\
సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ
మానవ సృష్టికి మునుపే ఫరిష్తాల కాలం నాటిది కాబా గృహం. ఆకాశంలో దైవ దూతల ఆరాధనా క్షేత్రం బైతుల్ మామూర్ అయితే, అవనిలో మనుజ భక్తుల ప్రార్థనాలయం ఈ ప్రతిష్ఠాలయం. భువిలో తొలి దైవ గృహం, భూతల స్వర్గం ఈ గృహం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స) హృదయాలను ఏలిన మహీతలం మక్కా నగరం. అనాదిగా ఈ గృహం విశ్వ మానవ మార్గదర్శక కేంద్రం.
ఇదో విశిష్ఠతైతే…
ఈ పుణ్య క్షేత్రానికి దైవ ప్రవక్తలందరూ తమ జీవితకాలంలో ఏదో ఒక సందర్భాన వచ్చి దర్శించుకున్నట్లు, వారిలోని అనేక మంది ప్రవక్తలు తమ శేషజీవితాన్ని ఇక్కడే గడిపినట్లు అమరవీరులై కీర్తిశేషులైనట్లు చరిత్ర చెబుతోంది.
ఈ మహా నగరాన్నే పూర్వం ‘బక్కా’ అని పిలిచేవారు. ఎట్టి శత్రువునయినా ఇట్టే క్షమించి వదిలేయాలన్నది దానర్థం. ఎంత మధురం! ఎంత మనోహరం – మక్కా నగరం!! బైబిల్లో, పురాణాల్లో, ప్రపంచ ఇతిహాసాల్లో – అంతిమ దైవ గ్రంథం ఖుర్‌ఆన్‌లో – ఈ పవిత్ర పురం గురించి ఎన్నో వర్ణనలు, ఉదంతాలు ఉన్నాయి. ప్రవక్తల పితామహులు హజ్రత్ ఇబ్రాహీమ్ (అ) తన పుత్ర రత్నంతో కలిసి ఈ పవిత్ర గృహాన్ని పునర్నిర్మించారన్నది ప్రసిద్ధిగాంచిన ప్రతీతి. ఆ కుమారుని పేరు ఇస్మాయీల్. ప్రవక్త (స) వారి వంశానికి మూల పురుషుడు, వారిరువురి ప్రార్థనా ఫలితమే మహా ప్రవక్త ముహమ్మద్ (స) వారి ప్రభవనం. ముహమ్మద్ (స) వారు ప్రభవింపజేయబడింది ఈ నగరంలోనే.
ఆ నగరం భక్తిపరులకు ఆలవాలం. సత్యసంధులకు పంట పొలం. సాత్వికులకు, శాంతి ప్రియులకు ఆలయం. అటువంటి మహా నగరం కొన్నేళ్ళుగా అంధకారాలతో, మూఢ నమ్మకాలతో అతలాకుతలమవుతూ ఉంది. అట్టి తరుణంలో ప్రకృతి ధర్మాన్ని , సంపూర్ణ ధర్మ శాస్త్రాన్ని, అంతిమ గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని అనేక రేఖల్లో, రూపాల్లో – అక్షరాల్లో – ఆచరణల్లో అభిషేకించేందుకు వచ్చారు మహా ప్రవక్త ముహమ్మద్ (స). నీతి నడవడికలు, సత్యం ధర్మాల రీత్యా ఆయనో మహోన్నత పర్వత శిఖరం. అందునుండి ఎన్నో సెలయేర్లు లకం నలుదిశలా ప్రవహించి – మహా నదులై – ఎందరెందరో సత్యార్తిని తీర్చి – అనంత, అద్భుత, అద్వితీయ ఆదర్శప్రాయుల్ని చేశాయి.
ఇవీ ఆ పవిత్ర పురానికీ, పుర ప్రవక్తకు సంబంధించిన కొన్ని పూర్వేతిహాసాలు. ఇక ఆ నగరంలో ఆయన చిలికించిన అమృత జల్లులు, ఆదర్శ పలుకుల గురించి తెలుసుకుందాం! పవిత్రమైన మార్గదర్శక కేంద్రాన్ని ఫలవంతం చేయడానికీ, ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దడానికి నిర్మలమైన దివి నుండి కురిసిన కారుణ్య జల్లే, అంతరాత్మ హరివిల్లే అంతిమ ప్రవక్త ముహమ్మద్ (స). అజ్ఞానులకు జ్ఞానకాంతులనిచ్చి, చీకట్లలో మ్రగ్గుతున్న జనాలకు వెలుగు బాట చూపి సత్య మార్గాన శాంతి పథాన నడిపించేందుకు ఆవిర్భవించిన క్రాంతికారుడే, శాంత మూర్తియే కారుణ్య ప్రవక్త ముహమ్మద్ (స ).
