అనాథల  సంరక్షణ మరియు ఇస్లాం

అనాథల  సంరక్షణ మరియు ఇస్లాం / ఒక మహా యుద్ధం, ఒక మహా ప్రకృతి విలయం, భూకంప బీభత్సం మానవాళిని భయానకంగా గాయపరిచి వెళ్తాయి. కొవిడ్‌ 19 ‌కూడా అంతటి లోతైన గాయమే చేసింది. కొవిడ్‌తో జరుగుతున్న ఈ భీకర సమరంలో చుక్క రక్తం కూడా చిందలేదు. కానీ కొన్ని లక్షల మంది వారాల వ్యవధిలో ఆ యుద్ధంలోనే నేలకొరిగిపోయారు. పెనుగాలి సవ్వడి లేదు, వాన లేదు. పిడుగులు లేవు. ఇళ్లు కూల లేదు. కానీ వందల తుఫానుల శక్తితో కొవిడ్‌ ‌మహమ్మారి కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. ఇప్పుడు భారతీయ సమాజం ముందు నిలిచిన అతి పెద్ద ప్రశ్న- కొవిడ్‌ ‌మిగిల్చిన అనాథ బాలబాలికల రక్షణ. శతాబ్దాల పాటు భారతీయులను కబళించిన అంటు వ్యాధులూ, యుద్ధాలూ, దుర్భిక్షాలూ అవి మిగిల్చిన అమానవీయ అనుభవాను మనం చదువుకున్నాం. వాటికి ఏమీ తీసిపోని భయానక దృశ్యాలను కరోనా కారణంగా ఈ తరం వారమంతా చూస్తున్నాం. మిగిలిన విషాదాల మాట ఎలా ఉన్నా ఆ దృశ్యా లన్నింటిలోను మనసులను విచలితం చేస్తూ ఆ బాలబాలికల దయనీయ స్థితి కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వీరంతా కరోనా చేసిన కన్నీటి బొమ్మలు. వేయీ రెండు వేలూ కాదు, దాదాపు 30,000. ఈ 30,000 మందిలో బాలురు 15,620. బాలికలు 14,447.

2019 అక్టోబర్‌లో ప్రభుత్వ చైల్డ్‌లైన్‌ ‌పోర్టల్‌ అం‌దించిన వివరాల ప్రకారం దేశంలో 25 మిలియన్లు (2007 గణాంకాల ప్రకారం, యునెసెఫ్‌ ‌సేకరించినది), అంటే రెండుకోట్ల యాభయ్‌ ‌లక్షల మంది అనాథ బాలలున్నారు. ఇప్పుడు కొవిడ్‌ ఆ ‌సమస్యను ఇంకాస్త తీవ్రం చేసింది. మరొక అధ్యయనం ప్రకారం నాలుగున్నర కోట్ల దిక్కులేని పిల్లలు ఉన్నారు. ఇలాంటి పిల్లలను తాత్కాలికంగా ఆదుకునే వారు కనిపిస్తున్నారు కానీ, శాశ్వత ప్రాతిపదికన దత్తత చేసుకోవడానికి ముందుకు వస్తున్నవారు చాలా తక్కువ. దేశంలో ఒక అనాథను ఎవరూ సాకడానికి ముందుకు రాకపోతే వారి బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలని చట్టం చెబుతోంది. సంబంధిత ఉద్యోగులే అలాంటి వారిని గుర్తించి ఏదైనా సంస్థలో ఆశ్రయం కల్పించాలి.  ఇది ఓ వైపే అయితే, ఈ బడుగు బలహీన వర్గం గురించి ఇస్లాం ఏం చెబుతుంది అన్నది ముక్తసరిగా తెలుసుకుందాం!

దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు: “నీవు అనాధల పట్ల కఠినంగా ప్రవర్తించకు. యాచకుణ్ణి కసురుకోకు.” (అల్ జుహా : 9,10)

ఇంకా ఇలా అంటున్నాడు : “పరలోక శిక్షను, బహుమానాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా? అతడే అనాథలను కసరి కొట్టేవాడు, పేదవాళ్ళకు అన్నం పెట్టు అని ప్రోత్సహించనివాడు.” (అల్ మావూన్ : 1-3)

అల్లాహ్  దృష్టిలో ప్రజలంతా ఆయన దాసులే. వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసేవారికి ఎక్కువ  విలువ ఉంటుంది. అలాంటి వారు అభాగ్యులు, నిరుపేదలైనందు వల్ల లోకులు వారిని నీచులుగా, అల్పులుగా భావించినా దేవుని సన్నిధిలో మాత్రం వారు గౌరవనీయులుగానే పరిగణించ బడతారు. వీరికి భిన్నంగా అహంకారులు   ప్రాపంచికంగా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ వారి సిరిసంపదలకు, వారి భోగభాగ్యాలకు, ఇహలోకపు పెద్దరికానికి దేవుని దృష్టిలో పూచిక పుల్లంత విలువ కూడా ఉండదు.

 

ప్రజలందరూ పరస్పరం ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండాలని ప్రబోధిస్తోంది ఇస్లాం. తోటిప్రజల  గురించి – వారు ధనికులైనా, నిరుపేదలైనా, ఏ వర్ణం, ఏ వర్గానికి, ఏ మతానికి, మారె సమాజానికి చెందిన వారైనా – అన్నీ ఉన్న వారైనా, అనాథలైన  ఎల్లప్పుడూ సదభిప్రాయాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైనా ప్రయత్నంగానో అప్రయత్నంగానో అన్నమాటల వల్ల తోటి ప్రజలకు  బాధకలిగితే వెంటనే పశ్చాత్తాపంతో వారికి క్షమాపణలు చెప్పుకోవాలి. ధనికులనీ, పేదవారనీ, కులీనులనీ, కులహీనులనీ ఎలాంటి తారతమ్యాలు లేవు. ఇస్లాం దృష్టిలో అందరూ సమానులేనన్న విషయాన్ని గ్రహించాలి.

స్వర్గంలో దైవప్రవక్త (సల్లం) సామీప్యంలో, ఆయన సహచర్యంలో చోటు లభించటం

గొప్ప అదృష్టం. అనాధల పట్ల ఉత్తమంగా వ్యవహరించేవారు, వారి మంచిచెడ్డలు చూసేవారికి

ఆ అదృష్టం లభిస్తుంది. అందుకే దైవప్రవక్త (సల్లం) అనాధల పట్ల మంచిగా వ్యవహరించే

వారి ఇల్లు ఉత్తమ ఇల్లనీ, అనాధల్ని కష్టపెట్టేవారి ఇల్లు అతి నీచమైన ఇల్లని అన్నారు.

హజ్రత్ సహ్ బిన్ సాద్ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు: నేను మరియు అనాధల పోషకుడు స్వర్గంలో ఇలా ఉంటాం. (‘ఇలా’ అన్నప్పుడు) ఆయన తన చూపుడు వ్రేలు మరియు మధ్య వ్రేలిని కలపకుండా కొంతసందు ఉంచి చూపిం చారు. (అంటే స్వర్గంలో ఇద్దరూ ఒకేచోట ఉంటారు కాని స్థానాల్లో మాత్రం తారతమ్యం ఉంటుంది.) (బుఖారీ)

హజ్రత్ అబూ హురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు అనాధుల పోషకుడు అనాధకు బంధువైనా, కాకపోయినా (సరే) నేను మరియు అతను స్వర్గంలో ఈ రెండు వ్రేళ్ళ మాదిరిగా (కలసి) ఉంటాం.” హదీసు ఉల్లేఖకులు మాలిక్ బిన్ అనస్ చూపుడువ్రేలు మరియు మధ్య వ్రేలితో సైగ చేసి చూపించారు. (ముస్లిం)

