సన్మార్గ భాగ్యం

'శ్రద్ధ' ఒక మనఃస్థితి. కార్యతత్పరత, వినయం, గౌరవం. ఏ సంశ యాల చేత విచలితం కాని దృఢ విశ్వాసమే శ్రద్ధ. సమున్నత లక్ష్య సాధనలో చేసే ప్రయత్నాలన్నింటికీ శ్రద్ధయే ఆధారం. ప్రగాఢ విశ్వా సానికీ, నిరంతర ఆకాంక్షకు ప్రతీక శ్రద్ధ. మనసులో శ్రద్ధ సత్య తత్పర తగా రూపొందితే అనితర సాధ్యమయిన విజయం తథ్యం.

‘శ్రద్ధ’ ఒక మనఃస్థితి. కార్యతత్పరత, వినయం, గౌరవం. ఏ సంశ యాల చేత విచలితం కాని దృఢ విశ్వాసమే శ్రద్ధ. సమున్నత లక్ష్య సాధనలో చేసే ప్రయత్నాలన్నింటికీ శ్రద్ధయే ఆధారం. ప్రగాఢ విశ్వా సానికీ, నిరంతర ఆకాంక్షకు ప్రతీక శ్రద్ధ. మనసులో శ్రద్ధ సత్య తత్పర తగా రూపొందితే అనితర సాధ్యమయిన విజయం తథ్యం.

సన్మార్గ భాగ్యం నేటి మనందరి అవసరం. కూడు, గూడు, గుడ్డకన్నా దీని ఆవశ్యకత అధికం. ఎందుకంటే సన్మార్గరహిత జీవితం నిస్తేజం, నిర్వీర్యం, నిర్జీవం. సత్యార్తి రగలని ఆంతర్యం దీపం లేని గృహం. సత్యాన్వేషణ లేని హృదయం జీవం లేని కళేబరం. సత్యానికి స్పందిం చని గుండె చలనం లేని పాషాణం. సత్యానికి పరితపించని మనస్సు కొడిగట్టిన దీపం. 

సన్మార్గాన్ని అరబీలో హిదాయత్‌ అని, మార్గదర్శకత్వాన్ని హుదా అని అంటారు. హుదా, యహ్దీ, ముహ్తదీ, హాదీ అన్న పదాలతో ఖుర్‌ఆన్‌లో పలు చోట్ల ప్రస్తావించబడింది. సృష్టికర్త అయిన అల్లాహ్‌ తన సృష్టికి చేసిన మార్గదర్శకత్వాన్ని మనం నాలుగు విధాలుగా పేర్కొ నవచ్చు. 1) ప్రకృతిసిద్ధ మార్గదర్శకత్వం. 2) ఆధ్యాత్మిక మార్గ దర్శక త్వం. 3) అన్వేషకొద్దీ మార్గదర్శకత్వం. 4) పరలోక మార్గదర్శకత్వం.

1) ప్రకృతిసిద్ధ మార్గదర్శకత్వం:

