కల చెదిరింది… కథ మారింది.. …కన్నీరే ఇక మిగిలింది

క్షణికావేశంలో హద్దు మీరి క్షణం క్షణం నరకం అనుభవిస్తూ కువైట్లో జీవచ్ఛవంలా జీవిస్తున్న ఓ మైగ్రెన్ట్ కన్నీటి గాథ…బ్రతుకు తెరువు కోసం స్వదేశాన్ని వదలి వచ్చి క్షణికావేశంలో కాలుజారిన అబలలు కొందరైతే, కాసుల కోసం శరీరాన్ని అమ్ముకుంటూ ” మృత్యు వైరస్‌ ”ను విరివిగా అందించే మగువలు మరి కొందరు…అటు కట్టుకున్న ఇల్లాలినీ, ఇటు కన్న బిడ్డల యోగక్షేమాలను కూడా విస్మరించి ఉంపుడుకత్తెల వలలో చిక్కుకున్న మగ మారాజులు కొందరైతే, కామోద్రేకంలో ఉజ్వల భవిష్యత్తును మరచి ఆనక బాధపడే అభాగ్య యువకులు ఇంకొందరు.

 

దిన పత్రికల్లోనూ, మ్యాగజైన్ల లోనూ ఇలాంటి కన్నీటి గాధలు కోకొల్లలు – కువైట్లోని అరబీ దిన పత్రిక ”అల్‌ ఖబస్‌” ఇటీవల ఓ అరబ్బేతర మైగ్రెన్ట్ని ఇంటర్వ్యూ చేసి ప్రచురించిన వృత్తాంతాన్ని సంక్షిప్తంగా మన తెలుగు పాఠకుల కోసం ఈ నెల ప్రచురిస్తున్నాం. ప్రవాసాంధ్ర సోదర సోదరీ మణులకు ఇలాంటి  సంఘటనలు కను విప్పు కలిగించాలన్నది మా ప్రగాఢ వాంఛ … ఎడిటర్‌).

బ్రతుకు తెరువు కోసం స్వదేశాన్ని వదలి వచ్చి క్షణికావేశంలో కాలుజారిన అబలలు కొందరైతే, కాసుల కోసం శరీరాన్ని అమ్ముకుంటూ ” మృత్యు వైరస్‌ ”ను విరివిగా అందించే మగువలు మరి కొందరు…అటు కట్టుకున్న ఇల్లాలినీ, ఇటు కన్న బిడ్డల యోగక్షేమాలను కూడా విస్మరించి ఉంపుడుకత్తెల వలలో చిక్కుకున్న మగ మారాజులు కొందరైతే, కామోద్రేకంలో ఉజ్వల భవిష్యత్తును మరచి ఆనక బాధపడే అభాగ్య యువకులు ఇంకొందరు.

ప్రశ్న: మీ గురించి చెబుతారా!

జవాబు: నేను 30 ఏండ్ల నవ యువకుణ్ణి. మంచి ఫామిలీ మాది. నేనిక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్‌ చేస్తున్నాను. వివాహితుణ్ణి. ముగ్గురు పిల్లలు. కువైట్లో మాత్రం ఒంటరి గా ఉంటున్నాను. నాలుగేళ్ళ క్రితం వచ్చాను. బాగా సంపాదించి పిల్లలకు ఉజ్వల భవిష్య త్తును ఇవ్వాలనుకున్నాను. మంచి ఇల్లు కట్టాలని కలగన్నాను. కానీ! ఇప్పుడు… నా కల చెదిరింది. కథ మారింది… కన్నీరే ఇక మిగిలింది. నా జీవితం సర్వ నాశనమై పోయింది.

ప్రశ్న: ఇంతకీ అసలేం జరిగిందో చెబుతారా?

జవాబు: ఏం చెప్పమంటారు? ఒక రోజు నేను ఓ షాపింగ్‌ కాంప్లెక్సు వద్ద నిలబడి ఉన్నాను. అక్కడున్న ఓ ఫిలిప్పీనీ యువతిపై నా దృష్టి పడింది. కళ్ళు చెదిరే అందం ఆ యువతిది. ఒంటికి అతుక్కుపోయిన దుస్తులు ధరించి అటూ ఇటూ చూస్తూ పచార్లు చేస్తూంది. నేను చాలా సేపు ఆ అమ్మాయిని తదేకంగా చూస్తూ ఉండిపో యాను.

