స్త్రీలు పురుషుల తోబుట్టువులు
బతుకు ముళ్ళ బాటయితే స్నేహితురాలిగా ధైర్యం ఇస్తుంది స్త్రీ. విషాదం ఉన్నప్పుడు చెల్లిలా కన్నీరు తుడుస్తుంది స్త్రీ. ధైర్యం చాలక వెనుకడుగు వేద్దాం అనుకున్నప్పుడు భార్యగా వెన్ను తట్టి ప్రోత్సహి స్తుంది స్త్రీ. పురి నొప్పుల బాధ తెలియని మగజాతికి తల్లిలా లాలి స్తుంది స్త్రీ. ఒక్క మాటలో చెప్పాలంటే, కష్టంలో ముందుండి, సుఖంలో తోడుండి, విజయంలో వెనకుండి ఎప్పుడూ పక్కనే ఉంటుంది స్త్రీ.
అలాంటి స్త్రీ మూర్తిని గురించి ప్రవక్త (స): ”స్త్రీలు పురుషుల తోబుట్టు వులు”. (మస్నుద్ అహ్మద్) అని ఓ సందర్భంలో అంటే, ”స్వర్గం తల్లి పాదాల చెంత ఉంది” (నసాయీ) అని మరో సందర్భంలో చెబితే, ”నారీమణీ నరకాగ్ని నుండి కాపాడే కవచం” (తిర్మిజీ) అని ఇంకొక సందర్భంలో సెలవిచ్చారు.
ఇస్లాం స్త్రీకిచ్చే గౌరవం
ఇస్లాం స్త్రీని శైశవ థలో శుభవార్త అని, కౌమార థలో కూతురిగా, చెల్లిగా నరక ముక్తి మార్గం అని, పెళ్ళయిన తర్వాత ప్రపంచ సంపదల్లోకెల్లా మేలిమి సంపద పుణ్యవతి అయిన ప్రమిద అని, తల్లి అయ్యాక – స్వర్గమే ఆమె పాదాల చెంత ఉందని ఎనలేని కీర్తిని, గౌరవాన్ని ప్రసాదించింది. మానవ చరిత్రలో ఎక్కడయితే పురుషులు తనదయిన ముద్రను వదిలారో అక్కడే స్త్రీలు సయితం తనదయిన ముద్రను వదలి వెళ్ళారు. కొందరంటారు- ‘స్త్రీలు దైవ ప్రవక్తలుగా ఎందుకు లేరు?’ అని. ‘ప్రవక్తల వంటి మహా మహులను కడుపున మోసిన భాగ్యం, ఆలనా పాలన అదృష్టం ఆమెకే దక్కింది’ అన్నది వారికి మా సమాధానం. మానవ జాతి మొత్తానికి అమ్మ అయిన హజ్రత్ హవ్వా (అ), మూసా (అ) తల్లి, ఫిర్ఔన్ భార్య, సబా దేశ రాణి, ప్రవక్త ఈసా (అ) తల్లి మర్యం, ప్రవక్త (స) వారి గారాల పట్టి ఫాతిమా (ర.అ), ప్రియ సతీమణి ఖదీజా (ర.అ), పుణ్య సహా బియా సుమయ్యా (ర.అ)..ఇలా మానవాభ్యుదయంలో సమిధలయిన ప్రమిదలు ఎందరో!
ఖుర్ఆన్ వచనాలు ఎలాగయితే పురుషుల కోసం అవతరించాయో, అలాగే స్త్రీల కోసం సయితం అవతరించాయి. సూరతున్నిసా, సూర తుత్ తలాఖ్ ఈ రెండింటిలో స్త్రీలకు సంబంధించిన ఆదేశాలే అధికంగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, సమాజంలో సగం స్త్రీ. ఒక దేశానికి వెన్నుముక పురుషులయితె గుండెకాయ స్త్రీ. వారు బాగుంటే సమాజం బాగుంటుంది. వారు పాడయితే సమాజం పాడ వుతుంది. కనుకనే పెద్దలన్నారు: ”ఎక్కడయితే స్త్రీలు గౌరవించ బడతారో ఆ దేశం, ఆ ప్రాంతం, ఆ సంఘం, ఆ సమాజం, ఆ గృహం సుభిక్షంగా, సస్సశ్యామలంగా, సుఖసంతోషాల హరివిల్లయి విరాజిల్లు తుంది” అని.