సామూహిక అనాధపరిపోషక కార్యాకలాపాలు కేవలం బంధుమిత్రుల అనాధపిల్లలకే పరిమితం కావు. సమాజంలోని ప్రతి అనాధకు, అవసరాల్లో ఉన్న ప్రతి వ్యక్తికీ ఇవి తమ సేవలనందజేస్తాయి. ముస్లింలు సామూహిక అనాధ పరిపోషక వ్యవస్థను స్థాపించుకుంటే వారిలో ఎవరికీ భీమా చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. భీమా అనేది వడ్డీ వ్యాపారంలోని ఒక రకం. నిరుపేదల నడ్డివిరిచే ఈ వడ్డీ వ్యాపార విధానాలను ఇస్లాం రూపుమాపాలని ఆదేశిస్తోంది. కనుక ముస్లింలు తమ ధర్మం బోధించే సమున్నత ఆర్థిక విధానాలను అమలుపరచుకుంటే ఇలాంటి అడ్డదారులు తొక్కాల్సిన అవసరం ఉండదు.

ఇక్కడ కొందరికి ఓ సందేహం కలగొచ్చు – ఇలా చేస్తే ఒకరి మీద ఆధార పడే స్వభావం సర్వ సాధారణం అవుతుంది కదా? అని.

సాధారణంగా వీధుల వెంట తిరుగుతూ భిక్షాటనం చేసేవారు నిరుపేదలై ఉండరు. పైసా జమ చేసుకొని దాచిపెట్టుకుంటూ ఉంటారు. కాని కొంతమంది తాము ఎంత వాళ్ళు పైసా పేదరికంతో కునారిల్లుతున్నప్పటికీ తొడుక్కున్న దుస్తులవల్లగాని, బాహ్య అవతారం వల్లగాని తమ పేదరికాన్ని బయట పెట్టుకోరు. వారి ఆత్మాభిమానం వారిని ముట్టెత్తనీయదు. వాస్తవానికి నిరుపేదలు, దానధర్మాలు పుచ్చుకోవటానికి అర్హులు వీరే. కనుక దానధర్మాలు చేసినప్పుడు ఇలాంటి సిసలైన నిరుపేదల్ని వెతికి వారికే దానం చేయాలి. భిక్షాటనను వృత్తిగా చేసుకున్నవారికి దానాలు చేస్తే వారిని భిక్షాటనపై ప్రోత్సహించినట్లవుతుంది. ఇస్లాం భిక్షాటనను గర్హిస్తుంది.

దైవ ప్రవక్త (స)  ఇలా ప్రవచించారు : (ఇంటింటా తిరిగి) ఒకటి రెండు ఖర్జూరపు పండ్లు లేదా ఒకటి రెండు ముద్దలు అడుక్కునే వాడు నిరుపేద కాదు. (పేదరికంతో బాధపడుతున్నప్పటికీ) ముష్టెత్తకుండా (ఆత్మాభిమానంతో) బ్రతికేవాడే సిసలైన నిరుపేద. (బుఖారీ – ముస్లిం)

బుఖారీ – ముస్లింలో వేరొక ఉల్లేఖనం లోని వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి: ప్రజల దగ్గర ఒకటి రెండు ముద్దలు లేదా ఒకటి రెండు ఖర్జూర పండ్లు అడుక్కుంటూ తిరిగేవాడు నిరుపేద కాదు. సిసలైన నిరుపేద ఎవరంటే, అతని దగ్గర ఇతరుల్ని యాచించకుండా ఉండేందుకు తగిన ఆర్థిక స్తోమత ఉండదు. మరోవైపు ప్రజలు అతనికి దానం చేయాలన్నా అతను వారికి పేదవాడిగానూ కనిపించడు. (తాను ఎంత పేదరికం బాధపడుతు న్నప్పటికీ) ఇతరుల ముందు చేయి చాపటానికి అతను సిద్ధపడడు. (బుఖారీ – ముస్లిం)

