ప్రముఖ హదీసువేత్తలు

హదీసువేత్తలు

మౌలానా సఫీయుర్రహ్మన్ ముబారక్పూరీ

 

1.ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ (రహ్మలై)

ధార్మిక జగత్తులో పీష్వాలుగా, మార్గదర్శకులుగా పరిగణింబడే నలుగురు ఇమాములో ఈయన ఒకరు. ఈయన అసలు పేరు అబూ అబ్దుల్లాహ్  అహ్మద్‌ బిన్‌ ముహమ్మద్‌ బిన్‌ హంబల్‌ షైబానీ. హిజ్రీ 174వ సంవత్సరం రబీవుల్‌ అవ్వల్‌ నెలలో జన్మించారు. హిజ్రీ 241, రబీవుల్‌ అవ్వల్‌ నెల 12వ తేదీ శుక్రవారం నాడు బాగ్దాద్‌లో కాలధర్మం చెందారు. ధర్మమార్గంలో కఠినాతికఠినమైన పరీక్షల్ని ఎదుర్కొని, కదలని కొండలా స్థయిర్యాన్ని ప్రదర్శించిన గొప్ప విద్వాంసులు. ఈయనకు 10లక్షల హదీసులు కంఠస్థం అయి ఉండేవి. ఈయన మరణించిన రోజున 20వేల మంది క్రైస్తవులు, యూదులు, పారసీకులు ధర్మపరివర్తన చెంది ఇస్లాం పరిధిలోకి వచ్చారని అనబడుతోంది.

2. ఇమామ్‌ ముహమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్‌ బుఖారీ (రహ్మలై)

హదీసు విద్యలో ఈయన హదీసువేత్తలందరికీ ఇమామ్‌గా పరిగణించబడతారు. పూర్తి పేరు అబూ అబ్దుల్లాహ్  ముహమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్‌ బిన్‌ ఇబ్రాహీమ్‌ బిన్‌ ముగీరా బిన్‌ బర్దిజ్బాహ్  జూఫీ బుఖారీ. ప్రస్తుత ఉజ్బెకిస్తాన్‌లోని బుఖారాలో హిజ్రీ 194వ సంవత్సరం షవ్వాల్‌ మాసంలో జన్మించారు.

హదీసుల సంకలనం కోసం ప్రపంచంలో విస్తృతంగా పర్యటించారు. హదీసు విద్యకు సంబంధించినంత వరకు ఈయన ‘దేవుని చిహ్నం’గా భావించబడేవారు. ఆయన సంకలనం చేసిన హదీసు గ్రంథం ”అల్‌ జామె అస్సహీహ్ ” దివ్య ఖుర్‌ఆన్‌ తరువాత ఇస్లాం జగత్తులో అత్యంత ప్రామాణికమైన గ్రంథంగా పరిగణించబడుతోంది. ఈయన హిజ్రీ 256వ సంవత్సరం ఈదుల్‌ ఫిత్ర్‌ రాత్రి సమర్‌ఖండ్‌లో తనువు చాలించారు.

3.ఇమామ్‌ ముస్లిం బిన్‌ హజ్జాజ్‌ (రహ్మలై)

ఈయన ప్రఖ్యాత హదీసు ఇమాములలో ఒకరు. పూర్తిపేరు ముస్లిం బిన్‌ హజ్జాజ్‌ ఖుషైరీ నీసాపూరీ. ఈయన హిజ్రీ శకం 204లో మష్‌హద్‌ నగరానికి సమీపంలో వున్న నీసాపూర్‌ పట్టణంలో జన్మించారు. ప్రస్తుతం ఈ స్థలం ఈరాన్‌లో ఉంది. ఈయన సంకలనం చేసిన ‘సహీహ్‌ా ముస్లిం’ గ్రంథం ప్రపంచంలో ‘సహీహ్  బుఖారీ’ తరువాత రెండో ప్రామాణిక హదీసుల సంకలనంగా పరిగణించబడుతు న్నది. ఈయన ఇమామ్‌ బుఖారీతో సహా అనేకమంది అగ్ర ఇమాముల ద్వారా హదీసులు విన్నారు. హదీసు విద్యార్జన కోసం ఇరాఖ్‌, హిజాజ్‌ ప్రాంతాలలో పర్యటించారు. హిజ్రీ 271లో మరణించారు.