‘ఇంతకీ మీరిద్దరి ప్రభువు ఎవరయ్యా?’ అని ప్రవక్త మూసా (అ) వారిని నియంత ఫిర్‌ఔన్‌ అడిగినప్పుడు – ”ప్రతి వస్తువుకూ దాని ప్రత్యేక రూపును ఇచ్చి తర్వాత దానికి మార్గాన్ని చూపినవాడే మా ప్రభువు” అని ప్రవక్త మూసా (అ) సమాధానమిచ్చారు. (తాహా: 95)
అంటే, మనిషికి శోభనిచ్చే రూపును మనిషికి, పశువులకు తగిన ఆకారాన్ని పశువులకు, పక్షులకు సరిపోయే ఆకృతిని పక్షులకు – విశ్వంలోని వస్తువులన్నింటికీ వాటికి అతికనట్లు సరిపోయే రూపురేఖ లను ప్రసాదించాడు అల్లాహ్‌ా. అంతే కాదు; వాటికి కావాల్సిన మార్గ నిర్దేశనం కూడా చేశాడు. ప్రతి ప్రాణికీ దాని స్వభావ స్వరూపాల రీత్యా బ్రతకడానికి ఏమేమి కావాలో అన్నీ సమకూర్చి పెట్డాడు పరమ దయాళువు అయిన అల్లాహ్‌ా. వాటన్నింటికి బ్రతుకు తెరువును నేర్పిం చాడు. వాటి మనుగడకు అవసరమయిన వాటిన్నింటినీ సమకూర్చు కునే తెలివీతేటలను ఇచ్చాడు. వాటి ప్రకారమే ఆ ప్రాణులు తమ జీవన పథాన్ని నిర్ణయించుకుంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ”ఆయన ఏ వస్తువును చేసినా చాలా చక్కగా, ఉన్నతంగా చేశాడు”.
అవును, అల్లాహ్‌ా సృష్టించిన ప్రతి వస్తువు ఏదోక ఆశయంతో, ఏదోక పరమార్థంతో సృష్టించినదై ఉంటుంది. ప్రకృతి సిద్ధ మార్గదర్శకత్వాన్ని తెలియజేసే రెండు ఉపమానాలను తెలుసుకుందాం!
”నీ ప్రభువు తేనెటీగకు ఈ సంకేతమిచ్చాడు: ‘కొండల్లో, చెట్టల్లో, ప్రజలు కట్టుకున్న ఎత్తయిన కోటల్లో, పందిళ్ళలో నీ ఇండ్లను (తెట్టెల ను) నిర్మించుకో”. (నహ్ల్‌: 68)
ఆ తర్వాత వాటి అవసరాలను తీర్చుకోవడానికి సయితం మార్గదర్శ కత్వం వహిస్తూ ఇలా అన్నాడు: ”అన్ని రకాల పండ్లను తిను, నీ ప్రభువు సులభతరం చేసిన మార్గాలలో విహరిస్తూ ఉండు”. (నహ్ల్‌: 69) అల్లాహ్‌ వాటికి చేసిన మార్గదర్శకాత్వనికి లోబడి అవి నిర్మించు కునే తెట్టలలో ఎక్కడా ఖాళి స్థలం ఉండదు. లోపం వెతకాలన్నా కాన రాదు.
ఖుర్‌ఆన్‌లో పేర్కొనబడిన మరో ఉదాంతం చీమలది – ‘చివరకు వారంతా (సులైమాన్‌ మరియు ఆయన సైన్యం) ఒక చీమల లోయకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా ప్రకటించింది: ”ఓ చీమల్లారా! సులై మాను మరియు అతని సైన్యం తెలియకుండా మిమ్మల్ని నలిపి వేసే స్థితి ఏర్పడకుండా ఉండేందుకు, మీ మీ పుట్టలలోకి దూరిపోండి” (నమ్ల్‌;28)
అంటే, అల్లాహ్‌ జంతువులలో కూడా ప్రమాదాన్ని పసిగట్టే చైతన్యాన్ని ఉంచాడు. ఈ కారణంగానే భూకంపాన్ని మనిషికన్నా ముందు పక్షులు, జంతువులు పసి గడతాయి. మంచీచెడులు, లాభనష్టాలు తెలుసుకునే మార్గదర్శకత్వం పశువులకు కూడా చేయబడింది. ఆహార వస్తువులను ప్రసాదించడంతోపాటు ఆయా వస్తువుల గుణాలను, వాటి లాభనష్టాలను కూడా అటు మనిషికి, ఇటు పశుపక్ష్యాదులకు ఎరుక పర్చాడు అల్లాహ్‌ా. ఈ మార్గదర్శకత్వం ఆధారంగానే పుట్టే శిశువు మొదట శ్వాస పీలుస్తుంది. ఆ తర్వాత అమ్మ పాలు కమ్మదనాన్ని అద్భుతమయిన శైలిలో, అద్వితీయమయిన రీతిలో తనివితీరా గ్రోలు తుంది. ఈ యదార్థాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటుంది: ”ఆత్మ సాక్షిగా! దాన్ని తీర్చిదిద్దినవాని సాక్షిగా! మరి ఆయనే దానికి చెడును, చెడు నుండి తప్పించుకుని మసలుకునే ప్రేరణను ఇచ్చాడు”. (షమ్స్‌:7,8 )

2) ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం

ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం ఇది కేవలం మనుషులకు, జిన్నాతులకు అనుగ్రహించబడిన మార్గదర్శకత్వం. అల్లాహ్‌ా తన దాసులకు నమ్మ కాలకే కాదు; ప్రవర్తనలకు కూడా మార్గం చూపాడు. ఆలోచనలకే కాదు ఆచరణలకు సయితం దారి చూపాడు. విధానాలు, సిద్ధాంతాలే కాదు క్రీయాశీలకమయిన ఆదర్శాలూ నిలిపి చూపాడు. ప్రకృతి సిద్ధం గానే కాదు ఆధ్యాత్మికంగా సయితం మార్గదర్శకత్వం వహించాడు. ఇలా అన్నాడు: ”ఏమిటి మేమతనికి రెండు కళ్ళును సృజించలేదా? ఒక నాలుకను, రెండు పెదవులను చేయలేదా? ఆనక మేమతనికి రెండు మార్గాలు కూడా చూపాము”. (బలద్‌: 8-10)
అల్లాహ్‌, మనక్కావాల్సిన భౌతిక అవసరాల్ని మాత్రమే ప్రసాదించి ఊరుకోలేదు; మనకు అవసరమైన ఆధ్యాత్మిక అవసరాలు తీరే మార్గాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఆయన చేసిన ఆ ఏర్పాటు ఎంతో మహోత్కృష్టమయినది. ఆయన ఇలా అన్నాడు: ”మా ఆదేశానుసారం ప్రజలకు మార్గదర్శకత్వం వహించటానికి మేము వారిని (ప్రవక్తలను) నాయకులుగా, ఇమాములుగా తీర్చిదిద్దాము. పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలనీ, నమాజును స్థాపిస్తూ ఉండాలనీ, జకాతును చెల్లిస్తూ ఉండాలనీ మేము వారికి ఉపదేశించాము. వారంతా మమ్మల్ని ఆరా ధించేవారే”. (అన్బియా: 73)

ఈ వచనంలో ప్రజలకు అంటే, సమస్త జనావళికి అని అర్థం. అల్లాహ్‌ా మన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం నిమిత్తం ప్రభవింపజేసిన ఆ క్రియాశీలక ఆదర్శాలే ప్రవక్తలు. వారు ప్రతి జాతిలోనూ ఆవిర్భవిం చారు. ఇలా ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేయడం వెన కాల పరమార్థ ఏమిటంటే –
1) ”అల్లాహ్‌ మీకు (ధర్మాధర్మాలను) విడమరచి చెప్పాలనీ, మీ పూర్వీకుల్లోని (సజ్జనుల) మార్గంపై మిమ్మల్ని నడిపించాలనీ, మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాలని అభిలషిస్తున్నాడు. అల్లాహ్‌ సర్వం తెలిసిన వాడు. మహా వివేక సంపన్నుడు”. (నిసా: 26)

ఇంకా – ”మీపై ఉన్న బరువును తగ్గించాలన్నది అల్లాహ్‌ అభిలాష. ఎందుకంటే, మానవుడు బలహీనుడిగా పుట్టించ బడ్డాడు”. (నిసా: 28)
2) ”ఒకవేళ మేము ఇతని (ప్రవక్త రాక)కి పూర్వమే, ఏదయినా శిక్ష ద్వారా వాళ్ళను అంతమొందించి ఉంటే, ‘మా ప్రభూ! నువ్వు మా వద్దకు ఒక ప్రవక్తను ఎందుకు పంపలేదు? పంపి ఉంటే మేము పరాభావానికి, అవమానానికి లోనవక ముందే నీ సూచనలను అనుస రించి ఉండేవాళ్ళం కదా!’ అని వారు ఖచ్చితంగా అని ఉండేవారు”. (తాహా: 134)
మనిషి పుడమిపైన కాలు మోపిన నాటి నుండి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారి కాలం నాటి వరకూ అతని ముందు నిలిచి, అతను నడవవలసిన బాట ఏదో, అతను చేరవలసిన గమ్యమేదో విడమర్చి చెబుతూ వచ్చారు. అల్లాహ్‌ ఇలా అంటున్నాడు:
”(ఓ ప్రవక్తా!) వాస్తవానికి నువ్వు వారిని హెచ్చరించేవాడిని మాత్రమే. ప్రతి జాతికీ మార్గదర్శకుడు అంటూ ఒకడున్నాడు”. (రాద్‌: 7)
ఇక ఆయా జాతి ప్రజలు సన్మార్గాన్ని అవలంబించారా? లేదా? అన్నది ఎలా ఉన్నా-”ప్రతి సమాజంలోనూ హెచ్చరించెవాడు తప్ప కుండా వచ్చాడు”. (ఫాతిర్‌: 24)