తెల్లవారు జామున మంచు కురిసే వేళలో ఎడారి ఓడల క్ష్షీరసాగరాలు, పక్షుల కిల కిలారావాలు, అండ పిండ బ్రహ్మాండాల స్తుతిగీతాల, ప్రత్యూషాల దైవన్నామ స్మరణలు, రెక్కల్లో తల దూర్చి ఆత్మ పరిశీలన చేసు కుంటున్న పక్షులు – అప్పుడే తొలిజాము తొలి కోడి కూసింది. చల్లని నీటితో వుజూ చేసుకుని పవిత్ర భావాలతో పరమోన్నతుడి సన్నిధిలో మోకరిల్లేందుకు బయలుదేరారు ప్రవక్త శిఖామణి (స). మలి కోడి కూసే వేళకు ప్రార్థన పూర్తి చేసుకుని దివ్యగ్రంథ పఠనంలో లీనమైనారు. ప్రపంచ చీకట్లను పటా పంచలు చేసేందుకు ఆ ప్రభాకరుడు పగటి పూట ఉదయిస్తే, ప్రజల జీవితాల్లో వెలుగును నింపేందుకు నిద్రను త్యజించి నిశిరాత్రి ప్రార్థనల్లో ప్రభువు సన్నిధానంలో ప్రణమిల్లు తున్నాడు ఈ ధర్మ ప్రభాకరుడు. ఆ రవికిరణం చీకటి పడ్డాక కనుమరుగైపోతే, ఈ రవితేజం రాత్రిళ్లు సైతం తేజోవంతమై వెలుగు నందిస్తున్నాడు. తెల్ల వారింది… సూర్య కాంతులతో తడి స్నానాలు చేస్తోందీ లోకం. ప్రియ ప్రవక్త (స) వారు ప్రజల జీవితాలను జ్యోతిర్మయం చేసేందుకు, వారి అంతరాత్మ చక్షువుల్ని తెరిచేందుకు, మొద్దు నిద్ర నుండి వారిని తట్టి లేపేందుకు, వాస్తవ జగత్తులో, సత్యామృతంలో జలకాలాడించేందుకు, వారి పుట్టుకకు పరమార్థాన్నిచ్చేందుకు, వారి బ్రతుకు బాట సరి చేసేందుకు, వారి ఉనికికి లక్ష్యాన్ని బోధించేందుకు, వారి జీవితాల్ని పునీతం చేసేందుకు, వారి జన్మను ధన్యం గావించేందుకు బయలు దేరారు దైవ ప్రవక్త ముహమ్మద్ (స).
మనిషి జీవితానికి అర్థాన్నిచ్చే అంతిమ ప్రవక్త ముహమ్మద్ (స). సత్యవంతుల సత్యార్తిని తీర్చే జీవ జలం దివ్య ఖుర్‌ఆన్. మనిషికి స్వర్గ సౌఖ్యాలను, కోరిన వరాలను అనుగ్రహించే శాంతి మార్గం ఇస్లాం. చీకటి అనే జగత్తులో విరిసిన క్రాంతి మొగ్గ, శాంతి ప్రభాకరుడు ప్రియ ప్రవక్త. అందానికే అందమైన ఆయనకు అలంకారాలు దేనికన్నట్లు దేదీప్యమానంగా వెలిగిపోతోంది ఆయన వదనం. ఆ దృశ్యం ఎంత మధురం! ఎంత ముగ్ద మనోహరం!! ఆయనే ధర్మజ్యోతి అయితే చీకట్లు పటాపంచలు కావా, శాంతి సామరస్యాలను తేవా? ప్రేమ పూరితమైన ఆయన పలుకులు మధురాను భూతులలో మైమరపించే దివ్య వాణులు. మరపురాని, మరచిపోలేని మహితోక్తులు. రండీ! విని తరించండి!!