ఆమె నా వంక చూసి, చిరునవ్వు చిందించింది. కాస్త దగ్గరకు వెళ్ళి ”ఏం కావాలి?” అన్నాను. ‘రావలసినవారి కోసం ఎదురు చూస్తున్నాను. మీరు నన్నక్కడకు తీసుకెళ్తారా?’ అన్నది. ఆ క్షణంలో నేను ఆలోచించే స్థితిలో లేను. మారు మాట్లాడకుండా ఆమెను నా కారులో ఎక్కించుకున్నాను… సంభాషణ మొదలయింది. అడిగిన ప్రతిదానికీ చలాకీగా సమాధానాలిస్తుంది. ” నువ్వేం చేస్తావు? ” అన్నాను. డబ్బుకోసం ఏం చేయమన్నా చేస్తాను అన్నది నవ్వుతూ. ఆమె ఉద్దేశం గ్రహించాను. మరో వైపు నన్ను నేను నిగ్రహించుకోలేక పోయాను. కామంతో నా కళ్ళు మూసుకు పోయాయి. తిన్నగా ఆమెను నా రూముకు తీసుకెళ్ళాను. కొన్ని నిమిషాల్లోనే ఇద్దరం శారీరకంగా ఏకమయ్యాం.

ఆ క్షణంలో నేను షైతాన్‌ వలలో ఎలా చిక్కుకున్నానా అని ఇప్పుడు ఏడుస్తున్నాను. చూడబోతే నేను ధార్మిక భావాలు గలవాణ్ణి. ప్రతిరోజు నమాజు చేస్తాను. ఉపవాసాలు ఉంటాను. కాని ఆ సమయంలో నేను వివే కాన్ని కోల్పోయి ఆ అమ్మాయి అందాలకు దాసోహమన్నాను. కథ అంతటితో ఆగలేదు. మూడు రోజుల తర్వాత మరోసారి ఫోన్‌ చేసి ఓ ప్రత్యేక స్థలంలో ఆమెను పిలిచి, కామ తాపం చల్లార్చుకున్నాను. కొన్నాళ్ళకు నా పురుషాంగంలో మంట మొదలయింది. మూత్ర విసర్జన సమయంలో మరీ బాధగా ఉండేది. మెడికల్‌ షాపు వారికి విషయం చెప్పి మందులు కొన్నాను. మందులు వాడితే తాత్కాలిక ఉపశమనం కలిగింది. బహుశా ఆ అమ్మాయితో జరిపిన రతి క్రీడ వల్లనే ఈ ప్రాబ్లమ్‌ వచ్చిందని అనుమానించి ఆమెతో తెగతెంపులు చేసుకున్నాను. ఆమె చాలా సార్లు ఫోన్‌ చేసింది. ఇక ఎన్నడూ నా మొహం చూడొద్దని తెగేసి చెప్పేశాను. పది మాసాల తర్వాత విచిత్రంగా నా బాధ మళ్ళీ మొదలయింది.

ప్రశ్న: మొదట ఏ లక్షణాలు కనిపించాయి?

జవాబు: జలుబు జ్వరంతో బాధ మొదలయింది. వాతావరణంలో వచ్చిన మార్పు ప్రభావం అని అనుకున్నాను. తర్వాత నడుం నొప్పి విపరీతమయింది. అంగంలో నుంచి తరచూ నీరు వచ్చేది. ఆ నీటితోపాటే సుద్దలు పడేవి. డాక్టరును సంప్రదించి మందులు వాడాను. కాని లాభం లేక పోయింది. నా మనసు ఏదో కీడు శంకిం చింది. మరోసారి హాస్పిటల్‌కి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకున్నాను. వాళ్ళేమో కిడ్నీల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉందని అనుమానించి మందులు వ్రాశారు. దానివల్ల కూడా ప్రయోజనం లేకపోయింది. ఒల్లంతా పచ్చి పుండుగా మారింది. వేగంగా బరువు తగ్గసాగింది. తొందరగా అలసిపోయేవాణ్ణి. లైంగిక కోర్కె కూడా తగ్గి పోయింది. రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు. అంచేత వేరొక డాక్టర్ని సంప్రదించాను.

ప్రశ్న: ఈ బాధంతా ఆ స్త్రీ మూలంగానేనని మీకు అనుమానం రాలేదా?

జవాబు : వచ్చింది – కాని తమాయించుకునేవాణ్ణి. డాక్టర్లకు కూడా అసలు విషయం చెప్పలేకపోయాను. నిజం బయటపడి, నలుగురిలో నవ్వుల పాలౌతానేమోనన్న సంశయంతో స్పష్టంగా చెప్పలేదు.

