హృదయ విజేత ప్రవక్త ముహమ్మద్ (స)

ముహమ్మద్ (స) మహనీయులు మానవాళి ఇహపరసాఫల్యం కోసం అహర్నిశలు శ్రమించిన గొప్ప దైవప్రవక్త. ప్రజలను దుర్మార్గాల నుండి కాపాడి, సన్మార్గపథంపై, నిజధర్మంపైన నడిపించడానికి అలుపెరగని ప్రయత్నం చేశారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ, వారికి వీలైనన్ని సేవలందించేవారు.

ముహమ్మద్ (స) మహనీయులు మానవాళి ఇహపరసాఫల్యం కోసం అహర్నిశలు శ్రమించిన గొప్ప దైవప్రవక్త. ప్రజలను దుర్మార్గాల నుండి కాపాడి, సన్మార్గపథంపై, నిజధర్మంపైన నడిపించడానికి అలుపెరగని ప్రయత్నం చేశారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ, వారికి వీలైనన్ని సేవలందించేవారు.

ముహమ్మద్ (స) మహనీయులు మానవాళి ఇహపరసాఫల్యం కోసం అహర్నిశలు శ్రమించిన గొప్ప దైవప్రవక్త. ప్రజలను దుర్మార్గాల నుండి కాపాడి, సన్మార్గపథంపై, నిజధర్మంపైన నడిపించడానికి అలుపెరగని ప్రయత్నం చేశారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ, వారికి వీలైనన్ని సేవలందించేవారు. ఆ మహనీయుడు తన కర్తవ్య నిర్వహణలో ఏనాడూ ఎలాంటి లోటూ రానివ్వలేదు. ప్రజలతో ఆయన ఎంతో ప్రేమానురాగాలతో, జాలి కరుణలతో, స్నేహ సౌహార్ద్రతలతో వ్యవహరించేవారు. అవసరార్థులకు, ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించేవారు. ఆ మహనీయుని కారుణ్యగుణాన్ని, సుగుణ సంపన్నతను తెలిపే ఓ సంఘటన చూద్దాం.

ముహమ్మద్ ప్రవక్త (స) బోధనల వల్ల మక్కాలో చాలామంది ఆయనకు శిష్యులుగా మారిపోతున్నారు. ఈ విషయం ఓ వృద్ధురాలికి తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఆయన మాటలు వినకూడదని, ఒకవేళ ఆ బోధనలు వింటే ఎక్కడ ఆ ప్రభావానికి లోనవుతానోనని ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లపాటు ఊరు విడిచి వెళ్లిపోవాలని తీర్మానించుకుంది. మూటాముల్లె సర్దుకుని బయలుదేరింది. మూట చాలా బరువుగా ఉండడంతో వచ్చే పోయే వారిని సహాయం కోసం పిలుస్తోంది. కాని ఎవరి దారిన వారు వెళుతున్నారే తప్ప ఆ వృద్ధురాలికి సాయంగా ఒక్కరూ ముందుకు రావడం లేదు. అంతలో ఓ వ్యక్తి అటుగా వెళుతున్నాడు. వృద్ధురాలు అతణ్ణి కూడా పిలిచింది. వృద్ధురాలి పిలుపుకు వెంటనే స్పందించిన ఆ వ్యక్తి, ఆమెను సమీపించి క్షేమసమాచారం విచారించాడు. ఆప్యాయంగా పలకరించాడు. ఇంత బరువు ఎలా మోస్తావమ్మా!

అంటూ స్వయంగా తానే భుజాలపెకైత్తుకున్నాడు. ఆమె కోరిన చోటుకు చేర్చాడు. ‘బాబూ! దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఏ తల్లి కన్న బిడ్డవోకానీ ముక్కుముఖం తెలీని నాలాంటి వృద్ధురాలికి ఇంత పెద్దసాయం చేశావు. చాలాసేపటినుండి ఒంటికాలిపై నిలబడి ఎంతోమందిని సాయంకోసం అర్థించాను. ఒక్కరూ నా మాట వినిపించుకోలేదు. కాని నువ్వుమాత్రం ఇంత పెద్ద బరువులు మోయడమే కాకుండా నా క్షేమం పట్ల ఎంతో శ్రద్ధ కనబరిచావు. నీలాంటివాళ్లు పదికాలాలపాటు చల్లగా వర్థిల్లాలి నాయనా’’అంటూ అటూ ఇటూ చూసి అతని మేలుకోరి ఏదో రహస్యం చెబుతున్నట్లుగా, ‘‘బాబూ! నేను చెప్పేమాట జాగ్రత్తగా విను. ఇంత మంచివాడివి, కలకాలం సుఖంగా ఉండాలి. అందుకే చెబుతున్నాను. ఇక్కడ ఎవరో ‘ముహమ్మద్’ అట. ఏవేవో కొత్త కొత్త విషయాలు చెబుతున్నాడట. అతని మాటల్లో ఏం మాయ ఉందోగాని, విన్నవాళ్లు విన్నట్లుగానే అతని వలలో పడుతున్నారట. జాగ్రత్త నాయనా! అతని మాయలో పడకు. నిజానికి నేను ఈ ఊరొదిలి వెళ్లిపోతున్నది కూడా అందుకే’’ అని హితబోధ చేసింది.