తస్మాత్ జాగ్రత్త!
ఈ నిజాన్ని గ్రహించిన పాశ్చాత్య సమాజం, క్రైస్తవ మిషనరీల అ-విద్యాలయాలు ముస్లిం మహిళను మరియు పిల్లలను లక్ష్యంగా చేసుకొని పని చేస్తున్నాయి, వారు త్రోవ తప్పితే ఆటోమేటిక్క్గా వారి సంతానం త్రోవ తప్పుతుందన్నది వారి కుట్రపూరిత ప్రణాళిక. ఇది గ్రహించని ముస్లిం మహిళ వారు చూపే అర చేతి స్వర్గాన్నే అసలు స్వర్గంగా, తనకు లభించిన స్వేచ్ఛగా భావించి మోసపోతున్నది. తనకు పూర్వం గతించిన విశ్వాస మహిళలు ఎలాంటి ఆదర్శాలను నెలకొల్పి వెళ్ళారో పాపం వీరికి తెలీదు. తెలియజేసే ప్రయత్నం జరిగిందా? అంటే అది అంతంత మాత్రంగానే అనాలి. గుర్తుంచుకో వాల్సిన విషయం ఏమిటంటే, ”పురుషుడిలో ధార్మికత వస్తే గుమ్మ వద్దకు వచ్చినట్టు, స్త్రీలో ధార్మికత వస్తే ఇంటిల్లిపాది ధర్మజ్యోతి వెలిగినట్టు”. కాబట్టి నేటి ముస్లిం మహిళా లోకం మేల్కోవాలన్నా, పుణ్య స్త్రీల అడుగుజాడల్లో నడుచుకోవాలన్నా మార్గం ఒక్కటే; అదే అల్లాహ్ నిర్దేశించిన మార్గం: ”అల్లాహ్ సన్మార్గం చూపించినటువంటి వారు వీరే. ఓ ప్రవక్తా! నువ్వు వారి మార్గాన్నే అనుసరించు”. (అల్ అన్ఆమ్: 90) ఎవరు వారు? వారే మహనీయ ముహమ్మద్ (స) మెచ్చిన మహిళలు.
ప్రవక్త మెచ్చిన తల్లి: ఉమ్మె హానీ (ర.అ)
ఆమె పేరు ఫాఖితా బిన్త్ అబీ తాలిబ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (ర.అ). ఆమె వరుసకు ప్రవక్త (స) బాబాయి కూతురు. దైవదౌత్యం ప్రసాదించ పూర్వం ప్రవక్త (స) ఆమెకు వివాహ సందేశం పంపించారు కూడా. కానీ ముగీరా బిన్ అబీ వహబ్ అనే వ్యక్తి ఆమెను మనువాడారు. తర్వాత ఆమె ఇస్లాం స్వీకరించారు. భర్త ఇస్లాం స్వీకరించ లేదు. అల్లాహ్ ఆదేశానికి లోబడి ఆమె తన భర్త నుండి వేరయింది. తన వద్ద ఉన్న నలుగురు పిల్లల పోషణలో శేష జీవితం గడప సాగింది. అది గమనించిన ప్రవక్త (స) రెండవ సారి ఆమెకు వివాహ సందేశం పంపారు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం – ”ఓ దైవ ప్రవక్తా! మీరు నా దృష్టిలో నా కనులకన్నా, నా వీనులకన్నా ఎక్కువ అభిమాన పాత్రులు. కానీ, భర్త హక్కు అనేది చాలా పెద్దది. ఒకవేళ నేను నా భర్త హక్కు పూర్తి చెయ్యడంలో నిమగ్నమయి పోతే, నా పోషణలో ఉన్న నా పిల్లలకు అన్యాయం చేసిన దాననవుతాను. ఒకవేళ నా పిల్లల పోషణ మీద శ్రద్ధ వహిస్తే, నా భర్త హక్కును విస్మరించిన దాననవుతాను. కాబట్టి నాకు వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేదు”.
