భోజనం చేస్తూ సలాంకు జవాబివ్వటం

అన్నం ముద్ద ఉన్నప్పుడు మాట్లాడటం వల్ల ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశ్యంతో అలా చెప్పి ఉంటారు. ఒకవేళ ఆ  క్షణంలో ఎవరయినా సలాం చేస్తే తక్షణం జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు.

అన్నం ముద్ద ఉన్నప్పుడు మాట్లాడటం వల్ల ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశ్యంతో అలా చెప్పి ఉంటారు. ఒకవేళ ఆ క్షణంలో ఎవరయినా సలాం చేస్తే తక్షణం జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు.

మౌలానా సిఫాత్ ఆలం మదనీ

 

ప్రశ్న: భోంచేస్తూ మధ్యలో సలాం చేయవచ్చా? ఆసమయంలో ఎవరైనా సలాం చేస్తే, దానికి జవాబు ఇవ్వచ్చా?

(సయ్యిద్‌ ఇన్తెజార్‌ – కువైట్‌)
జవాబు: సలాం చేయవచ్చు. సలాంకు జవాబు ఇవ్వవచ్చు. ఇందులో ‘వారింపు’ ఏదీ లేదు. ”అన్నం తినేటప్పుడు మాటామంతీ-సలాం జవాబు తగదు” అనేది సర్వత్రా ప్రసిద్ధి చెందిన సంగతి నిజమే. కాని ఆ మేరకు హదీసుగానీ, ప్రామాణిక ఆధారంగానీ ఏదీ లేదు. మహా ప్రవక్త (స) భోజన సమయంలో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. ఒకసారి ఆయన (స) సమక్షంలో మాంసం ఒడ్డించబడింది. దాన్ని ఆయన తింటూ ”నేను ప్రళయ దినాన జనులకు నేతృత్వం వహిస్తాను” అన్నారు. ఆ తరువాత ఆయన (స) ‘సిఫారసు’కు సంబంధించిన సుదీర్ఘమైన హదీసు కూడా వినిపించారు. (బుఖారీ, ముస్లిం)
కొంత మంది ధర్మవేత్తలు భోజన సమయంలో సలాం చేయటాన్ని వారించారంటే, నోటిలో అన్నం ముద్ద ఉన్నప్పుడు మాట్లాడటం వల్ల ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశ్యంతో అలా చెప్పి ఉంటారు. ఒకవేళ ఆ క్షణంలో ఎవరయినా సలాం చేస్తే తక్షణం జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు.

ఇస్లాం స్వీకరణకు ఖత్నా చేసుకోవడం అవశ్యమా?

ప్రశ్న: ఇస్లాం ధర్మంలోనికి రావాలంటే ఖత్నా (సున్నతి) చేసుకోవటం తప్పనిసరా? ఇంతకీ ఖత్నా (సుంతీ) వల్ల కలిగే లాభం ఏమిటి?

(జహాంగీర్‌ ఆలమ్‌ – కువైట్‌)
జవాబు: తప్పనిసరి ఏమీ కాదు. ఎవరయినా ఒక వ్యక్తి మనస్పూర్తిగా ఇస్లాం ధర్మం గ్రహించడానికి ముందుకు వస్తే, అతని చేత సాక్ష్య వచనం (కలిమయె షహాదత్‌) పలికిస్తే సరిపోతుంది. ఇస్లాం స్వీకారానికి – ఖత్నా (సుంతీ) చేయించుకోవటానికి మధ్య అవినాభావ సంబంధం ఏమీ లేదు. ఎవరైనా చేయించుకుంటే మంచిదే. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఖత్నా చేయించుకోకపోయినంత మాత్రాన అతను పాటించే నమాజులోగానీ. వేరితర సత్క్రియల్లోగానీ ఎలాంటి దోషం ఏర్పడదు.
ఇస్లాం ఒక ప్రకృతి ధర్మం. ఖత్నా (సుంతీ) చేయించుకోవటం ప్రాకృతిక సత్సంప్రదాయం (సున్నత్‌). కాబట్టి తన అనుయాయులకు ఖత్నా చేయించుకోమని ఇస్లాం తాకీదు చేసిన సంగతి నిజమేగాని అవశ్యంగా ఖరారు చేయలేదు.
ఆరోగ్య రీత్యా కూడా ఖత్నా చేయించుకోవడం మంచిది. ఖత్నా చేయించుకున్న వారు సుఖ వ్యాధుల నుండి, ఎయిడ్స్‌, కేన్సర్‌ వంటి ప్రాణాంతక రోగాల నుండి చాలావరకు సురక్షితంగా ఉండగలరని పరిశోధనల్లో తేలింది.

