల సౌఖ్యాలను మనిషికి ప్రసాదించి అతన్ని సమస్త జీవరాసులలో ప్రవరుఁనిగా చేసి నిలబెట్టాడు. అయితే మనిషి తనకు ప్రాప్త మయి ఉన్న మహోన్నత స్థానాన్ని కాపాడుకోలేక పోయాడు, ఇది అతని తప్పు. తన స్వార్థం కోసం, తన స్వయ ప్రయోజనాల కోసం నాకంలా ఉన్న ఈ ‘నర’ లోకాన్ని ఒక ప్రయోగశాలగా, ఒక మారణహోమంగా మార్చి ‘నరక కూపం’ లాంటి చేదు అనుభూతిని మిగిల్చాడు. సకల సౌకర్యాలతో, దేవుని అనుగ్రహాలతో సుభిక్షంగా ఓలలాడుతున్నఅవనీతలాన్ని అపాయం పాల్జేసి దయనీయ దుర్భిక్ష స్థితికి గురి చేశాడు. ఈ పాపం మనిషిది. ఈ విపర్యాసం దుర్గర్వ దానవుడు చేసినదే. అవును, ఈ దుర్భిక్ష స్థితి ప్రకృతి చేసినది ఎంత మాత్రం కాదు. దేవుడు చేసినది అంతకన్నా కాదు. ఇదంతా నరుడు చేసినదే, దుర్మార్గ మానవుడు చేసినదే. కాబట్టి ఈ దుస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా నరులమైన మనందరి మీద ఉంది. అందు కోసం కనీస సామాజిక సృహ మనకు అవసరం. ఈ వ్యాసం ఆ కార్యసిద్ధిలో కొంత వరకైనా దోహద పడగలదని నమ్మకం.

నిజమే; కాలూ చెయ్యీ బాగుండి, సంపాదించే శక్తి ఉండి కూడా కొందరు ఈ యాచకుల వర్గంలో మనకు తారసపడతారు. అంతమాత్రాన తొందర పడి వారిని సోంబేరులుగానో, పని దొంగలుగానో ఖరారు చేసెయ్యడం సబబు కాదు.

 

బస్సుల్లో, బజార్లల్లో, బస్తీల్లో, పుణ్యక్షేత్రాలలో, హెటళ్ల ముందు, అంగళ్ల దగ్గర…. ఎక్కడ చూసినా కనబడతారు అవ్వ రార్డులు. ముష్టివాళ్లు, అడుక్కుతినేవాళ్లు అని వీరిని నామకరణం చేసి తామేదో డిక్షనరీలో లేని కొత్త పదాన్ని కనుక్కున్నామంతగా సంబర పడిపోతూ ఈ బలహీనుల్ని తస్కరించడం కూడా మనం గమనిస్తూనే ఆదేదో మనకు సంబంధం లేని విషయంగా దాటి వెళ్లిపోతుంటాము. వారు మా (నవ) లోకానికి చెందినవారు కానట్టుగా ఉపేక్షిస్తూ ఉంటాము. అవసరం ఏదీ లేకపోయినా, ఆస్తులుపాస్తులు మస్తుగా ఉన్నా, దేశాల మీద ఏదోక సంస్థ పేరు తో, సేవ పేరుతో తన పబ్బం గడుపుకోవడానికి అడక్కునేవాళ్లను భిక్షగాళ్లన్నా, ముప్ఫైత్తుకు బ్రతికేటోళ్లన్నా చెల్లుతుంది. అంతేగానీ, పూట గడవక, కడుపు మంట చల్లార్చుకోవడం కోసం పిడికెడు అన్నం అడిగేవారిని భిక్షగాళ్లని, ముష్టివాల్లని అనడం ఎంత మాత్రం సబబు కాదు. నిజంగా వారు అడుగుతున్నది భిక్షం కాదు; మన మీద వారికున్న కనీస హక్కును వారు అడుగుతు న్నారు. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ ఇలా సెలవిస్తున్నది. “వ ఫీ అమ్వాలిహిమ్ హక్కుల్ లిస్సాయిలి వల్ మరహూమ్”. వారి సంపదలో నిర్ణీత హక్కు ఉంటుంది. అడిగేవారికి, అడగనివారికి (అవసరం ఉంది కూడా ఆత్మాభిమానం వల్ల అదగనివారు, ప్రకృతి వైపరీత్యాలు తారసపడి సర్వస్వాన్ని కోల్పోయినవారికి) కూడా. (నూహ్. 24,25)

