నమాజు నియమాలు

namaz - telugu
ఇస్లామీయ ఆరాథనలు పుస్తకం నుండి
నమాజ్‌ కోసం ఈ కింది షరతులకు కట్టుబడాలి:
1) నమాజ్‌  వేళ అవటం.
2) మలమూత్ర అశుద్ధతలు లేకుండా పరిశుభ్రంగా ఉండటం.
3) నమాజు చేసే వ్యక్తి శరీరం, దుస్తులు, నమాజ్‌ చేసే చోటు  పరిశుభ్రంగా ఉండటం.
4) సతర్‌ (అచ్ఛాదన).
5) ఖిబ్లా దిక్కుకు తిరిగి నిలబడటం
6) నమాజ్‌ చేస్తున్నానని మనసులో నిర్ణయించుకోవటం.
నమాజులోని ముఖ్యాంశాలు, ఫర్జ్‌లు నమాజ్‌లోని ముఖ్యాంశాలు (అర్కాన్‌), ఫర్జ్‌లు (విధిగా చేయదగిన విషయాలు) క్రింద పేర్కొనబడ్డాయి.
1) సంకల్పం (నియ్యత్‌) చేసుకోవటం
2) ఖియామ్‌ (శక్తి గలవారు నిలబడటం).
3) తక్బీరె తహ్రీమా (నమాజ్‌ ప్రారంభించేటప్పుడు ‘అల్లాహు అక్బర్‌’  అని అనటం). అంటే నమాజు ప్రారంభించటానికి పలికే తక్బీరును  ‘తక్బీరె తహ్రీమా’ అంటారు.
నోట్‌:
ఈ తక్బీరును పలకటం విధి. ఇది పలకకపోతే అసలు నమాజే నెరవేరదు. ఇకపోతే నమాజు ప్రారంభించిన తర్వాత ఒక స్థితి నుంచి మరొక స్థ్థితికి (ఉదా; ఖియామ్‌ నుంచి రుకూకు లేక రుకూ నుంచి ఖౌమాకు) బదిలీ అయ్యేటప్పుడు పలికే తక్బీర్లన్నీ వాజిబ్‌ (తప్పనిసరిగా చెప్పవలసిన) తక్బీర్లుగా భావించబడతాయి. విధి (ఫర్జ్‌) అన్నా తప్పనిసరి (వాజిబ్‌) అన్నా ఒకటే కదా అని మీకు సందేహం రావచ్చు. కాని షరీఅత్‌లో వాజిబ్‌ అనేది ఫర్జ్‌కంటే కొంచెం తక్కువ స్థాయి కలిగిన అంశం అన్న మాట.!
4) ఫాతిహా సూరా పఠనం.
5) రుకూ చేయటం (తల, వీపు సమాంతరంగా ఉండేటట్లు  వంగటం.
6) ఖౌమా చేయటం, అంటే రుకు నుంచి లేచి నిటారుగా నిలబడటం.
7) తాదీల్‌, అంటే రుకూ సజ్దాలు, మొదలైన అంశాలన్నింటినీ పూర్తి  నింపాదిగా నెరవేర్చడం.
8) ఏడు ఎముకల ఆధారంగా సజ్దా చేయటం. అంటే రెండు చేతులు,  రెండు పాదాల వ్రేళ్ళు, రెండు మోకాళ్ళు, ముక్కు సహితంగా నుదురును నేలకు ఆనించి సజ్దా చేయటం.
9) సజ్దా స్థితి నుండి పైకి లేవటం.
10) రెండు సజ్దాల మధ్య స్థిమితంగా కూర్చోవటం.
11) నమాజులోని ముఖ్యాంశాలన్నింటినీ ప్రశాంతంగా, నింపాదిగా  నెరవేర్చటం.
12) మూడు లేక నాలుగు రకాతులుండే నమాజులోని ఆఖరి రకాత్‌  చివర్లో కూర్చోవటం.
13) కుడి, ఎడమల వైపు మెడ త్రిప్పుతూ ‘అస్సలాము అలైకుమ్‌’ అని   పలకటం. (కుతుబె సిత్తా)
