ఉజైర్‌ (అ)

    ఉజైర్‌ (అ) చూస్తుండగానే గాడిద అస్థి పంజరంపై మాంసం కండరాలు చోటు చేసుకున్నాయి. గాడిద మళ్ళీ సజీవంగా లేచి నిలబడింది. ఆయన ఆశ్చర్యంగా,  ''అల్లాహ్‌   ఏమైనా చేయగల శక్తి గలవాడని నేనిప్పుడు దృఢంగా నమ్ముతున్నాను'' అన్నారు.

ఉజైర్‌ (అ) చూస్తుండగానే గాడిద అస్థి పంజరంపై మాంసం కండరాలు చోటు చేసుకున్నాయి. గాడిద మళ్ళీ సజీవంగా లేచి నిలబడింది. ఆయన ఆశ్చర్యంగా, ”అల్లాహ్‌ ఏమైనా చేయగల శక్తి గలవాడని నేనిప్పుడు దృఢంగా నమ్ముతున్నాను” అన్నారు.

– కురాన్ కథామాలిక

(వందేళ్ళు నిద్రపోయిన మనిషి) (500-400 క్రీ.పూ)

అల్లాహ్‌ (ఉజైర్‌తో) అన్నాడు, ”నువ్వు నూరేళ్ళు ఈ స్థితిలో పడి ఉన్నావు. నీ అన్నపానీయాల వైపు చూడు , అవి ఏ మాత్రం చెడిపోలేదు. మరి నీ గాడిదను కూడా చూసుకో…మేము (గాడిద) ఎముకలను ఏ విధంగా లేపి, వాటిపై మాంసం నింపుతామో!”   (ఖుర్‌ఆన్‌- 2: 259)

ఉజైర్‌ (తి) తన తోటలోకి ప్రవేశించి అక్కడి ప్రకృతి సౌందర్యానికి మ్రాన్పడి అలాగే కాసేపు నిలబడి పోయారు. పచ్చగా కళ కళలాడే చెట్లు, వాటిపై ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మపైకి కిలకిలారావాలతో ఎగిరే పక్షులు, విసన కర్రల్లాంటి చెట్ల ఆకుల నుంచి వీస్తున్న స్వచ్ఛమైన పిల్ల తెమ్మరలు ఆస్వాదిస్తూ తన చేతిలో ఉన్న బుట్టను క్రింద పెట్టారు. అలా చాలా సేపు నిలబడిపోయారు. చెట్ల కొమ్మలు నోరూరించే పండ్ల భారంతో క్రిందికి వంగిపోయి ఉన్నాయి. ఆయన తన బుట్టను తీసుకుని అందులో రకరకాల పండ్లు కోసుకున్నారు. ఆ బుట్టను తన గాడిద వీపున కట్టారు. దానిపై కూర్చోని వెళ్ళిపోయారు.

దారిలో కూడా ప్రకృతి సౌందర్యం గురించి, ప్రకృతిలోని రమణీయత గురించి ఆలోచించి ఆశ్చర్యపోసాగారు. గాడిద దారి తప్పి తనను ఎటో తీసుకుపోవటాన్ని ఆయన గుర్తించలేదు. ఆలోచనలో నుంచి బయటపడి చూసేసరికి ఆయన ఒక పాడుబడిన ఊరిలో ఉన్నారు. నేలపై మానవుల కంకాళాలు, జంతువుల అస్థి పంజరాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వారంతా గతించిన కాలాల ప్రజలని, వారి చిహ్నాలు చిందంవందరగా పడి ఉన్నాయని గ్రహించారు.

ఆయన గాడిదపై నుండి క్రిందికి దిగారు. గాడిదపై ఉన్న బరువును క్రిందికి దించి, ఒక కూలిపోయిన గోడకు ఆనుకుని కూర్చున్నారు. ఆ ఊరి ప్రజలకు ఏమయ్యిందో అని ఆలోచించసాగారు. ఆయనకు మరణానంతర జీవితం గురించి ఆలోచన వచ్చింది. మరణించినవారు మళ్ళీ ఎలా బ్రతికించబడతారు? అన్న ఆలోచన ఆయన మనసులో ముసురుకుంది. ఆలోచనల్లో మునిగి అలాగే కునికిపాట్లు పడుతూ నిద్రలోకి జారిపోయారు.