నిద్రించే సమయంలో శ్రీమతిని తలచుకోవటం

ప్రశ్న: ఒక వ్యక్తి నిద్రకు ఉపక్రమిస్తూ, భార్యను గురించి ఆలోచించుకోవటంలో, భావ ప్రాప్తికై భార్యను ఆశించటంలో తప్పేమన్నా ఉందా? (ముహమ్మద్‌ అలీ – కువైట్‌)
జవాబు: తప్పు లేదు. అలా చేయటం సమ్మతమే. నిద్రపోయే టప్పుడైనా, వేరితర సమయాల్లోనయినా అర్ధాంగిని గురించి ఆలోచించుకోవటం ఆక్షేపణీయం కాదు. ఆక్షేపణీయమల్లా పరాయి స్త్రీని తలచుకుని భావప్రాప్తి పొందటమే. కడకు శ్రీమతికి ఏకాంతంలో ఫోన్‌ చేసి సరస సల్లాపాలు జరపవచ్చని కూడా విద్వాంసులు అభిప్రాయపడ్డారు. కాకపోతే ఆ విధంగా ముచ్చటించిన తరువాత ఆ దంపతులు తమ తమ స్థానాల్లో కామోద్రేకంతో ఎలాంటి అక్రమ చేెష్టకు ఒడిగట్టకుండా, నిగ్రహంతో వ్యవహరించాలన్నది షరతు.

రెండో పెళ్ళికి అర్ధాంగి అనుమతి

ప్రశ్న: రెండో పెళ్ళి చేసుకోవటానికి మొదటి భార్య అనుమతి పొందటం అవసరమా? (సలీం పర్వేజ్‌ – కువైట్‌)

జవాబు: రెండో పెళ్ళి చేసుకోదలచిన వ్యక్తి తన మొదటి భార్య అనుమతిని పొందవలసిన అవసరమైతే లేదు. ఇక్కడ చూడవలసిన అతి ముఖ్యమైన విషయం పురుషుడు మరో పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాడన్నదే. ఒకవేళ అతను గనక రెండో పెళ్ళికి ఆర్హుడై ఉండి, ఇద్దరు భార్యల మధ్య ‘న్యాయం’ చేయగల శక్తీస్థోమతలు కలిగి ఉంటే సరి – ఒకవేళ ఈ రెండో పెళ్ళికి మొదటి భార్య అంగీకరించకపోయినా సరే. కాని భార్యల మధ్య న్యాయం చేయలేనన్న అనుమానం ఉంటే మాత్రం ఒక్కావిడతో సరిపెట్టుకోవడమే సమంజసం. ”ఒకవేళ న్యాయం చేయలేమన్న భయం మీకుంటే ఒకామెతోనే సరిపెట్టుకోండి”. (అన్నిసా: 3)

అయితే భార్యకు దూరంగా – విదేశాల్లో ఉంటున్న భర్త మాత్రం రెండో పెళ్ళి చేసుకోదలచుకుంటే తప్పకుండా మొదటి భార్యను సంప్రతించి, ఆమె అంగీకారం పొందటం మంచిది. అన్యధా ఆ కాపురంలో కలతలు రేగి అన్యోన్నత దెబ్బ తింటుంది.

Related Post