అలా మానవాళిని ఆధ్యాత్మికంగా మార్గదర్శకత్వం వహించే నిమి త్తం వచ్చిన ప్రవక్తల్లో మహనీయ ముహమ్మద్‌ (స) వారి అంతిమ ప్రవక్త. ఆయన గురించి అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు:”(ఓ ముహ మ్మద్‌!-స) నీశ్చయంగా నీవు (ప్రజలకు) రుజుమార్గం వైపనకు మార్గదర్శకత్వం వహిస్తున్నావు. భూమ్యాకాశాల్లోని సమస్తానికీ యజ మానీ అయిన అల్లాహ్‌ మార్గం వైపునకు. తుదకు సమస్త వ్యవహా రాలూ అల్లాహ్‌ వద్దకే చేరతాయి సుమా!”. (షూరా: 52, 53)
మానవాళి మార్గదర్శనార్థం వచ్చిన దైవగ్రంథాల్లో అంతిమ దైవ గ్రంథమయిన ఖుర్‌ఆన్‌ గురించి తెలియజేస్తూ అల్లాహ్‌ా ఇలా సెలవి స్తున్నాడు: ”నిశ్చయంగా ఈ ఖుర్‌ఆన్‌ అన్నింటికంటే సవ్యమయిన మార్గాన్ని చూపిస్తుంది”. (బనీ ఇస్రాయీల్‌: 9)
అంతిమ దైవప్రవక్తని ప్రభవింపజేసి, అంతిమ దైవగ్రంథాన్ని అవ తరింపజేసిన మీదట ఆయన ఇలా ఉపదేశిస్తున్నాడు: ”మీకు తెలియకుండానే మీపై అకస్మాత్తుగా ఆపద వచ్చి పడక ముందే, మీ ప్రభువు తరపు నుండి పంపబడిన ఉత్తమ విషయాన్ని అనుసరిం చండి”. (జుమర్‌: 55)
”అప్పుడు ఏ ప్రాణి అయినా, ‘అయ్యో! ఏమి దురవస్థ నాది! నేను అల్లాహ్‌ా విషయంలో లోటు చేశానే! నేను గేలి చేసేవారిలో ఉండి పోయానే!? అని చెబుతుందేమో!” (ఆ దుస్థితి రాకుండా జాగ్రత్త పడండి సుమా!). (జుమర్‌: 56)
”లేదా, అల్లాహ్‌ా గనక నాకు సన్మార్గం చూపి ఉంటే నేను కూడా భయభక్తులు గలవారిలో చేెరి ఉండేదాన్నేమో!’ అని చెబుతుం దేమో!” (జుమర్‌: 57)
ఆ తర్వాత అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ”సన్మార్గాన్ని పొందేవాడు తన మేలు కోసమే సన్మార్గాన్ని పొందుతాడు. పెడదారి పట్టేవాడు తన కీడుకు తానే కారకుడవుతాడు. బరువు మోసే ఎవ్వడూ ఇంకొ కరి బరువును తనపై వేసుకోడు. ఒక ప్రవక్త పంపనంత వరకూ ఎవరినయినా శిక్షించటం మా సంప్రదాయం కాదు”. (బనీ ఇస్రాయీల్‌: 15)
సమస్త మానవాళికి సర్వేశ్వరుడయిన అల్లాహ్‌ చూపిన ఆ సన్మార్గం ఏమిటో కూడా ఆయన మాటల్లోనే విందాం! ”నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్‌ వద్ద సమ్మతమైన ధర్మం”. (ఆలి ఇమ్రాన్‌: 19)
”ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారి లో చేరిపోతాడు”. (ఆలి ఇమ్రాన్‌: 85)

ఈ యదార్థాన్ని తెలుసుకున్న తర్వాత కూడా ఎవరయితే ఇస్లాం సన్మా ర్గానికి వ్యతిరేకంగా జీవిస్తారో వారినుద్దేశించి అల్లాహ్‌ ఇలా ప్రశ్నిస్తు న్నాడు:’ఆకాశాలలోనూ,భూమిలోనూ ఉన్నవారంతా-తమకు ఇష్టమున్నా లేకపోయినా అల్లాహ్‌ా విధేయతకు కట్టుబడి ఉండగా, వీరు అల్లాహ్‌ా ధర్మాన్ని కాకుండా మరో మార్గాన్ని అన్వేషిస్తున్నారా? ఎట్టకేలకు వారం తా ఆయన వైపునకే మరలించబడతారు”. (ఆలి ఇమ్రాన్‌: 83)

