New Muslims APP

నా అన్వేషణ ఫలించింది

నా అన్వేషణ ఫలించింది

అబ్దుర్రహ్మాన్
”అస్సలాము అలైకుమ్‌ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు”
నా పేరు అబ్దుర్రహ్మాన్‌. పూర్వాశ్రమంలో హిందువులైన నా తల్లి దండ్రులు నా బాల్యంలో క్రైస్తవ మతాన్ని ఆశ్రయించారు. నేను నా తల్లిదండ్రులను అనుసరించి వారి బాటలోనే సాగిపోయాను. 18 సంవత్సరాల వయస్సులో బైబిల్‌ చదవాలి, అవగాహన చేసుకోవాలన్న ఉత్సుకత నాలో మొదలయింది. నేను బైబిల్‌ను కొద్దిగా చదవడం, అర్థం చేసుకోవడం ప్రారం భించాను. యెహోవా ఒక్కడే దేవుడని, ఏసుక్రీస్తు దేవుని కుమారుడని , ఏసుక్రీస్తు ద్వారానే స్వర్గం సాధ్యమని, ఏసే సత్యం, ఏసే మార్గం, ఏసే స్వర్గం అని నమ్మి బాప్తిస్మం కూడా తీసుకున్నాను. అప్పుడు నాతో ఒక ప్రమాణం చేయించారు కూడా. అదేమంటే- యెహోవాయే నిజ దైవం అని, ఏసు క్రీస్తు దేవుని కుమారుడని, ఏసు క్రీస్తు పాప విమోచకుడని, ఏసే రక్షకుడని, విగ్రహారాధన చేయకూడదని, కనిపించే ప్రతిమల్ని మొక్కకూడదని.

మా ఊరిలో హిందువులు, క్రైస్తవులు తప్ప ముస్లింలు లేరు. ఇక హిందువుల ఆరాధ్య దేవుళ్ల గురించి – వారు ముక్కోటి మందని అంటారు. కాని ఈ సిద్ధాంతం నాకు మింగుడు పడలేదు. విశ్వాన్ని, విశ్వంలో జీవకోటిని సృజించిన సృష్టికర్త ఒక్కడే అని, ఆయన యెహోవాయేనన్నది నా నమ్మకం. అప్పట్లో నాకు ముస్లింల గురించి అంతగా తెలియదు. ఒకట్రెండుసార్లు దర్గాలు, జెండా చెట్ల చుట్టూ తిరుగుతూ హైదరాబాదుకెళ్ళి నప్పుడు చూశాను గనక, ముస్లింలంటే (నవూజుబిల్లాహ్‌– — అల్లాహ్‌ నన్ను క్షమించుగాక!) దర్గాలను, జెండా చెట్టులను పూజించేవాళ్ళేమో అన్న అభిప్రాయం నాకుండేది.

అలా సాగిపోయే నా జీవితంలో కువైట్‌ రాక ఓ కొత్త మలుపుకి నాంది పలుకుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. చివరికి నేను కువైట్‌కి వచ్చాను. భారత దేశంలో మస్జిద్‌ ఎలా ఉంటుందో కూడా ఎరుగని నేను కువైట్‌లో ఎటు చూసినా మస్జిదులే ఉండటం చూసి కాస్తంత విస్తుబోయాను. అప్పుడే నాకు తెలిసింది. ముస్లింలంటే – ఒకే నిజ దైవాన్ని ఆరాధించేవాళ్ళని, 5 పూటలా నమాజు క్రమం తప్పకుండా చేసేవాళ్ళని, దర్గాలు జెండా మాను, పీర్ల పండగల్లాంటివి అసలు ఇస్లాంలోనే లేదన్న వాస్తవం అప్పుడే నాకు తెలిసింది. అయినా నాలో మార్పు మాత్రం రాలేదు. ఆ తర్వాత కొన్ని మాసాల తర్వాత నాకు కొందరు ముస్లిం స్నేహితులు పరిచయ మయ్యారు. అలా పరిచయం అయిన వారిలో కొందరికి అటు క్రైస్తవం, హైందవం, ఇటు ఇస్లాం గురించి కొద్దోగొప్పో అవగాహన ఉన్నవారు కూడా ఉండటం నా అదృష్టంగానే భావిస్తాను. ముస్లింలకు ఏసుక్రీస్తు గురించి బొత్తిగా తెలియదేమో అనుకున్న నాకు, ఖుర్‌ఆన్‌ గ్రంథంలో ఆయన గురించిన ప్రస్తావన ఉందని తెలుసుకొని ఆశ్చర్యమేసింది. ముస్లింలు ఏసు క్రీస్తుని – ఈసా మసీహ్‌గా పిలుస్తారని, ఆయన కేవలం ఇతర ప్రవక్తల్లాంటి దైవప్రవక్త తప్ప మరేమీ కాడని మరో ముస్లిం స్నేహితుడు చెప్పినప్పుడు సంతోషంతోపాటు ఒకింత కోపం కూడా కలిగింది. ముహమ్మద్‌ ప్రవక్త (స) ప్రస్తావన బైబిల్‌లో ఉందని చెప్పినప్పుడు మరింత చిరాకు కూడా వేసింది.

ఆ క్షణం నుండి, ఇస్లాం గురించి తెలుసుకోవాలని, ఇస్లాం ఆదం నుండి మొదలు ఏసుక్రీస్తు వరకు వచ్చిన ప్రవక్తల గురించి ఏమంటుందో తెలుసుకోవాలని, ఈ ముహమ్మద్‌ ఎవరు? ఇస్లాం మూలాలేమిటో తెలుసుకోవాలన్న ఆరాటం మొదలయింది. ఆ తర్వాత ఎప్పటికో చాలా రోజులకుగానీ తత్సంబంధిత సమాచారాన్ని అందించే పుస్తకాలు లభించలేదు. చివరికి నా శ్రమ షేఖ్‌ ఖాదర్‌ బాషా అనే స్నేహితుడి రూపంలో ఫలించింది. (ఇంకా ఉంది)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.