ఆమె చెప్పినదంతా ఎంతో శ్రద్ధగా విన్న ఆ వ్యక్తి ‘సరేనమ్మా’ అంటూ ఎంతో వినయపూర్వకంగా, ప్రేమతో అవ్వకు అభివాదం చేసి సెలవు తీసుకున్నాడు. అతను చూపిన అభిమానానికి, మంచితనానికి, అంతటి వినయపూర్వక వీడ్కోలుకు కరిగిపోయిన ఆ వృద్ధురాలు ఆ వ్యక్తి వెనుదిరుగుతుంటే ఒక్కసారిగా భావోద్వేగానికిలోనై, ‘బాబూ..! అని ఆప్యాయంగా పిలిచింది. ఆ వ్యక్తి వృద్ధురాలి పిలుపుతో ‘అమ్మా!’ అంటూ ఆమెను సమీపించాడు. వృద్ధురాలు ‘‘బాబూ! నీ పేరేమిటి నాయనా?’’అంటూ ప్రశ్నించింది. కాని ఆ వ్యక్తి తలదించుకుని మౌనం వహించాడు. ‘కనీసం నీ పేరయినా చెప్పు నాయనా. కలకాలం గుర్తుంచుకుంటాను’’ అంటూ అభ్యర్థించింది.

‘‘అమ్మా! ఏమని చెప్పను? నా పేరు ‘ముహమ్మద్’ అని నీకెలా చెప్పను? ఏ ముహమ్మద్‌కు భయపడి నువ్వు దూరంగా వెళ్లిపోతున్నావో, ఏ ముహమ్మద్ మాటలు కూడా వినకూడదని నువ్వు నిర్ణయించుకున్నావో ఆ ముహమ్మద్‌ను నేనేనమ్మా! నన్ను మన్నించు’’అన్నాడు ఆ వ్యక్తి. దీంతో ఒక్కసారిగా ఆ వృద్ధురాలు అవాక్కయిపోయింది. ఏమిటి? నేను చూస్తున్నది ముహమ్మద్‌నా? నేను వింటున్నది ఈ ముహమ్మద్ మాటలా? ఏ ముహమ్మద్ మాటలు వినడకూ దని, ఏ ముహమ్మద్ ముఖం కూడా చూడకూడదనుకుని పుట్టి పెరిగిన ఊరినే వదులుకున్నానో, ఆ ముహమ్మద్ ఇంత మంచివాడా? మానవత్వం మూర్తీభవించిన ఈ ప్రేమమూర్తికి దూరంగా పోవాలనుకున్నానా?

నాది ఎంతటి అజ్ఞానం? ఎంతటి మూర్ఖత్వం? కళ్లనుండి ఆనందబాష్పాలు రాలుతుండగా, ‘‘బాబూ ముహమ్మద్! (స) నేనెక్కడికీ వెళ్లను. నిజానిజాలు తెలుసుకోకుండా చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. అపోహలకు లోనై, అనవసర ద్వేషాన్ని పెంచుకున్నాను. ఇప్పటినుంచి ఇక నీ మాటలే వింటాను’’ అంటూ ముహమ్మద్ ప్రవక్త(స)కు ప్రియశిష్యురాలిగా మారిపోయింది.

ఇదీ ప్రవక్త మహనీయుని ఆచరణావిధానం. ఆయన సుగుణ సంపదలో ఎంతో కొంత భాగం మనం కూడా ఆచరణలో పెట్టగలిగితే సమాజంలో తప్పకుండా మంచి, మానవత్వం పరిమళిస్తుంది.

Related Post