3) శ్రద్ధకొద్దీ మార్గదర్శకత్వం:

‘శ్రద్ధ’ ఒక మనఃస్థితి. కార్యతత్పరత, వినయం, గౌరవం. ఏ సంశ యాల చేత విచలితం కాని దృఢ విశ్వాసమే శ్రద్ధ. సమున్నత లక్ష్య సాధనలో చేసే ప్రయత్నాలన్నింటికీ శ్రద్ధయే ఆధారం. ప్రగాఢ విశ్వా సానికీ, నిరంతర ఆకాంక్షకు ప్రతీక శ్రద్ధ. మనసులో శ్రద్ధ సత్య తత్పర తగా రూపొందితే అనితర సాధ్యమయిన విజయం తథ్యం.
మనసులో సత్యార్తి రగులుకున్నప్పుడే శ్రద్ధ సంతరించుకుంటుంది. సత్య ప్రభువు చల్లని చూపు మనపై ఉంటుంది. ఆయన ఇలా సెలవిస్తు న్నాడు:”ఎవరయితే మా విషయంలో అహిర్నిశలు పరిశ్రమిస్తారో మేము వారికి ఖచ్చితంగా మా మార్గాల వైపు మార్గదర్శకత్వం చేస్తాము”. ఎందుకంటే, ”నిజంగా మార్గం చూపే బాధ్యత మాదే”. (అల్‌ లైల్‌:12)

అల్లాహ్‌ ఎలాగయితే మనిషికి శ్రమకొద్దీ, అన్వేషణకొద్దీ ఐహిక, ఆర్థిక అవసరాలను తీర్చాడో, అలాగే ఆధ్యాత్మికంగా మనిషిలోని దైవభీతి కొద్ద్దీ, శ్రద్ధకొద్దీ మార్గదర్శకత్వం వహించే బాధ్యతను తీసుకున్నాడు. ధర్మాధర్మాలను, సత్యాసత్యాలను, న్యాయాన్యాయాలను, ఉచితా నుచితా లను విడమరచి చెప్పి, సన్మార్గమేదో, అపమార్గమేదో సూచించే బాధ్యత మామీదే ఉందన్నాడు.

ఆ తర్వాత ఇలా ఉపదేశించాడు: ”నా మార్గాన్ని అవలంబించే వాడు దారి తప్పడం గాని, ప్రయాసకు లోనవడం గాని జరగదు. అయితే ఎవరయితే నా ధ్యానం (సందేశం-మార్గం) పట్ల విముఖత చూపుతాడో వాడి బ్రతుకు దుర్భరమయిపోతుంది. ప్రళయ దినాన మేమతన్ని గుడ్డి వానిగా చేసి లేపుతాము”. (తాహా; 123, 124)

అల్లాహ్‌ ఇంతగా విడమరచి చెప్పినా మార్గ తప్పేవారి గురించి తెలియజేస్తూ ఆయన ఇలా సెలవిస్తున్నాడు: ”అల్లాహ్‌ అవతరింపజేసిన దాన్ని అనుసరించండి అని వారితో అన్నప్పుడల్లా – లేదు; మా తాత ముత్తాతలను మేము ఏ మార్గం మీద పొందామో ఆ బాటనే నడుస్తా మంటారు….” (బఖరా:170)

”సన్మార్గానికి బదులుగా అపమార్గాన్ని కొనితెచ్చుకున్నవారు వీరే. అందుచేత ఈ వర్తకం వారికి ఏ విధంగానూ లాభదాయకం కాలేదు. వారు సన్మార్గానికి నోచుకోనూ లేదు”. (బఖరా: 16)

ఇక ఏ భాగ్యవంతులయితే అల్లాహ్‌ా చూపిన మార్గం మీద నడుచు కున్నారో వారికి – ”తద్వారా అల్లాహ్‌ా తన ప్రసన్నతను అనుసరించే వారికి శాంతి మార్గాలను చూపుతాడు. తన అనుమతి మేరకు వారిని చీకట్లలో నుంచి వెలికి తీసి, కాంతి వైపునకు దారి చూపుతాడు. రుజు మార్గం వైపునకు వారికి దర్శకత్వం వహిస్తాడు”. (మాయిదా: 16)