అలా రోజులు గడిచిపోయాయి, నెలలు గతించాయి. సంవత్సరాలు కాల గర్భంలో కలిసిపోయాయి. ఉజైర్‌ (అ) నిద్రలోనే ఉన్నారు. అల్లాహ్‌ తన ప్రవక్తలతో వ్యవహరించే తీరు విభిన్నంగా ఉంటుంది. సాధారణ విశ్వాసికి ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన అనుభూతి లభించకపోయినా అతను తన విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. కాని దేవుని సందేశహరులైన  ప్రవక్తలకు వారి విధుల నిర్వహణలో, దేవుని సందేశం ప్రజలకు అందజేయడంలో పటిష్టమైన సంకల్పం అవసరం.   అందుకు   గాను జీవితానికి సంబంధించిన లోతయిన వాస్తవాలను తెలుసుకోవలసిన అవసరం కూడా వారికి ఉంటుంది. అందుకే ప్రవక్తల వద్దకు దైవ దూతలు వచ్చేవారు. స్వర్గ నరకాలు, భూమ్యాకాశాలు, మరణానంతర జీవితం వగైరా వాస్తవాలను వారికి చూపించడం జరిగేది.

మెలకువ

ఉజైర్‌ (అ) తన సుదీర్ఘ నిద్ర నుంచి మేల్కొన్నారు. అల్లాహ్‌ ఆదేశానుసారం ఆయన నిద్ర పూర్తయింది. ఆయన నిద్రపోయినప్పుడు  ఎలా ఉన్నారో నిద్ర లేచినప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఒక దైవ దూత ఆయన ముందు ప్రత్యక్ష మయ్యాడు. ఉజైర్‌తో దైవ దూత, ”ఎంత కాలం నిద్రపోయావని భావిస్తున్నావు?” అని ప్రశ్నించాడు. ఉజైర్‌ జవాబిస్తూ, ”నేను ఒక రోజులో చాలా భాగం నిద్ర పోయి ఉంటాను” అన్నారు. దైవదూత ఆయన్ని చూస్తూ, ”కాదు, నువ్వు వంద సంవత్సరాలు నిద్రపోయావు. చూడు! నీ పండ్లు అప్పుడు ఎంత తాజాగా ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉన్నాయి. నీ త్రాగు నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. కాని నీ గాడిదను చూడు, కేవలం దాని అస్థిపంజరం మాత్రమే మిగిలి ఉంది… అల్లాహ్‌ మహత్యాన్ని చూడు…మరణించిన వారిని మళ్ళీ ఆయన ఎలా బ్రతికిస్తాడో అర్థం చేసుకో…దీన్ని నీ ప్రభువు తరఫు నుంచి నిదర్శనంగా భావించు. నీ మనస్సులో ఉన్న అనుమానాలన్నీ తొలగించుకో” అన్నాడు.

ఉజైర్‌ (అ) చూస్తుండగానే గాడిద అస్థి పంజరంపై మాంసం కండరాలు చోటు చేసుకున్నాయి. గాడిద మళ్ళీ సజీవంగా లేచి నిలబడింది. ఆయన ఆశ్చర్యంగా,  ”అల్లాహ్‌   ఏమైనా చేయగల శక్తి గలవాడని నేనిప్పుడు దృఢంగా నమ్ముతున్నాను” అన్నారు.

  అంతరించిన గతం

ఉజైర్‌కు తెలిసిన ప్రాంతాలన్నీ పూర్తిగా మారిపోయాయి. తన ఇంటిని వెదకడానికి చాలా సమయం పట్టింది. చివరకు ఇంటికి చేరుకుంటే అక్కడ ఆయనకు ఒక వృద్ధ మహిళ కనబడింది. ఆమెకు కళ్ళు కనబడటం లేదు. కాని ఆమె జ్ఞాపక శక్తి చాలా బలంగా ఉంది. ఉజైర్‌ (అ) ఆమెను గుర్తించారు. తాను ఇల్లు వదలి వచ్చినప్పుడు ఆమె తన ఇంట్లో పని చేసే చిన్న పిల్ల.  ఆయన ఆమెతో ”ఇది ఉజైర్‌ ఇల్లేనా” అని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇస్తూ ”అవును” అంది. ఆమె దుఃఖంతో, ”ఉజైర్‌ ఇల్లు వదలి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలై పోయాయి. ఆ తర్వాత ఎవరికీ ఆయన ఎక్కడికెళ్ళిందీ తెలియరాలేదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. చాలా కాలంగా ఆయన పేరు ప్రస్తావించిన వాళ్ళు కూడా లేరు” అంది. ఉజైర్‌ (తి) ఆమెతో, ”నేనే ఉజైర్‌ని. అల్లాహ్‌ అభీష్టం వల్ల నేను చాలా కాలం నిద్రపోయాను. అల్లాహ్‌ా నన్ను వంద సంవత్సరాల తర్వాత నిద్ర లేపాడు” అన్నారు.