ఆమె నిరాకరణ సందేశం అందాక ప్రవక్త (స) అన్న మాట: ”ఒంటె మీద సవారీ చేసిన స్త్రీలలో ఉత్తములు ఖురైష్ మహిళలు. వారు పసితనంలో ఉన్న తమ సంతానం యెడల అమిత వాత్సల్య భరితులయి ఉంటారు. భర్త తనకు అప్పగించిన విషయాల యెడల గొప్ప సంరక్షకురాళ్ళుగా ఉంటారు” అని.
ఆమె మనస్తత్వం ఎంత మంచిదంటే, భయంతో ఉన్న వారికి ఆశ్రయం ఇవ్వడం, ఆందోళనకు గురయిన వారికి శాంత పర్చడం ఆమె విశిష్ఠ లక్షణంగా ఉండేది. మక్కా విజయం సందర్భంగా ఆమె వచ్చిం దన్న సమాచారాన్ని ఆమె తమ్ముడయిన హజ్రత్ అలీ (ర) గారు ప్రవక్త (స) వారికి చేరవేయగా, ప్రవక్త (స) ఆమెను ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇలా అన్నారు: ”ఓ ఉమ్మె హానీ! ఏ విషయం నిన్ను ఇక్కడకి తీసుకు వచ్చింది?” ఆమె ఎందు కోసం వచ్చిందో వివరించిన మీదట ప్రవక్త (స) అన్నారు: ”నువ్వు ఆశ్రయం ఇచ్చిన వారికి నేను ఆశ్రయమిస్తున్నాను. నువ్వు ప్రాణ భిక్ష పెట్టిన వారిని నేను కూడా ప్రాణ బిక్ష పెడుతున్నాను. వారిని హత్య చెయ్యడం జరుగదు”. (బుఖారీ)
మనలో ఎంత మంది తమ సొంత తల్లి యెడల గౌరవభావంతో మెలిగే వారున్నారు చెప్పండి!
ప్రవక్త మెచ్చిన ఆయా: ఉమ్మె ఐమన్.
ప్రవక్త (స) జననానికి పూర్వం ఉమ్మె ఐమన్ ఆయన తండ్రి అబ్దుల్లాహ్ బానిసరాలిగా ఉండేది. ఆయన మరణానంతరం ప్రవక్త (స) వారి తల్లితో పాటు ఉండేది. ప్రవక్త (స) వారిని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకునేది. మదీనా నుండి తిరుగు ప్రయాణంలో అబ్వా ప్రాంతంలో ప్రవక్త (స) వారి తల్లి మరణించినప్పుడు ఆయన వయసు ఆరు సంవత్సరాలు. అక్కడి నుండి మక్కా వరకు ప్రవక్త (స) వారిని సముదాయిస్తూ, ఓదార్చుతూ మక్కా వరకు ఒంటరిగా తీసుకొ చ్చిన ఆయా ఉమ్మె ఐమన్. ఆ తర్వాత ప్రవక్త (స) వారు పెరిగి పెద్దయ్యేంత వరకూ ఆయన ఆలనా పాలన ఒక ఆయాలా కాకుండా ఒక అమ్మలా చూసుకున్న పుణ్యవతి ఉమ్మె ఐమన్. ఆమె నీగ్రో బానిస. ప్రవక్త (స) తరచూ ఆమె గురించి ఈ మాట అంటూ ఉండేవారు: ”నా కుటుంబీకుల్లో మిగిలి ఉన్న మేలు ఈమె (మహా తల్లి)”. (బుఖారీ)
ప్రవక్త (స) పెద్దయ్యాక ఆమెను విడుదల చేశారు, బానిసత్వం నుండి ముక్తిని కలిగించారు. ఆయన (స) ఇలా అంటూ ఉండేవారు: ”స్వర్గపు స్త్రీలలోని ఓ స్త్రీని మనువాడితే ఆనందించే వారు ఉమ్మె ఐమన్ను మనువాడాలి”. (అఅలామున్నబ్లా)
ఆమెను జైద్ బిన్ సాబిత్ (ర) గారు మనువాడారు. వారిద్దరికి ఉసామా అను బాలుడుపుట్టాడు. ఉసామా బిన్ జైద్ (ర) గారిని ప్రవక్త (స) ఎంతో అల్లారు ముద్దుగా చూసుకునే వారు. చివరికి ఆయన్ను ఉమర్, ఆబూ బకర్, అలీ, ఉస్మాన్ (ర.అ) వంటి మహా ఉద్దండ సహచరులు ఉన్న సైన్యానికి సేనాధికారిని చెయ్యడం జరి గింది. అలా సేనానిగా వెళ్ళిన ఆయన (స) విజయం సాధించారు. ప్రవక్త (స) వారి కాలానికి చెందిన అందరూ ఆమెను ఎంతగానో గౌరవించేవారు, అభిమానించేవారు. ద్వితీయ ఖలీఫా హజ్రత్ ఉమర్ (ర) మరణించినప్పుడు ఆమె రోధిస్తూ అన్న మాటలు నేటికీ స్మరణీయం: ”ఓ ఉమర్! నీ మరణంతో మళ్ళీ ఇస్లాం బలహీన పడింది” అని.