4) పరలోక మార్గదర్శకత్వం:

మనిషి సన్మార్గాన్ని అనుసరిస్తూ సత్యధర్మ ధ్వజవాహకుడిగా ధర్మో న్నతి కోసం అంతిమ శ్వాస ఆగేంత వరకూ గనక అలుపెరగని కృషి సలిపినట్లయితే అల్లా అన్ని విధాలా అతన్ని ఆదుకుంటాడు. ఇహ లోకంలో ధర్మమార్గం మీద సహనస్థయిర్యాలను అనుగ్రహించడమే కాక, రేపు ప్రళయ దినాన పుల్‌సిరాత్‌ వారధిపై అడుగులు తడబడ కుండా స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఆయన ఇలా సెలవిస్తున్నాడు:
”ఆయన సమీపంలోనే వారికి సన్మార్గం చూపుతాడు, వారి పరిస్థితిని చక్కదిద్దుతాడు. మరియు వారికి (ముందుగా) తెలిపి ఉన్న స్వర్గంలో వారిని ప్రవేశింపజేస్తాడు”. (ముహమ్మద్‌:5)

అంటే, ఇహలోకంలో ఉన్నన్నాళ్ళు స్వర్గానికి గొనిపోయే మార్గాన్ని వారి కొరకు సులభతరం చేస్తాడు. సత్కార్యాలను ఇతోధికంగా చేసుకునే సద్బుద్ధిని వారికి వొసగుతాడు. రేపు ప్రళయ దినాన సయి తం సత్యవంతులకు స్వర్గం తీర్పు ఇచ్చిన మీదట, వారికి అల్లాహ్‌ా చేసిన మార్గదర్శకత్వంతో వారు తమ తమ నివాస స్థలాలకు చేరుకుం టారు. అప్పుడక్కడ వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ”మమ్మల్ని ఈ స్థానం వరకూ చెర్చిన అల్లాహ్‌ాకు కృతజ్ఞతలు. అలాహ్‌ాయే గనక మాకు మార్గదర్శకత్వం వహించకుండా ఉంటే మేము ఎన్నటికీ ఈ స్థితికీ ఈ స్థితికి చేరుకునే వాళ్లము కాము”. (ఆరాప్‌: 43)
సత్యవంతులకు లభించే సత్ఫలం, సన్మానం ఇలా ఉంటే, అసత్య ప్రియులను నానా యాతనల పాలు చేయడం జరుగుతుంది. ఇలా ఆదేశించబడుతుంది: ”దుర్మార్గులనూ, వారితో జతకట్టినవారినీ, వారు ఎవరెవరినయితే పూజించారో వారందరినీ ప్రోగు చేయండి. మరి వారందరికీ జ్వలించే అగ్ని (నరకం) దారి చూపండి”. (సాప్ఫాత్‌: 22,23)

ఆ తర్వాత-”వారికి కాస్త ఆపండి. వారికి కొన్ని (ముఖ్యమైన) ప్రశ్నలు వేయాల్సి ఉంది”. సాఫ్ఫాత్‌:24)
”అందు (నరకం)లో ఏదయినా ఒక సమూహం పడవేయబడినప్పు డల్లా దాని రక్షకులు వారినుద్దేశించి, ‘ఏమిటి, మీ వద్దకు హెచ్చరించే వారెవరూ రాలేదా?’ అని అడుగుతారు. ‘ఎందుకు రాలేదు? హెచ్చ రించేవాడొకడు వచ్చాడు. కాని మేమే అతన్ని ధిక్కరించాము. అల్లాహ్‌ా దేనినీ అవతరింపజేయలేదు. మీరే పెద్ద అపమార్గానికి లోనై ఉన్నారని చెప్పేశాము’ అని వారు ఒప్పుకుంటారు”. (అల్‌ముల్క్‌: 8,9)
ఆనక చేసిన నిర్వాకానికి పశ్చాత్తాప పడుతూ – ”అయ్యో! మేము విని ఉంటే లేదా బుద్ధి పెట్టి ఆలోచించి ఉంటే నరకాగ్నికి ఆహుతి అయినవాళ్ళలో చేరేవాళ్లం కాము”. (అల్‌ముల్క్‌: 10) అయితే అక్కడ వారు చింతించడం వల్ల ప్రయోజనం ఉండదు.

 

Related Post