ఈ మాటలు విన్న ఆ వృద్ధ మహిళ చాలా ఆశ్చర్యపోయింది. కాసేపు ఏమీ మాట్లాడ లేదు.   తర్వాత,    ”ఉజైర్‌ (అ) గొప్ప ధర్మాత్ముడు. అల్లాహ్‌ ఆయన ప్రార్థనలను వినేవాడు. ఆయన రోగుల స్వస్థత కోసం ప్రార్థించిన ప్రతి సారీ వారికి ఆరోగ్యం చేకూరేది. కాబట్టి, నువ్వు ఉజైర్‌వే అయితే నా ఆరోగ్యం కోసం, నా కంటి చూపు కోసం అల్లాహ్‌ను ప్రార్థించు” అని అడిగింది.

ఉజైర్‌ (అ) అల్లాహ్‌ను వేడుకున్నారు. అల్లాహ్‌ ఆయన ప్రార్థనలను ఆలకించాడు. ఆ వృద్ధ  మహిళకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది. ఆమె కంటి చూపు మళ్ళీ వచ్చింది. ఆమె ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఈ వార్త అందరికీ చెప్పడానికి తక్షణమే బయటకు వెళ్ళింది. ఉజైర్‌ పిల్లలు, మనుమల పిల్లలు అందరూ పరుగున వచ్చారు. యువకునిగా కనబడుతున్న ఉజైర్‌ని చూసి ఆయన తమకు తాతగారని నమ్మలేకపోయారు. ”ఇది నిజమా!” అని గుసుగుసలాడుకోసాగారు. ప్రస్తుతం ముసలి వాడైపోయిన ఉజైర్‌ కొడుకు ఒకడు ”నా తండ్రికి భుజంపై  ఒక    పుట్టు     మచ్చ ఉండేది. మా అందరికీ ఆ పుట్టు మచ్చ గురించి బాగా తెలుసు. మీరు ఆయనే అయితే ఆ పుట్టు మచ్చను చూపించండి” అని ప్రశ్నించాడు. ఉజైర్‌ తన భుజంపై ఉన్న పుట్టు మచ్చను చూపించారు. అయినా వారికి సంతృప్తి కలగలేదు. మరో కుమారుడు, ”జెరుసలేమ్‌ను బుఖ్తనస్సర్‌ ఆక్రమించుకుని తౌరాత్‌ గ్రంథాలన్నింటినీ ధ్వంసం చేసినప్పటి నుంచి తౌరాత్‌ కంఠస్థం చేసినవాళ్ళు చాల తక్కువ మంది మిగిలారు. అలా తౌరాత్‌ కంఠస్థం చేసినవారిలో మా తండ్రిగారు కూడా ఒకరు. మీరు ఆయనే అయితే తౌరాత్‌ వినిపించండి” అనడిగాడు. ఉజైర్‌ తౌరాత్‌ మొత్తం పఠించి విన్పించారు. ఆయన స్వరానికి వారు మంత్రముగ్దులై విన్నారు. నిజంగా ఉజైర్‌ (అ) తిరిగి వచ్చారని వారికి అప్పటికి నమ్మకం కలిగింది. అందరూ ఆయన్ని ప్రేమతో కౌగలించుకున్నారు. ఆనంద భాష్పాలు రాల్చారు.

ఆ పిదప యూదులు, ”అల్ల్లాహ్‌ ఉజైర్‌ను మళ్ళీ బ్రతికించాడు. కాబట్టి ఆయన తప్పక అల్ల్లాహ్‌ా కుమారుడై ఉండాలి”  అనడం ప్రారంభించారు.   (చదవండి దివ్య ఖుర్‌ఆన్‌-9: 30. 2: 259)

గ్రహించవలసిన పాఠం

సాధారణంగా మనుషులు కళ్ళకు కనబడే వాటిని పట్టించుకోకుండా తమ స్వంత ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉజైర్‌ తిరిగి రావడం అల్ల్లాహ్‌ా చూపించిన మహత్యంగా గ్రహించే బదులు యూదులు ఆయన్ను దేవుని కుమారునిగా పిలువడం ప్రారంభించారు.     (‘ఖుర్‌ఆన్‌ కథామాలిక’ – సౌజన్యంతో)

Related Post