మసహ్

masah - telugu
ఇస్లామీయ ఆరాథనలు పుస్తకం నుండి
 ”శరీరావయవాలను నీళ్లతో కడగటానికి వీలు లేనప్పుడు లేక నీళ్ల ఉపయోగం వల్ల నష్టం కలిగే ప్రమాదమున్నప్పుడు ఇస్లామీయ షరీఅత్‌ ఆయా భాగాలను తడిచేత్తో తుడుచుకోవడానికి అనుమతినిస్తోంది. ఇలాంటి సౌకర్యాలు, సౌలభ్యాలు ఇస్లాం ప్రకృతి ధర్మమని రుజువు చేస్తున్నాయి”. మేజోళ్ళను ధరించిన తర్వాత కాళ్ళను నీటితో కడిగే బదులు వాటిపై మసహ్  చేసుకోవచ్చని దైవప్రవక్త (స) విధానం (సున్నత్‌) ద్వారా బోధపడుతుంది. హాఫిజ్‌ ఇబ్నె హజర్‌ (రహ్మలై) ఇలా రాస్తున్నారు: దైవప్రవక్త (స) నుంచి నేటి వరకు తరతరాలుగా ఎంతో మంది ఉల్లేఖులు మేజోళ్ళ పై మసహ్‌ా చేసే విధానం గురించి వివరిస్తూ వచ్చారు. దైవప్రవక్త (స) అనుచరుల్లో దాదాపు ఎనభై మంది దీనిని ఉల్లేఖించారు. వారిలో అషరయె ముబష్షిరహ్‌ా (ఇహలోకంలోనే స్వర్గసుఖాల శుభవార్త పొందిన పది మంది అనుచరులు) కూడా ఉన్నారు. హదీసువేత్తల ఒక పెద్ద సమూహం ఈ విషయాన్ని దృవీకరించింది. మేజోళ్ళను తడిచేత్తో తుడచుకోవటం మేజోళ్ళపై మసహ్  చేసుకోవడానికి షరీఅత్‌ అనుమతించింది.
హజ్రత్‌ ముగీరా బిన్‌ షోబా (రజి) కథనం: ఒకసారి దైవప్రవక్త (స) వుజూ చేస్తూ తన మేజోళ్ళను, పాదుకులను తడిచేత్తో తుడుచుకున్నారు (మసహ్  చేసుకున్నారు). (తిర్మిజీ)
మసహ్  అనుమతికి షరతు
మేజోళ్ళు వుజూ చేసుకున్న తర్వాత ధరించి ఉన్నప్పుడు మాత్రమే వాటిపై మసహ్  చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. (బుఖారీ-ముస్లిం) మసహ్  గడువు స్థానికుడికి ఒక పగలు ఒక రాత్రి (అంటే 24 గంటలు), ప్రయాణికుడికి మూడు పగళ్ళు, మూడు రాత్రుల వరకు మేజోళ్ళపై మసహ్  చేసుకునే అనుమతి ఉంది. (ముస్లిం – అబూ దావూద్‌))
ఉదాహరణకు స్థానికుడైన ఒక వ్యక్తి ఉదయం ఫజ్ర్‌ నమాజుకు ముందు వుజూ చేసి మేజోళ్ళు తొడుక్కున్నాడనుకోండి. నమాజు తర్వాత అతను మల మూత్ర విసర్జనకు వెళ్ళి వచ్చాడు. మల మూత్ర విసర్జన వల్ల అతని వుజూ భంగమయింది. కనుక ఇప్పుడతను సరికొత్త వుజూ చేసుకోవాలి. అయితే అతను మేజోళ్ళు తీసి కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు. కేవలం తడిచేత్తో వాటి మీద తడుచుకుంటే సరిపోతుంది.ఈ విధంగా మర్నాడు ఉదయం ఫజ్ర్‌ నమాజుకు ముందు వరకు ఎన్నిసార్లు వుజూ భంగమయినా మేజోళ్ళు తీయకుండా వాటి మీద మసహ్  చేసుకుంటూ ఉండవచ్చు.
 గమనికి: మరుగుదొడ్డిలో వెళ్ళేటప్పుడు వట్టి మేజోళ్లతో కాకుండా అవి తడవకుండా ఉండటానికి చెప్పులు వేసుకుని వెళ్ళాలి. మసహ్‌ా చేసుకునే పద్ధతి మేజోళ్ళ పైభాగంలో తడి చేతుల్తో మసగ్‌ చేసుకోవాలి. అరికాలికి గాని, గిలకలవైపు గాని మసహ్  చేసుకుంటే ఆ మసహ్  నెరవేరదు. (అబూ దావూద్‌)
మసహ్  భంగమయ్యే పరిస్థితులు
1) మసహ్  గడువు ముగిసినప్పుడు. 2) మేజోళ్ళను తీసివేసినప్పుడు. 3) గుసుల్‌ చేయటం అనివార్యమయ్యే పరిస్థితుల్లో. గమనిక: వుజూ అనివార్యమయ్యే సందర్భాల్లో మేజోళ్ళను తీసి కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు.

Related Post