నిజమే; కాలూ చెయ్యీ బాగుండి, సంపాదించే శక్తి ఉండి కూడా కొందరు ఈ యాచకుల వర్గంలో మనకు తారసపడతారు. అంతమాత్రాన తొందర పడి వారిని సోంబేరులుగానో, పని దొంగలుగానో ఖరారు చేసెయ్యడం సబబు కాదు. ‘యాచకుడు మీ వద్దకు ఒంటె మీద స్వారీ అయి వచ్చినా మీరతనికి ఇవ్వండి’ అని ప్రవక్త (స) వారి మాట ప్రకారం మనం చేయగలిగిన సహా మం మనం చేయాలి. అంతేగాని, ఒక రూక కూడా ఇవ్వకుండా, ఒక్క ఈక కూడా విదిలించకుండా యాచకుణ్ణి నిందించే హక్కు మనకు లేదన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ మనం అనుకున్నదే నిజమయినా, అప్పుడు కూడా మనమెంతో సౌమ్యం గా వ్యవహరించి సమస్యకు తగిన పరిష్కారాన్ని సూచించగలిగతే, వారు చెయగలిగిన పనిని వారికి పురమాయించ కలిగితే మానవాభ్యుదయానికి, సమాజాభ్యున్నతికి, దేశాభివృద్ధికి దోహదం కెసినవారం అవుతాము. గత్యంతరం లేని వాళ్లను, అనాథలను, వితంతువులను, వికలాంగులను, ఆసరా కరువై, ఆదరణకు దూరమైన వృద్ధజీవులకు విధిగా కూడు, గూడు, గుడ్డ వంటి కనీస అవసరాల్ని తీర్చాలన్నది ఇస్లాం ఉపదేశం. ఈ బడుగు, బలహీన వర్గాలను ఉద్దరించేందుకు మానవ సమాజంలో ధనం ఒకటే కాదు, కావలసిందల్లా మంచి చేయాలన్న హృదయం. సాటి మనిషి ఆదుకోవాలన్న తపన. మానవునికి ఎదుర్కొంటున్న పర్భిక్ష దయనీయ స్థితిని దూరం చేయాలన్న సదభిప్రాయం కావాలి. అంతే! ఈ విషయమై ఖుర్ఆన్ మనల్ని ఇలా బోధిస్తుంది: మరియు దేవుడు నిన్ను మార్గము తెలియని వానిగా పొందెను. -కావున నీకు (ధర్మ) మార్గమును చూపెను. మరియు దేవుడు నిన్ను పేదవానిగా పొందెను. కావున నిన్ను ధనవంతునిగా జేసెను. కావున తండ్రి లేని బిడ్డను (అనాథను) నీవు గద్దింపకుము. మరియు అడుగునట్టివానిని అదలింపకుము. మరియు నీ ప్రభువు యొక్క మేలును గూర్చి పలుకుచుండుము”. (అజుహా: 7-) మరో చోట ఇలా సెలవియ్యబడింది: “వ అహ్సిన్ కమా అహ్సనల్లాహు ఇలైక”. అల్లాహ్ నీకు ఏ విధంగా మేలు చేశాడో అదే విధంగా నువ్వు కూడా (ప్రజల పట్ల) సద్వ్యవహారం చెయ్య. (అల్ ఖసస్: 77)