మనలో ఎంత మంది తమల్ని బాల్యంలో అల్లారు ముద్దుగా చూసుకున్న అత్తలు, నాన్నమ్మలు, అమ్మమ్మల యెడల గౌరవభావంతో మెలిగే వారున్నారు చెప్పండి?!
ప్రవక్త (స) మెచ్చిన చెల్లి: షైమా బిన్త్ హారిస్ (ర.అ).
ప్రవక్త (స) ఆయన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. పేగు పంచుకుపుట్టిన చెల్లి, అక్కగానీ, తమ్ముడు, అన్నగాని ఆయనకు లేరు. అయితే పాలు సంబంధిత అన్నా చెల్లెలు ఉండేవారు. వారే, ఆయనకు బాల్యంలో పాలు తాపించిన హలీమా సఅదియా సంతానం. పేర్లు-అబ్దుల్లాహ్, అష్బా, హుజైఫా, హుజాఫా. హుజాఫా మరో పేరే షైమా. ప్రవక్త (స) పసితనంలో షైమా ఆయన్ను సంకలో పెట్టుకొని తిరిగేది, గుర్రమయి ఆయన్ను తన వీపు మీద కూర్చోబెట్టుకునేది.ఆయన్ను ఆటాడిస్తూ ఇలా పాడుతూ ఉండేది. ఓ ప్రభూ! ముహమ్మద్ ఆయష్షును పెంచు. అతన్ని నేనునాయకునిగా చూడాలి. ఎన్నిటికీ అంతం కాని కీర్తి ప్రతి ష్టల్ని అతనికి ప్రసాదించు.
హునైన్ సంగ్రామ సమయంలో ఆమెను యుద్ధ ఖైదీగా కొందరు విశ్వాసులు బంధించారు. వారినుద్దేశించి- ”నేను మీ ప్రవక్త అక్కను. నన్ను ఆయన వద్దకు తీసుకెళ్ళండి” అని చెప్పింది. ప్రవక్త (స) వారి సన్నిధికి వచ్చాక-”ఆధారం ఏమి?”అని అడిగినప్పుడు- ”మిమ్మల్ని మీ బాల్యంలో నా వీపు మీద కూర్చోబెట్టుకొని ఆడిస్తున్నప్పుడు ఫలానా చోట మీరు నన్ను కొరికారు” అని విన్నవించుకుంది. అది విన్న ప్రవక్త (స) వారి కళ్ళు చెమర్చాయి. లేచి ఆమెను స్వాగతం పలుకుతూ ఆమె కోసం తన దుప్పటిని పరచి, దాని మీద ఎంతో మర్యాదగా కూర్చో బెట్టారు. ఆ తర్వాత ఇలా అన్నారు: ”నీ జాతి వద్దకు వెళ్ళడాన్ని నువ్వు ఇష్ట పడితే సగౌరవంగా నిన్ను నీ వారి వద్దకు చేరుస్తాను. నా దగ్గరే ఉండటం నీకు ఇష్టముంటే నిన్ను ఎంత కాలమయినా అత్యంత గౌరవంగా, ప్రేమగా చూసుకుాంను”. అది విన్న ఆమె: ”నేను నా వారి వద్దకు వెళతాను” అని చెప్పగా, మేకల మందను, కొన్ని ఒంటెలను ముగ్గురు పని వాళ్ళను బహుమానంగా ఇచ్చి మరీ సాగనంపారు. ప్రవక్త (స) ప్రేమ, ఔదార్యానికి ముగ్దురాలయిన ఆమె తర్వాత ఇస్లాం స్వీకరించింది.