ప్రశ్న: ఇంతకీ మీకు ‘ఎయిడ్స్‌’ ఉందని ఎప్పుడు తెలిసింది?

జవాబు: నా బాధ మితిమీరిపోయినప్పుడు, నేను నా స్వదేశానికి వెళ్ళి, నా అన్న గారిని తీసుకుని అక్కడి ఫేమస్‌ డాక్టర్‌ వద్దకు వెళ్ళాను. వివరాలు అన్నీ చెప్పాను. ఆయన నా పాత రిపోర్టులు అడిగారు. కాని ఆ రిపోర్టులేవీ లేకపోవటం చేత మళ్ళీ వైద్య పరీక్షలు చేయించారు. రిపోర్టుల్ని పరిశీలించిన మీదట డాక్టర్‌ నన్ను విచిత్రంగా చూశారు, రకరకాల ప్రశ్నలు వేశారు. ఎక్కదుంటావ్‌?.. ఏం పని చేస్తావ్‌? పరాయి ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలేమైనా పెట్టుకున్నావా?…అంతే … నాకర్థమైపోయింది… ”సార్‌! నాకు ఎయిడ్స్‌ రోగం ఉందా డాక్టర్‌!.. చెప్పండి డాక్టర్‌! ఇప్పటికే నరకం అనుభవించాను డాక్టర్‌! నాలో ఇక శక్తిలేదు డాక్టర్‌!” అంటూ విలవిల్లాడాను.

”అవును… నీకు ఎయిడ్స్‌ ఉంది”.

నా ముఖం పాలి పోయింది. నా కాళ్ళ క్రింద నేల కదలసాగింది. ఒక్కసారిగా నా శరీరంలో నిస్సత్తువ ఆవరించింది. నా అన్న గారు నన్ను కౌగిలించుకుని వెన్ను తట్టు తున్నారు. నేను చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాను. ఆ క్షణంలో మృత్యువు నా కళ్ళ ముందు కదలాడింది.

ప్రశ్న: డాక్టర్‌ని సంప్రదించక ముందు మీరు మీ ధర్మపత్నితో సంభోగించారా?

జవాబు: లేదు. నా మనసాక్షి నన్ను ఆమెను సమీపించకుండా ఆపింది. ఎందుకంటే నా రోగ నిర్థారణ జరిగే వరకూ ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకోరాదని గట్టిగా సంకల్పించుకున్నాను.

ప్రశ్న: ఇప్పుడు మీరు పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొంటున్నారు?

జవాబు: క్రమ క్రమంగా తేరుకున్నాను. నన్ను నేను అదుపులో పెట్టుకున్నాను. కానీ చాలా వీక్‌ అయిపోయాను. మునుపటిలా కష్టపడలేను. ఇంటికి వెళ్ళలేను. ఇంటికెళ్ళి ఇల్లాలి నుండి తప్పించుకొని తిరగ లేను. కుటుంబీకులకు మొహం చూపెట్టలేను. ఇల్లాలు నిలదీసి అడిగితే ఏం చెప్పను? ఆత్మీయులు రకరకాలుగా అనుమానించవచ్చు. ఇక్కడే ఏడుస్తూ జీవచ్ఛవంలా గడపటం తప్ప మార్గాంతరం లేదు. నా స్వయంకృతా నికి ఈ శాస్తి తప్పదు.

ప్రశ్న: ఈ వైరస్‌ చాలా ప్రమాదకరమన్న సంగతి మీకు తెలుసా? ఇది ఏండ్ల తరబడి ఉంటుంది. (దేవుడు మీకు స్వస్థతను ప్రసాదించుగాక!) మరి మీరు దీనిని అధిగమించ గలననుకుంటున్నారా?

జవాబు: జీవన్మరణాలు అల్లాహ్‌ చేతిలో ఉన్నాయన్నది నా విశ్వాసం. అల్‌హందు లిల్లాహ్‌ నేనొక ముస్లింని. నా వ్యవహారమంతా ఆ ప్రభువు ఆధీనంలో ఉంది. నేను అబద్ధాలు చెప్పను. నా ప్రభువు నన్ను మన్నించి వీలైనంత తొందరగా లేపుకోవాలని కోరుకుంటున్నాను. నా తప్పులు జనులకు తెలియకుండా ఉండాలన్నది నా వాంఛ.

ప్రశ్న: అంటే, మీ సంబంధీకులకు కూడానా?!

జవాబు: అవును. ఒక్క అన్నగారికి తప్ప ఎవరికీ ఈ సంగతి తెలీదు. నేను చచ్చిపోయాక కూడా ఆయన ఎవరికీ చెప్పరని నా నమ్మకం.