ఒక్క అనాథాలనే కాదు, సమాజంలోని బడుగు వర్గాల ప్రజలు – వారు వికలాంగులైనా, వితంతువులైనా వారి పోషణా బాధ్యత అందరి మీద ఉంటుంది. పైగా ఇది ఎంతో ఘానా కార్యం కూడా.  వాస్తవానికి సమాజంలోని ఇతర అభాగ్యజీవులు, నిరాశ్రయులు, నిరాధారజీవులందరి పోషణ, సంరక్షణ కోసం చేసే కృషి దైవమార్గంలో చేయబడే పోరాటంతో సమానంగా పరిగణించబడు తుంది. దీనిద్వారా ఇస్లాంలో సంక్షేమ కార్యకలాపాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో తెలుస్తోంది. దురదృష్టవశాత్తూ నేడు ముస్లింలు వీటిని విస్మరిస్తూ పోతున్నారుగాని ఇస్లాం ధర్మం సంక్షేమరాజ్య రూపురేఖల్ని సైద్ధాంతికంగా వివరించి, క్రియాత్మకంగా ఏనాడో దానిని స్థాపించి చూపించింది.   కేవలం నమాజ్, రోజాలు పాటించటమే ఆరాధన కాదు. బలహీనులకు సహాయపడటం, వితంతువులు, నిరుపేదల్ని ఆదుకోవటంలాంటి పనులన్నీ కూడా ఆరాధనల క్రిందికే వస్తాయి.

హజ్రత్ అబూ హురైరా (రజి) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు వితంతువులు, సమానం. (హదీసు ఉల్లేఖకులు ఇలా అంటున్నారు:) అతడు అలుపెరగ కుండా దైవారాధన చేసేవాడితో, నిరంత రంగా ఉపవాసాలు పాటించేవాడితో సమానమని కూడా దైవప్రవక్త (సల్లం) అన్నారని నా అనుమానం. (బుఖారీ – ముస్లిం)

కొందరుంటారు –  సమాజంలోని నిరుపేదల్ని, అభాగ్యజీవుల్ని ఆహ్వానించకుండా  అట్టహాసంగా విందులు, వినోద కార్యక్రమాలు చేస్తుంటారు. వారు తమ  విందుకు హాజరయితే అది తమ కీర్తికే కళంకంగా భావిస్తారు. వాస్తవానికి ఆ విందుకు హక్కుదారులు ఆదరణ నోచుకోని అనాథలు, ఆకలిగొన్నవారు, అగత్యపరులు, నిరుపేదలే. అలాంటప్పుడు వారిని విస్మరించి ధనవంతుల్ని మాత్రమే ఆహ్వానించటం నైతికంగా ఎంతో దిగజారిన పని అనిపించుకుంటుంది. దీనివల్ల కలిగే ఇంకో దుష్పరిణామం ఏమిటంటే, ధనవంతులు చేసే ఘనమైన విందు ఏర్పాట్లని చూసి పేదవారు చిన్నబుచ్చుకుంటారు. తమ దగ్గర అంత స్తోమత లేకపోయినందుకు వారి మనసు చివుక్కుమంటుంది. ఈ విధంగా ఒక ముస్లింని మానసికంగా కష్టపెట్టడం కూడా పాపమే. ఇస్లాం ధర్మం అగత్యపరుల్ని ఆదుకోవాలని, వారి మనసును సంతుష్టపరచాలని, సమాజంలోని నిరుపేదల పట్ల ఉత్తమంగా వ్యవహరించాలని ఆదేశిస్తోంది.

హజ్రత్ అబూ హురైరా (రజి) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: (అగత్యపరులు) వస్తుంటే వద్దని, రానివారి కోసం వెంప ర్లాడే వలీమా విందు అత్యంత నీచ మైనది. (వలీమా విందు) ఆహ్వానాన్ని అంగీకరించనివాడు దైవానికి, దైవ ప్రవక్తకు అవిధేయుడయ్యాడు. (ముస్లిం) బుఖారీ – ముస్లింలలోని అబూ హురైరా (రజి) గారి వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: పేదవారిని పిలవకుండా (కేవలం) ధనికులు మాత్రమే ఆహ్వా నించబడే వలీమా విందు అత్యంత నీచమైనది. (బుఖారీ – ముస్లింల)