ఆ విషయానికొస్తే, మనమందరం బీదవారమే, అవసరార్డులమే, అశక్తులమే; ఒక్క అల్లాహ్ తప్ప. “యా అయ్యుహన్నాసు అంతుముల్ ఫుఖరావు ఇలల్లాహ…” ఓ ప్రజలారా! మీరంతా అల్లాహ్ అవసరం కలిగినవారే. అల్లాహ్ మాత్రం అక్కర లేనివాడు. సర్వ విధాల స్తుతించదగినవాడు. (ఫాతిర్: 15) ఇవ్వడం కష్టమైతే అడగడం మరింత కష్టం ‘అడిగాడు’ అనగానే అతను ఎంతటివాడైనా అల్పుడైపోతాడు. అంతకు ముందు అతనో దాతయినా, మహా నేతయినా, ప్రాణ మిత్రుడైనా, సమీప బంధువైనా, క్షణం క్రితం వారిని అభిమానించిన మనమే వారిని అట్టడుగున పడేస్తాము. మరుక్షణం నుండి అతనిలోని సకల సుగుణాలకు అర్థం మారి పోతుంది. అతని పరువు ప్రతిష్టలు మట్టి పాలవుతాయి, అతని కీర్తికండూతి మొత్తం జీరో స్థాయికి చేరుకుంటుంది. ఏం? అడిగినందుకు ఫలితం కలిగినా, కలగకపోయినా ఈ ఛీత్కారం మాత్రం తప్పదు. ఇలా మనం ఎందుకు వ్యవహరిస్తామో ఒక్క క్షణం కోసం ఎప్పడైనా సునిశితంగా ఆలోచించామా?! ఒక వ్యక్తి మనల్ని ఏదైనా సహాయం అడిగాడు అంటే మనల్ని తన పాలిట శ్రేయోభిలాషులుగా ఎంచి తన సమస్యను మన ముందు పెట్టాడు అని ఎందుకు అనుకోము? అడిగాడు-అంటే, అడుక్కున్నాడు, ముప్టెత్తుకుంటు న్నాడు అనేగా అని వాదిస్తాము. ఇంకా స్నేహము, బాంధవ్యము, మర్యాద అన్న మాటలు అర్థం లేనివి అని భావిస్తాము. అది అతని పాలిట వరమో లేదా మన పాలిట శాపమో దేవుడికే ఎరుక.

ఎంత కష్టం! ఆలోచించే కొద్దీ గుండె తరుక్కుపోతుంది. ఎవరిని అడగాలి? ఎలా అర్థించాలి? ఏవిధంగా ఆరంభించాలి? ఏమని అడగాలి? కంఠస్వరంలో గాద్గదం కలుగుతుంది. లోగొంతు పడుతుంది. మాట రావడం కష్టమైపోతుంది. బలవంతంగా మాటను బయటికి ఈడ్వాల్సి ఉంటుంది. ఈ సంఘర్షణలో మాటలు తెగి పోతాయి. అన్ని అక్షరాలు స్వచ్ఛంగా ఉచ్చరించడానికి దమ్ము, ధైర్యమ చాలదు. అనుకున్న మాటలు అంతరిక్షానికి ఎగిరి పోతాయి. వల్లే వేసుకున్న పాఠాలు చెల్లాచెదురైపోతాయి. ఇదో వేదనయితే, అడినందుకు ఫలం ‘అడిగాడు’ అని అన్పించుకో వడం తప్ప ఇతర ఫలం దక్కదేమోనన్న యమ యాతన మరో వైపు. ఒళ్లంతా పాములు, తేళ్లు పాకుతున్న అనుభూతి. గుండె ల్లో శూలాలు గుచ్చుకుంటున్నట్టు విపరీత బాధ. ప్రాక్టీస్ కోసమే ‘సహాయం’ అని అనబోతాడు. ‘స’ అన్న అక్షరం మాత్రమే విన బడుతుంది. తర్వాత అధరాలు మాత్రం అదురుతాయి. మనసున్న మారాజులు, ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే, ఒకరికి మంచి చేయాలన్న హృదయం గలవారు గ్రహించుకోవాల్సిందే. ఈ యాతన అంతా పూర్వ రంగమే. ఇది తెలిసిన కాళిదాసు ఇలా అన్నాడు:

అభ్యర్థనాభంగ భమేవ సాధుః
మాధ్యస్థ మిద్దే ప్యపలంబ్య తేర్దే

అడిగితే ఎక్కడ లేదని సమాధానం వినవలసి వస్తుందేమోనని కావలసిన వస్తువును కూడా అక్కర లేదన్నట్టే ఊరుకుంటారట.