ప్రశ్న: మీ ఇల్లాలికి కూడా ఈ నిజం చెప్పరా?

జవాబు: చెప్పకూడదనే నిశ్చయించుకున్నాను. చెబితే ఆమె దృష్టిలో నీచుణ్ణి అయిపోతాను. ఆమె నన్నెంతో గౌరవిస్తుంది. మరోవైపు నేను సమాజానికి భయ పడుతున్నాను. నాకే గనక ఎయిడ్స్‌ ఉందని తెలిస్తే జనులు నా నుండి పారి పోతారు. నా పిల్లలను చిన్న చూపు చూస్తారు. స్కూల్లో నా పిల్లలను ఎగతాళి చేస్తారు. ఈ అవమానాన్ని నా పిల్లలు భరించలేరు.

ప్రశ్న: జరిగిన దానిపై మీరు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారా?

జవాబు: సిగ్గుతో కుంచించుకు పోతున్నాను. ఎన్నో సార్లు ఆత్మ నింద చేసుకున్నాను. సౌందర్యవతి, శీలవతి అయిన ధర్మపత్ని ఉండగా నేను ఎంగిలి విస్తరాకు కోసం ఎందుకు ఎగబడ్డానా? అని పదే పదే ప్రశ్నించుకుంటున్నాను. జరిగినదంతా ఓ పీడకల అయి ఉంటే బావుండునే అని అన్పిస్తోంది. నేను ఇంటి కెళ్ళినపుడు నా ఆస్తిపాస్తులన్నింటినీ భార్యా పిల్లల పేర వ్రాసి వచ్చాను. వారన్నా ఎలాంటి చీకూచింతా లేకుండా బ్రతకాలన్నది నా కోరిక.
దేవుడు నాకన్నీ ఇచ్చాడు. అర్థాంగి ఉంది. ఆస్తి ఉంది. సంతానం వుంది. ఈ దైవానుగ్రహాలపై నేను కృతజ్ఞుడినై ఉండా ల్సింది. కాని మాయలమారి షైతాను నన్ను వంచించాడు. నా చేత చేయరాని పని చేయించాడు. ఇప్పుడు శిక్ష అనుభవిస్తు న్నాను.

ప్రశ్న: ఈ జబ్బుకు గురైనాక మీలో వచ్చిన మార్పేమిటి?

జవాబు: ఏకాంతాన్ని ఇష్టపడుతున్నాను. ఫ్రెండ్స్‌తో కలిసి తిరిగే ఆలోచన ఉండదు. ఏకాంతంలో ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తూ, ఇంటర్న్‌నెట్లో ఈ జబ్బుకు సంబంధించిన మెడిసిన్స్‌ను గురించి వాకబు చేస్తూ ఉంటాను. ఈ రోగం మందులతో నయం అయ్యేది కాదని నాకు తెలుసు. అయితే చావు మాత్రం నా ఇంటి వారి మధ్యనే రావాలన్నది నా ఆకాంక్ష.

ప్రశ్న: ఇంతకీ మీరీ వృత్తాంతాన్ని మాకెందుకు తెలిపారు?

జవాబు: నా జీవితం అందరికీ ఓ గుణ పాఠం కావాలనుకున్నాను. ముఖ్యంగా యువతీ యువకులు లైంగిక విశృంఖలత్వం వల్ల పొడసూపే ప్రమాదాలను గురించి ఆవేశంలో పట్టించుకోరు. నా బాధే నా కళ్ళు తెరిపించింది. ఈ నరక యాతన ఇతరులెవరికీ సోకవద్దని కోరుకుంటున్నాను.

ఆఖరిమాట:

చివర్లో నేను చెప్పేదొక్కటే – నాలాంటి వారు క్షణికావేశంలో తప్పు చేసేస్తారు. తర్వాత బాధపడతారు. కాని అప్పటికే సమయం మించిపోతుంది. ఇలాంటి పాడు పని కోసం మనసు పురికొల్పినప్పుడు యువకులు వెయ్యిసార్లు ఆలోచించాలి. వారిపై ఎందరో ఆధారపడి ఉంటారు. కన్న తల్లి తండ్రులు, కట్టుకున్న ఇల్లాలు, రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువులు … ఇలా ఎందరో వారిపై గంపెడాశలతో జీవిస్తుంటారు. ఈ ఆశా దీపాలు ఆరిపోకూడదు….. ఆరిపోకూడదు.

Related Post