క్షుద్బాధ తీర్చడమే పుణ్యకార్యం

క్షుద్బాధను తీర్చడం, దాహార్తులకు నీళ్లు తాగించడం, ఒళ్లు కప్పుకోవడానికి వస్త్రాలు సమకూర్చడం ఎంతో గొప్ప పుణ్యకార్యం. దీనివల్ల దైవం సంతోషిస్తాడు, దైవ సామీప్యం ప్రాప్తిస్తుంది. దీనికి భిన్నంగా పౌరుల ఆకలిబాధలను పట్టించుకోకపోవడం, పేదసాదలను విస్మరించి డాంబిక జీవితం గడపడం, పాపకార్యాలు... వంటివి దైవాగ్రహానికి కారణాలవుతాయని తెలుసుకోవాలి.

క్షుద్బాధను తీర్చడం, దాహార్తులకు నీళ్లు తాగించడం, ఒళ్లు కప్పుకోవడానికి వస్త్రాలు సమకూర్చడం ఎంతో గొప్ప పుణ్యకార్యం. దీనివల్ల దైవం సంతోషిస్తాడు, దైవ సామీప్యం ప్రాప్తిస్తుంది. దీనికి భిన్నంగా పౌరుల ఆకలిబాధలను పట్టించుకోకపోవడం, పేదసాదలను విస్మరించి డాంబిక జీవితం గడపడం, పాపకార్యాలు… వంటివి దైవాగ్రహానికి కారణాలవుతాయని తెలుసుకోవాలి.

ప్రళయదినం నాడు దైవం మానవుడిని ఉద్దేశించి, ‘ఆదం సంతానమా! నేను నిన్ను అన్నం పెట్టమని అడిగాను, కాని నువ్వు నాకు అన్నం పెట్టలేదు. దాహం తీర్చమని అడిగాను. కాని నువ్వు నా దాహం తీర్చలేదు. వస్త్రాలు ఇవ్వమని అడిగాను. వస్త్రాలూ ఇవ్వలేదు’ అంటాడు. అప్పుడు మనిషి, ‘ప్రభూ! నేనేమిటి, నీకు అన్నం పెట్టడమేమిటి? ప్రభూ! నేను నీ దాహం తీర్చడమేమిటి? నేను నీకు వస్త్రాలు సమకూర్చడమేమిటి? నువ్వు సకల లోకాల ప్రభువు, పరిపోషకుడివి కదా!’ అని దీనంగా, వినయంగా విన్నవించుకుంటాడు. అప్పుడు దైవం, ‘నీకు గుర్తు లేదా (అప్పుడే మరిచిపోయావా?) నా ఫలానా దాసుడు ఆకలితో వచ్చి అన్నం పెట్టమని నిన్ను అడిగాడు, కాని నువ్వు తనకి మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఫలానా దాసుడు శరీరం కప్పుకోవడానికి వస్త్రాలు ఇవ్వమని అడిగాడు. నువ్వు తనకి వస్త్రాన్నీ ఇవ్వలేదు. నువ్వు ఆ నాడు (ఇహలోకంలో) ఆకలి గొన్నవాడికి అన్నం పెట్టి ఉంటే, దాహార్తికి నీళ్లు ఇచ్చి ఉంటే, వస్త్రవిహీనులకు వస్త్రాలు సమకూర్చి ఉండే, అవన్నీ ఇప్పుడు నా వద్ద పొందేవాడివి’ అంటాడు.

సాధారణంగా ఎవరైనా బిచ్చగాళ్లు ఇంటి ముందుకొచ్చి అర్థిస్తే ఆ ఇంటివారి నుండి నిర్లక్ష్యమైన సమాధానం వస్తుంది. చాలా కొద్దిమంది మాత్రమే సకారాత్మకంగా స్పందిస్తారు. అన్ని అవయవాలూ సలక్షణంగా, ఆరోగ్యంగా ఉండి, యాచననే వృత్తిగా స్వీకరించిన వారిని పక్కనపెడితే, సమాజంలో అనునిత్యం ఎంతోమంది అభాగ్యులు, అన్నార్తులు, పూట గడవని పేదసాదలు, ఏ పనీ చేసుకోలేని నిస్సహాయులు మనకు తారసపడుతూంటారు. అలాంటి నిస్సహాయుల్ని ఆదుకోవాలని, వారి ఆకలిబాధను తీర్చడం, వారికి వస్త్రాలు సమకూర్చడం, నివాస సదుపాయం కల్పించడం కనీస మానవధర్మమని, దీన్ని పట్టించుకోనివారు ప్రళయదినంనాడు పరాభవం ఎదుర్కోవలసి ఉంటుందని మానవ మహోపకారి ముహమ్మద్ ప్రవక్త పేర్కొన్న ప్రవచనంలో స్పష్టంగా వివరించారు.

క్షుద్బాధను తీర్చడం, దాహార్తులకు నీళ్లు తాగించడం, ఒళ్లు కప్పుకోవడానికి వస్త్రాలు సమకూర్చడం ఎంతో గొప్ప పుణ్యకార్యం. దీనివల్ల దైవం సంతోషిస్తాడు, దైవ సామీప్యం ప్రాప్తిస్తుంది. దీనికి భిన్నంగా పౌరుల ఆకలిబాధలను పట్టించుకోకపోవడం, పేదసాదలను విస్మరించి డాంబిక జీవితం గడపడం, పాపకార్యాలు… వంటివి దైవాగ్రహానికి కారణాలవుతాయని తెలుసుకోవాలి. అందుకే ప్రవక్త మహనీయులు… అర్థించిన వారికి ఏదో ఒకటి (ఉన్నదాంట్లోనే) ఇచ్చి పంపించండి, ఉత్తి చేతులతో పంపకండి… అని చెప్పారు. ఆకలిగొన్నవాడికి కడుపునిండా అన్నం పెట్టడం అన్నిటి కన్నా శ్రేష్ఠమైన దానం అని కూడా ఆయన సెలవిచ్చారు. కనుక నిజమైన పేదసాదలను గుర్తించి వారిని ఆదుకొనే ప్రయత్నం చేయడం సమాజంలోని స్థితిపరుల తక్షణ కర్తవ్యం. దైవం అందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక!

 

Related Post