 

4. ఇమామ్‌ అబూదావూద్‌ సులైమాన్‌ బిన్‌ అష్‌అస్‌ (రహ్మలై)

ఎన్నదగ్గ హదీసువేత్తలలో ఈయన కూడా ఒకరు. పూర్తి పేరు అబూదావూద్‌ సులైమాన్‌ బిన్‌ ఇస్‌హాఖ్‌ అజ్‌దీ సజిస్తానీ. ‘సుననె అబూదావూద్‌’ ఈయన విరచితమే. ఈయన హిజ్రీ 276 షవ్వాల్‌ నెల 15వ తేదీ శుక్రవారం నాడు తన నిజప్రభువు వద్దకు చేరుకు న్నారు. హదీసు విద్యలో సాటిలేని మేటి. ఈ విద్య ఆయనకు కొట్టిన పిండి అనీ, హజ్రత్‌ దావూద్‌ అలైహిస్సలాం ముందు ఉక్కు ఎలా మెత్తబడిపోయిందో అలాగే హజ్రత్‌ అబూదావూద్‌ ముందు హదీసు విద్య సులువై పోయిందని మేధావులు కొనియాడారు. మహాప్రవక్త (స) వారి ఐదు లక్షల ప్రవచనాలను తాను లిఖించా ననీ, తాను వ్రాసిన సునన్‌ గ్రంథంలోని హదీసులు ఆ ఐదు లక్షల హదీసుల్లో కొన్ని మాత్రమేనని ఆయన అంటుండేవారు.

5. ఇమామ్‌ అబూ ఈసా ముహమ్మద్‌ బిన్‌ ఈసా తిర్మిజీ (రహ్మలై)

ఇమామ్‌ బుఖారీ (ర) గారి శిక్షణలో పోత పోయబడిన ప్రియ శిష్యులలో ఇమామ్‌ తిర్మిజీ ఒకరు. ఉజ్బెకిస్తాన్‌లోని తిర్మిజ్‌  అనే పట్టణంలో హిజ్రీ 209లో జన్మించారు. ‘జామె తిర్మిజీ’ అనే గ్రం థాన్ని సంకలనం చేశారు. ఇందులో సుమారు 4 వేల హదీసులు న్నాయి. తన గురువర్యులైన ఇమామ్‌ బుఖారీ (ర) మరణంపై ఈయన అమితంగా దుఖించారు. ఆ దుఖంలోనే ఆయన కంటి చూపు పూర్తిగా పోయింది. చాలా కాలం పాటు అంధులుగానే ఉండి, హిజ్రీ 279లో తన నిజ నేస్తాన్ని చేరుకున్నారు.

6. ఇమామ్‌ అబూ అబ్దుర్రహ్మాన్‌ అహ్మద్‌ బిన్‌ షుఐబ్‌ నసాయి (రహ్మలై)

ఖురాసాన్‌లోని ‘నసా’ పట్టణంలో హి.శ. 215లో ఇమామ్‌ నసాయి పుట్టారు. హదీసు విద్యలో నిష్ణాతులు. హదీసులను కంఠ స్థం చేసుకోవటంలో దిట్ట. అందుకే హాఫిజె హదీస్‌గా పిలువ బడ్డారు. సహీహ్  బుఖారీ, సహీహ్  ముస్లిం గ్రంథాల తరువాత చాలా తక్కువ బలహీన (జయీఫ్‌) ఉల్లేఖనాలు గల హదీసు సంక లనాల్లో ఇమామ్‌ నసాయి గారి ‘సునన్‌’ ఒకటి. ఈయన ఈజిప్టు లో కొంత కాలం స్థిరపడిన తరువాత డెమాస్కస్‌కు ప్రస్థానం చేశారు. అక్కడి నుంచే ”అల్‌ ఖసాయిస్‌ ఫీ ఫజ్లె అలీ -రజి” అనే రచన చేశారు. దీనిపై తీవ్ర విమర్శల వెల్లువ పెల్లుబికింది. విమర్శ కులు ఆయనపై విరుచుకుపడ్డారు. అనంతరం ఆయన మక్కా నగ రానికి చేరుకున్నారు. మక్కాలోనే హి.శ. 303లో తనువు చాలిం చారు.

7. ఇమామ్‌ ముహమ్మద్‌ బిన్‌ యజీద్‌ బిన్‌ మాజా (రహ్మలై)

ఇబ్నె మాజాగా సుప్రసిద్ధులు. హి.శ. 207లో ఖజ్వీనీలో జన్మించారు. ఈయన సునన్‌ అను గ్రంథాన్ని రచించారు. ఈయన ఇమామ్‌ మాలిక్‌ సహవాసుల నుండి హదీసులను విన్నారు. ఇమామ్‌ మాలిక్‌ శిష్యునిగా అధ్యయనం చేశారు. ఈయన ద్వారా భారీ సంఖ్యలో జనులు హదీసులను ఉటంకించారు. ఈయన హదీసులలో బలహీన (జయీఫ్‌) ఉల్లేఖనాలు అనేకం ఉన్నాయి. ఇమామ్‌ ఇబ్నె మాజా హి.శ. 273 రమజాన్‌ నెలలో మరణించారు.

Related Post