ఖుర్ఆన్లో ఇటువంటి ఆత్మాభిమానధనుల గురించి ఇలా సెలవియ్యబడింది: “ముఖ్యంగా సహాయానికి అర్హులైనవారు, దైవ ధ్యేయ పథంలో తలమునకలై ఉండి స్వంత ఉపాధి సంపాదనకై – ధరణిలో ఎటూ కదలలేని నిర్ధనులు. వారిని ఎరుగని వ్యక్తి వారి ఆత్మాభిమానాన్ని చూసి, వారు కలిగినవారేనని తలపోస్తాడు. వారి ముఖాల ద్వారా వారి నిజ స్థితిని మీరు గ్రహించగలరు. కాని, వారు జనుల వెంటబడే రకం కాదు. వారి సహాయార్థం మీరు ఏదైనా ఖర్చు చేస్తే అది అల్లాహ్ కు తెలియకుండా ఉండదు”. (అల్ బఖర: 273)

మరో చోట ఇలా ఉంది: “వ యస్లూఅ లూనక మాజా యున్ఖూఫిఖూన్ ఖులిల్ ఆఫ్వ్ ” ఏం ఖర్చు పెట్టాలి? అని వారు నిన్ను అడుగుతున్నారు. (ఓ ప్రవకా!) ‘మీ ఖర్చులు పోగా మిగిలినది’ అని నువ్వు వారికి చెప్పు. (అల్ బఖర:2!9 )

మన అవసరాలకు అయి మిగిలిన దాంట్లోంచి కొంచెం ఇవ్వడానికే మనకు అంత కష్టంగా ఉంటే, తన దగ్గర మిగిలున్న ఒకేఒక్క ఆత్మాభిమానం అనే ధనాన్ని సయితం పరిత్యజించి ‘లేదు’ అని అడగటం అంతకన్నా కష్టమవుతుంది. ఇచ్చేవాడి త్యాగం రవ్వంత అయితే, ఆత్మాభిమానాన్ని చంపుకుని అడిగే వాడి త్యాగం కొండంతటిది. ఆశ్చర్యంగా ఉంటాయీ మాటలు. అడుక్కునేవారికి త్యాగంతో ఏం సంబంధం? అని శంకిస్తుంది హృదయం. కొంచెం అతిగా, అసత్యంగా ఉన్నట్లు కూడా తోస్తుంది. నిజమే. కాని అడిగేవాడు ఎవడు? అడగడమే అలవాటుగా, అదే తమ వృత్తిగా చేసుకొని ఊర్లమీద పడి తిరిగేవారు ఈ జాబితాలోకి రారు. వీరు అడుక్కొడాన్ని ఒక విద్యగా, ఒక కళగా చేశారు. కాలేజీలు, యూనివర్సిటీలు లేవుగాని, ఉంటేనా ఈ కళలో వీరంతా డిగ్రీలు పుచ్చుకుని పట్టభద్రులయి ఉండే వారేమో కాబోలు! ఈ వృత్తి పెద్దల్ని అడిగారని చెబితే అపచారం, అపచారం అంటూ లెంపలేసుకోవడం మనకు ముందు నుంచి ఉన్న ఆనవాయితే. “సువర్ణ పుష్పం సమర్పయామి” అంటూ సగౌరవంగా ఇచ్చుకుంటాము. అవును; ఇటువంటివారు అడుక్కోడానికే పుట్టారనిపిస్తుంది అప్పుడప్పుడు. ధర్మశాస్త్రాలు వీరి సొత్తు అయినట్టు. ధర్మం వీరి చుట్టమైనట్టు. ఇట్టివారికి ఎట్టి వ్యధాభరిత శిక్ష ఉంటుందో ప్రవక్త (స) హెచ్చరించి ఉన్నారు: “ప్రజల దగ్గర అడుక్కోవడమే వృత్తిగా చేసుకున్న వ్యక్తి, ముఖం పై ఒక మాంసపు తునకయినా లేని స్థితిలో అల్లాహ్ను కలుసుకుంటాడు”. (బుఖారీ,ముస్లిం) , “ధనాన్ని కూడబెట్టాలన్న ఉద్దేశ్యంతో అడక్కునే వాడు వాస్తవానికి అగ్ని జ్వాలల్ని కోరుకుంటున్నాడు. కనుక ఎక్కువ అడుక్కుంటాడా, తక్కువ అడుక్కుంటాడా అనేది అతని విజ్ఞతకే వదిలి పెడుతున్నాను”. (ముస్లిం) “(అవసరం లేకపోయినా అలవాటు) భిక్షాటన ఒక గాయం లాంటిది. మనిషి భిక్షాటన చేసి తన ముఖాన్ని గాయపర్చు కుంటాడు”. (తిర్మిజీ)

 

 

Related Post