హజ్రత్ ఆయిషా (రజి. అర్హి) కథనం : ఒక స్త్రీ తన ఇద్దరు అనాథ ఆడ పిల్లలను  వెంటబెట్టుకొని నా దగ్గరికొచ్చి – ఏమైనా దానం చేయమని అడిగింది. అప్పుడు నా దగ్గర ఆమెకివ్వటానికి ఒక ఖర్జూర పండు తప్ప మరేమీ లేదు. నేను ఆ ఒక్క ఖర్జూర పండునూ ఆమెకిచ్చేశాను. ఆ స్త్రీ నేనిచ్చిన ఖర్జూరపండును తన ఇద్దరు కూతుళ్ళకు పంచి ఇచ్చింది. తాను మాత్రం తినలేదు. కొంత సేపటికి ఆమె లేచి వెళ్లిపోయింది. ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) మా దగ్గరికి వచ్చి నప్పుడు నేనీ విషయాన్ని ఆయనకు తెలియజేయగా, దానికి ఆయన ఆడపిల్లల వల్ల ఎవరైనా పరీక్షలకు గురైనప్పటికీ (సహనం వహిస్తూ) వారి పట్ల ఉత్తమంగా వ్యవహరించిన వ్యక్తి పాలిట ప్రళయదినాన ఆ ఆడ పిల్లలే నరకాగ్నికి అడ్డుగా నిలుస్తారు” అని అన్నారు. (బుఖారీ – ముస్లిం)

 

సమాజంలో బలవంతులు బలహీనులపై దౌర్జన్యాలకు పాల్పడటమనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ దౌర్జన్యాలకు గురయ్యేది అబలలైన స్త్రీలు, అనాధలే. ప్రజలు స్త్రీల కోసం, అనాధల కోసం షరీఅత్ కేటాయించిన హక్కులు వారికి దక్కకుండా చేస్తుంటారు. ఒకవైపు వారి హక్కుల్ని కాలరాయటంతోపాటు మరోవైపు వారిని రకరకాలుగా వేధించటం, చిత్రహింసలకు గురిచేయటం చేస్తుంటారు. దైవప్రవక్త (స) ఇలాంటి దౌర్జన్య పరులకు పరలోకంలో వినాశం తప్పదని హెచ్చరించారు. బలవంతులు బలహీనుల హక్కుల్ని దోచుకుతినడాన్ని ఖండించారు

హజ్రత్ అబూ షురైహ్ ఖువైలిద్ బిన్ అమ్ర ఖుజాయి (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా అనేవారు : దేవా! ఇద్దరు అబలల హక్కుల విష యమై నేను ప్రజల్ని పదే పదే భయ పెడుతున్నాను. (ఆ ఇద్దరు ఎవరంటే), అనాధ మరియు స్త్రీ. (ఈ హదీసు ‘హసన్’ కోవకు చెందినది).

కాని శోచనీయమైన విషయం ఏమిటంటే సత్యధర్మ ధ్వజవాహకులైన ముస్లింలు సైతం తమ ధర్మాదేశాల అమలుకు స్వస్తి పలికారు. మంచికి మారుపేరు కావాల్సిన ముస్లిం సమాజాల్లోనే ఇలాంటి రుగ్మతలు చోటుచేసుకుంటున్నాయి. బలవంతులు బలహీన వర్గాలపై దౌర్జన్యాలకు ఒడిగడుతున్నారు. పురుషులు స్త్రీలను నానా యాతనలకు గురిచేస్తున్నారు. ఫలితంగా నేడు ప్రపంచంలో ఇస్లాం అపఖ్యాతి పాలౌతోంది. ఇస్లాంలో మహిళల హక్కులకు రక్షణ లేదన్న అపవాదు మొదలయ్యింది. ఇస్లాం విరోధులు రకరకాల అనుమానాలు సృష్టించి దీనికి ఆజ్యం పోస్తున్నారు. కాని వాస్తవానికి ఇస్లాం ధర్మం పురుషులతోపాటు స్త్రీలకు కూడా సమాన హక్కుల్ని, సముచితమైన స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను ప్రసాదించింది. నేటి ముస్లింలు వాటిని విస్మరిస్తున్నారంటే ఆ దోషం ఇస్లాంది కాదు. దానికి ఇస్లాంను ఆడిపోసుకోవటం సమంజసం కూడా కాదు.