మనలో ఎంత మంది తన సొంత అక్కా, చెల్లి పట్ల గౌరవభావంతో మెలిగే వారున్నారు చెప్పండి!
ప్రవక్త (స) మెచ్చిన భార్య: ఖదీజా (ర.అ)
”జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన సంపదను గురించి నేను నీకు తెలుపనా?” అని ప్రవక్త (స) హజ్రత్ ఉమర్ (ర) గారిని అడిగి ఇలా అన్నారు: ”పుణ్యవతి అయిన స్త్రీ”. భర్త ఆమె వైపు చూసినప్పుడల్లా అతనికి సంతోషాన్ని కలిగిస్తుంది. అతను ఏదైనా ఆదేశిస్తే శిరసా వహిస్తుంది. ఒకవేళ భర్త ఇంట్లో లేకపోతే అతనికి సంబంధించిన సకల విషయాలను సంరక్షిస్తుంది”. (అబూ దావూద్)
పై లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న పుణ్య స్త్రీ హజ్రత్ ఖదీజా (ర.అ). ఆమె గురించి ప్రవక్త (స) వారు ఇచ్చిన కితాబు: ”ప్రజలు నన్ను తిరస్కరించినప్పుడు ఆమె నన్ను విశ్వసించింది. ప్రజలు నన్ను అబద్దీ కుడు అన్నప్పుడు ఆమె నన్ను సత్యవంతుడని ధృవీకరించింది. ప్రజలు నన్ను ఏకాకి చేసినప్పుడు ఆమె తన సంపదతో నన్ను ఆదుకుంది. (అల్ ఇస్తిఆబ్ లి ఇబ్నిల్ బిర్ర్)
అది తొలి వాణి అవతరించిన శుభ ఘడియలు. ప్రవక్త (స) కంగారు కంగారుగా ఇంటికీ వచ్చి – ‘దుప్పటి కప్పు, దుప్పటి కప్పు’ అన్నప్పుడు ఆయన (స) వారికి ధైర్యానిస్తూ ఆమె చెప్పిన మాట – ”అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ మిమ్మల్ని ఎన్నిటికీ అవమాన పర్చడు.నిశ్చయంగా మీరు బంధుత్వ సంబంధాలను బల పరుస్తారు. సత్యం మ్లాడుతారు. ఇతరుల బరువుల ను మోస్తారు. అతిథులను సన్మానిస్తారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటారు”. ఆమె అందించిన సేవలు ఎంత ఘనాపాటివి అంటే, ఆమె సేవాతత్పరతను మెచ్చుకుంటూ స్వయంగా అల్లాహ్ దైవ దూత జిబ్రీల్ (అ) ద్వారా ఆమెకు శుభవార్త అందజేశాడు. ప్రవక్త (స) వారి సన్నిధికి విచ్చేసిన దైవ దూత జిబ్రీల్ (అ) – ”ఆమె ప్రభువు తరపు నుంచి ఆమెకు సలామ్ చెప్పండి. మరియు నా తరఫు నుంచి కూడా. ఆమె కోసం స్వర్గ లో చెరుకు కాడల భవన శుభవార్తను తెలియజేయండి” అన్నారు. (బుఖారీ) వేరోక ఉల్లేఖనంలో ఆ చెరుకు కాడలు ముత్యాలు పగడాల వయి ఉంటాయి అని ఉంది.