14) నమాజు విధుల క్రమాన్ని పాటించటం. అంటే- ముందు  నియ్యత్‌. తర్వాత ఖియామ్‌, రుకూ, సజ్దా, ఖఅదా, ఆ తర్వాత  సలామ్‌. (వీటిలో ఏ ఒక్కటినీ ముందూ వెనకా చేయడానికి వీలు లేదు).
గమనిక: పైవాటిలో ఏది చేయకపోయినా నమాజు నెరవేరదు. నమాజును తిరిగి నెరవేర్చవలసి ఉంటుంది.
వాజిబాతె నమాజ్‌ (నమాజ్‌లో తప్పనిసరి అంశాలు) నమాజ్‌లో తప్పనిసరిగా ఈ క్రింది పనులు చేయాలి:
 1) తక్బీరె తహ్రీమా తప్ప ఇతర తక్బీర్లు పలకటం (అంటే తక్బీరె తహ్రీమా పలకటం విధి. మిగతా తక్బీర్లు పలకటం తప్పనిసరి అన్న  మాట!)
2) రుకూ నుండి తల పైకెత్తినప్పుడు ”సమిఅల్లాహు లిమన్‌ హమిదహ్‌ా” అని పలకటం.
3) రుకూ స్థితిలో  ‘సుబ్హాన రబ్బియల్‌ అజీమ్‌’ అని పలకటం.
4) ఇమామ్‌ వెనుక ఉండే ముక్తదీలు ‘రబ్బనా వలకల్‌ హమ్ద్‌’ అని  చెప్పటం.
5) సజ్దా స్థితిలో ‘సుబ్‌హాన రబ్బియల్‌ ఆలా’ అనే తస్బీహ్‌ా పఠించటం.
 6) ఫజ్ర్‌, మగ్రిబ్‌, ఇషా నమాజులలో మొదటి రెండు రకాతులలో బిగ్గరగా సూరాలు చదవటం. జుహ్ర్‌ా, అస్ర్‌ నమాజుల అన్ని  రకాతులలో నెమ్మదిగా (లోలోపల) పారాయణం చేయటం.
7) మూడు లేక నాలుగు రకాతుల నమాజులోని రెండవ రకాతు చివర్లో (మొదటి తషహుద్‌ కోసం) కూర్చోవటం.
8) మొదటి, రెండవ రకాతుల్లో ఫాతెహా సూరా చదివిన పిమ్మట  మరికొన్ని దివ్య ఖుర్‌ఆన్‌ సూక్తులు పఠించటం.
9) చివరి ఖఅదాలో తషహ్హుద్‌ అనంతరం దరూద్‌ ఇబ్రాహీమ్‌  చదవటం. (సిహాహ్  సిత్తా)
గమనిక: వాజిబాతులలోని ఏ ఒక్క వాజిబ్‌ తప్పినా సజ్దా సహూ చేయాలి.
ఒక అపోహ:
 సాధారణంగా కొంతమంది అనుకుంటారు, ”నమాజులోని దుఆలను, ప్రార్థనా వచనాలను అరబీ భాషలోనే ఎందుకు వల్ల్లించాలి? వాటి అర్థాన్ని తెలుగులోనే పఠిస్తే బాగుంటుంది కదా!” అని. కాని నిజానికి దాని వల్ల లాభం కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఇతర భాషల్లో పఠించడం వల్ల దైవ ప్రవక్త (స ) పలుకుల్లోని శుభం ప్రాప్తం కాదు. అదీగాక దైవ ప్రవక్త (స ) ఈ విధంగా ప్రార్థనా వాక్యాలను మార్చి చదవటాన్ని వారించినట్లు కూడా ఉల్లేఖనాలున్నాయి. అన్నింటినీ మించి ఈ విధంగా వేర్వేరు భాషల్లో చదవటం వల్ల అర్థ సారూప్యత, ముస్లింల భావ సమైక్యత, ధర్మ సమగ్రతలు దెబ్బ తింటాయి.

 

Related Post