నేడు ముస్లింలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. తమ నడవడిక ద్వారా గాని, తాము అనుసరిస్తున్న విధానాల ద్వారాగాని ఇస్లాంధర్మం అపఖ్యాతి పాలు గాకుండా విజ్ఞతతో వ్యవహరించాలి. ఇస్లాం బోధించే అభ్యుదయ సుమగంధాల్ని లోకానికి తెలియజేయాలి. లేకపోతే తాము స్వయంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నందుకు, ఇంకా తమ ధర్మం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు వారు రెండింతల పాపాన్ని మోయవలసి ఉంటుంది.

హజ్రత్ ముస్లిబ్ బిన్ సాద్ బిన్ అబూ వఖాస్ (రజి) కథనం ప్రకారం (ఆయన తండ్రి) అయిన సాద్ గారికి తాను తన క్రిందివారికన్నా గొప్పవాణ్ణనిపించింది. (ఈ విషయం తెలుసుకొని) దైవప్రవక్త “ఈ బలహీనుల చలువతోనే మీకు (దైవం తరపునుంచి) సహాయం లభిస్తుందని, ఉపాధి దొరుకుతుందని గ్రహించండి” అని అన్నారు. (సహీహ్ బుఖారీ)

స్థితిమంతులు తమల్ని తాము గొప్పవారిగానూ, తమకన్నా తక్కువ స్థాయిలో వున్నవారిని అల్పులుగానూ భావించకూడదు. పైగా బలహీనుల్ని, నిస్సహాయుల్ని గౌరవించాలి. వారు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలి. బహుశా మీపై ఆధారపడి బతుకుతున్న వారిమీద కనికరంతోనే దేవుడు మీ సిరిసంపదల్లో వృద్ధిని ప్రసాదిస్తున్నాడేమో! అలాంటప్పుడు మీరు మిడిసిపడటం దేనికి?!

దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ దర్గా ఉవైమిర్ (రజి) తెలియజేశారు: మీరు నన్ను బలహీనుల్లో అన్వే షించండి. నిస్సందేహంగా ఈ బలహీనుల వల్లనే మీకు సహాయం అందు తోంది. ఉపాధి లభిస్తోంది.(సుననె అబూదావూద్)

బలహీనులు, నిస్సహాయుల వల్ల స్థితిమంతులకు సహాయం లభించటంలోని ఆంతర్యం ఏమిటంటే సాధారణంగా నిరుపేదల, బలహీనుల హృదయాలు ఐహిక వ్యామోహానికి అతీతంగా ఉంటాయి. కనుక వారిలో చిత్తశుద్ధి మెండుగా ఉంటుంది. ఇతరుల కన్నా ఎక్కువగా వారు దైవాన్ని స్మరిస్తూ ఉంటారు. అలాంటివారు దైవసన్నిధిలో చేతులెత్తి ప్రార్థిస్తే దేవుడు వారిని ఒట్టి చేతులతో త్రిప్పి పంపడు. తప్పకుండా వారి ప్రార్థనలను ఆమోదిస్తాడు. కాబట్టి అలాంటి బలహీనుల్ని ఆదుకుంటే వారు తమని ఆదుకున్నవారు సుఖంగా ఉండాలని దైవాన్ని వేడుకుంటారు. వారి ప్రార్ధనల ఫలితంగా వారికి దైవసహాయం అందుతూ ఉంటుంది. నసాయిలోని వేరొక ఉల్లేఖనం కూడా ఈ అర్థాన్ని సమర్థిస్తోంది. అందులో ‘దేవుడు సమాజంలోని బలహీనుల ప్రార్థనలు, నమాజు మరియు వారి చిత్తశుద్ధి వల్ల ఆ సమాజాన్ని కాపాడుతుంటాడు’ అని ఉంది. (ఔనుల్ మాబూద్)

 

Related Post