ప్రవక్త (స) మెచ్చిన కూతురు: హజ్రత్ ఫాతిమా (ర.అ)
”ఫాతిమా (ర.అ) నాలోని భాగం. ఆమెకు ఇబ్బంది కలిగించేది నాకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఆమెను బాధ పెట్టేది నన్ను బాధ పెడుతుంది” అన్నారు ప్రవక్త (స). (ఇబ్ను అబ్దుల్ బిర్ర్)
ప్రవక్త (స) వారి గారాల పట్టి హజ్రత్ ఫాతిమా (ర.అ). చాలా పొదుపుతో కూడిన జీవితం ఆమెది. నీళ్ళు తోడటం, పొయ్యి వెలిగించడం, పిండి రుబ్బడం, కట్టెలు తేవడం వంటి పనులన్నీ ఆమె చేసేవారు. అమ్మ గారయిన హజ్రత్ ఖదీజా (ర.అ) గారి దగ్గర ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన ఆమె వివాహానంతరం కడు పేదరికాన్ని ఎదుర్కొవాల్సి వచ్చింది. చేతులు కాయలు కాసాయి. ఓ రోజు ధైర్యం చేసి ప్రవక్త (స) వద్ద నుండి ఒక పని కత్తె తెచ్చుకుందాం అని బయలు దేరారు. ఎంతో ఆప్యాయంగా పలుకరించిన ప్రవక్త (స) – ”ఏ అవసరం మీద వచ్చావమ్మా?” అని ఆరా తీశారు. నాన్న గారిని ఎలా అడగాలి? అన్న సిగ్గు ఆమెను మాట్లాడనీయ కుండా చేసింది. అక్కడే ఉన్న భర్త హజ్రత్ అలీ (ర) కలుగజేసుకొని – ”ఓ దైవ ప్రవక్తా! (స) కఠినమయిన పని చేసి ఫాతిమా (ర.అ) చేతుల్లో బొబ్బలు తేలాయి. ఆమెకు సహాయంగా ఒక పనికత్తెను ఇస్తే బాగుండు” అని విన్నవించుకున్నారు. ఆ సందర్భంగా ప్రవక్త ౖ(స) అన్న మాట నిజంగా నేడు నాయకులు, అధినాయకులనేబడే వారందరికి ఆదర్శం. ”అల్లాహ్ సాక్షిగా! నేను సుఫ్పా నిరుపేద జనుల్ని వదలేసి, వారి కూడు, గూడు, గుడ్డ ఏర్పాటు చెయ్యకుండా ఒక్క బానిసను కూడా మీరిద్దరికి ఇవ్వను. నిశ్చయంగా నేను ఈ బానిసల్ని అమ్మి దాని నుండి వచ్చే మొత్తాన్ని వారి మీదనే ఖర్చు చేయ దలిచాను” అన్నారు. (అఅలామున్నబలా)
వారిద్దరూ ఒఠ్ఠి చేతులతో వెళ్ళి పోయారు. రాత్రి వేళ ఇద్దరూ పడక మీద ఉండగా ప్రవక్త (స) వారి వద్దకు వచ్చారు. అప్పుడు వారు కప్పుకున్న దుప్పటి స్థితి ఎలాంటిదంటే, తల కప్పుకుంటే, కాళ్ళు కనబడేవి, కాళ్ళు కప్పుకుంటే తల కనబడేది. ప్రవక్త (స) వారిని చూసి సద్దుకో బోయారు. ప్రవక్త (స) అన్నారు – ”మీరు మీ చోటనే ఉండండి! ఉదయం మీరు నన్ను అడిగిన వస్తువు కన్నా గొప్ప వస్తువును మీకు తెలుపనా?” అని ప్రశ్నించారు. అందకు వారిద్దరూ ఎంతో అతురతతో తప్పకుండా చెప్పండి! అన్నారు. నేను మీకు చెప్పబోయే వాక్యాలు నాకు స్వయంగా దైవదూత జిబ్రీల్ (అ) నేర్పినవి. ”మీరిద్దరూ ప్రతి ఫర్జ్ నమాజు అనంతరం పది సార్లు సుబ్హానల్లాహ్, పది సార్లు అల్హందులిల్లాహ్, పది సార్లు అల్లాహు అక్బర్ చెప్పండి. మీరు మీ పడక మీదకు చేరుకున్నాక 33 సార్లు సుబ్హానల్లాహ్, 33 సార్లు అల్హందులిల్లాహ్, 34 సార్లు అల్లాహు అక్బర్ చెప్పండి”. అని హితవు పలికి వెళ్లారు. (అఅలామున్నబలా)
నేడు మనం ఒకరికి ఇంటికి కోడలిగా పంపే మన కూతుళ్ళకు ఇలాంటి ఉత్తమ శిక్షణ ఇస్తున్నామా?